వానా... వానా... ఇలియానా! | Ileana Childhood Memories of Rain | Sakshi
Sakshi News home page

వానా... వానా... ఇలియానా!

Published Sun, Jul 19 2015 1:37 AM | Last Updated on Sun, Sep 3 2017 5:45 AM

వానా... వానా... ఇలియానా!

వానా... వానా... ఇలియానా!

ఎండలకు సెలవు చెప్పి, వానలకు ఆహ్వానం పలకడానికి ఎంతో హుషారుగా ఎదురు చూస్తుంటా.

♦  ఇలియానాకి వానంటే ఇష్టమా?
♦  వాన పడితే తనకి గుర్తొచ్చేది?
♦  వర్షాలప్పుడేం వేస్కుంటుంది?
♦  చిన్ననాటి వాన జ్ఞాపకాలేంటి?

♦  ఎండలకు సెలవు చెప్పి, వానలకు ఆహ్వానం పలకడానికి ఎంతో హుషారుగా ఎదురు చూస్తుంటా.
తొలకరి జల్లు పడగానే  పులకరించిపోతా. అప్పటివరకూ ఎండల కారణంగా అనుభవించిన కష్టమంతా ఆ జల్లులతో ఒక్కసారిగా పోయినట్లు ఉంటుంది.

♦  రుతు పవనాలు వచ్చేస్తున్నాయి అని టీవీల్లో, రేడియోల్లో చెప్పగానే నేను షాపింగ్‌కి రెడీ అయిపోతాను. రంగు రంగుల గొడుగులు, గమ్ బూట్స్, రెయిన్ కోట్, కలర్‌ఫుల్ స్వెటర్‌లు కొని తెచ్చుకుంటాను.

♦  వర్షాకాలంలో పసుపు రంగు దుస్తులు వాడితే బాగుంటుంది. అందుకని, ఎక్కువగా ఆ రంగు దుస్తులు వాడతాను. యెల్లో కాకపోతే వేరే ముదురు రంగు డ్రెస్సులు వేసుకుంటాను. ఈ సీజన్‌లో లేత రంగులు అంత బాగుండవు. రెయినీ సీజన్‌లో నేను జీన్స్ ప్యాంట్స్ వాడను. కురచ దుస్తులే వాడతాను. ట్రౌజర్స్, కలర్‌ఫుల్ టీ షర్ట్స్ వేసుకుంటాను.

♦  నేను మామూలుగా ఎప్పుడూ ఎత్తు మడమల పాదరక్షలే వాడతాను. కానీ, వర్షాకాలంలో వాటిని పొరపాటున కూడా షూ ర్యాక్ నుంచి బయటికి తీయను. ఫ్లాట్ స్లిప్పర్స్ వాడతాను. షూటింగ్స్ ఉంటే మాత్రం క్యారెక్టర్‌కి అనుగుణంగా బూట్లు, చెప్పులు సెలక్ట్ చేసుకుంటాను.

♦  వర్షాకాలం అంటే నాకు మా గోవా గుర్తొస్తుంది. ఇలా వాన పడిందో లేదో అలా పవర్ కట్ అవుతుంది. అందుకని కొవ్వొత్తులు రెడీగా ఉంచుకుంటాం. రాత్రిపూట క్యాండిల్ లైట్ డిన్నర్ చేసేవాళ్లం. భలే గమ్మత్తుగా ఉండేది. అదేంటో ఎంత వాన వచ్చినా గోవా బాగానే ఉంటుంది. కానీ, ముంబయ్ చాలా అధ్వాన్నంగా తయారవుతుంది. విడి రోజుల్లోనే ట్రాఫిక్ ఎక్కువ అనుకుంటే ఇక వర్షాకాలంలో చెప్పక్కర్లేదు. రోడ్లన్నీ బురద బురదగా తయారవుతాయ్. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు నిలిచిపోతాయ్. నడిచి వెళ్లేవాళ్లకీ ఇబ్బందే, వాహనాల్లో వెళ్లేవాళ్లకీ ఇబ్బందే.

♦  చిన్నప్పుడు వానలో బాగా తడిచేదాన్ని. పాటలు కూడా పాడేదాన్ని. ఇప్పుడు దూరంగా నిలబడి ఎంజాయ్ చేయడంతో సరిపెట్టుకుంటున్నా. వానలో తడుస్తూ, పాటలు పాడితే చుట్టుపక్కలవాళ్లు విచిత్రంగా చూస్తారని భయం. ఆ భయాలు, బెరుకులూ తెలియని బాల్యం చాలా తీపిగా ఉంటుంది కదా!

♦  రెయినీ సీజన్‌లో ఆ చల్లదనానికి కాస్త బద్ధకంగా ఉంటుంది. బయటికెళ్లి వాకింగ్, స్విమ్మింగ్ చేసే వీలు కూడా ఉండదు. అందుకే ఈ సీజన్లో ఇన్‌డోర్ వ్యాయామాలే చేస్తాను. మా ఇంటి లోపల మెట్లు ఉంటాయి. వీలైనన్ని సార్లు అవి ఎక్కి దిగుతాను. అలాగే కార్డియో ఎక్సర్‌సైజ్ కూడా చేస్తాను.

♦  వడగళ్ల వాన గురించి వినడం తప్ప ఎప్పుడూ చూడలేదు. పిడుగు శబ్దం వినపడితే మాత్రం ‘ఏ సముద్రంలోనో పడి ఉంటే బాగుంటుంది’ అనుకుంటాను. ఈ సీజన్‌లో షూటింగ్ ఉంటే ఎప్పుడెప్పుడు ప్యాకప్ చెబుతారా, ఎప్పుడు ఇంటికెళ్లిపోదామా అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే వర్షాకాలంలో నాకు ఇంట్లో ఉండటం బాగా ఇష్టం. బాల్కనీలో నిలబడి వర్షాన్ని చూస్తుంటాను. ఆ సమయంలో వేడి వేడి కాఫీ తాగుతుంటే దీన్నే స్వర్గం అంటారేమో అనిపిస్తుంటుంది. అలాగే మా అమ్మగారు వేడి వేడి స్నాక్స్ తయారు చేసి ఇస్తారు. అవి తింటూ హ్యాపీగా టీవీ ముందు సెటిలైపోతా. మామూలుగా డైట్ విషయంలో జాగ్రత్త తీసుకున్నా ఆ టైమ్‌లో మాత్రం లెక్కలేకుండా తింటా. ఒంట్లోకి ఎన్ని కేలరీలు పంపించానా అని తర్వాత  టెన్షన్ పడుతుంటా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement