పండుగ చూస్కో | hundred sixteen years Telugu film industry | Sakshi
Sakshi News home page

పండుగ చూస్కో

Published Sun, Sep 17 2017 12:39 AM | Last Updated on Fri, Sep 22 2017 1:40 PM

hundred sixteen years Telugu film industry

దసరా పండగ కానుకల పండగ. ఇచ్చే పండగ.ఎదుటివారిని సంతోషపెట్టే పండగ. పిల్లలకు పప్పుబెల్లాలు కావాలి. పెద్దలకు మామూళ్లు కావాలి. ఇన్నీ పుచ్చుకుని ఇచ్చుకొని ఆనందంగా గడిపే పండగ ఇది.మరి పాఠకులకు ఏం ఇచ్చుకోవాలి? ఆలోచన చేశాం.ఇది సెలవుల కాలం. ఇంట్లో అందరూ తీరిగ్గా సోఫాల్లో కూలబడి కాలం గడిపే కాలం. టీవీ ఆన్‌లో ఉంటుంది. యూ ట్యూబ్‌కు కనెక్ట్‌ అయి ఉంటుంది. లేదంటే డీవీడీలు సంపాదించుకోవచ్చు. కాదంటే కేబుల్‌వాడికి చెప్పి కోరింది పొందవచ్చు. అందుకే సినిమాలు ఇవ్వాలనుకున్నాం. ఈ సెలవుల్లో పాఠకులంతా తెలుగు సినిమాను ఒక రౌండ్‌ అలా రౌండేసి రావాలని కోరుకున్నాం. తెలుగు సినిమాకు స్వర్ణయుగం ఉంది. సువర్ణ పరంపర కొనసాగుతూ ఉంది. అది పెద్దలు ఒకసారి పునశ్చరణ చేసుకుంటే బాగుంటుంది, కుటుంబానికి నాటి సినిమాల గొప్పతనం చూపిస్తే బాగుంటుంది అనుకున్నాం. అందుకే ఈ నూటపదహార్లు మీకు సవినయంగా చదివిస్తున్నాం. వీటిలో అరవై సినిమాలకు వ్యాఖ్యలు రాశాం.

స్థలాభావం వల్ల మరో యాభై ఆరు సినిమాల లిస్ట్‌ మాత్రమే ఇచ్చాం. వ్యాఖ్య రాసినవి గొప్ప, రాయనివి తక్కువా కాదు. అన్నీ గొప్పవే. నూట పదహార్లు ఒక అచ్చ తెలుగు అంకె. అందుకనే అక్కడితో ఆగాం. నిజానికి తెలుగు సినిమాలు ఎంచడం మొదలుపెడితే అంతం అంటూ ఉందా? ఎన్నో ఆణిముత్యాలు... రతనాలు... మరకత మాణిక్యాలు. అయినప్పటికీ ఆచి తూచి అందరూ మెచ్చే పట్టికను సిద్ధం చేశాం. డబ్బింగ్‌ సినిమాలను మినహాయించాం. రీమేక్‌ సినిమాలు తగ్గించాం. ఇంకొన్ని గొప్పసినిమాలను ప్రస్తావించలేకపోతున్నందుకు చింతిస్తున్నాం. మా ప్రయత్నం మిమ్మల్ని సినిమా టూర్‌ చేయించడమే. ఈ స్టేషన్లు కానివి మీకు నచ్చిన స్టేషన్లకు కూడా మీరు వెళ్లిరండి. మన సినిమా పచ్చగా ఉండాలి. రెండు రాష్ట్రాల పాఠకులు కళకళలాడాలి. ఈ పండగ సెలవుల్లో అందరి ఇంటా ఆనందం తొణికిసలాడాలి. పదండి... పండగ చూసుకుందాం...



మాలపిల్ల (1938)
పౌరాణిక ఇతివృత్తాలను తీసుకొని మొదలైన తెలుగు మూకీ, టాకీ సినిమాల పరంపరను చెదరగొట్టి ఒక సమకాలీన సమస్యతో మొదలైన తొలి తెలుగు చిత్రం ‘మాలపిల్ల’. ఉన్నవ లక్ష్మీకాంతం రాసిన నవల ‘మాలపల్లి’ కథాంశం వేరు. ఈ కథ వేరు. రెంటికీ సంబంధం లేదు. ఇది చలం, తాపీ ధర్మారావుల సహకారంతో అల్లుకున్న కథ. అభ్యుదయ భావాలు కలిగిన దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం ఆ రోజుల్లో విజృంభించే స్థాయిలో ఉన్న హరిజనోద్యమానికి ఊతం ఇస్తూ తీసిన సినిమా ఇది. ఒక రకంగా బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకిస్తూ తీసిన సినిమా. నటి కాంచనమాల ఈ సినిమాతో సూపర్‌స్టార్‌ అయ్యారు. ‘కొల్లాయి కట్టితే ఏమి మా గాంధీ మాలాడై తిరిగితే ఏమీ’ వంటి పాటలు ఈ సినిమాలో జనాన్ని ఉర్రూతలూగించాయి. చాందస బ్రాహ్మణులు కొందరు ఈ సినిమాని చూడరాదని తీర్మానం చేశారు. చూసిన తమ కుర్రాళ్లను మైలస్నానం చేయించి మరీ ఇళ్లల్లోకి రానిచ్చారు. సంస్కరణకు సినిమా శక్తివంతమైన సాధనం అని నిరూపించిన సినిమా మాలపిల్ల.

విశేషం: దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం ఆ రోజులలో ‘జస్టిస్‌ పార్టీ’లో ముఖ్యమైన సభ్యుడు. ఆ పార్టీ ఆధ్వర్యంలోని పత్రికలకు ఆయన సంపాదకుడిగా కూడా వ్యవహరించేవారు.మాలపిల్లలో నటించిన కాంచనమాల మోడ్రన్‌లుక్‌ ఆ రోజుల్లో చాలా తెలుగు ఇళ్లల్లో క్యాలెండర్‌గా ఉండేది. ఇంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్న కాంచనమాల కేవలం 11 సినిమాల్లోనే నటించారు.

భక్త పోతన (1942)
తెలుగులో టాప్‌ హీరోయిన్‌ కాంచనమాల అయితే టాప్‌ హీరోగా చిత్తూరు నాగయ్యను నిలబెట్టిన సినిమా భక్త పోతన. అప్పటి వరకూ రొమాంటిక్, సోషల్‌ పాత్రలనే పోషిస్తున్న నాగయ్యను ఒక గొప్ప భక్తుడిగా, అటువంటి పాత్రల కోసమే పుట్టిన కారణజన్ముడిగా నిలబెట్టిన సినిమా ఇది. కె.వి.రెడ్డి మొదటిసారి దర్శకత్వం వహించిన సినిమా కూడా. ఆ రోజులలో లక్ష రూపాయల ఖర్చుతో తీసిన ఈ సినిమా లాభాల తుఫాన్‌ సృష్టించింది. నాగయ్యకు ఎన్నో సత్కారాలు, సన్మానాలు అందేలా చేసింది. దీనికి కొనసాగింపుగా నాగయ్య ‘త్యాగయ్య’ సినిమా తీసి ఇంకా ఎక్కువ సంపదను పోగు చేసుకున్నారు. నాగయ్య సింగింగ్‌ స్టార్‌ మాత్రమే కాదు, గొప్ప మ్యూజిక్‌ కంపోజర్‌ కూడా అందుకు ‘పోతన’ సినిమాయే ఒక ఉదాహరణ. ఒకప్పుడు కోడంబాకంలో 52 ఎకరాలకు అధిపతి అయిన నాగయ్య ఆ తర్వాతి రోజుల్లో అంతా పోగొట్టుకోవడాన్ని చాలామంది తర్వాతి తరం నటులు ఒక గుణపాఠంగా స్వీకరించారు.

విశేషం: రెండో ప్రపంచయుద్ధ రోజులలో చెన్నైకు బాంబుల భయం ఉండటం వల్ల ఈ సినిమా కొన్ని రోజులు షూటింగ్‌ ఆగిపోయింది. ఆ భయం సద్దుమణిగాకే తీశారు.

బాలరాజు (1948)
అక్కినేని నాగేశ్వరరావుకు స్టార్‌ ఇమేజ్‌ తెచ్చి పెట్టిన తొలి సినిమా ఇది.  ఎస్‌.వరలక్ష్మి, అంజలీదేవి, కస్తూరి శివరావు... అందరూ పోటీ పడి నటించి జనాన్ని ఆకట్టుకున్నారు. దర్శకుడు ఘంటసాల బలరామయ్య అక్కినేనిని తెలుగు సినిమాకు ఇంట్రడ్యూస్‌ చేయడమే కాదు ఈ సినిమాతో స్టార్‌ని చేసి తన పట్ల జీవితాంతం కృతజ్ఞుడై ఉండేలా చేసుకున్నారు. జానపదంలో ఉన్న ఒక కథకు ఇంకొన్ని హంగులు దిద్ది తయారు చేసుకున్న ఈ సినిమా ఆ రోజుల్లో రిలీజైన థియేటర్లన్నింటిలో తీయకుండా ఆడుతూనే ఉండేసరికి కొత్తగా రిలీజ్‌ చేయాల్సిన సినిమాలకు థియేటర్లు లేక కొత్తవి కట్టాల్సి వచ్చింది. అదీ ఈ సినిమా రికార్డు. జనరంజకమైన కథ, పాటలు ఉంటే కాలక్షేపం ఆశించే ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి చెక్కుచెదరని ఉదాహరణ ఈ సినిమా.

విశేషం: తెలుగులో అక్కినేని ఈ సినిమాతోనే తొలి జానపద హీరోగా ప్రేక్షకులలో స్థిరపడ్డారు. అయితే అది కొనసాగలేదు. ‘పాతాళభైరవి’తో ఆ ఇమేజ్‌ను ఎన్‌.టి.ఆర్‌ పట్టుకెళ్లారు. అన్నట్టు అక్కినేనికి ఘంటసాల ప్లేబ్యాక్‌ పాడటం ఈ సినిమాతోనే మొదలైంది.

పాతాళభైరవి (1951)
రచయిత చక్రపాణి, నిర్మాత నాగిరెడ్డి ఒక ఉత్తమ జోడీగా మారాక తొలిసారిగా విజయా బ్యానర్‌పై ‘షావుకారు’ తీశారు. సంభాషణల్లో, నడతలో కొత్త పుంతలు తొక్కిన ఆ కథ బాగున్నా ప్రేక్షకులు అంతగా ఆదరించలేకపోయారు. ప్రేక్షకులకు మంచి విషయాలు తర్వాత చెబుదాం వారికి వినోదం మొదట అందిద్దామని స్నేహితులిద్దరూ ఎంచుకున్న కథ ‘పాతాళభైరవి’. కె.వి.రెడ్డి దర్శకత్వం, పింగళి రచన, ఘంటసాల సంగీతం ఈ సినిమాకు పునాదిగా నిలిచాయి. ‘మన దేశం’ (1949)తో వెండి తెరకు పరిచయం అయిన ఎన్‌.టి.రామారావును జానపద నాయకుడిగా, ధీరోదాత్త వీరుడిగా స్థిరపరిచిన సినిమా ఇదే. అక్కినేని నాగేశ్వరరావు జానపద హీరోగా అవైలబుల్‌గా ఉన్నా ఒకసారి ఆయనతో ఎన్‌.టి.రామారావు టెన్నిస్‌ ఆడుతుండగా ఎన్‌.టి.ఆర్‌ బాల్‌ని షాట్‌ కొడుతున్న స్టయిల్‌ని బట్టి ఆయన జానపద హీరోగా బాగుంటాడని కె.వి.రెడ్డి నిర్ణయించుకున్నారట. ఆ తర్వాతికాలంలో ఆ మాటే నిజమై అక్కినేని సోషల్‌ హీరోగా స్థిరపడాల్సి వచ్చింది. ఇందులో ఎస్వీఆర్‌ నేపాళ మాంత్రికుడిగా వేశాడు. ‘సాహసం చేయరా ఢింభకా’ లాంటి డైలాగులు ఇప్పటికీ ఫేమస్‌. పేదకుర్రాడు, రాకుమారిని ధైర్యంగా వలచవచ్చని చెప్పిన మొదటిసినిమా అలాంటి ప్రేమకథలకు మూలంగా నిలిచిన సినిమా ఇది. ‘ప్రేమ కోసమై వలలో పడెనే’ పాట ఎవరం మర్చిపోతాం?

విశేషం: అప్పట్లో విజయావారి దగ్గర ‘హేమండ్‌ ఆర్గాన్‌’ అనే వాయిద్యం ఉండేది. మాంత్రికుడి గుహ వచ్చినప్పుడల్లా ఆ ఆర్గాన్‌తో చేసిన నేప«థ్య సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మల్లీశ్వరి (1951)
తెలుగువారు క్లాసిక్స్‌ తీయగలరు అనీ, సినిమాలో కూడా కళాత్మకతను జోడించగలరని ‘మల్లీశ్వరి’ చాటి చెప్పింది. దర్శకుడు బి.ఎన్‌.రెడ్డి ఈ సినిమాతో అజరామరమైన కీర్తిని గడించారు. ఏదో సినిమా షూటింగ్‌ కోసం హంపీని దర్శించిన ఆయన అక్కడి శిల్పసౌందర్యానికి ముచ్చటపడి అదివరకు నుంచి ఉన్న శ్రీకృష్ణదేవరాయలిపై అభిమానాన్ని చాటుకునేందుకు ‘మల్లీశ్వరి’కి నడుం బిగించారు. దీనికి రచన దేవులపల్లి కృష్ణశాస్త్రే అయినా కథకు మూలం కథారచయిత బుచ్చిబాబు రాసిన ‘రాయల కరుణకృత్యం’ నాటిక అని కూడా అంటారు. ఎన్‌.టి.రామారావు, భానుమతిల నటన సాలూరి రాజేశ్వరరావు పాటలు సినిమాకు ఆయువు పట్టుగా నిలిచాయి. ‘పిలిచినా బిగువటరా’, ‘మనసున మల్లెల మాలలూగెనే’, ‘ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు’... ఆ పాటల తియ్యదనం ఎంతటిదని. ఈ సినిమాను సర్వేపల్లి రాధాకృష్ణ చూశారట. మెచ్చుకున్నారట. ఆయనది ఏముంది కళాహృదయం ఉన్న ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు ఇప్పటికీ ఈ సినిమా చూస్తున్నాడు ఇకపైనా చూస్తాడు.
 
విశేషం: కృష్ణశాస్త్రి ఈ సినిమాకు స్క్రిప్ట్‌ సమకూర్చినా ఆ తర్వాతి రోజులలో ఆయన ప్రధానంగా పాట రచన మీదే దృష్టి పెట్టారు తప్ప స్క్రిప్ట్‌ పనికి పూనుకోలేదు.

దేవదాసు (1953)
భగ్నప్రేమకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన తొలి సినిమా, అక్కినేని నాగేశ్వరరావు కెరీర్‌ను జీవితాంతం ప్రభావితం చేసిన సినిమా దేవదాసు. బెంగాలీ రచయిత శరత్‌ ఏ ముహూర్తాన ఈ నవల రాశాడోకానీ ఎన్నో భారతీయ భాషల్లో ఇది నిర్మితమవుతూనే ఉంది. కానీ తెలుగు సినిమాకి తెలుగు హీరోగా అక్కినేనికీ వచ్చినంత పేరు ఎవరికీ రాలేదు. దర్శకుడు వేదాంతం రాఘవయ్య, సంగీత దర్శకుడు సి.ఆర్‌.సుబ్బురామన్, సముద్రాల గీత రచన సినిమాను ఎక్కడికో తీసుకెళ్లి కూచోబెట్టాయి. పార్వతిగా సావిత్రి, చంద్రముఖిగా లలిత, స్నేహితుడు భగవాన్‌గా పేకేటి శివరామ్‌ వీళ్లందరూ అలాగే గుర్తుండిపోతారు. ఇవాళ్టికీ ఎవరైనా ప్రేమలో విఫలమైతే ‘వాడో దేవదాసు’ అనేంతగా ఈ పాత్ర తెలుగువారి రక్తంలో జీర్ణించుకుపోయింది. ‘జగమే మాయ.. బ్రతుకే మాయ’, ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌’, ‘చెలియ లేదు చెలిమి లేదు’, ‘అంతా భ్రాంతియేనా’... పాటలన్నీ రసగుళికలు. గాలివానను క్లైమాక్స్‌కు వాడిన మొదటి సినిమా ఇదే. నేటికీ ప్రేమకథలు ఎన్ని పుట్టినా ఇది మాత్రమే జేజమ్మ.

విశేషం: ఈ సినిమాను దర్శకుడు వేదాంతం రాఘవయ్య ఎక్కువగా రాత్రి వేళల్లో షూట్‌ చేశారు. అందువల్ల నిద్రలేక అక్కినేని కళ్లు ఉబ్బినట్టయ్యాయి. దాంతో అవి తాగుబోతు కళ్ల వలే కనిపించి పాత్రకు నప్పి రాణించాయి.

పెద్ద మనుషులు (1954)
సమకాలీన సమాజంపై సెటైర్‌తో నిండిన కామెంట్‌ చేయవచ్చని మొదటిసారిగా నిరూపించిన సినిమా ‘పెద్ద మనుషులు’. దర్శకుడు కె.వి.రెడ్డిలో ఉండే సోషల్‌ అవేర్‌నెస్, పైకి పెద్దవాళ్లుగా అభినయిస్తూ లోన సమాజాన్ని దోచుకు తినేవారి పట్ల రోత ఈ సినిమాలో కనిపిస్తాయి. కమెడియన్‌ రేలంగి  ఈ సినిమాలో విశ్వరూపం చూపుతారు. అలా పిచ్చివాడిగా ఉంటూ సమాజాన్ని తిట్టే ఆ పాత్రను కేంద్రంగా చేసుకొని తెలుగు సినిమాల్లో అనేక పాత్రలు వెలువడ్డాయి. ఇబ్సెన్‌ నాటకం ‘ది పిల్లర్స్‌ ఆఫ్‌ సొసైటీ’ ఆధారంగా వచ్చిన ఈ సినిమా ఆ రోజుల్లో ధర్మపరాయణులుగా కనిపిస్తూ పేదలను దోచుకు తినే పెద్దలపై ఈసడింపు. డి.వి.నరసరాజు ఈ సినిమాతోనే మాటల రచయిత అయ్యారు. ‘శివ శివమూర్తివి గణనాథ నీవు శివుని కుమారుడవు గణనాథా’.. పాట ఇందులోదే.

విశేషం: ఆ తర్వాతి రోజులలో విశేష ప్రాధాన్యం సంతరించుకున్న ‘గ్రూప్‌ విలనిజం’కు ఈ సినిమాయే ఆద్యం. ఇందులో నలుగురు విలన్లుగా జంధ్యాల గౌరీనాథశాస్త్రి, ఏ.వి.సుబ్బారావు, వంగర వెంకట సుబ్బయ్య, చదలవాడ నటించారు.

మిస్సమ్మ (1955)
అచ్చ తెలుగు వినోదానికి ఎస్‌ అన్న చిత్రం మిస్సమ్మ. తమిళంలో, హిందీలో కూడా ఈ సినిమా ప్రేక్షకులను రంజింప చేసింది. ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకుడిగా గొప్పవాడనడానికి ఈ సినిమా ఒక్కటి సరిపోతుంది. ఎన్‌.టి.ఆర్‌ ఈ సినిమాలో కనిపించినంత అందంగా మరే సినిమాలోనూ కనిపించడు. మొదట భానుమతిని హీరోయిన్‌గా అనుకుని ఆమెను క్యాన్సిల్‌ చేసి సావిత్రిని పెట్టడం వల్ల ఆమె స్టార్‌ అయి ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీని ఏలింది. ఉద్యోగం దొరకడం కష్టమైన ఆ రోజుల్లో చిన్న నాటకమాడి ఉద్యోగం సంపాదించుకున్న ఒకమ్మాయి అబ్బాయిల గిలిగింతల ప్రేమ కథ ఇది. దొంగ బిచ్చగాడు దేవయ్యగా రేలంగికి నూటికి నూరు మార్కులు. ఎస్‌.వి. రంగారావు గొప్పతనం సరే కమెడియన్‌గా నాగేశ్వరరావు దుమ్ము దులిపేసి పగలబడి నవ్విస్తాడు. ‘రావోయి చందమామ మా వింత గాథ వినుమా’... ఈ వింతగాథను బోరు లేకుండా జనం చూస్తూనే ఉన్నారు.

విశేషం: ఈ సినిమా హిందీలో ‘మిస్‌ మేరీ’గా చేస్తే సావిత్రి పాత్రను మీనాకుమారి పోషించారు. నటనలో ఇద్దరూ సమ ఉజ్జీలు. చెప్పాల్సిన సంగతి ఏమిటంటే ఇద్దరి జీవితమూ విషాదపరిస్థితుల్లో ముగిసింది.

రోజులు మారాయి (1955)
భూమిని గుత్తాధిపత్యంలో ఉంచుకుని కౌలు రైతుల రక్తం తాగే కామందుల రాజ్యం పోయిందని, రోజులు మారాయని ఇక మీదట దున్నేవాడిదే భూమి అని నిరూపించడానికి వచ్చిన సినిమా ‘రోజులు మారాయి’. ఈ సినిమా పేరెత్తగానే వహీదా రహెమాన్, ఆమె నర్తించిన ‘ఏరు వాకా సాగారో రన్నో చిన్నన్న’ పాట గుర్తుకు వస్తాయి. ‘మాస్టర్‌ వేణు’ సంగీతకారుడుగా ఒక గ్లామర్‌ను తెచ్చుకున్న సినిమా ఇది. అక్కినేని, షావుకారు జానకీలతో పాటు రేలంగి కూడా సినిమాలో మార్కులు కొట్టేశాడు. నిర్మించిన సారథి స్టూడియోవారికి, దర్శకత్వం వహించిన తాపీ చాణక్యకి చిరకీర్తి సంపాదించి పెట్టిన సినిమా ఇది.

విశేషం: ఈ సినిమా హైదరాబాద్‌లో 100 రోజులు ఆడటంతో తెలుగు సినిమాలకు తెలంగాణలో ఆదరణ బయటపడింది. దాంతో మొదటిసారిగా సికింద్రాబాద్‌లో ఈ సినిమా పుణ్యమా అని డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసులు మొదలయ్యాయి.

శ్రీ వేంకటేశ్వర మçహాత్మ్యం (1960)

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి మీద తీసిన సినిమా అంటే ప్రేక్షకులు తండోపతండాలుగా వస్తారని నిరూపించిన సినిమా. దర్శకుడు పి.పుల్లయ్య ఇదే సినిమాను ఇంతకుమునుపు 1939లో నాటి తారాగణంతో ఒకసారి తీశారు. ఆ తర్వాత రామారావు వెండితెర దైవస్వరూపుడని కనిపెట్టి 1960లో రామారావుతో తిరిగి నిర్మించారు. ఎస్‌.వరలక్ష్మి శ్రీ మహాలక్ష్మిగా, సావిత్రి పద్మావతిగా, రామారావు శ్రీనివాసునిగా నటించిన సినిమా ఆ రోజుల్లో ప్రతి సినిమాహాలును మినీ తిరుమలగా చేసింది. అక్కడే వెంకటేశ్వరుని ప్రతిమలు పెట్టి జనం పూజించడం ప్రారంభించారు. ఘంటసాల పాడిన ‘శేషశైలావాస శ్రీవేంకటేశ’ పాట నాటికీ నేటికీ ఒక భక్తిగీతం. సినిమాలో ఆయనే ఈ పాట పాడుతూ కనిపిస్తారు. వెంకటేశ్వరస్వామిపై చిత్రాలకు పాదు వేసిన ఈ సినిమా వరుసలో మొన్నటి ‘నమో వెంకటేశాయ’ వరకూ వచ్చినవి ఎన్నో... రానున్నవి ఎన్నెన్నో.

విశేషం: ఈ సినిమా పూర్తయ్యాక ‘శుభం కార్డు’ వేయకుండా తిరుమల విశేషాలను తెలిపే డాక్యుమెంటరీని జత చేసి ఆ రోజులలో ప్రదర్శించడాన్ని జనం బోనస్‌గా భావించారు.

గుండమ్మ కథ (1962)

విజయా వారి ఘన వైభవానికి ఆఖరి తార్కాణంగా ఈ సినిమాని చెప్పుకుంటారు. దీని తర్వాత విజయ బ్యానర్‌ మీద ఆ స్థాయి హిట్స్‌ రాలేదు. గుండమ్మ అనే దురుసు వితంతువు తన కన్న కూతురిని ఒకలాగా సవతి కూతురిని ఒకలాగా చూస్తూ ఉంటే ఆ తల్లినీ ఆమె గారాల పట్టీని దారికి తెచ్చి తమ ఇంటికి కోడళ్లుగా చేసుకున్న ఇద్దరు అన్నదమ్ముల కథ ఇది. ముందు కన్నడలో విఠలాచార్య తీస్తే తెలుగులో విజయా సంస్థ చక్రపాణి, డి.వి.నరసరాజు ఆధ్వర్యంలో మార్పు చేర్పులు చేసి కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో విడుదల చేసింది. తెలుగువాళ్లలో ‘గుండమ్మ’ అని ఎవరూ పెట్టుకోరు. అది కన్నడ పేరైనా బాగుందని అలాగే పెట్టేశారు. అన్నదమ్ములుగా అక్కినేని, ఎన్టీఆర్‌ వారి తండ్రిగా ఎస్వీ రంగారావు, వారు ఎంచుకున్న అమ్మాయిలుగా జమున, సావిత్రి కళ్లకు నిండుగా కన్నుల పండువగా కనిపిస్తారు. ఇది ఒక రకంగా ‘ఫీల్‌ గుడ్‌ మూవీ’ అని చెప్పుకోవాలి. మధ్యలో హరనాథ్, ఎల్‌.విజయలక్ష్మిల ఉపకథ కూడా నడుస్తుంటుంది. రమణారెడ్డి కీలకపాత్ర పోషించి సినిమాలో సుడిగాలి వలే వ్యవహరిస్తుంటారు. చివర్లో వచ్చే రాజనాల కూడా నవ్వు తెప్పిస్తారు. ఆబాల గోపాలాన్ని మెప్పించి అందరికీ పేరూ డబ్బు తెచ్చి పెట్టిన సినిమా ఇది.

విశేషాలు: ఘంటసాల చేసిన పాటలన్నీ హిట్టే. కోలో కోలోయన్న కోలో నా సామీ, లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, అలిగిన వేళనే చూడాలి... ఇక ‘ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలనో’ పాట ఒక జాతీయంలా స్థిరపడింది. దీనిని రీమేక్‌ చేయాలని బాలకృష్ణ– నాగార్జున జోడీతో జూ.ఎన్టీఆర్‌–నాగచైతన్య జోడీతో కొందరు ప్రయత్నించారు. సూర్యకాంతంను రీప్లేస్‌ చేసేవారు లేరని ఆ ప్రయత్నాలు మానుకున్నారు.


మాయాబజార్‌ (1957)

‘బజార్‌’ అనే ఉర్దూ మాటను టైటిల్‌లో పెట్టి మరీ పౌరాణిక సినిమా తీసినా జనం అదేమీ పట్టించుకోకుండా బ్రహ్మరథం పట్టిన సినిమా ఇది. నాగిరెడ్డి, చక్రపాణి, కె.వి.రెడ్డి, పింగళి, ఘంటసాల, ఎన్‌.టి.ఆర్, ఏ.ఎన్‌.ఆర్, ఎస్వీఆర్, సావిత్రి, రేలంగి, సి.ఎస్‌.ఆర్‌... ఇలా సినిమాతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ చెరగని కీర్తి పొందిన సినిమా ఇది. పాండవులు సినిమాలో ఒక్కసారి కూడా కనిపించకుండా పాండవుల కథతో తీసిన విడ్డూరమైన సినిమా ఇది. మూలంలో లేని శశిరేఖా పరిణయంను కల్పితంగా కల్పించుకుని ఒక అందమైన రూపం ఇచ్చారు. ఇందులో మార్కస్‌ బాట్లే ట్రిక్‌ ఫొటోగ్రఫీ ఇప్పటి బాహుబలికి బాబు అని ఫీలయ్యేవారు ఉన్నారు. ‘ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి’, ‘రసపట్టులో తర్కం కూడదు’ వంటి డైలాగులు మురిపెం కలిగిస్తాయి. ‘చూపులు కలిసిన శుభవేళ’, ‘వివాహ భోజనంబు’, ‘అహ నా పెళ్లి అంట’, ‘నీవేనా నను పిలిచినది’... వంటి పాటలెన్నో. దర్శకుడు జంధ్యాల ఈ సినిమా ఆధారంగా కనీసం అరడజను సినిమా టైటిల్స్‌ పెట్టి సినిమాలు తీశారు. తెలుగువారు ఒక సినీ ఆస్తిగా ఫీలయ్యే సినిమా అంటే ఇదేనేమో. ఆబాల గోపాలాన్ని అలరించిన ఏకైక సినిమా ఇది.

విశేషం: ఎన్‌.టి.ఆర్‌ ఇంతకుమునుపు ఒకసారి కృష్ణుడి వేషం వేస్తే జనం మెచ్చలేదు. దాంతో ఆయన కృష్ణుడి పాత్రంటేనే భయపడి మాయాబజార్‌లో కృష్ణుడి పాత్ర ఆఫర్‌ను వద్దనుకున్నారు. కాని కె.వి.రెడ్డి ఒప్పించి చేయించారు. ఈ సినిమా తర్వాత తెలుగువారికి కృష్ణుడంటే రామారావే అన్నట్టు స్థిరపడిపోయింది. నేటికీ ఆ పాత్రను ఎవరు వేసినా ఎన్‌టిఆర్‌తో పోల్చి నిరుత్సాహపడేవాళ్లు అనేకమంది ఉన్నారు.

లవకుశ (1963)

తెలుగులో పూర్తి కలర్‌లో తీసిన తొలి సినిమా. నిర్మాత శంకర్‌రెడ్డి ఈ సినిమా నిర్మించడానికే పుట్టారేమో తెలీదు. ఐదేళ్లు కష్టపడి భారీ ఖర్చుతో తీసిన ఈ సినిమా ఆ తర్వాత ఈ నాటి లెక్కల్లో అప్పుడే వెయ్యి కోట్లు కలెక్షన్లు సాధించిందని అంచనా. జన ఎడ్లబండ్లు కట్టుకుని వచ్చి మరీ ఈ సినిమా చూసేవారు. రావణుడు, యుద్ధము లేని ఈ సినిమా కేవలం సీతారాముల ఎడబాటు, సుపుత్రులతో సీతారాముల కలయికతో ఆకట్టుకుంది. దర్శకుడు సి.పుల్లయ్య సగం సినిమా పూర్తి చేయగా ఆయన అనారోగ్యం వల్ల ఆయన కుమారుడు సి.ఎస్‌.రావు మిగిలిన సినిమాను పూర్తి చేశారు. అంతవరకూ డాన్సింగ్‌ స్టార్‌గా ఉన్న అంజలీ దేవి సీతగా చేయడం ఏమిటి అన్నవారే సినిమా చూసి ఆమె కలియుగ సీతగా హారతులు పట్టారు. రాముడిగా ఎన్టీఆర్‌కు జేజేలు సిద్ధించాయి. ఇక కుశలవులుగా నటించిన నాగరాజు, సుబ్రహ్మణ్యం జీవితానికి సరిపడా కీర్తి సంపాదించారు. లక్ష్మణుడిగా వేసిన కాంతారావుకు ఈ సినిమా మరో వంద సినిమాల భిక్ష పెట్టింది. ‘వినుడు వినుడు రామాయణగాథ’, ‘శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా’, ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’... ఘంటసాల చేసిన పాటలు పల్లెపల్లెలో నేటికీ సుప్రభాత గీతాలుగా వినిపిస్తూ ఉన్నాయి.

విశేషం: లవకుశ కోసం రిపీట్‌ రన్‌లతో సహా ఇప్పటికి పదిహేను కోట్ల టికెట్లు తెగి ఉంటాయని అంచనా. ఈ రికార్డు ఇప్పటికీ తెలుగులో ఈ సినిమాకే సొంతం.

మూగ మనసులు (1964)

ప్రేమనూ పునర్జన్మలనూ కలిపి ‘మ్యూజికల్‌ హిట్‌ లవ్‌స్టోరీ’లకు తెర తీసిన సినిమా ఇది. దర్శక దిగ్గజం ఆదుర్తి సుబ్బారావు విశ్వరూపం చూపి అంతవరకూ స్టూడియోలలో మగ్గుతున్న సినిమాను గోదారి ఒడ్డుకు తీసుకొచ్చి కొబ్బరిగాలి తగిలేలా చేసి ప్రేక్షకుల్ని పులకరింపజేశారు. రచయిత ముళ్లపూడి వెంకటరమణ ఈ సినిమా వెనుక గట్టి కృషి చేసినా చాలా క్రెడిట్‌ ఆత్రేయకు దక్కింది. హీరోను హీరోయిన్‌ ‘ఒరే’ అని పిలవడం ఈ సినిమాతోనే మొదలు. అక్కినేని, సావిత్రిలది హిట్‌ పెయిర్‌ అని మరోసారి నిరూపించిన సినిమా. సావిత్రి పక్కన పద్మనాభంను భర్తగా పెట్టి ధైర్యం చేశారు. జమున ఒక అల్లరి పిల్లలా అదరగొట్టేస్తుంది. ‘గోదారి గట్టుంది గట్టు మీద చెట్టుంది’, ‘నా పాట నీ నోట పలకాల చిలకా’, ‘ముద్దబంతి పువ్వులో’, ‘ఈనాటి ఈ బంధం ఏ నాటిదో’... ఇలా ప్రతి పాట సూపర్‌డూపర్‌ హిట్‌ చేసింది కె.వి.మహదేవన్‌. దీనిని హిందీలో ‘మిలన్‌’ పేరుతో రీమేక్‌ చేశారు. చాలా రోజుల తర్వాత అక్కినేని కుమారుడు నాగార్జున ఇదే కథతో ‘జానకి రాముడు’ చేశాడు.

విశేషం: ఈ సినిమాకు హీరోగా ఆదుర్తి మొదటి ఛాయిస్‌ ఎన్‌.టి.ఆర్‌. అయితే ఆ రోజుల్లో ఆయన మద్రాసు స్టూడియోల్లోనే షూటింగ్‌ చేయడానికి ఇష్టపడేవారు. ఈ సినిమా పూర్తిగా ఔట్‌డోర్‌ చేయాలనుకుంటున్నందువల్ల చేయ నిరాకరించడంతో అవకాశం ఏ.ఎన్‌.ఆర్‌కు దక్కింది. అది ఆయన కెరీర్‌కు ఎంతో ప్లస్‌ అయ్యింది.

రాముడు– భీముడు (1964)
డబుల్‌ యాక్షన్‌ సినిమాల ఫార్ములాను ఖరారు చేసిన చిత్రం. దీనికి కారణం రచయిత డి.వి.నరసరాజు. ఇదే సినిమా హిందీలో, తమిళంలో రీమేక్‌ అయ్యి అక్కడా ఘన విజయం సాధించింది. దీనిని తిరగేసి సలీమ్‌ జావేద్‌లు ‘సీతా ఔర్‌ గీతా’ రాస్తే దానిని మళ్లీ తెలుగులో ‘గంగ – మంగ’గా తీశారు. ఇద్దరు హీరోలుంటే ఒక హీరో క్లాస్‌ మరో హీరో మాస్‌ అనే ‘రాముడు–భీముడు’ ఫార్ములాను ఇప్పటికీ ఫాలో అవుతూనే ఉన్నారు. నిర్మాత డి.రామానాయుడు ఈ సినిమాతో నిర్మాతగా స్థిరపడ్డారు. నాగార్జున సాగర్‌ నిర్మించే రోజులు కనుక అక్కడ తీసిన ‘దేశమ్ము మారిందోయ్‌ కాలమ్ము మారిందోయ్‌’ పాటలో ఆ నిర్మాణం చూడవచ్చు. ఎన్టీఆర్‌ డబుల్‌ యాక్షన్‌ చేసిన ఈ సినిమాలో ఆయన డూప్‌గా సత్యనారాయణ నటించారు. ‘ఉందిలే మంచికాలం ముందు ముందునా’, ‘తెలిసిందిలే తెలిసిందిలే’... హిట్‌ పాటలు. దీని దర్శకుడు తాపీ చాణక్య.

విశేషం: ఈ సినిమాలో డాన్సర్‌ ఎల్‌.విజయలక్ష్మి ఒక హీరోయిన్‌గా అలరిస్తారు. తెలుగువారి ఇష్టమైన డాన్సర్‌ అయిన ఎల్‌.విజయలక్ష్మి ఆ తర్వాతి రోజులలో సినిమాలకు స్వస్తి చెప్పి, ప్రస్తుతం అమెరికాలో విశ్రాంత జీవితం గడుపుతున్నారు.

తేనెమనసులు (1965)

అంతా కొత్తవారితో ఒక సినిమా తీయవచ్చని, తీసి హిట్‌ చేయవచ్చని తెలుగులో మొదటిసారి నిరూపించిన చిత్రం. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ధైర్యం చేసి ఎంపిక చేసిన స్టార్లలో బుర్రిపాలెం నుంచి వచ్చిన కృష్ణ ఆ తర్వాత సూపర్‌ స్టార్‌ అవడమే కాక మహేశ్‌బాబు అనే మరో సూపర్‌స్టార్‌ను ఇండస్ట్రీకి ఇచ్చాడు. ఇందులో మరో హీరోగా నటించిన రామ్మోహన్‌ అతి కొద్ది సినిమాల్లో నటించి ఆ తర్వాత వేషాలు లేక తెరమరుగయ్యాడు. హీరోయిన్లుగా వేసిన సుకన్య, సంధ్యారాణి కూడా నిలువలేదు. ముళ్లపూడి వెంకటరమణ కథ అందించడమే కాక ‘తేనె మనసులు’ అనే టైటిల్‌ కూడా పెట్టారు. ఇవాళ దాదాసాహెబ్‌ ఫాల్కే అందుకున్న కె.విశ్వనాథ్‌ దీనికి కో డైరెక్టర్‌. కృష్ణ ఈ సినిమాలో బ్రిలియంట్‌గా, ఈజ్‌తో డైలాగ్స్‌ చెప్పడం మనం చూస్తాం. ‘దివి నుంచి భువికి దిగి వచ్చె దిగి వచ్చె’, ‘నా ఎదుట నీవు నీ ఎదుట నేను’ హిట్‌ సాంగ్స్‌ ఇందులోవే.

విశేషం: ఈ సినిమాను మొదట కొంత బ్లాక్‌ అండ్‌ వైట్‌లో తీశారు. అయితే అప్పుడప్పుడే కలర్‌ సినిమాలు ఊపందుకుంటూ ఉండటంతో తీసింది పక్కన పెట్టి మొత్తం సినిమా తిరిగి కలర్‌లో తీశారు.

ప్రేమనగర్‌ (1971)

నవలా చిత్రాలు ఇంత పెద్ద హిట్‌ కాగలవని, సరిగ్గా మలుచుకుంటే కాసులు కుమ్మరిస్తాయని నిరూపించిన చిత్రం. అక్కినేనిని నవలా నాయకునిగా, వాణిశ్రీని నవలా నాయికగా ఈ సినిమా పర్మనెంట్‌గా నిలబెట్టింది. ప్రఖ్యాత నవలారచయిత్రి కోడూరి కౌసల్యాదేవి రాసిన ‘ప్రేమనగర్‌’ నవలను కొనుక్కున్న నిర్మాత రామానాయుడు దర్శకుడిగా కె.ఎస్‌.ప్రకాశరావును, రచయిత ఆత్రేయను, సంగీత దర్శకునిగా కె.వి.మహదేవన్‌ను ఎంచుకుని నేల క్లాసు ప్రేక్షకుడు మెచ్చే హంగులు జత చేసి తీసిన ఈ సినిమా రామానాయుడిని సినీ రంగంలో పెద్ద నిర్మాతగా కొనసాగే స్థయిర్యాన్ని ధైర్యాన్ని ఇచ్చింది. తాగుబోతు హీరోని సంస్కరించి దారిలో పెట్టే హీరోయిన్‌ అతను దారికి వచ్చాక ఆమె ఎడబాటు... ఈ ట్విస్ట్‌లన్నీ జనానికి నచ్చాయి. భారీ సెట్లు వేసి తీసిన ‘నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం’, ‘ఎవరి కోసం ఎవరి కోసం’... ‘మనసు గతి ఇంతే’ విషాద గీతాలు పెద్ద హిట్‌. అలాగే ‘లే..లే.. లే నా రాజా’ పాట మాస్‌కు పట్టింది. ‘నేను పుట్టాను ఈ లోకం ఏడ్చింది’... అని రాయడం ఆత్రేయకే చెల్లు. ‘ఎందుకు చేశావు ఈ పని’ అని హీరో ఒక నిందను వేయడంతో హీరోయిన్‌ అతడికి దూరమవుతుంది. ఆ ఒక్క డైలాగూ ఫేమస్సే. బలమైన కథ, హిట్‌ పాటలు ఉంటే సినిమా భారీ విజయం సాధిస్తుందనడానికి ‘ప్రేమనగర్‌’ ఒక శాశ్వత ఉదాహరణ.

విశేషం:  ఈ సినిమాలో నటించిన వాణిశ్రీ హెయిర్‌ స్టయిల్, పొడవు చేతుల జాకెట్లు ఆరోజుల్లో పెద్ద క్రేజును సంపాదించుకున్నాయి. తమిళంలో శివాజీ గణేశన్‌తో, హిందీలో రాజేష్‌ఖన్నాతో రీమేక్‌ చేస్తే అక్కడా హిట్‌ అయ్యి రామానాయుడు పెద్దఎత్తున డబ్బు సంపాదించుకున్నారు ఈ సినిమాతో.

మోసగాళ్లకు మోసగాడు  (1971)

క్రైమ్‌ సినిమాల ఘనాపాటి, డేరింగ్‌ డాషింగ్‌ హీరో కృష్ణ తెలుగువారికి అందించిన తొలి కౌబాయ్‌ చిత్రం ఇది. హాలీవుడ్‌లో విపరీతంగా పాపులర్‌ అయిన ఈ ధోరణి చిత్రాలను భారతదేశంలో అందునా దక్షిణభారతదేశంలో హిట్‌ ఫార్ములాగా మార్చింది కె.ఎస్‌.ఆర్‌ దాసే. క్లింట్‌ ఈస్ట్‌వుడ్‌ నటించిన ‘ది గుడ్‌ ది బ్యాడ్‌ అండ్‌ ది అగ్లీ’ కథను ఆధారంగా చేసుకుని తీసిన ఈ సినిమాలో విజయనిర్మల, జ్యోతిలక్ష్మి ముఖ్యపాత్రలు పోషించారు. నాగభూషణం ఇందులో ‘అగ్లీ’ని పోలిన పాత్రలో చెలరేగిపోయి నటించారు. రిలీజైన వెంటనే భారీ విజయం నమోదు చేసిన సినిమా ఆ తర్వాత అలాంటి సినిమాలెన్నింటికో పురుడు పోసింది. ఇందుకు రచయిత ఆరుద్రకు కూడా క్రెడిట్‌ ఇవ్వాలి. ‘కోరినది నెరవేరినది ఒహో కలలు నిజమాయే’ పాట ఇందులోదే. సంప్రదాయ సంగీతంలో ఘనాపాటి అయిన ఆదినారాయణరావు ఈ సినిమాకు వెస్టర్న్‌ తరహా సంగీతం అందించడం విశేషం.
 
విశేషం: ఈ సినిమా మొత్తాన్ని రాజస్తాన్‌ చుట్టుపక్కల తీశారు. ఇందుకోసం ఒక ప్రత్యేక రైలులో తారాగణాన్నంతా పట్టుకుపోయారు. సినిమాకు ఆరుద్రనే డైరెక్టర్‌ చేద్దామనుకున్నారు. కాని ఆయన వారించడంతో అవకాశం కె.ఎస్‌.ఆర్‌.దాస్‌కు దక్కింది. ఈ సినిమా గొప్పగా రావడానికి కెమెరామెన్‌ వీఎస్‌ఆర్‌ స్వామిది కూడా ముఖ్యభూమికే.

ముత్యాల ముగ్గు (1975)

ఉత్తర రామాయణాన్ని సోషలైజ్‌ చేసి బాపు రమణలు హిట్‌ కొట్టిన సినిమా ఇది. బాపు దర్శకుడుగా రమణ రచయితగా ఒక జోడిని ఈ సినిమా తెలుగులో స్థిరపరిచింది. సహజమైన నుడికారం, సహజ వెలుతురులో చిత్రీకరణ, కొత్తరకం కథనం, పాటలు అన్నీ ఈ సినిమాకు అందంగా అమిరాయి. శ్రీధర్, సంగీత వీరితోపాటు కాంతారావు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించారు. రావు గోపాలరావు ఈ సినిమాతోనే తెలుగులో మెయిన్‌ విలన్‌గా జెండా పాతారు. కట్టుకున్న భార్యను అనుమానించి వదులుకున్న భర్తను దారిలోకి తేవడానికి పిల్లలు రంగంలోకి దిగుతారు. ఇందులో ఆంజనేయస్వామి కూడా ముఖ్యపాత్రధారి కావడం విశేషం. ‘మడిసన్నాక తిని తొంగోవడం కాదు కాసింత కళాపోషణ ఉండాల’ అనే ఫేమస్‌ డైలాగ్‌ ఇందులోదే. ‘డిక్కీలో ఎట్టించేస్తాను’, ‘ఆ ముక్క లెక్కెట్టుకోక ముందు చెప్పాల’ లాంటి డైలాగులు జనం నోట నానాయి. ఆ రోజుల్లో కోటి రూపాయలు కలెక్ట్‌ చేసిన సినిమాగా చెప్పుకుంటారు.

విశేషం: సుప్రసిద్ధ కవి గుంటూరు శేషేంద్రశర్మ తన జీవితంలో రాసిన ఒకే ఒక పాట ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది’ ఇందులోదే. ఆరుద్ర రాసిన ‘ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ’ పాట ఇంటింటి మేలుకొలుపు పాటయ్యింది.

అంతులేని కథ (1976)

మధ్యతరగతి జీవితాల్లోని చేదును, వగరును, స్వార్థాన్ని, స్వలాభాన్ని నలుపు–తెలుపుల్లో వాస్తవిక ధోరణిలో చూపి ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం. 1970వ దశకంలో మధ్యతరగతి ఇళ్లల్లో ఒక్కరి మీద అందరూ ఆధారపడి బతికే ధోరణిని, మగవాళ్ల నిర్బాధ్యతను, ఆడవాళ్ల నలుగులాటను దర్శకుడు కె.బాలచందర్‌ ఈ సినిమాలో సమర్థంగా చూపించాడు. ఏ కుటుంబం కోసం సినిమా అంతా హారతిలా హరించుకుపోతుందో అదే కుటుంబం కోసం సినిమా చివరలో కూడా మళ్లీ దగ్ధమవ్వడానికి ముఖ్యనాయిక జయప్రద సిద్ధమవుతుంది. ఈ కుటుంబాన్ని వదిలి పారిపోయిన తండ్రి తిరిగి వస్తున్నాడని తెలిసి కుటుంబం అంతా వేయి కళ్లతో ఎదురు చూస్తే అతడు సన్యాసిలా తిరిగి వచ్చి అంతలోనే వెళ్లిపోయే సన్నివేశం కలచి వేస్తుంది. జయప్రద నటన, గణేశ్‌పాత్రో సంభాషణలు ముఖ్యం. ఈ సినిమాలో పాటలన్నీ హిట్‌. ‘తాళి కట్టు శుభవేళ’, ‘దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి’, ‘కళ్లలో ఉన్న నీరు కన్నులకే తెలుసు’... జనం మర్చిపోలేదు.

విశేషాలు: ఈ సినిమాలో కనిపించిన కమలహాసన్, రజనీకాంత్‌ ఆ తర్వాత తమిళనాడుకే కాదు భారతదేశానికే సూపర్‌స్టార్లు అయ్యారు. ఇందులో రజనీకాంత్‌ సిగరెట్‌ ఎగరేసి తాగడం అప్పట్లో ఫ్యాషన్‌ అయ్యింది. జయప్రద స్లీవ్‌లెస్‌ జాకెట్స్‌ తొడుక్కోవడం కాక మధ్యతరగతి ఇళ్లల్లో చాలా సాధారణంగా కనిపించే బట్టలు మార్చుకునే సన్నివేశంలో మూడునాలుగుసార్లు కనిపిస్తుంది.

అల్లూరి సీతారామరాజు (1974)

హిందీలో షోలే వంటి భారీ సినిమాలు 1975లో వస్తే అంతకు ఒక సంవత్సరం ముందే సినిమాస్కోప్‌లో మన దగ్గర వచ్చిన భారీ సినిమా అల్లూరి సీతారామరాజు. విప్లవజ్యోతిగా, మన్నెం వీరుడుగా అల్లూరి సీతారామరాజు తెలుగువారి దృష్టిలో మరో భగత్‌సింగ్‌లా ఔన్నత్యం పొందారు. ఆయన కథను ఎన్టీఆర్‌ సినిమాగా తీయాలని ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమవగా ఆ అదృష్టం కృష్ణకు దక్కింది. ఆయనే నిర్మాతగా మారి హీరోగా నటించి వి.రామచంద్రరావు దర్శకత్వంలో ఆయన అకాల మరణం పొందగా కె.ఎస్‌.ఆర్‌. దాస్‌ సహాయంతో అంతా తానై సినిమాను ముగించారు. పాఠ్యపుస్తకాల్లో చదివిన దానికంటే తెలుగువారు ఈ సినిమా ద్వారానే సీతారామరాజును ఎక్కువగా తెలుసుకున్నారని చెప్పవచ్చు. ఈ సినిమా తీయడంతో కృష్ణ జన్మ ధన్యమైందని భావించినవారు ఉన్నారు. బ్రిటిష్‌ అధికారి రూథర్‌ఫోర్డ్‌గా జగ్గయ్య కంచు కంఠం మోగిస్తారు. సినిమా అంతా ఒకెత్తయితే క్లయిమాక్స్‌ ఒకెత్తు. ఆ సన్నివేశంలో సీతారామరాజుకు, రూథర్‌ఫోర్డ్‌కు జరిగిన సంవాదం సంభాషణా రచయిత త్రిపురనేని మహారథి కలం పదనుతో పతాక స్థాయికి వెళ్లింది. విడుదలై ఇన్నేళ్లయినా ప్రతి జెండా పండుగకూ టీవీలో ప్లే అవుతూ తెలుగువారి గుండెలను ఉప్పొంగేలా చేస్తున్న చిత్రమిది. మరువలేని చిత్రం.

విశేషాలు: ఈ సినిమా విడుదలయ్యాక దీని ప్రభావంలో పడి దీని తర్వాత విడుదలైన 16 కృష్ణ సినిమాలను ప్రేక్షకులు ఫ్లాప్‌ చేశారు. ‘పాడిపంటలు’ సినిమాతో గాని మళ్లీ కృష్ణ హిట్‌ కొట్టలేదు. ఇందులోని పాటలు ‘వస్తాడు నా రాజు ఈ రోజు’, ‘తెలుగు వీర లేవరా’ పెద్ద హిట్‌. శ్రీ శ్రీ రాసిన తెలుగు వీర లేవరా పాట ఆయనకు జాతీయ పురస్కారం తెచ్చి పెట్టింది.

భక్త కన్నప్ప (1976)

‘శ్రీకాళహస్తీశ్వర మహత్యం’ ఎప్పుడూ ప్రజలకు ఆసక్తికరమైనదే. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ హీరోగా 1954లో ఈ కథాంశం సినిమాగా వచ్చింది. అయితే బాపు రమణలు దీనిని ఇంకాస్త అందంగా తీర్చిదిద్ది భారీ హంగులతో తీసి ప్రేక్షకులను అలరించారు.  కోయవాడైన తిన్నడు శివుడిపై భక్తితో తన రెండు కన్నులు అర్పించపూనుకుని ‘కన్న’ప్పగా మారడం కథ. ఈ గిరిజన కథ సినిమాగా విస్తరించడంలో భాగంగా ఊరు, విలన్‌గా రావు గోపాలరావు రంగప్రవేశం చేస్తారు. కమెడియన్‌ సారథి ఇందులో ముఖ్యమైన వేషం. వాణిశ్రీ హీరోయిన్‌గా సినిమాకు గ్లామర్‌ తేవడం చూస్తాం. సత్యం సంగీతంలో వచ్చిన పాటలు ‘ఎన్నియల్లో ఎన్నియల్లో చందమామ’, ‘ఆకాశం దించాలా’, ‘శివ శివ శంకర భక్తవశంకర’ పెద్ద హిట్‌. కృష్ణంరాజు స్వయంగా నిర్మించిన ఈ సినిమా ఆయనకు భారీగా లాభాలు తెచ్చి పెట్టింది.

విశేషాలు: ‘బెన్‌–హర్‌’ సినిమా చూసి అలాంటి సినిమా తీయాలనే కృష్ణంరాజు ఆలోచనకు రూపం ఈ సినిమా అంటారు. ఆ ప్రభావం వల్లే కావచ్చు ఈ సినిమాలో కృష్ణంరాజు–శ్రీధర్‌ల మధ్య భారీ ఫైట్‌ ఉంటుంది. అలాగే ‘కండ గెలిచింది’ పాట ‘డ్రమ్స్‌ పాట’గా చాలా భారీస్థాయిలో తీశారు.

దానవీరశూరకర్ణ (1977)

అంతవరకూ వచ్చిన పౌరాణికాలను తిరగేసి శూద్రదృష్టితో భారతాన్ని దర్శించి కర్ణుణ్ణి హీరోగా నిలబెట్టి సంచలనం సృష్టించిన సినిమా. నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా ఎన్‌.టి.రామారావు సర్వం తానై విశ్వరూపం చూపిన సినిమా ఇది. దాదాపు నాలుగు గంటల నిడివి ఉన్న ఈ సినిమాని 43 రోజులలో పూర్తి చేసినట్టు భోగట్టా. ఇవాళ్టి మేకింగ్‌తో పోల్చితే అదో పెద్ద రికార్డ్‌ కింద లెక్క. కర్ణుడు దుష్టుడు కాదని అతడు అర్జునుడి కంటే పరాక్రమవంతుడని దురదృష్టకరమైన కారణాల వల్ల, పాండవుల కాపట్యం వల్ల అతడు ఓడిపోయాడని ఈ కథ చెబుతుంది. వీరుడిగా ఓడినా దానగుణంలో అతడిని మించినవాడు లేడని ఈ కథలో చూపించారు. దుర్యోధనుడిగా, కృష్ణుడిగా, కర్ణుడిగా ఎన్‌.టి.రామారావు త్రిపాత్రాభినయం చేశారు. దుర్యోధనుడికి ఒక డ్యూయెట్‌ పెట్టవచ్చని, పెట్టినా జనం ఆదరిస్తారని ఎన్‌.టి.ఆర్‌ నిరూపించారు. ‘చిత్రం భళారే విచిత్రం’ డ్యూయెట్‌ ఈ సినిమాలోదే. మహా పండితుడైన కొండవీటి వేంకటకవి తొలిసారి సినీ రచన చేసిన ఈ సినిమాలోని డైలాగులు కేసెట్లుగా రికార్డులుగా వెలువడి వేలకొద్దీ అమ్ముడుపోయాయి. తిరుపతి వేంకటకవుల పద్యాలను కూడా సినిమాలో వీలు వెంబడి ఉపయోగించారు. ఫస్ట్‌ రన్, సెకండ్‌ రన్‌లో కూడా కోట్లు సంపాదించిన సినిమా ఇది.

విశేషాలు: ఈ సమయంలోనే సూపర్‌స్టార్‌ కృష్ణ ఇదే కథాంశంతో ‘కురుక్షేత్రం’ తీశారు. దాంతో ఇండస్ట్రీలో పోటాపోటీ ఏర్పడింది. ఇందులో నటించినవాళ్లు అందులో నటించకూడదు అని రూల్‌ పెట్టారు. ఒక్క కైకాల సత్యనారాయణే దీని నుంచి మినహాయింపు పొంది రెంటిలోనూ నటించారు. రెండూ ఒకేసారి విడుదలైనా కృష్ణ సినిమా పరాజయం పొంది దానవీరశూరకర్ణ నిలిచి వెలిగింది.

అడవిరాముడు  (1977)

తెలుగు సినిమా కమర్షియల్‌ వాల్యూస్‌ని తారస్థాయికి తీసుకెళ్లిన సినిమా. 1973లో కన్నడలో రాజ్‌కుమార్‌ నటించిన ‘గంధదగుడి’ అనే సినిమా విడుదలైంది. ఇది అడవి నేపధ్యంలో సాగుతుంది. అలాగే 1975లో ‘షోలే’ విడుదలైంది. ఈ రెంటి ప్రభావం నిర్మాతలు సత్యనారాయణ, సూర్యనారాయణల మీద అలాగే దర్శకుడు కె.రాఘవేంద్రరావు మీద పడింది. తెలుగులో ఒక భారీ కేన్వాస్‌ ఉన్న సినిమా తీయాలని నిశ్చయించుకుని ఈ కథల ప్రభావంతో ఒక కథ అల్లుకున్నారు. జంధ్యాల ఈ రచనకు తోడ్పడ్డారు. అంతవరకూ చిన్న సినిమాల హీరోయిన్‌గా ఉన్న జయప్రద ఈ సినిమాలో ఎన్‌టీఆర్‌ సరసన నటించి టాప్‌స్టార్‌ అయ్యారు. అడవిలో మొదట మారు వేషంలో వచ్చి ఫస్ట్‌ హాఫ్‌లో ఫారెస్ట్‌ ఆఫీసర్‌గా వచ్చి సెకండ్‌ హాఫ్‌లో ఎన్‌.టి.ఆర్‌ ప్రేక్షకులను అలరిస్తారు. ఏనుగులు కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడం విశేషం. విన్సెంట్‌ ఫొటోగ్రఫీ, కె.వి.మహదేవన్‌ సంగీతం, వేటూరి గీత రచన సినిమాకు ఎస్సెట్‌ అయ్యాయి. నాగభూషణ్‌ విలన్‌గా ‘చరిత్ర అడక్కు చెప్పేది విను’ డైలాగ్‌ ఫేమస్‌. తెలుగులో సంవత్సరం పాటు ఆడిన సినిమాలలో ఇది ఒకటి.
 
విశేషం: ఇందులో ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ పాట విని ‘సభ్య సమాజం’లో అనేక మంది హాహాకారాలు చేశారు. పాట స్థాయి దిగజారిందనే విమర్శలు వచ్చాయి. కాని ఆ పాటే పెద్ద హిట్టయ్యి ‘కోటి రూపాయల పాట’గా వాసికెక్కింది. ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు’, ‘ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్లకు’ తదితర పాటలు కూడా పెద్ద హిట్‌.

శంకరాభరణం (1980)

‘పాశ్చాత్య సంగీతపు పెనుతుపానుకు రెపరెపలాడుతున్న శాస్త్రీయ సంగీతానికి అరచేతులు అడ్డుపెట్టిన’ సినిమా ఇది. తెలుగుదనం కోల్పోయి, నేల విడిచి సాము చేసే కథలతో మూసధోరణిలో కొట్టుకుపోతున్న సినిమా వీపుపై చరిచి ఉలిక్కిపడేలా చేసిన సినిమా. తెలుగు వారికి ఒక సంస్కృతి ఉంది, సంగీతం ఉంది, చక్కటి సంభాషణ కూడా ఉందని ఈ సినిమా చెప్పే ప్రయత్నం చేసింది. ఇది బ్రాహ్మణ నేపథ్యంలో సాగినా భావోద్వేగాలు సకల సమూహాలకు వర్తించి సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యింది. దారిలో పాము ఎదురు పడితే ఎవరైనా కర్రతో కొట్టి చంపుతారు. అదే శంకరుని మెడలో ఉంటే (శంకరుని ఆభరణంగా మారితే) చేతులెత్తి మొక్కుతారు. ఈ సినిమాలో మంజుభార్గవి ఒక దుర్మార్గుడి అత్యాచారం వల్ల గర్భం దాల్చి బిడ్డను కంటుంది. ఒక రకంగా ఆ  బిడ్డ పాము. ఆమె ఆ బిడ్డకు శాస్త్రీయ సంగీతం నేర్పించి, శంకరశాస్త్రి దగ్గర శిష్యుడిని చేసి, గొప్ప సంగీతకారుడిగా మార్చి శంకరుని మెడలో ఉన్న ఆభరణం వలే చేస్తుంది. అదే శంకరాభరణం కథ. పాములాంటి తులసి పాత్ర శంకరాభరణంగా మారే ప్రయాణమే ఈ కథ. జె.వి.సోమయాజులు ఈ పాత్ర కోసమే పుట్టారు. దర్శకుడు కె.విశ్వనాథ్‌ ఈ సినిమాతో తరించారు.

విశేషాలు: ఇందులోని పాటలు సంస్కృతంతో నిండినప్పటికీ ఆబాలగోపాలాన్ని ఆకర్షించాయి. రిక్షావాళ్లు కూడా పాడుకున్నారు. ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం ఈ పాటలతోనే జాతీయ అవార్డు పొందారు.  ‘శంకరా నాదశరీరాపరా’, ‘రాగం తానం పల్లవి’, ‘బ్రోచే వారెవరురా’... ఈ పాటలు ఇప్పటికీ వినిపించేవే.

కరుణామయుడు (1978)

అంతవరకూ తెలుగునాట చర్చిలలో ఉన్న క్రీస్తును సినిమా థియేటర్లకు తీసుకువచ్చి ప్రతి మతం వారికి పరిచయం చేసిన సినిమా ‘కరుణామయుడు’. క్రైస్తవం పట్ల ఏమాత్రం అవగాహన లేనివారు కూడా ఈ సినిమా చూసి ఓహో క్రీస్తు కథ ఇదన్నమాట అని తెలుసుకున్నారు. ఎన్‌.టి.ఆర్‌ రాముడు, కృష్ణుడు పాత్రలకు ఎలా ప్రసిద్ధమో నటుడు విజయచందర్‌ ఏసుక్రీస్తు పాత్రకు అలా ప్రసిద్ధమయ్యారు ఈ సినిమాకు. ఇంకోమాట చెప్పాలంటే మత ప్రవక్తలను మొదటిసారిగా తెలుగుతెర మీద తీసుకువచ్చిన సినిమా కూడా ఇది. క్రీస్తు జననం, దైవ  కుమారుడిగా ఆయన చూపిన మహిమలు, ఆయనకు శిలువ వేయడం ఈ సినిమాలో వివరంగా ఉన్నాయి. ఆయన చూపిన మహిమలు నీటి మీద శిష్యుల నడక, కుష్టువ్యాధి నయం చేయడం ఇవన్నీ చూసి ప్రేక్షకులు పారవశ్యానికి లోనవుతారు. ఇందులోని మోదుకూరి జాన్సన్‌ రాసిన ‘కదిలింది కరుణరథం’ పాట చాలా ప్రసిద్ధం. దీనిని చిత్రీకరించేటప్పుడు శిలువ వేసిన విజయచందర్‌ను చూసి జూనియర్‌ ఆర్టిస్టులు నిజంగానే కన్నీరుమున్నీరు అయ్యారట. కరుణామయుడు విడుదల అయ్యాక కనీవినీ ఎరగని హిట్‌ అయ్యింది. భారతదేశంలో 14 భాషలలో అనువాదమై ప్రదర్శితమైంది. ఇవాళ్టికి తెలుగువారు క్రిస్మస్‌ వచ్చిందంటే తలుచుకునే సినిమా ‘కరుణామయుడు’.

విశేషం: విడుదలైన మొదటి నాలుగురోజులు ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా ఐదో రోజు నుంచి విజయదుందుభి మోగించింది. జనం థియేటర్‌లలో కన్నీరు మున్నీరై చీమిడి చీదుతుండటంతో షోకు షోకు మధ్య కొన్నిచోట్ల హాళ్లను కడగాల్సి వచ్చేది.

మా భూమి  (1980)

తెలంగాణ సాయుధపోరాటం అని చెప్పే తెలంగాణ దేశ్‌ముఖ్‌ల వ్యతిరేక పోరాటాన్ని, తెలంగాణ దొరల నుంచి విముక్తి కోసం ప్రజలు సాగించిన పోరాటాన్ని, భూమి పంపిణీ కోసం చేసిన పోరాటాన్ని వెండితెర మీద సమర్థంగా చూపించిన సినిమా. మరికొన్నాళ్లలో దేశానికి ఒకవైపు స్వాతంత్య్రం సిద్ధించే పరిస్థితులు ఉండగా మరోవైపు నిజాం పాలనలో తెలంగాణ గ్రామాల పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. గ్రామదొరల పీడన పెరిగింది. దీని నుంచి విముక్తి కోసం కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో సాయుధ పోరాటం సాగింది. ఇది విజయవంతమై దాదాపు 30 వేల మంది రైతులు వెట్టిచాకిరి నుంచి విముక్తం అయ్యారు. పది లక్షల ఎకరాల భూపంపిణీ జరిగింది. దీన్నంతటినీ ఈ సినిమా చర్చించి చూపిస్తుంది. బి.నర్సింగరావు నిర్మాతకాగ సుప్రసిద్ధ బెంగాలీ దర్శకుడు గౌతం ఘోష్‌ దీనికి దర్శకత్వం వహించారు. సాయిచంద్, భూపాల్‌ ముఖ్య తారాగణంగా ఉన్నారు. ప్రఖ్యాత జానపద సంగీతకారిణి వింజమూరి సీత పాటలకు బాణీలు కట్టారు. సుద్దాల హనుమంతు రాసిన ‘పాలబుగ్గల జీతగాడా’, గద్దర్‌ పాపులర్‌ చేసిన ‘బండెనక బండి కట్టి’.. ఇందులోనే ఉన్నాయి. మెదక్‌ జిల్లాలోని చిన్న పల్లెలో కష్టనష్టాలకు ఓర్చి జరిగిన షూటింగ్‌ ప్రజలే నటీనటులుగా కొనసాగింది. విడుదలయ్యాక ఎన్నో ప్రశంసలకు పాత్రమైన ఈ సినిమా తెలుగులో వచ్చిన ఉత్తమ సినిమాలలో తప్పక ఒకటిగా నిలుస్తుంది.

విశేషాలు: ఈ సినిమాకు నటుడు జగ్గయ్య వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. ‘బండెనక బండి కట్టి’ పాటను గద్దర్‌ స్వయంగా పాడుతూ కనిపిస్తారు. తెలంగాణ నుడికారణం, సామెతలు, అచ్చమైన మాటల ధోరణి ఈ సినిమాలో కనిపిస్తాయి.

ప్రేమాభిషేకం  (1981)

‘కేన్సర్‌’ను ఒక విలన్‌గా చేసి కథను రక్తికట్టించే సినిమాలలో ముందు వరుసలో నిలిచే సినిమా. కేన్సర్‌ బారిన పడిన హీరో తాను ఎంతో గాఢంగా ప్రేమించిన హీరోయిన్‌ని దుర్భాషలాడి కావాలని దూరం చేసుకుని త్యాగం చేయడం ఈ కథ. పాత ‘దేవదాసు’, ‘ప్రేమనగర్‌’ కథలు ఈ సినిమా చూస్తుంటే గుర్తుకు వచ్చినా అక్కినేని, శ్రీదేవి, జయుసుధ తదితరుల నటన దర్శకుడు దాసరి నారాయణరావు డైలాగుల మాయాజాలం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. సినిమా విడుదలయ్యాక కనీ వినీ ఎరగనంత పెద్ద హిట్‌ అయ్యింది. ‘నా కళ్లు చెబుతున్నాయి నిను ప్రేమించానని’, ‘కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా’,  ‘వందనం అభివందనం’.., ‘ఆగదు ఏ నిమిషము నీ కోసము’... వంటి పాటలు పెద్ద హిట్‌ అయ్యాయి. క్లయిమాక్స్‌లో శ్రీదేవితో అక్కినేని ‘ఇవన్నీ ఎందుకు చేశానో తెలుసా... కావాలని కావాలని చేశాను... పగ... వెంజెన్స్‌’ అని చెప్పిన డైలాగులు రికార్డులుగా అమ్ముడుపోయాయి. మిమిక్రీ ఆర్టిస్టులు ఈ డైలాగును చెప్పి పొట్టపోసుకునేలా చేసిన సినిమా ఇది.

విశేషం: ఈ సినిమాలో యువ ప్రేమికుడిగా అక్కినేని నటించే సమయానికి ఆయన వయసు 57. హీరోయిన్‌గా హైరేంజ్‌లో ఉన్న జయసుధ ‘వేశ్య’ పాత్రకు ఒప్పుకోవడం అప్పట్లో న్యూస్‌.

దేవత (1982)

మహిళా సెంటిమెంట్‌ కథను కమర్షియల్‌ హంగులతో చిత్రీకరిస్తే పెద్ద హిట్‌ అవుతుందని నిరూపించిన సినిమా. గతంలో వచ్చిన ‘పెళ్లికానుక’ (1960) సినిమా దీనికి స్ఫూర్తి అని అభిప్రాయం.  శోభన్‌బాబు, శ్రీదేవి, జయప్రద నాటి మూడ్‌కు తగినట్టుగా ఆకర్షణీయంగా నటించి ఆకట్టుకున్నారు. నిర్మలమ్మ, మోహన్‌బాబు, రావు గోపాలరావు ఇతర ముఖ్యపాత్రల్లో వినోదం పంచుతారు. ముఖ్యంగా కామెడీ విలన్‌గా నటించిన మోహన్‌బాబుకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇద్దరు అక్కచెల్లెళ్లు ఒకే హీరోని ఇష్టపడి ఒకరి కోసం మరొకరు త్యాగానికి సిద్ధపడటం ఈ కథ. నిర్మాత రామానాయుడుకి కాసులు, దర్శకుడు రాఘవేంద్రరావుకు పేరు తెచ్చి పెట్టింది. సత్యానంద్‌ రచన చేశారు.

విశేషం: ఇందులోని ‘వెల్లువచ్చి గోదారమ్మ’ పాట ‘బిందెల పాట’గా చాలా పాపులర్‌ అయ్యింది. చిత్రీకర ణలో వందలాది బిందెలు వాడటం వల్ల ప్రేక్షకులు థ్రిల్‌ ఫీలయ్యారు. ఈ సినిమాను హిందీలో ‘తోఫా’గా రీమేక్‌ చేస్తే అక్కడా విజయం సాధించింది.

ఖైదీ (1983)

చిరంజీవిని ‘స్టార్‌’ను చేసిన సినిమా. ఆయన పూర్తిస్థాయి యాక్షన్‌ హీరోగా ఈ సినిమాతో మాస్‌కు చేరువయ్యారు. కొన్ని సినిమాలకు అన్నీ కుదురుతాయన్నట్టు ఈ సినిమాకు చిరంజీవి నటన, ఫైట్స్, పరుచూరి బ్రదర్స్‌ రచన, చక్రవర్తి సంగీతం, వేటూరి పాటలు, ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వం సరిగ్గా అమరాయి. అప్పట్లో సిల్వర్‌స్టర్‌ స్టాలెన్‌ నటించిన ‘ఫస్ట్‌బ్లడ్‌’ పెద్ద సంచలనం సృష్టించింది. దాని ఆధారంగా కేవలం ఒక్కరోజులో పరుచూరి వెంకటేశ్వరరావు ఈ కథను అల్లారని అంటారు. పెత్తందార్ల దోపిడీ వ్యవస్థపై, వారికి కాపు కాసే చట్ట వ్యవస్థపై తిరుగుబాటు చేసి కలకలం సృష్టించే ‘సూర్యం’గా చిరంజీవి కనిపిస్తారు.  మాధవి హీరోయిన్‌. ఇందులోని పాటల్లో ‘రగులుతుంది మొగలిపొద’ ఆ రోజుల్లో సంచలనం రేపింది. సుమలతతో చేసిన ‘ఇదేమిటబ్బా ఇది అదేను అబ్బా..’ కూడా హిట్టే.

విశేషం: ఈ సినిమాలో వచ్చే మొదటి ఫైట్‌ చాలా ఫేమస్‌. పోలీస్‌ స్టేషన్‌లో తప్పించుకోవ డానికి చిరంజీవి చేసే ఆ ఫైట్‌ను ఇటీవల అలీ మీద పూరి జగన్నాథ్‌ ‘దేశముదురు’లో తిరిగి యథాతథంగా చిత్రీకరించారు. కోదండ రామిరెడ్డి– చిరంజీవిల జోడి ఈ సినిమాతో కుదిరి ఆ తర్వాత వారి కాంబినేషన్‌లో 16 సినిమాలు రావడానికి కారణమైంది.

మయూరి (1985)

వ్యక్తులు జీవించి ఉండగానే వారి ‘బయోపిక్‌’లు తీయడానికి తెలుగులో అంకురార్పణ చేసిన సినిమా. డాన్సర్‌ సుధాచంద్రన్‌ యాక్సిడెంట్‌లో కాలు పోగొట్టుకున్నా పట్టుదలతో జైపూర్‌ కాలు అమర్చుకుని డాన్సర్‌గా కొనసాగడం ఉషాకిరణ్‌మూవీస్‌ అధినేత రామోజీరావుకు నచ్చి ఆ కథను సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో సినిమాగా తీస్తే అది అఖండ విజయం సాధించింది. సాధారణంగా ఒకరి బయోపిక్‌లో మరొకరు నటించడం ఆనవాయితీ. కానీ ఈ సినిమాలో సుధాచంద్రన్‌ తన పాత్రను తానే ధరించారు. గణేశ్‌ పాత్రో రచన, ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం సంగీతం, వై.విజయ, నిర్మలమ్మ, పి.ఎల్‌.నారాయణ, ముక్కురాజు తదితరుల సపోర్టింగ్‌ ఈ సినిమాకు లాభించాయి. కాలో చేయో కోల్పోతే జీవితమే వృథా అని భావించే మనోస్థితి ఉన్న ఆ రోజుల్లో అటువంటివారిలో నిజానికి వేల మందిలో స్థయిరాన్ని నింపిన సినిమా ఇది. ఇందులోని పాటలు ‘ఈ పాదం ఇలలోని నాట్య వేదం’, ‘మౌనం గానం మధురం మంత్రాక్షరం’, ‘ఇది నా ప్రియనర్తన వేళ’ పాటలు బాగుంటాయి.

విశేషం: ఈ సినిమాను తమిళంలో బాలసుబ్రహ్మణ్యం అనువాదం చేయగా తమిళనాడులో అదే వర్షన్‌ కేరళలో కూడా హిట్‌ అయ్యింది. హిందీలో రీమేక్‌ చేయగా ‘నాచె మయూరి’గా హిట్‌ అయ్యింది. ఈ స్ఫూర్తితో ఇలాంటి నిజ జీవిత కథలతో ఈ సంస్థ ఆ తర్వాతి రోజులలో ‘మౌన పోరాటం’, ‘అశ్వినీ’ సినిమాలు నిర్మించింది.

ఎర్రమల్లెలు (1981)

తెలంగాణ గ్రామాలలో దొరల పీడన ఉంటే ఆంధ్ర గ్రామాలలో పెత్తందార్ల పీడన అధికం. సర్పంచ్‌లు, మునసుబులు, ప్రెసిడెంట్‌లు... వీళ్లకు తోడు అప్పుడప్పుడే తలెత్తుతున్న పారిశ్రామికవేత్తలు ఇటు కార్మికులను, అటు కర్షకులను పీక్కు తినడం కొనసాగించారు. కార్మికులు, కర్షకులు ఏకమై ఈ విష వ్యవస్థను పెళ్లగించి ఆదర్శనీయమైన వ్యవస్థను సృష్టించుకోవాలనే లక్ష్యాన్ని వ్యక్తం చేసే సినిమా ‘ఎర్రమల్లెలు’. భార్యకు పూలు తీసుకువెళుతున్న కార్మిక నాయకుడు మురళీమోహన్‌ను ఫ్యాక్టరీ గూండాలు అడ్డగించి చంపడంతో ఆ పూలు రక్తసిక్తం అవుతాయి. అది చూసి ఊరంతా తిరగబడుతుంది. పూలే కాదు మనుషులూ తిరగబడాలని విప్లవ పంథాలో ఎర్రబడాలని సంకేతం. రంగనాథ్, సాయిచంద్, ‘అన్న’ వెంకటేశ్వర్లు, పి.ఎల్‌.నారాయణ ప్రధాన పాత్రలు పోషించారు. మాదాల రంగారావు రెబల్‌గా కనిపించి ఉత్తేజం కలిగిస్తారు. దర్శకుడిగా ధవళ సత్యంకు ఈ సినిమా పేరు తెచ్చి పెట్టింది. ‘నాంపల్లి టేషనుకాడి రాజాలింగో’, ‘హే.. లగ్‌జిగ్‌లంబాడి’... పాటలు ఈ సినిమాలోనివే.

విశేషం: అప్పటికి ఇంకా పాపులర్‌ కాని సుత్తి వీరభద్రరావు ఇందులో లాయర్‌గా ముఖ్యపాత్రలో కనిపిస్తారు. అలాగే అప్పటికి ఇంకా దర్శకుడిగా మారని టి.కృష్ణ కూడా ఈ సినిమాలో ఒక పాత్రను, నిర్మాత పోకూరి బాబూరావు మరో పాత్రను పోషించారు.

ప్రతిఘటన  (1985)

ఉషాకిరణ్‌ మూవీస్‌ సంస్థకు, దర్శకుడు టి.కృష్ణకు, నటి విజయశాంతికి విశేషమైన కీర్తి సంపాదించిపెట్టిన చిత్రం. అంత వరకూ చిన్న సినిమాలు చేస్తూ వచ్చిన టి.కృష్ణ ఈ సినిమాతో టాప్‌ డైరెక్టర్‌గా గుర్తింపు పొందారు. 80లలో కొన్ని టౌన్‌లలో పెచ్చరిల్లిన రౌడీయిజంను, ఆ రౌడీయిజంను అడ్డు పెట్టుకుని ఊరేగుతున్న రాజకీయ వ్యవస్థను కథాంశంగా తీసుకుని దానిని తుద ముట్టించే రెబల్‌ క్యారెక్టర్‌లో ఒక లెక్చరర్‌ పాత్రను పెట్టి ప్రేక్షకులలో గొప్ప ఎఫెక్ట్‌ సాధించారు. సినిమా విడుదలయ్యాక చాలామంది ఇది పలానా ఊరు కథ అంటే పలానావారి కథ అని అనుకున్నారు. ఎం.వి.ఎస్‌.హరనాథరావు మాటలు, వేటూరి పాటలు కూడా ఈ సినిమాకు ప్లస్‌ అయ్యాయి. అన్యాయాన్ని ఎదిరించే హీరోయిన్‌ను నడిరోడ్డు మీద వస్త్రాపహరణ చేస్తే ఆ తర్వాత సన్నివేశంలో స్టూడెంట్స్‌ అంతా ఆ విషయాన్ని గేలి చేస్తారు. అప్పుడు హీరోయిన్‌ పాడిన ‘ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతీ లోకంలో’ పాట గొప్ప ఉద్వేగాన్ని కలిగిస్తుంది. క్లయిమాక్స్‌లో విలన్‌ను హీరోయిన్‌ గండ్రగొడ్డలితో నరికే సన్నివేశం కూడా. సినిమా విడుదలయ్యాక జనం తండోపతండాలుగా చూశారు. తమిళంలో, మలయాళంలో డబ్‌ అయితే అక్కడా విపరీతంగా చూశారు. సిప్పీలకు ‘షోలే’లా ఉషాకిరణ్‌ మూవీస్‌కు విపరీతంగా డబ్బు సంపాదించి ఇచ్చిన సినిమా ప్రతిఘటన.

విశేషం: ఈ సినిమాలో తెలంగాణ యాస మాట్లాడి కోట శ్రీనివాసరావు మొదటిసారిగా జనం దృష్టిలో పడ్డారు. ఈ సినిమా తమిళంలో చూసిన కోయంబత్తూరు రౌడీలు ఇది మా కథే అని గొడవ చేశారు. సుత్తి వేలు ఈ సినిమాలో పిచ్చి కానిస్టేబుల్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

స్వాతిముత్యం (1986)

తెలివి మీరిపోయిన మనిషికి ఇన్నోసెన్స్‌ అనేదానిని గుర్తు చేసి స్వచ్ఛతతో ఉండటమే మనిషి ప్రాధమిక లక్షణమని తెలియచేసిన సినిమా. అమాయకత్వం అనేది దేవునికి సన్నిహితంగా ఉండేది, దానికి మొదట అపజయం కలిగినా అంతిమంగా దానికి మేలే జరుగుతుంది అని ఈ సినిమా చెబుతుంది. ఇందులో ‘స్వాతిముత్యం’గా కమలహాసన్‌ నటించి ‘మీరు కపటంతో కష్టపడి బతకండి. నేను అమాయకత్వంతో హాయిగా బతుకుతాను’ అని నిరూపిస్తాడు. మానసిక ఎదుగుదల సరిగా లేని కమలహాసన్‌ భర్తను కోల్పోయిన భార్య రాధికకు అండగా నిలిచి ఆమె జీవితానికి అర్థం కల్పించడం కథ. కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో కమల్‌  ‘సాగర సంగమం’ ఎంత పెద్ద హిట్‌ అయిందో స్వాతిముత్యం కూడా అంతే హిట్‌ అయ్యింది. ఇళయరాజా సంగీతం, సి.నారాయణరెడ్డి సాహిత్యం కలసి వచ్చాయి. ‘సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ’, ‘వటపత్రశాయికి వరహాల లాలి’, ‘రామా కనవేమిరా’... పాటలన్నీ హిట్‌. నిర్మలమ్మ, సుత్తి వీరభద్రరావు, గొల్లపూడి, జె.వి.సోమయాజులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు.

విశేషాలు: ఇందులో కమలహాసన్‌ చేయి పైకెత్తి వీపు వెనుగ్గా తీసుకెళ్లి కొట్టినట్టుగా చేసే మేనరిజం హిట్‌ అయ్యింది. అలాగే ఉద్యోగం ఇప్పిస్తానని మాటవరుసకు జె.వి. సోమయాజులు అంటే రేయింబవళ్లు ఆయన వెంట కమలహాసన్‌ పడటం తెలుగునాట స్థిరపడి ‘స్వాతిముత్యంలో కమలహాసన్‌లా వెంటపడ్డావేమిటిరా’ అనే జాతీయంలా వాడుకలోకి వచ్చింది.

అహ నా పెళ్లంట (1987)

గతంలో రామానాయుడుకి ‘ప్రేమనగర్‌’ సినిమా ఎంత మేలు చేసిందో ఆ తర్వాత ‘అహ నా పెళ్లంట’ సినిమా అంత మేలు చేసింది. ‘నా రామానాయుడు స్టుడియో నిర్మాణానికి దీని లాభాలు ఉపయోగపడ్డాయి’ అని రామానాయుడు చెప్పుకున్నారు. జంధ్యాల దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్‌ హీరోగా రజనీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఆంధ్రదేశమంతా నవ్వులు పువ్వులు పూయించింది. పరమ ఘోరమైన పిసినారిగా కోట శ్రీనివాసరావు ఈ సినిమాలో కనిపిస్తారు. ‘నాకేంటి’ అనే మేనరిజం ఫేమస్‌. పేపర్‌ని లుంగీలా చుట్టుకోవడాలు, పారేసిన అగ్గిపుల్లల్ని వంట చెరుకుగా వాడుకోవడాలు, కోడిని వేలాడగట్టి దానిని చూస్తు కోడి కూర తింటున్నట్టుగా ఫీలవడాలు ఈ సినిమాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. బ్రహ్మానందం ‘అరగుండు బ్రహ్మానందం’గా ఈ సినిమాతోనే ఫేమస్‌ అయ్యారు.

విశేషం: 16 లక్షలు పెట్టి తీస్తే దాదాపు 5 కోట్ల రూపాయలు వసూలు చేసిన సినిమా ఇది. దీనిని తమిళంలో భాగ్యరాజా, హిందీలో అనిల్‌కపూర్‌ రీమేక్‌ చేద్దామనుకున్నారు కాని ఎందుకనో కుదర్లేదు. ఇందులో ఒక పాటను రేడియో జింగిల్స్‌తో కలిపి ఉపయోగించడం మరో హాస్యప్రయోగంగా చేప్పుకోవచ్చు.

గీతాంజలి (1989)

మణిరత్నం నేరుగా తెలుగులో తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా. దృశ్య ప్రధానంగా కథ చెప్తే ప్రేక్షకులకు నిరూపించిన సినిమా. భావుకత్వంతో తీసిన సినిమా అని చెప్పుకోవచ్చు.  సాధారణంగా హీరోకో హీరోయిన్‌కో కేన్సర్‌ ఉండే కథలు ఉంటాయి. కాని ఇందులో హీరోతో పాటు హీరోయిన్‌కూ కేన్సర్‌ ఉంటుంది. ఇద్దరూ ఒకరికొకరు పరిచయమై ఒకరి జబ్బు గురించి మరొకరు దాచిపెట్టి ప్రేమలో పడతారు. చివరకు ఒకరి పరిస్థితి మరొకరికి తెలిసినా ప్రేమను వదిలేది లేదనీ బతికినంతకాలం ప్రేమించుకుంటూ సంతోషంగా ఉంటామని అనుకోవడంతో కథ ముగుస్తుంది. నాగార్జున, గిరిజల నటన, పి.సి.శ్రీరామ్‌ కెమెరా పనితనం, ఇళయరాజా సంగీతం, వేటూరి పాటలు గొప్పగా ఉంటాయి. ‘లేచిపోదామన్న మొనగాడా ఎక్కడున్నావ్‌’ అనే డైలాగ్‌ ఫేమస్‌. ఇందులోని ‘ఒళ్లంత కవ్వింత కావాలిలే’ పాట పూర్తి స్లో మోహన్‌లో ఉంటే, ‘ఓం నమః నయన శృతులకు’ పాట రౌండ్‌ ట్రాలీలో ఒకే షాట్‌గా పిక్చరైజ్‌ చేశారు. ‘ఓ ప్రియా ప్రియా’, ‘ఓ పాపా లాలీ’ పాటలు కూడా పెద్ద హిట్‌. తెలుగులో వచ్చిన మంచి ప్రేమకథలను ఎంచాలనుకున్నప్పుడు తప్పనిసరిగా గుర్తుకు వచ్చే సినిమా యువత మెచ్చిన సినిమా గీతాంజలి.

విశేషం: ఇందులో నటించిన గిరిజ ఆ తర్వాత ‘హృదయాంజలి’ అనే సినిమా చేసి సినిమాల నుంచి విరమించుకున్నారు. మణిరత్నం దీని తర్వాత తెలుగులో మళ్లీ దర్శకత్వం వహించలేదు. అప్పటికి డబ్బింగ్‌ రైటర్‌గా క్రేజ్‌లో ఉన్న రాజశ్రీ దీనికి మాటలు రాయడం విశేషం.

కళ్లు  (1988)

గొల్లపూడి మారుతీరావు రాసిన ప్రసిద్ధ నాటకం ‘కళ్లు’ ఆధారంగా ఇది సినిమాగా రూపాంతరం చెంది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాక పారలల్‌ సినిమాలకు తెలుగులో ఆదరణ ఉంటుంది అని నిరూపించింది. ఐదుగురు గుడ్డివాళ్ల కథ ఇది. అందులో మిగిలిన నలుగురు కష్టపడి ఒకతనికి కళ్లు తెప్పిస్తే అతడు లోకం పోకడలో పడి ఘోరమైన మనిషిగా తయారవుతాడు. కళ్లుండి పతనం కావడం కంటే కళ్లు లేకుండా ఉత్తమంగా జీవించడం మేలు అని భావించిన ఆ నలుగురు గుడ్డివాళ్లు ఎవరికైతే తాము కళ్లు తెప్పించారో అతడి కనుగుడ్లు పీకేస్తారు. ఈ కథను దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌ అయిన ఎం.వి.రఘు ఎంతో రియలిస్టిక్‌గా దాదాపు కొత్త తారాగణంతో తీసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గుడ్డి బిచ్చగాళ్లుగా ఇందులో శివాజీరాజా, భిక్షు, రాజేశ్వరి తదితరులు నటించారు. ఎస్‌.పి.బాలసుబ్రహ్మాణ్యం సంగీతం అందించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇందులో ‘తెల్లారింది లెగండో కొక్కరొక్కో’ పాట స్వయంగా పాడారు. విశాఖలో పూర్తి ఔట్‌డోర్‌లో తీసిన ఈ సినిమా ఇవాళ్టికీ కొత్తగా ఉంటుంది.

విశేషం:  కమెడియన్‌ చిదంబరం ఈ సినిమాలో యాక్ట్‌ చేసి ‘కళ్లు’ చిదంబరం అయ్యారు. నటుడు కొండవలస కూడా ఈ సినిమాలో మొదటిసారి వేషం కట్టారు. ఇందులో హీరో చిరంజీవి పాత్ర అంతర్లీనంగా ఉంటుంది. అది తెర మీద కనిపించకపోయినా వినిపిస్తుంది. దానికి చిరంజీవే డబ్బింగ్‌ చెప్పారు.

శివ (1989)

తెలుగు సినిమా చరిత్ర ఈ సినిమాకు ముందు ఈ సినిమాకు తర్వాతగా విభజించబడింది. టేకింగ్, మేకింగ్, సౌండ్, క్యారెక్టర్‌ బిహేవియర్‌ వీటన్నింటినీ సమూలంగా మార్చిన సినిమా ఇది. యువతలో హింసా ప్రవృత్తిని రెచ్చగొట్టేలా ఉంది అనే విమర్శలు వస్తే వాటిని దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ కొట్టి పారేసినా ఆ రోజుల్లో చాలామంది కుర్రాళ్లు సైకిల్‌ చైన్లతో ఫొటోలు దిగిన మాట వాస్తవం. అప్పటికి ఇంకా కాలేజీలలో బ్యాన్‌ కాని ఎలక్షన్లు, వాటి మీద పెత్తనం చేయాలని చూసే రౌడీలు, వాళ్ల మీద అధికారం చలాయించే రాజకీయ నాయకులు... ఈ సైకిల్‌ను ఈ సినిమా బాగా పట్టుకుంది. నాగార్జునకు ఎంత పేరు వచ్చిందో విలన్‌గా రఘువరన్‌కు అంతే పేరు తెచ్చి పెట్టింది. ఒక కొత్త దర్శకుడు తన మొదటి సినిమాను ఇంత బాగా తీయగలగడం, దానిని ఇంత పెద్ద హిట్‌ చేయగలగడం ఆ రోజుల్లో సంచలనం అయ్యింది. అమల, తనికెళ్ల భరణి, సాయిచంద్, శుభలేఖ సుధాకర్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ‘బోటనీ పాఠముంది మేటనీ ఆట ఉంది’, ‘సరసాలు చాలు శ్రీవారు’ పాటలు హిట్‌.

విశేషం: నటుడు చిన్నా ఈ సినిమాతోనే గుర్తింపు పొందారు. స్టడీ కామ్‌ కెమెరా ఈ సినిమాతోనే ఇండస్ట్రీకి తెలిసింది. ఆడియోగ్రఫీ చాలా ముఖ్యమైనది అని ఈ సినిమాలో మొదటి టైటిల్‌ కార్డ్‌గా వేయడం ద్వారా వర్మ ఒక కొత్త ఒరవడి దిద్దారు.

కర్తవ్యం  (1990)

ఒక హీరోయిన్‌ను హీరో ఇమేజ్‌ స్థాయికి తీసుకెళ్లిన సినిమా. నటి విజయశాంతి ఈ సినిమాలో నటించాక ఆమె పేరుకు ముందు ‘లేడీ అమితాబ్‌’ అని బిరుదు పెట్టడం  మొదలైంది. అప్పట్లో దేశమంతా గుర్తింపు పొందిన లేడీ ఐ.పి.ఎస్‌ ఆఫీసర్‌ కిరణ్‌ బేడీ స్ఫూర్తితో ఈ కథను అల్లుకున్నారు. ఒక రేప్‌ విక్టిమ్‌కు న్యాయం చేయడం కోసం విలన్‌తో హీరోయిన్‌ తలపడటం ఈ కథ. ఆ రోజులలో జరిగిన అనేక సంఘటనలను రచయితలు పరుచూరి బ్రదర్స్‌ సినిమాలో అందంగా ఇమిడ్చారు. దర్శకుడు మోహన్‌ గాంధీ, నిర్మాత ఎ.ఎం.రత్నం ఈ సినిమాతో పెద్ద పేరు సంపాదించారు. వినోద్‌ కుమార్, పరుచూరి వెంకటేశ్వరరావు ఇతర పాత్రలు పోషించారు. అప్పటికి ఇంకా ఫేమ్‌లోకి రాని మీనా ఇందులో రేప్‌ విక్టిమ్‌గా నటించింది. ‘మీ ఇంట్లో ఉప్మా తిన్నాను. నాతో ఉపకారం చేయించుకోమ్మా’లాంటి డైలాగులు బాగా పేలాయి.
 
విశేషం: నిర్మాత పుండరీకాక్షయ్య ఈ సినిమాలో విలన్‌ వేషం వేశారు. అది బాగా సక్సెస్‌ అయ్యింది. ఇందులో హీరోయిన్‌ కాళ్లు విరగ్గొడితే ఆమె మళ్లీ ఫిజికల్‌గా ఫిట్‌ కావడానికి అప్పట్లో నిజంగానే కాళ్లు పోగొట్టుకున్న నూతన్‌ప్రసాద్‌ ఒక పాత్రగా ఉత్తేజం ఇవ్వడం కనిపిస్తుంది. తమిళంలో డబ్‌ అయ్యి పెద్ద హిట్‌ అయిన ఈ సినిమాని హిందీలో ‘తేజస్విని’ పేరుతో రీమేక్‌ చేశారు.

జగదేకవీరుడు అతిలోక సుందరి (1990)

లంకేశ్వరుడు, స్టేట్‌ రౌడీ, రుద్రనేత్ర, రాజా విక్రమార్క... ఈ సినిమాల పరాజయం నుంచి 1990లో విడుదలైన ‘కొండవీటి దొంగ’ ఓ మోస్తరుగా చిరంజీవిని గట్టున పడేస్తే ఆ తర్వాత విడుదలైన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ చిరంజీవిని తిరిగి స్టార్‌డమ్‌లోకి తీసుకెళ్లింది. సోషియో ఫాంటసీ సబ్జెక్ట్‌ కావడం, శ్రీదేవి తోడుగా నిలవటం, రాఘవేంద్రరావు దర్శకత్వం, అశ్వినీదత్‌ భారీ నిర్మాణం, ఇళయరాజా పాటలు ఇలా అన్నీ కలిసొచ్చి సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి. ఆబాలగోపాలం మెచ్చిన సినిమాగా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇంద్రుడి కూతురు భూలోకం వచ్చి మానవుణ్ణి మనువాడటం కథ. దీనికి కమర్షియల్‌ హంగులన్నీ తోడయ్యాయి. అమ్రిష్‌పురీ విలనీ జనానికి నచ్చింది. ‘మానవా’, ‘తింగరబుచ్చి’ వంటి డైలాగులు హిట్‌ అయ్యాయి. ఇక ‘అబ్బ నీ తియ్యనీ దెబ్బ’ పాట ఒక ఊపు ఊపింది. చిరంజీవి అభిమానులను పులకింతలకు గురిచేసిన సినిమా నేటికీ టీవీలో జై చిరంజీవా అంటూ ప్రదర్శితమవుతూనే ఉంది.

విశేషాలు: మే 9న ఈ సినిమా విడుదలైనప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తుఫాన్‌ కొట్టింది. భారీ వర్షాలకు అంతా అతలాకుతలమైపోయింది. చాలా థియేటర్లకు కరెంట్‌ లేదు. అయినప్పటికీ సినిమా జనరేటర్ల మీదే బంపర్‌ కలెక్షన్లతో ఆడింది. ‘అబ్బ నీ తియ్యనీ దెబ్బ’ ట్యూన్‌ను హిందీలో అనిల్‌ కపూర్‌ ‘బేటా’కు వాడితే సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. అదే పాటకు ‘శివాజీ’లో రజనీకాంత్‌ స్టెప్పులేయడం ఒక మురిపమైన జ్ఞాపకమే.


బొబ్బిలిరాజా (1990)

వెంకటేశ్‌కు స్టార్‌డమ్‌ తెచ్చి అతణ్ణి పెద్ద హీరోల సరసన నిలిపిన సినిమా. ‘గాడ్స్‌ మస్ట్‌ బీ క్రేజీ’ సినిమాలోని కొన్ని సన్నివేశాలనీ మామూలు ఫార్ములా కథనీ కలిపి పరుచూరి బ్రదర్స్‌ ఈ రెసిపీ తయారు చేస్తే దర్శకుడు బి.గోపాల్‌ దాని ఆధారంగా చక్కటి వంట వండి ప్రేక్షకుల చేత లొట్టలు వేయించేలా చేశారు. హీరోయిన్‌ దివ్యభారతికి ఇదే మొదటి సినిమా. దీని తర్వాత ఆమె టాప్‌ హీరోయిన్‌ అయ్యి అందరు పెద్ద హీరోల సరసనా నటించింది. వాణిశ్రీ ఇందులో అటవీశాఖ మంత్రిగా నటిస్తూ ‘రాష్ట్రాన్నైనా రాసిస్తాను గానీ’ అని చెప్పే ఊత డైలాగుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఫస్ట్‌ హాఫ్‌లో అడవి అందాలు, సెకండ్‌హాఫ్‌లో నంద్యాల సమీపంలో రైల్వే ట్రాక్‌ మీద తీసిన క్లయిమాక్స్‌ సినిమాకు ప్లస్‌ అయ్యాయి. అంత వరకూ క్లాస్‌ పాటలు రాస్తారని పేరుబడ్డ సిరివెన్నెల ఈ సినిమాలో ‘బలపం పట్టి భామ బళ్లో’... రాసి కమర్షియల్‌ రైటర్‌గా మారారు. ఇళయరాజా చేసిన పాటలన్నీ కుర్రకారును అలరించాయి. వెంకటేశ్‌ కెరీర్‌లో తొలి సిల్వర్‌ జూబ్లీ హిట్‌ బొబ్బిలి రాజా.

విశేషం: ఈ సినిమా హైదరాబాద్‌ సుదర్శన్‌లో డైరెక్టుగా 200 రోజులు ఆడింది. దివ్యభారతి ఫస్ట్‌హాఫ్‌ అంతా  కేవలం పై ఆచ్ఛాదనగా ఒక షర్ట్‌తో కనిపించినా అశ్లీలత అనే అపవాదు రాలేదు.

సీతారామయ్యగారి మనవరాలు (1991)

యాక్షన్‌ సినిమాల దూకుడులో కూడా తెలుగు ప్రేక్షకులు కుటుంబ కథా చిత్రాలను ఆదరిస్తారు అని నిరూపించిన చిత్రం. మానవ సంబంధాలు, కుటుంబ అనుబంధాలు ఎప్పటికీ గొప్ప కథాంశమే అని ఈ సినిమా చెప్పింది. తాతా మనవడు కథాంశంతో ఇంతకు ముందు కథలు వచ్చినా తాతా మనవరాలు మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ సినిమా చూపించింది. రచయిత మానస రాసిన ‘నవ్వినా కన్నీళ్లే’ అనే నవల ఆధారంగా రచయిత గణేశ్‌ పాత్రో స్క్రిప్ట్‌ రాస్తే, నిర్మాత దొరస్వామి రాజు దర్శకుడు క్రాంతి కుమార్‌ ద్వారా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. మొదటి రెండు వారాలు ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుని మూడో వారం నుంచి కలెక్షన్లు అందుకుని 200 రోజులు ఆడిన సినిమా ఇది. తాతగా అక్కినేని నాగేశ్వరరావు విగ్‌ లేకుండా ఈ సినిమాలో నటించడం విశేషం. మనవరాలిగా నటించిన మీనా ఈ సినిమాతో కాబోయే స్టార్‌ని అని నిరూపించింది. నానమ్మగా నటించిన రోహిణి హట్టంగడి తెలుగు ప్రేక్షకులకు కొత్త అయినా ఆమెను వారు అభిమానించారు. గోదావరి ఒడ్డున అందమైన పల్లెటూళ్ల నడుమ తీసిన ఈ సినిమా అచ్చమైన తెలుగుదనంతో ఇప్పటికీ అలరిస్తూనే ఉంది.

విశేషం: కీరవాణికి పేరు తెచ్చి పెట్టిన ‘పూసింది పూసింది పున్నాగ’ పాట ఇందులోదే. దీనిని హిందీలో ‘ఉధార్‌ కి జిందగీ’ అని రీమేక్‌ చేసే కాజోల్‌ మనవరాలి వేషం వేసింది. కన్నడ రీమేక్‌లో మాలశ్రీ, మలయాళ రీమేక్‌లో మళ్లీ మీనాయే నటించారు. తాతకు షష్టిపూర్తి మనవరాలు నిర్వహించడం ఈ సినిమా విశేషం.

ఆదిత్య 369  (1991)

టైమ్‌ మిషన్‌ అనే కాన్సెప్ట్‌ని, కాలంతో పాటు ప్రయాణించడం అనే ఊహని, భూత భవిష్యత్‌ కాలాల్లో హీరో కథకు అంతరాయం కలిగించడం అనే కల్పనని చేయడమే కాక సినిమాగా తీసి హిట్‌ చేయడం కచ్చితంగా తెలుగువారి సినీ చరిత్రలో ఒక విశేషం. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు, నిర్మాత కృష్ణప్రసాద్‌కు, హీరో బాలకృష్ణకు ఈ క్రెడిట్‌ దక్కుతుంది. సామాన్యుడికి కూడా సులభంగా అర్థమయ్యేలా టైమ్‌ ట్రావెల్‌ను తీసి అందులో మనవారు ఐడెంటిఫై అయ్యే రాయలవారి ఎపిసోడ్‌ పెట్టి కలెక్షన్లను రాబట్టగలిగాడు దర్శకుడు. దీని తర్వాత తెలుగులో ఇలాంటి సినిమా రాలేదని చెప్పొచ్చు. అందుకే దీని సీక్వెల్‌ కోసం ఇప్పటికీ జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మోహిని, టీనూ ఆనంద్, సుత్తివేలు, సిల్క్‌ స్మిత ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. భూతకాలంలోకి ప్రయాణించిన బాలకృష్ణ రాయలవారి సభలో తెనాలి రామకృష్ణకవి కంటే ముందే ఆయన పద్యాలు చెప్పడం థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఇళయరాజా సంగీతం వహించిన ఈ సినిమాలో జిక్కి పాడిన ‘జాణవులే నెర జాణవులే’ పాట హిట్‌.

విశేషం: ముగ్గురు సీనియర్‌ ఫొటోగ్రాఫర్లు పి.సి.శ్రీరామ్, వి.ఎస్‌.ఆర్‌.స్వామి, కబీర్‌లాల్‌ పని చేసిన సినిమా ఇది. తాను డైలాగ్‌ స్పీడ్‌గా చెప్తాననే అపవాదును శ్రీకృష్ణదేవరాయలు పాత్రకు హుందాగా డైలాగులు చెప్పడం ద్వారా బాలకృష్ణ పోగొట్టుకోగలిగారు. తమిళంలో ‘అపూర్వశక్తి 369’ అని డబ్‌ అయి ఈ సినిమా అక్కడా విజయం సాధించింది.

భైరవ ద్వీపం (1994)

జానపదాలు ఇక తెలుగు సినిమాల్లో కనిపించవు అని అనుకుంటున్నప్పుడు, అది కాలం చెల్లిన జానర్‌ అని అంతా అనుకుంటున్నప్పుడు తిరిగి తెలుగు తెర మీద జానపదాలను సజీవం చేసి సూపర్‌ డూపర్‌ హిట్‌ అయిన సినిమా ‘భైరవ ద్వీపం’. ఒకప్పుడు  ‘పాతాళభైరవి’, ‘జగదేకవీరుని కథ’ వంటి క్లాసిక్స్‌ జానపదాలు తీసిన విజయా ప్రొడక్షన్స్‌ వారసులు ‘విజయ చందమామ కంబైన్స్‌’ పతాకం మీద ఈ సినిమా తీసి ఆ పరంపరకు కొనసాగింపు ఉంది అన్న నమ్మకం కలిగించారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం, నటుడు రావి కొండలరావు రచనానుభవం సినిమాకు విశేషంగా పనికొచ్చాయి. అవన్నీ అలా ఉంచి తెలుగులో ఎన్టీఆర్‌ తర్వాత జానపద కథానాయకుడు తానే అని బాలకృష్ణ ఈ సినిమాతో నిరూపించుకున్నారు. రాకుమారునిగా, వీరునిగా, ప్రేమికునిగా చెలరేగి నటించారని చెప్పాలి. రోజా, కె.ఆర్‌.విజయ, బాబూ మోహన్‌ తదితరుల పాత్రలు రాణించాయి. మాధవపెద్ది సురేశ్‌ సంగీతం చాలా పేరు తెచ్చుకుంది. ‘విరిసినది వసంతగానం, ‘నరుడా ఓ నరుడా’, ‘శ్రీ తుంబుర నారద గానామృతం’, ‘ఘాటైన ప్రేమ ఘటన’ పాటలన్నీ హిట్‌. మాయలు, మంత్రాలు, గుర్రాలు, సాహసాలు... ఇవన్నీ నిండిన ఈ సినిమా సిసలైన తెలుగు కాలక్షేపం. హాౖయెన వినోద సమ్మేళనం.

విశేషం: ఈ సినిమాలో ‘లిల్లీపుట్‌‘లను పోలిన మరుగుజ్జులను చూపిస్తారు. అది పిల్లలకు సరదగా అనిపిస్తుంది. ఏ హీరో కూడా చేయడానికి అంగీకరించని కురూపి వేషంలో బాలకృష్ణ కనిపిస్తారు. శాపవశాత్తు అలా మారే సన్నివేశం అది. అన్నట్టు ఈ సినిమాలో మాంత్రికుడుగా కనిపించినది ఎనభైయ్యవ దశకంలో రౌడీ వేషాలు విస్తృతంగా వేసిన రంగరాజా. కాని మధ్యలో గ్యాప్‌ తీసుకుని మలయాళంలో విలన్‌గా చేసి ఈ పెద్ద ఆఫర్‌ను చేజిక్కించుకున్నాడు.

 నిన్నే పెళ్లాడతా  (1996) 

1994లో సూరజ్‌ భరజ్యాతా ‘హమ్‌ ఆప్‌కే హై కౌన్‌’ వచ్చింది. మనుషులు కలసి కబుర్లు చెప్పుకుంటూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ, ఆప్యాయత ప్రదర్శిస్తూ, సరదాగా ఉండటం కథ. ఇలా ఎవరూ ఉండరు. కాని ఇలా ఉంటే బాగుండు అనే కోరిక అందరికీ ఉంటుంది. దానిని స్క్రీన్‌ మీద చూపించడంతో తమ జీవితంలో లేనిది కనీసం తెర మీద అయినా చూసి ఆనందిద్దాం అనే భావనతో ఆ సినిమాను సూపర్‌డూపర్‌ హిట్‌ చేశారు జనం. దాని ఇన్‌స్పిరేషన్‌తో తెలుగులో కాపీలా కాకుండా పూర్తి నేటివిటీతో వచ్చి అంతే హిట్‌ అయిన సినిమా ‘నిన్నే పెళ్లాడతా’. కృష్ణవంశీ, నాగార్జునల ఇమేజ్‌ను ఎక్కడికో తీసుకుపోయిన సినిమా ఇది. రెండు కుటుంబాల మధ్యన స్నేహం, రెండు బంధుత్వాల మధ్య ప్రేమ... ఈ చిన్న పాయింట్‌ను చాలా ఫ్రెష్‌ సన్నివేశాలతో నేరేట్‌ చేసుకుంటూ పోయి పెద్ద సక్సెస్‌ సాధించాడు దర్శకుడు. నాగార్జున, టబూ, చలపతిరావు, చంద్రమోహన్, లక్ష్మి... అందరికీ సినిమాతో పేరు వచ్చింది. దీని వరుసలో చాలా సినిమాలే వచ్చినా ఈ మేజిక్‌ పునరావృతం కాలేదనే చెప్పాలి.

విశేషాలు: ఇందులో టబూకు ‘పండు’ అనే నిక్‌నేమ్‌ ఉండటం ఆంధ్రదేశానికి నచ్చింది. ‘గ్రీకువీరుడు’... పాటతో అందగాడంటే గ్రీకువీరుడులా ఉండాలనే భావన తెలుగు నాట స్థిరపడింది. అంతవరకు నెగెటివ్‌ రోల్స్‌ చేస్తున్న చలపతిరావుకు ఈ సినిమా వంద సినిమాల మైలేజ్‌ను ఇచ్చింది. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ ఇందులో మరో హిట్‌ పాట.

యమలీల (1994)

ఎన్టీఆర్‌ హీరోగా 1977లో ‘యమగోల’ విడుదలైంది. అది వచ్చిన దాదాపు 20 ఏళ్ల తర్వాత ‘యమలీల’ విడుదలైంది. రెంటిలోనూ యముడుగా కైకాల సత్యనారాయణ నటించారు. యముడు మృత్యువుకు అధిపతి. అలాంటి దేవుడిని చూస్తే భయపడాలి. కాని తెలుగువారి అదృష్టం ‘యమగోల’ సినిమాతో ఆయనతో చనువుగా వ్యవహరించి హాస్యమాడేంత వీలు చిక్కింది. తెలుగులో యముడికి ఉన్న ఈ కామెడీ  ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఎస్వీ కృష్ణారెడ్డి తన దర్శకత్వంలో జాక్‌ పాట్‌ కొట్టిన సినిమాయే యమలీల. తల్లి కోసం తనయుడు తపనపడే కథగా ఇది కనిపించినా యముడు భూలోకానికి వచ్చి వింతలూ విడ్డూరాలు చేయడమే ప్రధానాంశం. అంతవరకు కామెడీ పాత్రలు పోషిస్తున్న అలీ ఈ సినిమాతో హీరోగా మారి సిక్సర్‌ కొట్టారు. హీరోయిన్‌గా ఇంద్రజ, చిత్రగుప్తునిగా బ్రహ్మానందం, లోకల్‌ ఎస్‌.ఐ.గా కోట శ్రీనివాసరావు ఇందులో నవ్వులు పూయిస్తారు. దివాకర్‌బాబు మాటలు కూడా ప్లస్‌ పాయింట్‌. సెలవుల్లో హాయిగా చూసి ఎంజాయ్‌ చేయదగ్గ సినిమా ఇది.

విశేషాలు: ఇందులో ‘హిమక్రీములు’ అంటూ యముడు ఐస్‌క్రీమ్‌లను లాగించడం ప్రేక్షకులకు నచ్చింది. పాటల విషయానికి వస్తే ‘నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో’ పెద్ద హిట్‌. లోకల్‌ రౌడీగా తనికెళ్ల భరణి ‘నా చెల్లి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ’ అని కవిత రాసి తెగ నవ్విస్తారు. అన్నింటికీ మించి సూపర్‌ స్టార్‌ కృష్ణ ‘జుంబారే జూజుంబరే’ అంటూ స్పెషల్‌ సాంగ్‌ చేసి స్టెప్పులతో అదరగొడతారు. ఇవన్నీ ఎట్రాక్షన్సే.

ఒసేయ్‌ రాములమ్మ (1997)
తెలంగాణ అనే ఒక ప్రాంతం ఉంటుందని, అక్కడ ఒక సంస్కృతి ఉంటుందని, అక్కడ కూడా పీడితులకు పీడకులకు మధ్య సంఘర్షణ ఉంటుందని అదంతా కూడా సినిమాకు ఒక మంచి కథాంశమని చెప్పిన సినిమా ‘ఒసేయ్‌ రాములమ్మ’. అంతవరకు తెలంగాణను ఒక ప్రేక్షక సముదాయంగా చూసిన ఇండస్ట్రీకి అదొక బలమైన కథావరణం అని ఈ సినిమా ద్వారా తెలిసి వచ్చింది. దళితుల బాధలు తీసేవారు కరువు. అందునా దళిత స్త్రీల బాధలు చూపే వారు కరువు. అలాంటి స్త్రీలు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తే అది ఏదైనా దినపత్రికలో చిన్న వార్తే తప్ప సినిమా వాళ్లకు కథ కాదు. కాని దాసరి నారాయణరావు ఆ సమకాలీన పరిస్థితిని కథగా స్వీకరించి సూపర్‌ డూపర్‌ హిట్‌ సాధించారు. తెలంగాణ ప్రాంతవాసులే కాదు యావదాంధ్ర ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. రాములమ్మగా విజయశాంతి తరగని కీర్తి సంపాదించుకున్నారు. ఇతర ముఖ్యపాత్రలలో కృష్ణ, దాసరి, రాంరెడ్డి ఆకట్టుకుంటారు. ప్రజల సాయుధ పోరాటాలను ప్రభుత్వాలు ఎంత ఉక్కుపాదంతో అణిచినా అణిగిపోవు. దేశంలో అణిగిపోలేదు కూడా. పీడన ఉన్న చోటల్లా అగ్గి రాజుకుంటూనే ఉంటుంది. అందుకు రుజువుగా ఒసేయ్‌ రాములమ్మ చిత్రాలకు దక్కిన విజయాన్ని చూడవచ్చు. తమలో ఉన్న తిరుగుబాటు స్వభావానికి రాములమ్మ ఒక ప్రతినిధి అని భావించడం వల్ల ఆ విజయం దక్కింది.

విశేషాలు: ఒసేయ్‌ రాములమ్మలో పాటలన్నీ పెద్ద విజయం సాధించాయి. సినారె రాసిన ‘ఓ రాములమ్మ’ పాట మోగిపోయింది. వందేమాతరం శ్రీనివాస్‌ సంగీతం అందించారు. ‘చౌదరిగారికి రెడ్డిగారికి నాయుడుగారికి పేర్ల చివర ఆ తోకలెందుకు... ఊరి చివర దళితుల పాకలెందుకు?’ అని ఈ సినిమా ప్రశ్నించింది.

అన్నమయ్య (1997)

కమర్షియల్‌ సినిమాలతో మారుమోగిపోతున్న రోజుల్లో తెలుగు సినిమాలో అన్నమయ్య ఒక ప్రయోగం. అదీ మంచి కమర్షియల్‌ హీరోగా పేరున్న అక్కినేని నాగార్జున చేసిన ప్రయోగం. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమాలంటే మాస్‌ అంశాల మేళవింపు. అలాంటి దర్శకుడు పూర్తిగా భక్తిరస చిత్రం చేయడమే విశేషమంటే, అందులో నాగార్జున నటించడం ఇంకా విశేషం. శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తుడు అన్నమయ్య పాత్రలో నాగార్జున కనిపించారిందులో! ఆ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయిన నాగార్జున తన నటనతో అందరినీ కట్టిపడేశారు. అన్నమయ్య కీర్తనలు సినిమా ఆసాంతం వినిపిస్తూ, కనిపిస్తూ ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయి. ఎం.ఎం. కీరవాణి సమకూర్చిన ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం. అన్నమయ్య ఆల్బమ్‌.. నాటి నుంచి నేటివరకూ ఇంట్లో దేవుడి పాటల క్యాసెట్లలో భాగమైపోయిందంటేనే అదెంత పెద్ద సక్సెస్సో, ప్రేక్షకులు సినిమాను ఎంతలా ఓన్‌ చేసుకున్నారో చెప్పొచ్చు. వెంకటేశ్వరస్వామిగా నటించిన సుమన్‌ నిజంగా దేవుడిగానే కనిపించాడు. కమర్షియల్‌గానూ తిరుగులేని విజయం సాధించిన ఈ సినిమాకు టెక్నికల్‌గా ప్రతి ఒక్కరి పనితనం ఒక ఆభరణంగా వెలిగిపోయింది.

విశేషం: ‘అన్నమయ్య’ సినిమాతో తెలుగులో భక్తుడి పాత్ర అంటే నాగార్జునే చేయాలి అన్న పేరు వచ్చేసింది. ఈ సినిమా తర్వాత ఆయన ‘శ్రీరామదాసు’, ‘ఓం నమో వెంకటేశాయ’ లాంటి సినిమాల్లో భక్తుడి పాత్రల్లో మెప్పించారు.

తొలిప్రేమ  (1998)

నీ ప్రేమలో నిజాయితీ ఉంటే ఆ అమ్మాయి నీకు దక్కాలి అనే సంకల్పం నిజంగా ఉంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ ప్రేమ సఫలమయ్యే తీరుతుంది అని చెప్పిన అందమైన ప్రేమ కథ ‘తొలి ప్రేమ’. ఇందులో పవన్‌కల్యాణ్‌ అల్లరి చిల్లరి కుర్రవాడు. కీర్తి రెడ్డి చాలా పెద్దింటికి చెంది పై చదువుల కోసం అమెరికా వెళ్లబోతున్న అమ్మాయి. పవన్‌ కల్యాణ్‌కు మంచి మనసు ఉంది. ఆ అమ్మాయికి అంతకన్నా మంచి సంస్కారం ఉంది. ఆమెను ఇష్టపడ్డ పవన్‌కల్యాణ్‌ సినిమా చివరి వరకూ తన మనసులోని మాట చెప్పలేక సతమతమవుతుంటాడు. కాని అతడి గుండెలోని ఆరాధన ఆమెను తాకే తీరుతుంది. ఆమె అతడి ప్రేమను అంతిమంగా స్వీకరిస్తుంది. దర్శకుడు కరుణాకర్‌ ఈ సినిమాతో తాను మరో భాగ్యరాజ్‌ అని నిరూపించుకున్నాడు. పవన్‌కల్యాణ్‌కు చాలామంచి పేరు, ప్రేక్షకుల అంగీకారం సంపాదించి పెట్టిన సినిమా ఇది. నగేశ్, అలీ, వేణుమాధవ్‌ వీళ్లందరి కంటే ముఖ్యంగా పవన్‌కల్యాణ్‌ చెల్లెలి పాత్ర వేసిన వాసుకి చాలా ఆకట్టుకుంటారు. తెలుగు టాప్‌ టెన్‌ ప్రేమ కథల్లో తప్పక ఈ చిత్రం నిలుస్తుంది.

విశేషాలు: ఇందులో సిటీలో ఎంత మంది ఆడపిల్లలు ఉంటారు, వారిని ఎంత మంది ప్రేమించి ఉంటారు అనేదానికి వేణుమాధవ్‌ చెప్పే పొడుగు డైలాగ్‌ లెక్క చాలా హిట్‌. ఆర్థికంగా మంచి లాభాలు తెచ్చి పెట్టిన ఈ సినిమాను కన్నడంలో, హిందీలో రీమేక్‌ చేశారు. ఇందులోని ఒక పాటలో పవన్‌కల్యాణ్‌ గెటప్స్‌తో నితిన్‌ మరో చిత్రంలో కనిపిస్తాడు.

ఒక్కడు (2003)

ఒక కరడుగట్టిన రాయలసీమ ఫ్యాక్షనిస్ట్‌ని ధైర్యంగా ఎదిరించి అతడి పంజరంలో చిక్కుకున్న ఆడపిల్లకు రక్షకుడుగా ఒక యువకుడు నిలవడం కథ. వినడానికి ఒక్కలైనే అయినా కథనంతో గగుర్పొడిచే సన్నివేశాలతో దర్శకుడు గుణశేఖర్‌ సినిమాను బ్లాక్‌బస్టర్‌ చేశారు. హీరో మహేశ్‌బాబుకు ఈ సినిమాయే స్టార్‌డమ్‌ను తెచ్చిందని చెప్పవచ్చు. పాత బస్తీ అల్లరి కుర్రాడిగా అతడు, హీరోయిన్‌గా భూమిక, విలన్‌గా ప్రకాష్‌రాజ్‌ పోటీలు పడి నటించారు. ఇందులో హీరోయిన్‌ను హీరో చార్మినార్‌ పైన దాచి పెట్టడం విశేషం. మణిశర్మ చేసిన పాటలు రాణించాయి. ‘చెప్పవే చిరుగాలి’, ‘నువ్వేం మాయ చేశావో గాని’... హిట్‌. అలాగే ధర్మవరపు సుబ్రహ్మణ్యం యాక్ట్‌ చేసిన సెల్‌ఫోన్‌ సీన్‌ ‘నైన్‌ యెయిట్‌ ఫోర్‌ యెయిట్‌ జీరో’... అంటూ కడుపుబ్బ నవ్విస్తుంది. కథలో, నెరేషన్‌లో, డైలాగ్స్‌లో... అన్నింటిలో కొత్తపుంతలు తొక్కిన సినిమా ఇది.

విశేషాలు: ఈ సినిమాలో చార్మినార్‌ కూడా ఒక క్యారెక్టర్‌. దాని మీద షూటింగ్‌ సాధ్యం కాదు కనుక నేరుగా చార్మినార్‌ సెట్‌ను వేసి సినిమా తీయడం ఆ రోజుల్లో విశేషంగా చెప్పుకున్నారు. ఈ సినిమాను చాలా భాషల్లో రీమేక్‌ చేశారు. ఇటీవల అర్జున్‌ కపూర్‌తో ‘తేవర్‌’ పేరుతో తీశారు. ఈ సినిమా ఇచ్చిన ఊపుతో ఈ హీరో డైరెక్టర్‌ కాంబినేషన్‌లో వచ్చిన తర్వాతి సినిమా ‘అర్జున్‌’ కోసం ఏకంగా మధుర మీనాక్షి టెంపుల్‌ సెట్‌ను భారీగా వేయడం మరో విశేషం.

బొమ్మరిల్లు  (2006)

కొడుకు పట్ల తండ్రి ‘పొజెసివ్‌నెస్‌’ని ఒక కథాంశంగా తీసుకుని తండ్రీ కొడుకుల మధ్య ఉండాల్సిన ‘స్పేస్‌’ని డిస్కస్‌ చేసిన సినిమా. చాలా కాలం తర్వాత తెలుగులో ఒక మంచి స్క్రిప్ట్‌తో ఒక మంచి సినిమా వచ్చిందన్న భావనతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కొడుకు తాను ప్రేమించిన అమ్మాయిని తండ్రి చేత ఒప్పించడానికి ఆమెను పెళ్లికి ముందే వారం రోజుల పాటు తన ఇంటికి తీసుకొని వస్తాడు. ఆ ప్రాసెస్‌లో తన వ్యక్తిత్వాన్ని తానే కోల్పోతాడు. అమ్మాయి ఇంట్లో వాళ్లకు నచ్చడం ఏమోకానీ అమ్మాయికి అసలు అబ్బాయే నచ్చకుండా పోతాడు. ఈ మలుపులు, కొత్తదనం సినిమాకు బిగి ఇచ్చాయి. హీరోగా సిద్ధార్థ, హీరోయిన్‌గా జెనీలియా మార్కులు కొట్టేశారు. వాళ్ల కంటే ఎక్కువగా తండ్రి పాత్ర వేసిన ప్రకాష్‌ రాజ్‌ కూడా. దర్శకుడు భాస్కర్‌కు ఇది తొలి సినిమాయే అయినా చాలా పేరు తెచ్చి పెట్టింది. కుటుంబకథా చిత్రాలు నిర్మిస్తారని దిల్‌ రాజు బేనర్‌కు దీనితో మరింత పునాది ఏర్పడింది.

విశేషాలు: ఎవరైనా కటువుగా ఉంటే ‘అతడు బొమ్మరిల్లు ఫాదర్‌’ అని అనడం తెలుగిళ్లలో ఆనవాయితీగా మారింది. సిద్ధార్థ స్వయంగా పాడిన ‘అపుడో ఇపుడో ఎపుడో’ పాట పెద్ద హిట్‌ అయ్యింది. ‘కుదిరితే కప్పు కాఫీ లేకుంటే నాలుగు మాటలు’ డైలాగ్‌ ఇంటింటా మోగింది.

నువ్వు నాకు నచ్చావ్‌ (2001)

ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం విశేషం కాదు. కాని ఇంకొకరితో ఎంగేజ్‌మెంట్‌ అయిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఈ సినిమాలో చూస్తాం. ‘ఆర్య’ సినిమాలో మనసిచ్చిన అమ్మాయిని ప్రేమించమని బహిరంగంగా చెప్పే అబ్బాయి కనిపిస్తే, ‘నువ్వు నాకు నచ్చావ్‌’లో ఇంకొకరితో పెళ్లి కావాల్సిన అమ్మాయిని నిశ్శబ్దంగా ప్రేమించి ఆ అమ్మాయి వెంట పడుతున్నా కుటుంబ మర్యాద కోసం వద్దని వారించే అబ్బాయిని చూస్తాం. ఒక ఆడపిల్లకు కావల్సింది మణులు మాణిక్యాలు పై హోదాలో ఉండే కుర్రాడు కాదు మనసులో పెట్టుకుని చూసుకునేవాడు... పూరింట్లో అయినా సంతోషంగా ఉంచేవాడు అనే కాన్సెప్ట్‌ను ఈ సినిమా రొమాంటిక్‌ స్థాయిలో చూపించి ఆకట్టుకుంది. ఇవాళ దర్శకుడుగా ముందంజలో ఉన్న త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ రచయితగా ప్రతిభావంతంగా స్క్రిప్ట్‌ రూపొందించి దర్శకుడు విజయభాస్కర్‌ సక్సెస్‌ కొట్టేలా చేశారు. వెంకటేశ్‌కు ఈ సినిమా పేరు తెచ్చింది. హీరోయిన్‌గా ఆర్తి అగర్వాల్‌కు కూడా. ఎం.ఎస్‌. నారాయణ, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, సునీల్‌ సినిమాలో నవ్వులు పూయించారు.  ఇప్పటికీ ఇంటిల్లిపాది చూసి ఎంజాయ్‌ చేసే సినిమా ఇది.

విశేషాలు: ఇందులో ప్రకాశ్‌రాజ్‌ తన తల్లి సూర్యకాంతంను తలుచుకుంటూ చదివే కవిత ఫేమస్‌. ‘అమ్మా... రాసుకోవడానికి పలక ఇచ్చావ్‌... గీసుకోవడానికి గడ్డమిచ్చావ్‌’ అని చదువుతుంటే ఒకటే నవ్వులు. అలాగే వెంకటేశ్‌ తాను భవిష్యత్తులో కలెక్టర్‌ అయ్యి వీడియో కాన్ఫరెన్స్‌లో ఉండి తన తండ్రిని గమనించి ‘చంద్రబాబూ... బయట మా బాబు వెయిటింగ్‌’ అంటాననడం కూడా చమక్కే. పాటలు బాగుంటాయి. ‘ఆకాశం దిగి వచ్చి’, ‘ఉన్నమాట చెప్పలేను’, ‘నువ్వే నువ్వే’... హిట్‌.

పోకిరి (2006)

తెలుగు కమర్షియల్‌ సినిమాకు ఒక కొత్త కళ తీసుకొచ్చిన సినిమా. ప్రిన్స్‌ మహేశ్‌ బాబును సూపర్‌స్టార్‌ను చేసిన సినిమా. ఈ సినిమాలోనే ఓ డైలాగ్‌ ఉంటుంది.. ‘‘200 సెంటర్స్‌ 100 డేస్‌’’ అని. దర్శక, రచయిత పూరీ జగన్నాథ్‌ ఏ ఉద్దేశంతో రాశారో కానీ, ఈ సినిమా నిజంగానే 200 సెంటర్స్‌లో హండ్రెడ్‌ డేస్‌ ఆడింది. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలకు పోకిరి అన్నది ఒక ఫార్ములా. ఈ ఫార్ములాను నమ్ముకొనే పదేళ్లు దాటినా నేటికీ ఏదో ఒక సినిమా వస్తోందంటే పోకిరి ప్రభావం తెలుగు సినిమాపై ఏ స్థాయిలో ఉందో చెప్పుకోవచ్చు. ఇందులో ఒక్కో డైలాగ్‌ ఒక్కో సెన్సేషన్‌. ‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయిపోద్దో.. ఆడే పండు గాడు’ అంటూ మహేశ్‌ చెప్పిన డైలాగ్‌ ఒక జనరేషన్‌ మొత్తాన్నీ ఊపు ఊపింది. ‘పండగచేస్కో’ అన్న డైలాగ్‌ అయితే వాడుకలోకే వచ్చేసింది. ఒక పోలీసాఫీసర్‌ క్రిమినల్స్‌తో కలిసిపోయి వారిని అంతం చేయడమనే కథతో వచ్చిన ఈ సినిమాలో మహేశ్‌ను పోలీసాఫీసర్‌గా రివీల్‌ చేసే సీన్‌ తెలుగు కమర్షియల్‌ సినిమాలో ఒక మర్చిపోలేని సీన్‌. మణిశర్మ సమకూర్చిన పాటలన్నీ సూపర్‌ హిట్‌. 40 కోట్ల రూపాయల మేర వసూళ్లు సాధించిన ‘పోకిరి’ అప్పటికి ఇండస్ట్రీ హిట్‌.

విశేషం: ‘పోకిరి’ సినిమాని తమిళ, హిందీ, కన్నడ భాషల్లో రీమేక్‌ చేశారు. రీమేక్‌ అయిన అన్నిచోట్లా సినిమా పెద్ద హిట్‌ కావడం అతిపెద్ద విశేషం.

గమ్యం (2008)

ఎక్స్‌టర్నల్‌ జర్నీ సరే... కాని ఇంటర్నల్‌ జర్నీని సినిమా తీసే ప్రయత్నాలు తెలుగులో పెద్దగా జరగలేదు. ‘గమ్యం’ సినిమా పైకి ప్రేయసిని వెతుక్కుంటూ ప్రియుడు చేసే మోటార్‌ సైకిల్‌ యాత్రగా కనిపించినా ఒక రకంగా అది అతడి అంతర్గత ప్రయాణం. తనను తాను తెలుసుకుంటూ, సమాజాన్ని తెలుసుకుంటూ, సిసలైన సమాజం ఎలా ఉందో, దాని కోసం ఒక మనిషిగా తాను చేయవలసింది ఏమిటో, దాని కోసం ఇది వరకే రకరకాల పనులు చేస్తున్నవారిలో తప్పొప్పులు ఏమిటో... ఇవన్నీ కథానాయకుడు ఈ జర్నీలో డిస్కవర్‌ చేస్తాడు. దర్శకుడు క్రిష్‌ తన మొదటి సినిమాగా ‘గమ్యం’ తీసి వెంటనే ప్రేక్షకుల దృష్టిలో పడ్డారు. ఆ తర్వాత ఆయన తీసిన సినిమాలన్నీ దీని వల్ల వచ్చిన మంచి పేరును ఆధారంగా చేసుకొని కొనసాగుతున్నవే. శర్వానంద్, కమలినీ ముఖర్జీ సినిమాలో జంటగా నటించారు. కామెడీ హీరోగా అందరికీ తెలిసిన అల్లరి నరేష్‌ ఇందులో ‘గాలి శీను’గా ప్రత్యేకమైన పాత్రలో కనిపించి ఆకట్టుకుంటాడు.

విశేషాలు: విప్లవ వీరుడు చే గువేరా పుస్తకం ‘ది మోటార్‌ సైకిల్‌ డైరీస్‌’ ప్రఖ్యాతం. దర్శకుడు క్రిష్‌ ఈ పుస్తకం నుంచి స్ఫూర్తి పొంది ఈ సినిమా రూపొందించారు. సీతారామశాస్త్రి రాసిన ‘ఎంత వరకు ఎంత వరకు’ పాట హిట్‌. ఇందులో ‘గమనమే నీ గమ్యమైతే బాటలోనే బతుకు దొరుకు’ అని రాయడంలో ఒక తాత్త్విక స్పర్శ ఉంది.

అరుంధతి  (2009)

లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు తెలుగులో కామనే! హీరోలకు దీటుగా తామేమీ తక్కువ కాదని హీరోయిన్లే సినిమాలను భుజాల మీద ఎత్తుకొని మోసిన సినిమాలు చాలానే వచ్చాయి. అరుంధతి ఈ కోవలో ఒక అడుగు ముందుకేసి భారీ బడ్జెట్‌తోనూ లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు తీయొచ్చని పరిచయం చేసింది. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. నిర్మాత శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి భారీ బడ్జెట్‌తో విజువల్‌ ఫీస్ట్‌గా సినిమాను నిర్మించారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌ సౌతిండియన్‌ సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసేలా ఉన్నాయని పేరొచ్చింది. స్టార్‌ హీరోలెవ్వరూ లేకున్నా బాక్సాఫీస్‌ వద్ద అరుంధతి కాసుల వర్షం కురిపించింది. అనుష్క తన పాత్రలో ప్రేక్షకులను అబ్బురపరిచింది. విలన్‌ పశుపతిగా నటించిన సోనూసూ«ద్‌ అదరగొట్టేశాడు. ఆయన రోల్‌ ఎంత పాపులర్‌ అంటే.. ‘అమ్మాళే.. ఎంద బొమ్మాళే..’ అన్న డైలాగ్‌ ఆ తర్వాత చాలా సినిమాల్లో వినిపించింది. ‘కమ్ముకున్న చీకట్లోనా..’ పాటతో పాటు కోటి సమకూర్చిన మిగతా పాటలన్నీ కూడా పెద్ద హిట్‌.

విశేషం: ‘అరుంధతి’ సినిమాతో అనుష్క స్టార్‌ హీరో స్థాయికి వెళ్లిపోయింది. ఆమె ప్రధాన పాత్రలో నటించగా తర్వాత ‘రుద్రమదేవి’, ‘పంచాక్షరి’, ‘సైజ్‌ జీరో’ లాంటి లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు వచ్చాయి.  

ఈగ (2012)

ఈగ తెలుగు సినీ చరిత్రలో ఓ అద్భుత ప్రయోగం. హీరో ప్రధానంగా నడిచే ఇండస్ట్రీగా పేరున్న తెలుగులో ఒక ఈగతోనే సినిమా నడిపించి రాజమౌళి చేసిన సాహసం ఇండియన్‌ సినిమా నోరెళ్లబెట్టేలా చేసింది. విలన్‌ చేతిలో హత్య కాబడ్డ హీరో.. ఈగగా మళ్లీ పుట్టి ప్రతీకారం తీర్చుకోవడమే కథ. ఆ ఈగకు కనెక్ట్‌ అయిపోయి సినిమాను ఒక ప్రేక్షకుడు పూర్తిగా ఎంజాయ్‌ చేయగలిగాడంటే అది రాజమౌళి మ్యాజిక్కే! విజువల్‌ ఎఫెక్ట్స్‌ చూస్తూంటే ఇదొక ఇండియన్‌ సినిమానేనా అనిపించేలా ఉంటాయి. కొద్దిసేపే కనిపించినా నాని అందరికీ నచ్చేశాడు. హీరోయిన్‌గా చేసిన సమంత, విలన్‌గా చేసిన కిచ్చా సుధీప్‌ సినిమా స్థాయిని మరింత పెంచారు. తెలుగు, తమిళ భాషల్లో ఈగ పెద్ద హిట్‌. రాజమౌళి అన్న బ్రాండ్‌ దేశవ్యాప్తంగా మారుమోగిపోయిందంటే ఈగతోనే!

విశేషం: ఈగను మొదట్లో ఐదారు కోట్లలో ఓ చిన్న బడ్జెట్‌ సినిమాగా చేయాలన్నది రాజమౌళి ప్లాన్‌. అయితే అది కాస్తా పెరుగుతూ పోయి ఓ పెద్ద హీరో సినిమా బడ్జెట్‌ స్థాయికి వెళ్లిపోయింది. రాజమౌళి బ్రాండ్‌తో బాక్సాఫీస్‌ వద్ద, పెద్ద హీరో లేకపోయినా వసూళ్ల వర్షం కురిసింది.

 మనం (2014) 

ఈ సినిమా గురించి ఒక ఆనందం ఉంది. అది ఇందులో మూడు తరాల నటులు అక్కినేని, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించడం. ఇలా ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల వాళ్లు కలిసి నటించడం హిందీలో రాజ్‌ కపూర్‌ కుటుంబానికి సాధ్యమైంది. తెలుగులో అక్కినేనికి. ఇక సినిమాకు ఒక విషాదం ఉంది. అది– దశాబ్దాలుగా తెలుగువారిని అలరించిన మహా నటుడు అక్కినేనికి ఇది ఆఖరు చిత్రం కావడం. ఈ సినిమా విడుదలకు ముందే ఆ మహనీయుడు పరమపదించారు. అందువల్ల ఈ సినిమా ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన సినిమాగా నిలిచింది. అదీ కాకుండా దీని కథాంశం పునర్జన్మలతో ముడి పడటం, అది మూడు కాలమానాలలో జరగడం విడ్డూరంగా ఉన్నా ఎటువంటి కన్‌ఫ్యూజన్‌ లేకుండా కథను నేరేట్‌ చేయడంలో దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ విజయం సాధించాడు. సమంత, శ్రేయ, అలీ తదితరులు సపోర్ట్‌ చేయగా అక్కినేని, నాగార్జున, నాగ చైతన్య ఒకరితో ఒకరు పోటీ పడి నటించారు. హర్షవర్ధన్‌ డైలాగులు, అనుప్‌ రూబెన్స్‌ సంగీతం రాణించాయి.

విశేషాలు: అక్కినేని సూపర్‌ హిట్‌ ‘నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది’ పాటకు ఈ సినిమాలో నాగార్జున, నాగ చైతన్య డ్యాన్స్‌ చేయడం ప్రేక్షకులకు నచ్చింది. సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ఒక ముఖ్యసన్నివేశంలో తళుక్కున  మెరుస్తారు. పిల్లలు పాడిన ‘కనిపించిన మా అమ్మకి’ పాట పెద్ద హిట్‌. క్లయిమాక్స్‌లో అక్కినేని అఖిల్‌ తెర ప్రవేశం చేసి థ్రిల్‌ కలిగించడం కూడా ఒక ముచ్చటే.

 మగధీర (2009) 

చిరంజీవి తనయుడు రామ్‌ చరణ్‌ను ఒక్కరోజులో స్టార్‌ను చేసేసిన సినిమా. దర్శకధీరుడు రాజమౌళి స్థాయిని సౌతిండియన్‌ సినిమాకు పరిచయం చేసిన సినిమా. అప్పటికి తెలుగులో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన సినిమానే 40 కోట్ల వసూళ్లు రాబడితే, 45 కోట్ల మేర ఖర్చు పెట్టి ఈ సినిమా తీశారు నిర్మాత అల్లు అరవింద్‌. దర్శక, నిర్మాతల గట్‌ ఫీలింగ్‌ అది. ఆ గట్‌ ఫీలింగే వాళ్లను ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టింది. ఒక జన్మలో ఒక్కటవ్వలేకపోయిన ఓ ప్రేమ జంట మరో జన్మలో ప్రేమను దక్కించుకోవడమనే మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న కథను ఈతరం ప్రేక్షకుడికి కిక్కిచ్చేలా తీర్చిదిద్దారు రాజమౌళి. భారీ ఫైట్లు, అద్భుతమైన విజువల్‌ ఎఫెక్ట్స్‌ కలిసి ఈ సినిమాకు ఒక ప్రత్యేక స్థాయిని తెచ్చిపెట్టాయి. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి పాటలన్నీ ఓ మ్యాజిక్‌. ‘బంగారు కోడిపెట్ట’ అంటూ చిరంజీవి సినిమా పాటనే మళ్లీ రీమిక్స్‌ చేశారు. ఈ పాటలో చిరు–చరణ్‌ వేసిన స్టెప్పులు టాప్‌ లేపేశాయి. తెలుగులో, తమిళంలో మంచి బాక్సాఫీస్‌ హిట్‌గా నిలిచిన ఈ సినిమా నేషనల్, ఫిల్మ్‌ఫేర్, నంది అవార్డుల్లోనూ ఇరగదీసింది. తెలుగు సినిమాకు ఓ కొత్త బాక్సాఫీస్‌ కళను తెచ్చిపెట్టింది మగధీర. విశేషం: ‘మగధీర’ తర్వాత సోషియో ఫాంటసీ అనే జానర్‌ తెలుగు సినిమాకు ఓ పిచ్చిలా పట్టుకుంది. 2009 నుంచి ఓ ఐదేళ్ల పాటు ఈ జానర్లో వరుస సినిమాలు వచ్చిపడ్డాయి.

బాహుబలి (2015, 2017)
ఇండియన్‌ సినిమాకు ఒక ఐడెంటిటీ బాహుబలి. ‘తెలుగు సినిమా పొరుగు రాష్ట్రానికి కూడా పరిచయం లేదు’ అన్న ఆలోచన నుంచి ఇండియన్‌ సినిమా ప్రైడ్‌ అని చెప్పుకోవడానికి ఒక తెలుగు సినిమా కారణం అయిందంటే అది బాహుబలి వల్లే! బాక్సాఫీస్‌ వసూళ్ల పరంగా ఈ సినిమా ఒక ప్రభంజనం. 2015లో వచ్చిన మొదటి భాగం ఎంత పెద్ద హిట్టో, 2017లో వచ్చిన రెండో భాగం అంతకు రెట్టింపు హిట్టు. బాహుబలితో రాజమౌళి మెయిన్‌ స్ట్రీమ్‌ కమర్షియల్‌ సినిమాలో తనదో తిరుగులేని బ్రాండ్‌ అని చాటిచెప్పుకున్నారు. ప్రభాస్, రానాలు నేషనల్‌ లెవెల్‌ స్టార్స్‌ అయిపోయారు. అనౌన్స్‌ అయిన రోజు ‘వంద కోట్ల బడ్జెట్టా?’ అన్నవారంతా రిలీజయ్యాక ‘వేల కోట్ల వసూళ్లా?’ అనుకున్నారంటే బాహుబలి ఎంత పెద్ద సక్సెస్సో చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అన్న ప్రశ్న రెండేళ్ల పాటు ఇండియన్‌ సినీ అభిమానుల్లో ఓ చర్చాంశంగా నిలిచింది. విశేషం: బాహుబలి విశేషాలు అన్నీ ఇన్నీ కావు. బాక్సాఫీస్‌ లెక్కలే చూస్తే, ఇండియన్‌ సినిమాకు వెయ్యి కోట్ల వసూళ్లు సాధ్యమా? అన్న ఆలోచనను తుంచేసి 1,700 కోట్ల రూపాయలు వసూలు చేసి, ‘ఇదీ ఇండియన్‌ సినిమా మార్కెట్‌!’ అని ప్రపంచానికి పరిచయం చేసిందీ సినిమా.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement