‘దేవదాసు’ సినిమాతో వెండితెరకు పరిచయమై ‘తెలుగింటి అమ్మాయి’గా పేరు తెచ్చుకున్న ఇలియానా ‘బర్ఫీ’, ‘మైనే తేరే హీరో’, ‘రుస్తుం’, ‘బాద్‌షా హో’... సినిమాలతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘కంఫర్ట్ జోన్ నుంచి రావడానికే ఎక్కువ ఇష్టపడతాను. అప్పుడు వైవిధ్యమైన పాత్రలు చేయడం సాధ్యపడుతుంది’ అంటున్న ఇలియానా ఫైనాన్షియల్ క్రైమ్–డ్రామా ‘ది బిగ్‌బుల్’లో నటిస్తోంది. ఆమె గురించి కొన్ని ముచ్చట్లు...
అమ్మో... ఆ జైలులో
‘బాద్‌షా హో’లో ‘మహారాణి గీతాంజలి’ పాత్ర పోషించింది ఇలియానా... ఎమర్జెన్సీ టైంలో తన కుటుంబం నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న బంగారాన్ని తిరిగి సొంతం చేసుకోవడానికి ఎత్తులు వేస్తుంది. పోరాటపటిమ ప్రదర్శిస్తుంది. ఇది ఆషామాషీ పాత్ర కాదు... సినిమా మొత్తం ఈ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. గ్లామర్ డాల్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఇలియానాకు ఈ పాత్ర ఒక సవాల్.బర్ఫీ’ సినిమాతో తనపై ఉన్న గ్లామర్ ముద్రను చెరిపేసుకున్న ఇలియానా ‘మహారాణి గీతాంజలి’ పాత్రతో మరో మెట్టుకు ఎక్కింది.‘‘ఇలాంటి శక్తివంతమైన పాత్రలు కూడా చేయగలననే ఆత్మవిశ్వాసం నాలో నింపిన పాత్ర ఇది’’ అంటోంది ఇలియానా. ఈ సినిమా షూటింగ్ కొంత రాజస్థాన్‌లో జరిగింది. భగభగమండే వేడిలో షూటింగ్ చేయాల్సి వచ్చిందట. ‘‘అదేమంత కష్టంగా అనిపించలేదుగానీ... అసలు కష్టమంతా నిజమైన జైలులో షూటింగ్ చేస్తున్నప్పుడే మొదలైంది. సహజత్వం కోసం ఈ జైలును ఎంచుకున్నారు. దుమ్ము, దుర్వాసన... అయినా తప్పదుకదా! శక్తినంతా హరించి వేసే రాక్షసిలాగా అనిపించింది ఆ జైలు!’’ అని ఆ భయానకమైన జైలును గుర్తు తెచ్చుకుంటోంది.
అదృష్టం
సినిమా కలలు కంటున్నరోజుల్లో ‘ఓంశాంతి ఓం’లాంటి మాంచి మాస్ మసాలా సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ కావాలనుకుంది ఇలియానా. అయితే ‘బర్ఫీ’ మసాలా ఫిల్మ్ కాదు. ‘‘స్టోరీ విన్నప్పుడు నిర్ణయం తీసుకోవడానికి మూడు నెలలు తీసుకున్నాను. ఇలాంటి సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ అయితే ఎలా ఉంటుంది? అని ఆలోచించాను. మసాలా సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ కావాలనే నా కోరిక ఎలా ఉన్నప్పటికీ ‘బర్ఫీ’లాంటి కథ మళ్లీ చేసే అవకాశం దొరకుతుందో లేదో అనుకొని చేశాను. ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టడం అదృష్టంగా భావిస్తాను.
బహు చక్కగా...
‘బర్ఫీ’లో శ్రుతి ఘోష్ పాత్ర చేసి ఉంటే దక్షిణాది ప్రేక్షకులు ఎలా స్వీకరించేవారో తెలియదుగానీ, బాలీవుడ్ జనాలు మాత్రం ‘బహు చక్కగా నటించారు’ అని ప్రశంసించారు.‘‘దక్షిణాదిలో సుపరిచితం అయినప్పటికీ, బర్ఫీ చేస్తున్నప్పుడు మాత్రం ఇక్కడి ప్రేక్షకులకు కొత్త నటినే. అది ప్లస్ అయింది. ‘శ్రుతి ఘోష్’ పాత్రకు న్యాయం చేస్తానా? లేదా? అనేది వేరే విషయంగానీ నాకైతే ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపించింది. ప్రయోగాలు చేయడానికి ఒక వేదిక దొరికినట్లయింది. ప్రేక్షకులకు నా పాత్ర ఎంతగానో నచ్చింది. ఇది నేను ఊహించనిది. నేను ఎప్పుడూ కంఫర్ట్‌జోన్‌ను ఇష్టపడను. అది దాటి బయటికి వచ్చినప్పుడు వైవిధ్యమైన పాత్రలు చేయడానికి అవకాశం దొరుకుతుంది’’ అంటోంది ఇలియానా .
Comments
Please login to add a commentAdd a comment