లైలా నేర్పిన లీలలే! | Telugu film industry copy process | Sakshi
Sakshi News home page

లైలా నేర్పిన లీలలే!

Published Sun, Jan 17 2016 3:43 PM | Last Updated on Sun, Sep 3 2017 3:45 PM

లైలా నేర్పిన లీలలే!

లైలా నేర్పిన లీలలే!

ఆ సీన్ - ఈ సీన్
 తెలుగు సినిమా పరిశ్రమలో కాపీ ప్రక్రియకు ఈ మధ్య కాలంలో కొత్త టచ్ ఇస్తున్నారు దర్శక, నిర్మాతలు.  అయాచితంగా కథలను కాపీ కొట్టేస్తూ... అంతా తమ క్రియేటివిటీనే అని చెప్పుకొన్న ఫిల్మ్ మేకర్లు ఇప్పుడు... ఒరిజినల్ రచయితలకు క్రెడిట్ ఇవ్వడం కూడా మొదలుపెట్టారు. తాము తమ సినిమా కథను ఫలానా విదేశీ సినిమా నుంచి తెచ్చుకున్నామని, దాని స్ఫూర్తితో సినిమాను రూపొందిస్తున్నామని వీరు బహిరంగంగానే చెబుతున్నారు. పరిశోధకులకు ప్రత్యేక పని పెట్టకుండా ఒరిజినల్ మూవీ పేరును చక్కగా చెప్పేస్తున్నారు.
 అయితే ఈ ధైర్యం  కొంతమందిలో మాత్రమే కనిపిస్తోంది.

నేటికీ విదేశీ సినిమాల స్ఫూర్తితో కథలు తయారు చేసుకుని.. అసలు వాళ్లకు క్రెడిట్ ఇవ్వకుండా మార్కెట్లోకి చొరబడుతున్న సినిమాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి... ‘కుమారి 21 ఎఫ్’. ఇటీవలే విడుదలైన ఈ ‘బోల్డ్’ సినిమా 2004లో వచ్చిన ఫ్రెంచి సినిమా ‘లైలా సేస్’కు యథాతథ అనుకరణ అని చెప్పాలి. యువతలో మెచ్యూరిటీ గురించిన డిస్కషన్‌లా సాగే ‘కుమారి 21 ఎఫ్’ సినిమా... మెచ్యూరిటీ ఉన్నవాళ్లకు మాత్రమే నచ్చుతుందని, మెచ్యూరిటీ లేని వాళ్లకు బూతుగా అనిపిస్తుందన్న విశ్లేషణలు వినిపించాయి. ఈ సినిమా చూసే ప్రేక్షకుల థాట్ విషయం ఎలా ఉన్నా... సినిమా కాన్సెప్ట్ వెనుక అసలు థాట్ మాత్రం ఫ్రెంచి వాళ్లదే. తెలుగులో ’ఆర్య’ వంటి వన్ సైడ్ లవర్‌ను సృష్టించిన సుకుమార్... రచయితగా సృష్టించిన ‘కుమారి’కి అసలు ప్రేరణ ‘లైలా’ అని చెప్పాలి.

 16 యేళ్ల లైలా తను కొత్తగా వచ్చి సెటిలైన ప్రాంతంలో నివసిస్తోన్న చిమో అనే టీనేజర్‌తో తొలి చూపులోనే ప్రేమలో పడుతుంది. తన ఆంటీతో కలిసి ఉండే లైలా చాలా స్వేచ్ఛగా ఉంటుంది. తనకు నచ్చిన వాడితో తన ప్రేమను గురించి మొహమాటం లేకుండా చెప్పేయడంతో పాటు... సెక్సీటాక్‌నే మొదలుపెడుతుంది. దీంతో కుర్రాడిలో కొత్త గుబులు మొదలవుతుంది. ఆమెపై ప్రేమ కలిగినా, ఆమె తీరుపై అనుమానపడతాడు. సరిగ్గా అదే సమయంలో హీరో ఫ్రెండ్స్ అతడిలో కొత్త అనుమానాలు రేపుతారు. ఆమెపై కన్నేసిన హీరో ఫ్రెండ్ ఒకడు హీరో మనసులో అనుమాన బీజాలు నాటి... ఆమె ప్రవర్తనను బట్టి ఆమె వర్జిన్ కాదనే డౌట్‌ను రెయిజ్ చేస్తాడు.

ఒకవైపు ఆమెతో సన్నిహితంగా ఉంటూనే, ఆమె దగ్గరే తన అనుమానాలను వ్యక్తం చేసే హీరోకి క్లైమాక్స్‌తో జ్ఞానబోధ అవుతుంది. ‘లైలా సేస్’ సినిమాకు సంబంధించిన ఈ కథ, కథనమే.. ‘కుమారి 21ఎఫ్’లో యాథాతథంగా కొనసాగించారు.  ఫ్రెంచ్ సినిమా వెర్షన్‌లో హీరో అల్లరి చిల్లరి ఫ్రెండ్స్‌తో తిరుగుతుంటాడు. హీరో ఫ్రెండ్స్‌లో ఒకడు హీరోయిన్‌ను బాగా వేధిస్తుంటాడు. చివర్లో వాడే హీరోయిన్‌పై అఘాయిత్యానికి పాల్పడతాడు. అప్పటికి అనుమానం అనే జాడ్యాన్ని వదిలించు కున్న హీరో ఆమెపై తన ప్రేమను వ్యక్తం చేస్తాడు.  తెలుగులో వెర్షన్‌లో ఈ విషయంలో, ఈ సన్నివేశాల్లో ఎలాంటి మార్పులూ లేవు.

అయితే హీరోయిన్ నేపథ్యంలో కొన్ని మార్పులు, హీరో నేపథ్యంలో చిన్ని చిన్ని మార్పులు చేశారు. హీరోయిన్‌ను ఒక మోడల్‌గా చూపించారు. ఆమె తన తాతయ్యతో కలిసి ఉన్నట్టుగా చూపారు. ఫ్రెంచి సినిమాలో హీరోయిన్ క్యారెక్టరైజేషన్‌లో మరింత ‘బోల్డ్‌నెస్’ ఉంటుంది.  తెలుగు వెర్షన్‌లో  హీరో చెఫ్ కావాలనే లక్ష్యాన్ని పెట్టుకుని ఉంటాడు. అయితే ఫ్రెంచి వెర్షన్‌లో హీరో రచయిత కావాలనే లక్ష్యంతో ఉంటాడు. ఆ లక్ష్యానికీ క్లైమాక్స్‌కు చాలా చక్కగా ముడి పెట్టారు. ప్రియురాలిపై తన ప్రేమను వ్యక్తం చేసిన హీరో రచయితగా తన ప్రేమకథనే రాసి సక్సెస్ అవుతాడు. తెలుగులో మాత్రం రివెంజ్ డ్రామాను యాడ్ చేశారు.

 ఫ్రెంచి నాగరికతలో యువతీ యువకుల ఆలోచనా తీరుకు దర్పణం పట్టింది ‘లైలా సేస్’. అలాంటి సినిమాను యథాతథంగా కాపీ కొట్టి.. తెలుగులో తీసేశారు. అలాంటప్పుడు మన సంస్కృతిలో ‘కుమారి’ వంటి క్యారెక్టర్ అన్‌న్యాచురల్ అనే విమర్శలు వచ్చాయంటే రావా మరి!
 - బి.జీవన్‌రెడ్డి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement