Exclusive Intervie
-
ఆయన పాట కమనీయం.. స్వరం రమణీయం
కొన్నేళ్ళుగా తన డ్రీమ్ ప్రాజెకై్టన మ్యూజికల్ ఫిల్మ్ ‘99 సాంగ్స్’తో ఏప్రిల్ 16న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలకరించనున్న ప్రపంచ ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ‘సాక్షి’తో ఎక్స్‌క్లూజివ్‌గా, సుదీర్ఘంగా సంభాషించారు. అందులో నుంచి కొన్ని ముఖ్యాంశాలు... ► రచయితగా, నిర్మాతగా కొత్త జర్నీ గురించి... రెహమాన్: దశాబ్దాలుగా సంగీత ప్రపంచంలోనే గడుపుతున్నా. కొత్తగా ఏదైనా చేయమని నా మైండ్ చెప్పింది. ఆస్కార్ అవార్డు తర్వాత హాలీవుడ్లో 5 ఏళ్ళున్నా. అక్కడి సినిమాలు చేశా. ఆ టైమ్‌లో కొన్ని వర్క్‌షాప్స్ చేశా. మనం ఎందుకు ఓ కథ చెప్పకూడదని అప్పుడనిపించింది. సంగీతం అనేది యూనివర్సల్ సబ్జెక్ట్. ప్రపంచంలో మంచి కథలున్నప్పుడు మనమూ చెప్పవచ్చనుకొని ‘99 సాంగ్స్’ కథ రాశాను. తల్లితో రెహమాన్ ► కొత్త రెహమాన్ పుట్టారననుకోవచ్చా? ఇదో మ్యూజికల్ ఫిల్మ్ లాగా అనిపిస్తోంది. (నవ్వేస్తూ...) అవును నిర్మాతగా కొత్త రెహమాన్నే. ఈ సినిమాలో పాటలు ఎక్కువే. అలాగని సినిమా పూర్తిగా సంగీతం గురించే కాదు. సామాజిక అంశాలూ ఉన్నాయి. ఈ కొత్త ప్రపంచానికీ, పాత ప్రపంచానికీ మధ్య వైరుధ్యాలనూ, డిమాండలోని తేడాలనూ మా కథ చూపిస్తుంది. ► మీ నిజజీవిత ఘట్టాలేమైనా కథలో పెట్టారా? లేదు. ఇది ఫ్రెష్స్టోరీ. వృత్తిలో భాగంగా చాలామందిని కలిశా. ఎన్నో ప్రదేశాలు చూశా. కొత్త క్యారెక్టర్లను చూశా. మనుషుల్ని రకరకాలుగా విడదీస్తున్న వేళ మ్యూజిక్, స్పోర్ట్స్, సినిమా... వీటి గురించి అందరినీ కలుపుతాయి. ముఖ్యంగా సినిమా. మా సినిమా రైట్ టైమ్‌లో వస్తోంది. ► ఈ కథపై దాదాపు ఏడేళ్లు వర్క్ చేశారట? ఒక అమ్మాయికి, ఒక అబ్బాయి వంద పాటలు రాయడమనేది నా బేసిక్ థాట్. కానీ ప్రేక్షకులకు పాటలే సరిపోవు. వాళ్లకు సినిమా చూస్తున్నామనే అనుభూతి కలగాలి. మ్యూజిక్, విజువల్స్ కలిస్తే బాగుంటుంది. ముందు తరాలవారు అలానే చేశారు. కె. విశ్వనాథ్ గారు తీసిన ‘శంకరాభరణం’, ‘స్వాతిముత్యం’, బాలచందర్‌గారి ‘సింధుభైరవి’, మణిరత్నం ‘నాయగ¯Œ ’ ఇలాంటి సినిమాలు చూసి చాలా నేర్చుకున్నా. దర్శకులు శంకర్, సంజయ్ లీలా భన్సాలీ గ్రాండియర్ విజువల్స్‌తో పాటలను తెరకెక్కిస్తారు. ప్రతి దర్శకుడు, మ్యూజిక్ కంపోజర్ మైండ్స్ వేర్వేరు. ఈ ‘99 సాంగ్స్’ డైరెక్టర్ విశ్వేశ్ కృష్ణమూర్తి, నేను కలిసి ఉమ్మడి కలగా ఈ సినిమా చేశాం. ► చెన్నై సంగీత ప్రపంచానికి ఇది మీ కానుక...? అనుకోవచ్చు. 1980లలో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం... ఇలా సౌత్‌లో ఉన్న సినీ జీనియస్‌లు అందరూ మద్రాసులోనే ఉండేవారు. తర్వాత ఏ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీ అయిపోయింది. ఓసారి దిలీప్ కుమార్ గారు మద్రాసులో 6 నెలలున్నారు. ఓ సినిమా చేశారు. అలా చెన్నైలో హిందీ సినిమాల షూటింగ్‌లూ జరిగాయి. అలాంటి మంచి రోజులు రావాలని, మరో స్వర్గం రావాలనీ మా సినిమా ఓ చిన్ని ప్రయత్నం. ► మ్యూజికల్ ఫిల్మ్స్ ఇండియాలో తక్కువ. నిర్మాతగా తొలిసారే ఇలాంటి ఛాలెంజ్...? (నవ్వేస్తూ) రెగ్యులర్‌గా ఉంటే, తీస్తే లైఫ్ బోర్ కొడుతుంది. అందుకే ఈ ఛాలెంజ్. జనం లవ్, యాక్షన్ ఫిల్మ్స్ చూశారు. ఓ మ్యూజికల్ సినిమా చూడబోతున్నామనే ఎగ్జయిట్మెంట్ వారికి ఉంటుంది. థియేటర్స్‌లో పాటలు వస్తున్నప్పుడు కొందరు మొబైల్ బ్రౌజింగ్‌లో ఉంటారు. ఏకకాలంలో ‘మల్టీఫుల్ థింగ్స్’ కోరుకుంటున్నారు. కానీ ఈ సినిమాకు అలా జరగదు. బిగువైన స్క్రీన్‌ప్లేతో ‘99 సాంగ్స్’ ఉంటుంది. ► తమిళం, హిందీ, తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. పాటలకు, గాయకుల విషయంలో జాగ్రత్తలు? ప్రతి పాటకూ 10 –13 రివిజన్స్ జరిగాయి. లిప్‌సింక్, మీనింగ్, పొయిట్రీ చూసుకున్నాం. అనువాదం చేయకుండా స్వేచ్ఛగా ఏ భాషకు ఆ భాషలో పాటలు రాశారు. డబ్బింగ్ సినిమాలా ఉండకూడదనుకున్నా. (నవ్వేస్తూ) అందర్నీ కష్టపెట్టి చాలా రివైజింగ్ వెర్షన్స్ చేశాం. కొన్నిసార్లు సింగర్స్నూ మార్చాం. తెలుగులో సీతారామశాస్త్రి గారు ‘సాయి..’ సాంగ్ బ్యూటిఫుల్‌గా రాశారు. అలాగే వెన్నెలకంటి కుమారుడు రాకేందు మౌళి. ► భారత చరిత్రలో తొలిసారి డాల్బీ ఎట్మాస్ టెక్నాలజీతో రిలీజ్ చేస్తున్న సౌండ్ ట్రాక్ ఆల్బమ్ అట కదా ఇది... అవును. ఆడియో త్వరలోనే రిలీజ్ చేస్తాం. ఫస్ట్ డాల్బీ సౌండ్ ట్రాక్ మా సినిమాతో లాంచ్ అవడం గౌరవంగా ఉంది. ఈ సినిమాను హిందీలోనే విడుదల చేద్దామనుకున్నాం. జియో స్టూడియోస్ మాతో అసోసియేటయ్యాక తెలుగు, తమిళంలోనూ చేయాలనుకున్నాం. ► మొదట మీకు కథ తట్టిందా? లేక సంగీతమా? (నవ్వుతూ) కథే! కథలో నుంచే సంగీతం వచ్చింది. కథ ప్రకారమే పాటలు ఉంటాయి. ► కె.విశ్వనాథ్ తీసిన ‘శంకరాభరణం’, ‘స్వాతిముత్యం’ సినిమాలు నచ్చాయన్నారు. మీరు ఆ టైమ్‌లో ఉంటే, ఆ సినిమాలకు చేసి ఉంటే...? లేదండీ. వాటికి లెజెండ్స్ వర్క్ చేశారు. కేవీ మహాదేవన్ గారిని నా గురువుగా భావిస్తాను. కర్ణాటక సంగీతం నుంచి తీసుకొని ఆయన సినిమాకు చేసిన ట్యూన్స్‌ను మ్యాచ్ చేయలేం. ► విశ్వనాథ్ గారి లాంటి వారితో ఓ మ్యూజిక్ ఫిల్మ్ చేయాలని మీరు ఆశపడుతుంటారా? ‘ఇఫీ’ ఫంక్షన్ లో గోవాలో విశ్వనాథ్‌గారిని కలిశా. గంట మాట్లాడా. ఆయనకి చాలా వినయం. అలాంటి అద్భుత చిత్రాలన్నీ భగవత్ కృప అని వినయంగా చెప్పారు. కమల్‌హాసన్ గారిని కలిసినప్పుడు రెండు గంటలు మాట్లాడుకున్నాం. ‘సాగర సంగమం’ రూపకల్పనలో విశ్వనాథ్‌గారి కృషి, అందరి మేధామథనం సంగతుల్ని నెమరేసుకున్నాం. ► మ్యూజిక్, రచన, నిర్మాణం... ఏది కష్టం? ఏ విషయాన్ని అయినా మూలాల నుంచి తపనతో నేర్చుకోవాలి. మ్యూజిక్‌లో నేను ఫాలో అయిన ఈ విధానాన్నే ప్రొడక్షన్, రైటింగ్లోనూ చేశా. సినిమా నిడివి మూడున్నర గంటలు వచ్చింది. కథాంశం పాడవకుండా ఉండేలా రెండు గంటల్లో సినిమా ఉండేలా కొత్త ఎడిట్ చేశాం. ‘మామ్’ చిత్ర ఎడిటర్ మోనిషా పని చేశారు. ట్రైలర్ కట్ కోసం దర్శకుడు అట్లీని సంప్రదించాం. కమర్షియల్ వేలో కట్ చేశారాయన. తమిళ వెర్షన్ కు దర్శకుడు గౌతమ్ మీనన్ డైలాగ్స్ అందించారు. ఆస్కార్ గెలిచిన ‘లా లా ల్యాండ్’కు చేసిన పియానో ప్లేయర్ మా సినిమాకు పనిచేశారు. చాలామంది అంతర్జాతీయ నిపుణులు, నా స్నేహితులు నన్ను గైడ్ చేశారు. ► నిర్మాతల కష్టాలు అర్థమయ్యాయా? (నవ్వేస్తూ) ప్రొడ్యూసర్ జాబ్ జూదం లాంటిది. నిర్మాతగా ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఫినిష్. చాలామంది నష్టపోయారు. కానీ ధైర్యంగా ముందుకు వెళ్లకపోతే లైఫ్ లేదు. ఒక మ్యూజిక్ డైరెక్టర్‌గా ‘సినిమాలో మంచి పాట ఇది.. వినండి’ అని నేనెప్పుడూ చెప్పను. కానీ నిర్మాత బాధ్యతలు వేరు. కెప్న్ ఆఫ్ ది షిఫ్ మనమే. సినిమాను రిలీజ్ చేయాల్సిన బాధ్యతా నిర్మాతలదే. కానీ ఈ ప్రొడక్ట్ ఒక్క నిర్మాతదే కాదు. డైరెక్టర్స్, ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్... ఇలా చాలామంది కలిస్తేనే ఒక సినిమా. వీటికి తోడు ఏఆర్ రెహమాన్ సినిమా అంటే కొన్ని అంచనాలు ఉంటాయి. వాటినీ అందుకోవాలి. ఇందులో అందరి కృషీ ఉంది. ► నిర్మాతగా, రచయితగా... కొనసాగుతారా? ‘99 సాంగ్స్’ రిలీజ్ కోసం చూస్తున్నా. నేను నిర్మాతగా కొనసాగాలో లేదో జనం నిర్ణయిస్తారు. ► సినిమా రఫ్కట్ మీ అమ్మగారికి చూపించారట అవును. ఆమె తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెబుతారు. ఆ సమయంలో అమ్మ అనారోగ్యంతో మంచం మీదున్నారు. ఆవిడ చూసి ఇంగ్లీష్ సినిమాలా ఉందన్నారు. ఇనిషియల్ కట్, కథలోని సీన్లు ఆమెకి అలా అనిపించాయి. ► దర్శకులు శంకర్ ఇదే మాట అన్నట్లున్నారు? ఆయన ఓ పాట చూశారు. విజువల్స్ అంత గ్రాండ్‌గా అనిపిస్తుండడం హ్యాపీగా ఉంది. హాలీవుడ్ విజువల్స్, భారతీయ ఆత్మ – మా సినిమా. ► మీ చిత్రదర్శకుడు విశ్వేశ్కి మీ సలహాలేమైనా? లేదు. 2016లో ఈ సినిమాను స్టార్ట్ చేశాం. వర్క్, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ నాలుగేళ్లు జరిగాయి. ► రాబోయే రోజుల్లో సినీ డైరెక్టర్‌గా కూడా...? లేదు. ‘లే మస్క్’ అనే ఓ చిన్న వర్చ్యువల్ రియాలిటీ ఫిల్మ్ మాత్రం తీశా. దర్శకత్వం అంటే, 2–3 ఏళ్ళు అన్నీ పక్కన పెట్టేయాలి. (నవ్వేస్తూ) నన్ను సంగీతం వదిలేయమంటారా ఏమిటి? ► మీరు వర్క్ చేసిన రాజ్–కోటితో అనుబంధం? కోటి గారిని కలుస్తుంటా. అన్నయ్య లేని నాకు ఆయన అన్నయ్య. రాజ్ గారిని చూసి చాలా కాలమైంది. ఆయనను కలవాలని ఉంది. ► గత ఏడాది మీ అమ్మ గారి లానే, లెజండ్ సింగర్ ఎస్పీ బాలు దూరమయ్యారు... (బాధగా)ఎస్పీబీ గారి లాంటి సింగర్ మరొకరు రారు. 40 వేల పాటలు పాడిన ఆయనను ఇంకెవరూ మ్యాచ్ చేయలేరు. 1982 –83 టైమ్‌లో అనుకుంటా... నా ఫస్ట్ పెర్ఫార్మెన్స్ ఆయన బర్త్ డేకి, మద్రాస్ మ్యూజిక్ అకాడెమీలో జరిగింది. నా మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన సినిమాల్లో ఆయన పాడిన పాటలన్నీ మళ్ళీ వీడియో రికార్డ్ చేయిద్దామని అనుకున్నాను. ఆయన ఎగ్జయిటయ్యారు. కానీ ఇంతలో కరోనా వ్యాప్తి. ప్రాజెక్ట్ ఆగింది. ఆయన వెళ్ళిపోయారు. ► ఆస్కార్ సాధించారు. మన సిన్మాలకి బెస్ట్ ఫారిన్ఫిల్మ్గా ఆస్కారొచ్చే ఛాన్స్? మన ఫిల్మ్‌మేకర్స్ ఏం మిస్సవుతున్నామో గమనించాలి. బావిలో కప్పల్లా ఉండిపోకూడదు. మనం వెళ్ళాలి, పోటీ పడాలి. నేను ‘ఫ్యూచర్ ప్రూఫ్స్’ వర్క్‌షాప్ కూడా చేశా. మార్కెటింగ్‌లో, క్రియేటివ్ సైడ్ కొత్త ఆలోచనలను సమీకరించడానికి ఈ ఛానెల్‌ను స్టార్ట్ చేశా. నేను అనకూడదు కానీ హాలీవుడ్లో భారతీయ సినిమాల పట్ల చిన్న రేసిజమ్ ఉంది. ఏ భాష సినిమా అయినా బాలీవుడ్ అనేస్తారు. నిజానికి, అద్భుతమైన డైరెక్టర్లు, సాంకేతిక నిపుణులు ఉన్నారు మన దగ్గర. మన మధ్య ఉన్న గ్యాప్‌ను కూడా పూడ్చుకోవాలి. ► నార్త్, సౌత్ మధ్య వివక్ష మాటేమిటి? అదో పెద్ద కథ. మరోసారి మాట్లాడతా. కానీ, జనరల్‌గా సౌత్ డైరెక్టర్స్ నార్త్‌లో చేస్తున్నారు. నార్త్ హీరోలు సౌత్‌లో నటిస్తున్నారు. జనం సమైక్యంగానే ఉన్నాం. తెలుగువారు తమిళం, తమిళం వారు తెలుగును ఇష్టపడతారు. హిందీవారు తమిళ పాటలను ఇష్టపడతారు. సో.. వుయార్ యునైటెడ్. వుయార్ హ్యాపీ ఇండియా. ► మీరు మళ్ళీ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ చేసేదెప్పుడు? ‘ఏ మాయ చేసావే’ స్ట్రైటేగా! మంచి కథ, దర్శకుడు కుదిరితే మళ్లీ చేస్తా. తెలుగంటే ఇష్టం. నా దగ్గరవాళ్ళతో తెలుగులోనే మాట్లాడుతుంటా. ► ఇటీవల ఓ ఫంక్షన్ లో ఈ తరం సంగీత దర్శకులు యువన్ శంకర్, జీవీ ప్రకాశ్, అనిరు«ధ్ మిమ్మల్ని పొగుడుతుంటే ఏమనిపించింది? ఈ తరంలో చాలా ఉత్సాహం కనిపిస్తోంది. వారు ప్రేమను చూపించడాన్ని గౌరవంగా ఫీలవుతున్నా. ఆర్టిస్టులందరూ కలిసి ఉంటే మరిన్ని అద్భుతాలు వస్తాయి. యువ సంగీతజ్ఞుల కోసం మేం ‘మాజా’ అనే యాప్ స్టార్ట్ చేశాం. ఇండిపెండెంట్ మ్యూజిక్‌ను ముందుకు తీసుకెళ్ళి, ఆర్థిక భద్రత కల్పిస్తుంది. ► మీరు చాలామందికి స్ఫూర్తి. కొత్తతరాన్ని చూసి మీరు ఇన్ స్పైర్ అవుతారనుకోవచ్చా? అవును. ప్రతిభావంతుల్ని ప్రోత్సహిస్తున్నా. ఎవరైనా కొత్త మ్యూజిక్‌ను ట్రై చేసినప్పుడు మెచ్చుకుంటే వారిలో మరింత జోష్ వస్తుంది. ► మీరు చాలామందిని ట్రైన్ చేస్తున్నారు కదా? మా కె.ఎం కన్జర్వేటరీ ద్వారా చాలామంది పైకొస్తు్తన్నారు. మేం కొన్ని షోలు చేశాం. కొన్నిసార్లు ఈ పాటను మరోలా పాడదామని అనిపిస్తుంటుంది. ఒకసారి నీతీ మోహన్, జనితాగాంధీ లాంటి యంగ్‌స్టర్స్ ఆడుతూ, పాడే శైలి చూశా. స్టేజ్‌పై ఎలా ఉండాలనే విషయాల్ని నేను వారిని చూసి నేర్చుకున్నా. మనం ఇంకా బాగా పాడాలి, ఏదో రిటైర్డ్ ఆఫీసర్లలా బిగుసుకోని ఉండకూడదని (నవ్వేస్తూ) అనుకున్నా. ఇప్పుడు బన్నీ, సిధ్ శ్రీరామ్ బాగా షైనవుతున్నారు. హ్యాపీగా ఉంది. ► మీ సంగీతానికి వారసులెవరు? మీ ఇంట్లో... నా అకాడెమీలోని స్టూడెంట్స్‌ను సొంత బిడ్డలుగా భావిస్తా. అమీన్, సార్థక్ కల్యాణి, పూర్వీ కౌటిశ్, ఔరంగాబాద్ అంజలీ గైక్వాడ్... ఇలా నా లెగసీని కంటిన్యూ చేయడానికి చాలామంది ఉన్నారు. అందులో నా బిడ్డలూ భాగస్వాములే. ► మీరీ స్థాయికి చేరుకోవడంలో మీ అమ్మగారి పాత్ర? గత ఏడాది మా అమ్మ మాకు దూరమయ్యారు. నేను, నా ఫ్యామిలీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాం. మా అమ్మకి మేం అంతలా అటాచ్ అయ్యాం. నా పిల్లలు, నా సిస్టర్స్ ఆ బాధను తట్టుకోలేక ఏడుస్తుంటే, నా బాధను దిగమింగుకొని, వాళ్లల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన బాధ్యత తీసుకున్నా. మా అమ్మగారు ఈ లోకాన్ని వదిలి మరో మంచి లోకాన్ని చేరుకున్నారు. ఈ విషయాన్ని మా ఫ్యామిలీ మెంబర్స్‌కు కన్విన్సింగ్‌గా చెప్పడం నాకు చాలా కష్టంగా అనిపించింది. ఆమె త్యాగం, గైడ్‌లైన్స్, ధైర్యమే మమ్మల్ని ఈ స్థాయిలో నిలిపాయి. మా అమ్మ పేరిట చెన్నైలో ఓ స్మారక చిహ్నం నిర్మిస్తున్నాం. ► ప్రపంచసిన్మాకి, భారతీయ సినిమాకు తేడా? ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతి తెలియాలి. మనం బెగ్గర్స్ కాదు. మనకంటూ ఓ స్టేటస్, ఉనికి, ఐకమత్యం ఉన్నాయని ప్రపంచం మొత్తం తెలియాలి. కష్టపడి పనిచేసే తత్వం మన నేలలోనే ఉంది. అంతర్జాతీయ ప్రేక్షకులు మన ప్రతిభను గుర్తించాలి. ఇండియా అనగానే ఏదో పేదరికంలో మగ్గే దేశం అన్నట్లు జాలి చూపిస్తుంటారు వారి సినిమాల్లో. అది కరెక్ట్ కాదు. అందుకే, నాకు ‘బాహుబలి’ నచ్చింది. ‘ఎవెంజర్స్’, ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ లాగా ఈ సినిమాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కింది. మన దగ్గర్నుంచి యంగ్ ఫిల్మ్‌మేకర్స్ మంచి ప్రతిభావంతులు వస్తున్నారు. మన సినిమాలు ప్రపంచస్థాయిని చేరుకోవాలని కోరుకుంటున్నా. – రెంటాల జయదేవ -
రాక్షసిలాగా అనిపించింది ఆ జైలు!
‘దేవదాసు’ సినిమాతో వెండితెరకు పరిచయమై ‘తెలుగింటి అమ్మాయి’గా పేరు తెచ్చుకున్న ఇలియానా ‘బర్ఫీ’, ‘మైనే తేరే హీరో’, ‘రుస్తుం’, ‘బాద్షా హో’... సినిమాలతో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘కంఫర్ట్ జోన్ నుంచి రావడానికే ఎక్కువ ఇష్టపడతాను. అప్పుడు వైవిధ్యమైన పాత్రలు చేయడం సాధ్యపడుతుంది’ అంటున్న ఇలియానా ఫైనాన్షియల్ క్రైమ్–డ్రామా ‘ది బిగ్బుల్’లో నటిస్తోంది. ఆమె గురించి కొన్ని ముచ్చట్లు... అమ్మో... ఆ జైలులో ‘బాద్షా హో’లో ‘మహారాణి గీతాంజలి’ పాత్ర పోషించింది ఇలియానా... ఎమర్జెన్సీ టైంలో తన కుటుంబం నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న బంగారాన్ని తిరిగి సొంతం చేసుకోవడానికి ఎత్తులు వేస్తుంది. పోరాటపటిమ ప్రదర్శిస్తుంది. ఇది ఆషామాషీ పాత్ర కాదు... సినిమా మొత్తం ఈ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. గ్లామర్ డాల్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఇలియానాకు ఈ పాత్ర ఒక సవాల్.బర్ఫీ’ సినిమాతో తనపై ఉన్న గ్లామర్ ముద్రను చెరిపేసుకున్న ఇలియానా ‘మహారాణి గీతాంజలి’ పాత్రతో మరో మెట్టుకు ఎక్కింది.‘‘ఇలాంటి శక్తివంతమైన పాత్రలు కూడా చేయగలననే ఆత్మవిశ్వాసం నాలో నింపిన పాత్ర ఇది’’ అంటోంది ఇలియానా. ఈ సినిమా షూటింగ్ కొంత రాజస్థాన్‌లో జరిగింది. భగభగమండే వేడిలో షూటింగ్ చేయాల్సి వచ్చిందట. ‘‘అదేమంత కష్టంగా అనిపించలేదుగానీ... అసలు కష్టమంతా నిజమైన జైలులో షూటింగ్ చేస్తున్నప్పుడే మొదలైంది. సహజత్వం కోసం ఈ జైలును ఎంచుకున్నారు. దుమ్ము, దుర్వాసన... అయినా తప్పదుకదా! శక్తినంతా హరించి వేసే రాక్షసిలాగా అనిపించింది ఆ జైలు!’’ అని ఆ భయానకమైన జైలును గుర్తు తెచ్చుకుంటోంది. అదృష్టం సినిమా కలలు కంటున్నరోజుల్లో ‘ఓంశాంతి ఓం’లాంటి మాంచి మాస్ మసాలా సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ కావాలనుకుంది ఇలియానా. అయితే ‘బర్ఫీ’ మసాలా ఫిల్మ్ కాదు. ‘‘స్టోరీ విన్నప్పుడు నిర్ణయం తీసుకోవడానికి మూడు నెలలు తీసుకున్నాను. ఇలాంటి సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ అయితే ఎలా ఉంటుంది? అని ఆలోచించాను. మసాలా సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ కావాలనే నా కోరిక ఎలా ఉన్నప్పటికీ ‘బర్ఫీ’లాంటి కథ మళ్లీ చేసే అవకాశం దొరకుతుందో లేదో అనుకొని చేశాను. ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టడం అదృష్టంగా భావిస్తాను. బహు చక్కగా... ‘బర్ఫీ’లో శ్రుతి ఘోష్ పాత్ర చేసి ఉంటే దక్షిణాది ప్రేక్షకులు ఎలా స్వీకరించేవారో తెలియదుగానీ, బాలీవుడ్ జనాలు మాత్రం ‘బహు చక్కగా నటించారు’ అని ప్రశంసించారు.‘‘దక్షిణాదిలో సుపరిచితం అయినప్పటికీ, బర్ఫీ చేస్తున్నప్పుడు మాత్రం ఇక్కడి ప్రేక్షకులకు కొత్త నటినే. అది ప్లస్ అయింది. ‘శ్రుతి ఘోష్’ పాత్రకు న్యాయం చేస్తానా? లేదా? అనేది వేరే విషయంగానీ నాకైతే ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపించింది. ప్రయోగాలు చేయడానికి ఒక వేదిక దొరికినట్లయింది. ప్రేక్షకులకు నా పాత్ర ఎంతగానో నచ్చింది. ఇది నేను ఊహించనిది. నేను ఎప్పుడూ కంఫర్ట్‌జోన్‌ను ఇష్టపడను. అది దాటి బయటికి వచ్చినప్పుడు వైవిధ్యమైన పాత్రలు చేయడానికి అవకాశం దొరుకుతుంది’’ అంటోంది ఇలియానా . -
అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు
సాక్షి, గుంటూరు: ‘రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. అర్హులైన లబ్ధిదారులకు కొత్తగా ఐదు రకాల కార్డులు, ఏడు కొత్త పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ, వార్డు వలంటీర్లతో ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. పారదర్శకంగా సర్వే, సామాజిక తనిఖీ, గ్రామ సభల ద్వారా వంద శాతం సంతృప్తి స్థాయిలో అర్హుల గుర్తింపుతో వైఎస్సార్ నవశకానికి నాంది పలకనుంది. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా కార్యాచరణ ప్రారంభించాం. ఇప్పటికే వలంటీర్లకు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాం. ఎటువంటి విమర్శలకు తావులేకుండా పనిని పూర్తి చేస్తాం’ అంటూ కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్ కుమార్ చెప్పారు. బుధవారం ఆయన వైఎస్సార్ నవశకంపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సాక్షి : ఇంటింటి సర్వే ఎలా సాగనుంది? కలెక్టర్ : అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ నవశకం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబరు 20వ తేదీ వరకు సమగ్ర సర్వే నిర్వహిస్తాం. ఇప్పటికే మాస్టర్ ట్రైనర్ల ద్వారా 16 వేల మంది గ్రామ వలంటీర్లకు, 9 వేల మంది వార్డు వలంటీర్లకు శిక్షణ ఇప్పించాం. బుధవారం సాయంత్రం నుంచి సర్వే ప్రారంభమయ్యింది. సాక్షి : కొత్తగా ఎన్ని రకాల కార్డులు ఇస్తున్నారు? వాటి ఎంపికలు ఎలా జరుగుతాయి? కలెక్టర్ : జిల్లాలో కొత్తగా బియ్యం కార్డు, పింఛన్ కానుక కార్డు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కార్డులకు అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసేందుకు సర్వే చేపట్టాం. ఈ పథకాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేసింది. కొన్ని పథకాల లబ్ధిదారుల ఎంపిక విషయంలో అనుమానాలు వ్యక్తమైతే సంబంధిత డిపార్టుమెంట్ అధికారులను పంపి, వివరాలను పరిశీలించి చేసి అర్హత ఉందో లేదో మరోసారి నిర్ధారిస్తాం. ఏ ఒక్కరికి అన్యాయం జరగనివ్వం. సాక్షి : ప్రభుత్వం కొత్తగా ఏయే పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది? కలెక్టర్ : ప్రభుత్వం ప్రధానంగా జగనన్న అమ్మఒడి, వైఎస్సార్ మత్య్సకార భరోసా, వైఎస్సార్ నేతన్న నేస్తం, సున్నా వడ్డీ రుణాలు, వైఎస్సార్ కాపు నేస్తం, టైలర్లు, నాయీబ్రాహ్మణులు, రజకులకు సంక్షేమ పథకాలు, ఇమామ్, మౌజన్, పాస్టర్, అర్చకులకు గౌరవ వేతనాలు వర్తింపజేసేందుకు అర్హుల జాబితాలను సిద్ధం చేయనున్నాం. సాక్షి : అమ్మఒడికి సంబంధించి ప్రైవేటు పాఠశాలలు, చైల్డ్ ఇన్ఫోలో నమోదు కాలేదనే ఆరోపణలు వస్తున్నాయి. వీటిని ఎలా పరిష్కరిస్తారు? కలెక్టర్ : జిల్లాలో అమ్మఒడికి పథకానికిసంబంధించి ఇప్పటికే 6.82 లక్షల మంది విద్యార్థులు ఉండగా, చైల్డ్ ఇన్ఫోలో నమోదు కాని వారు చాలా తక్కువ సంఖ్యలో (దాదాపు పది వేలలోపు) మాత్రమే ఉన్నారు. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయా పాఠశాలలకు చెందిన హెచ్ఎంలు అమ్మఒడి విరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం అందేలా చూస్తాం. సాక్షి : సర్వే ప్రక్రియను ఎలా నిర్వహిస్తున్నారు? కలెక్టర్ : వైఎస్సార్ నవశకంలో భాగంగా నవంబరు 20 నుంచి 30వ తేదీ వరకు గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటి సర్వే చేసి లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. డిసెంబర్ 9వ తేదీ నాటికి అర్హుల జాబితాను ప్రచురిస్తాం. జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు, సూచనలను డిసెంబర్ 10 నుంచి 12వ తేదీ వరకు స్వీకరిస్తాం. డిసెంబర్ 13 నుంచి 16వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించి పారదర్శకంగా పార్టీలకతీతంగా వంద శాతం సంతృప్తి స్థాయిలో లబ్ధిదారుల ఎంపిక చేపడతాం. ఎంపికైన వారి జాబితాను శాశ్వత ప్రాతిపదికన గ్రామాల్లో ప్రదర్శిస్తాం. అర్హులైన వారందరికీ జనవరి 1వ తేదీ నాటికి కొత్త కార్డులను జారీ చేస్తాం. సాక్షి : సర్వే ఏర్పాట్లు ఎలా చేశారు? కలెక్టర్ : జిల్లాలో పకడ్బందీగా సర్వే నిర్వహించేందుకు వీలుగా ఆయా శాఖల అధికారులు, జాయింట్ కలెక్టర్, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశాం. వైఎస్సార్ నవశకం కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. సాక్షి :గ్రామ, వార్డు సచివాలయాలు అందుబాటులోకి వచ్చాయా? కలెక్టర్ : ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. కొన్ని ప్రాంతాల్లో ప్రారంభం కాగా, మరికొన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న గ్రామ, వార్డు వలంటీర్ల పోస్టులను సైతం భర్తీ చేసి పంచాయతీ వ్యవస్థను పటిష్టం చేస్తాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకనుగుణంగా లబ్ధిదారుడు దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోనే సమస్యను పరిష్కరించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. -
మరీ ముసలోడిలా కనిపిస్తున్నానా?: రామ్‌చరణ్
ఈ రోజు కొత్తింట్లోకి షిఫ్ట్ అవుతున్నారు చెర్రీ అండ్ ఫ్యామిలీ! కొత్తిల్లు అంటే పూర్తిగా కొత్త అని కాదు. ఫ్యామిలీ అంటే చెర్రీ, ఉపాసన మాత్రమే కాదు. మొత్తం మెగా ఫ్యామిలీ.. పెద్ద సెలబ్రేషన్‌తో.. రీమోడలింగ్ చేసిన ఇంట్లోకి వచ్చేస్తోంది. మతాబుల్లాంటి పిల్లలు.. స్టార్స్‌లా వెలుగుతున్న పెద్దలు కలిసి సాయంత్రం దీపావళిని జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా.. ‘సాక్షి’... రామ్‌చరణ్‌ని కలిసింది. కొత్తింట్లోకి వెళ్లడానికి ముందే చెర్రీనిమీ ఇంటికి తీసుకొచ్చింది! హ్యాపీ దీపావళి. ‘సైరా’ నిర్మాతగా మీ అనుభవాలను షేర్ చేసుకోండి. నిర్మాత అనే ట్యాగ్‌ను నేనింకా యాక్సెప్ట్ చేయలేదు. ‘సైరా’ సినిమాను నేను నిర్మాతగా చేయలేదు. నాన్నగారి ఆలోచనకు చిన్న ఎక్స్‌టెన్షనే నిర్మాత అనే పాత్ర. ఆయన కలకి ఎక్స్టెన్షన్. కానీ ‘సైరా’ టీమ్‌లో పని చేసిన వాళ్లందరూ ‘చరణ్ బెస్ట్ ప్రొడ్యూసర్’ అని చెబుతున్నారు.. ఈ సినిమా ప్రీ–ప్రొడక్షన్, రెండు ఎపిసోడ్లకే(సుమారు 20 నిమిషాల నిడివి) 75 కోట్లు అయిపోయింది. వేరేవాళ్లైతే సినిమాను ఆపేస్తారు. నేను కూడా ఆపాలనే చూశాను. ఆపడం వల్ల వచ్చే నష్టమేంటి? కొనసాగించడంలో ప్లస్ ఏంటి? అని చూసుకున్నాం. ‘చిరంజీవిగారి సినిమా బడ్జెట్ సమస్యల వల్ల ఆగిపోయింది’ అనే మాట నేను పడకూడదు. ఆయన 30 ఏళ్ల కెరీర్లో ఇదో బ్లాక్మార్క్లా ఉండిపోతుంది. ఈ సినిమాకు లాభాలు రాకపోయినా నేను నిర్మాతగా ఫెయిల్ అవ్వను కానీ ఈ సినిమా ఆగిపోతే కొడుకుగా, మనిషిగా, నిర్మాతగా నేను ఫెయిల్ అయినట్టే. అందుకే దిగిపోయాం కాబట్టి చేసేద్దాం అని, పూర్తి చేశాం. నేనీ సినిమా లాభాల కోసం చేయలేదు అని చాలా సందర్భాల్లో చెప్పాను. నాన్న కోసమే ఈ సినిమా చేశాను. ఇక ముందు కూడా చేస్తాను. నిర్మాతంటే అనుకున్నదాంట్లో చేయాలి. మేం అనుకున్నదానికంటే లిమిట్ దాటేశాం. అందుకే నన్ను నేను పూర్తి స్థాయి నిర్మాతగా చూసుకోను. నాన్నగారి డ్రీమ్ సినిమా (సైరా) తీయాలని మీరెప్పుడనుకున్నారు? ‘ఖైదీ నంబర్ 150’ తర్వాతే. నెక్ట్స్ ఏం సినిమా చేయాలి? అని ఆలోచిస్తూ ఉంటే ‘ఒక కథ ఉందిరా అని ఆయన చెప్పారు, ఆ కథంతా విన్న తర్వాత చేయాలనుకున్నాను. ఏ నిర్మాతయినా నాన్నగారితో 7–8 నెలల్లో సినిమా తీసి ఏ పండగకో రిలీజ్ చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటారు. అటూ ఇటు అయినా ఫర్వాలేదు అనుకోవాలి. అంత ప్యాషనేట్‌గా ఫ్యామిలీ వాళ్లే తీయగలరు. అప్పట్లో అల్లు అరవింద్‌గారు నాతో ‘మగధీర’ సినిమాను చాలా ప్యాషనేట్‌గా నిర్మించారు. అందుకే ‘సైరా’ని నేను ప్యాషనేట్‌గా తీయాలనుకున్నాను. ‘నా సినిమా కలెక్షన్లను ఇక మీదట సినిమా పోస్టర్స్ మీద వేయను’ అని ఆ మధ్య అన్నారు. ఎందుకా నిర్ణయం? మంచిదే కదా. మేం చెప్పకపోయినా మార్కెట్, ట్రేడ్‌లో తెలుస్తూనే ఉంటుంది కదా. వెబ్సైట్లు ఉంటాయి. నేనొక్కడినే మాట్లాడకపోవడం వల్ల ఆగుతుందా? అఫీషియల్‌గా పోస్టర్స్ మీద ఉండవంతే. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడైనా సినిమా పోస్టర్స్‌లో ఆర్టిస్టులను, టైటిల్స్ మాత్రమే చూసాం. కేవలం మన ఇండియాలోనే పోస్టర్స్ మీద నంబర్స్ (సినిమా కలెక్షన్లు) వేస్తుంటాం. అది బిజినెస్‌కి సంబంధించినది. ఆర్ట్‌కి, ఆర్టిస్ట్‌కి సంబంధించినది కాదు. ‘రంగస్థలం’ సమయంలో మా అభిమానులకు, మహేశ్ అభిమానులకు సోషల్ మీడియాలో కలెక్షన్ల విషయంలో చిన్న గొడవలు ఏర్పడ్డాయి. నిజమైన నంబర్స్ ఏంటో మాకే తెలియదు. నిర్మాతలు ఇచ్చే నంబర్స్ కరెక్టా, ఫ్యాన్స్ వేసే నంబర్స్ కరెక్టా అనేది అర్థం కావడం లేదు. మంచి సినిమా తీశాం. హ్యాపీగా ఉన్నాం. మహేశ్ మంచి సినిమాలు తీస్తున్నాడు. అతను హ్యాపీగా ఉన్నాడు. ఇది కట్ చేయాలని అనుకున్నాను. పోస్టర్స్ మీద కలెక్షన్లను వేయడం ఆపేద్దాం అని నిర్ణయం తీసుకున్నాను. ఇండస్ట్రీలో నంబర్ గేమ్ కూడా కీలకమే కదా. అవును. కానీ పోస్టర్స్ మీద కలెక్షన్లు రావడం కాదు కదా? మేం కష్టపడిందంతా కొంతమంది అభిమానులు ఓవర్ షాడో చేసేసి, మా ఎఫర్ట్‌ని మించిపోయి గొడవలు ఎక్కువవుతున్నాయి. నేను అందరితో బావుంటాను. ఫ్యాన్ వార్స్ వల్ల మా మధ్య ఉన్న ఆ అనుబంధం మిస్ అవుతుందేమో అనిపిస్తుంది. అందుకే సినిమా చేశామా.. అక్కడితో చాప్టర్ క్లోజ్ అయిపోవాలి. ‘మా ఫ్యాన్స్ కోసం పోస్టర్ వేయండి’ అని నేను నా నిర్మాతను రెచ్చగొడితే ఎంతసేపు? ఈ బోర్డ్‌లో ‘చెర్రీ మామ, అన్నయ్యా యూ ఆర్ బెస్ట్’ అని ఉంది. పిల్లలు (చెల్లెళ్లు సుస్మిత, శ్రీజల కూతుళ్లు, బాబాయి నాగబాబు కూతురు నిహారిక, పవన్ కల్యాణ్ కుమార్తె ఆద్య) అందరూ వస్తారు. బోర్డ్ మీద వాళ్లకు తోచింది రాస్తుంటారు. చిన్న పిల్లలు కదా.. వాళ్లకు వచ్చిందే బెస్ట్, గుడ్ అనే పదాలు. నీహా (నిహారిక) ఏవేవో రాస్తుంటుంది (నవ్వుతూ). ‘నిన్ను డైరెక్ట్ చేయాలనుంది’ అని రాసింది ఆద్యా. పవన్ కల్యాణ్ గారి అమ్మాయి. తనకి డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్. నన్ను హీరోగా పెట్టి సినిమా చేస్తానంటుంది. నేను ఆఫీస్‌లో లేనప్పుడు వస్తే. ఆ రోజుకి వాళ్లకి ఏది అనిపిస్తే అది రాస్తారు. నేను వచ్చినప్పుడు చూస్తాను. ఎన్టీఆర్‌గారితో ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్నారు. మీరిద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి ఆ ఈక్వేషన్ కుదిరిందా? ఏమో. కథ వల్ల మాత్రం మేం దగ్గరవ్వలేదు. మేం ఫస్ట్ నుంచి దగ్గరగానే ఉన్నాం. రాజమౌళిగారు అలా ఆలోచించరు. కథకు మేం సూట్ అయ్యాం కాబట్టి మమ్మల్ని తీసుకున్నారు. వీళ్లిద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి వీళ్లను పెడదాం అని అనుకోలేదు. కెరీర్ మొదట్లో (మగధీర) చేశారు. మళ్లీ ఇప్పుడు చారిత్రాత్మక సినిమా చేస్తున్నారు. ఎలా అనిపిస్తోంది? కెరీర్ స్టార్టింగ్‌లోనే పది సినిమాల అనుభవాన్ని నాకిచ్చారు రాజమౌళిగారు. హెవీ డ్రామా ఉన్న సినిమా అది. నాకు చాలా హెల్ప్ అయింది ఆ సినిమా. ఒకవేళ నాకు ‘మగధీర’ ఇప్పుడు ఇచ్చి ఉంటే ఇంకా బాగా చేసేవాణ్ణేమో. ‘ఆర్ఆర్ఆర్’లోనూ హెవీ డ్రామా ఉంటుంది. అద్భుతమైన అవకాశం. ఈ సినిమాలోని అల్లూరి సీతారామారాజు పాత్ర కోసం కొంచెం సన్నబడ్డాను. ప్రస్తుతం అయ్యప్ప దీక్షలో ఉన్నారు. మాల వేసుకోవడం ఎలా అలవాటైంది? నాన్నగారు ఒకసారి నన్ను శబరిమల తీసుకెళ్లారు. 14 ఏళ్లప్పుడు అనుకుంటాను. ఆ తర్వాత నాన్న మాల వేసుకున్నప్పుడు ఒంట్లో బాగోలేకపోతే, ఆయన ఇరుముడిని కుటుంబ సభ్యులు శబరిమల తీసుకెళితే చాలన్నారు. దాని వల్ల రెండోసారి వేసుకున్నాను. నా టీనేజ్‌లో గ్యాప్ ఇచ్చి ‘చిరుత’ సినిమా తర్వాత నుంచి వేసుకుంటున్నాను. ఇది పదమూడోసారి. మాకున్న అప్స్ అండ్ డౌన్స్ లైఫ్ స్టయిల్లో అయ్యప్ప మాల వేసుకుంటే బాగున్నట్లు ఉంటుంది అయ్యప్ప దీక్ష వల్ల ఆలోచనా విధానం మారుతుందా? కచ్చితంగా. మాలలో ఉన్న 40–45 రోజులు మాత్రం క్లారిటీ ఎక్కువ ఉంటుంది. ఫ్రెష్‌గా ఉంటాం. ‘మనం ఏం తింటున్నామో అదే మనం’ అనే సామెత ఉంటుంది. ప్రతి 3 నెలలకు మన బాడీ మారిపోతుంటుంది. తినేటప్పుడు ఎంత స్వచ్ఛంగా ఉంటామో ఈ 45 రోజుల్లో అంతే స్వచ్ఛంగా ఉంటాం. అది సరిగ్గా వర్ణించలేను. డీటాక్స్లాగా అనుకోండి. ఆయుర్వేదిక్ సెంటర్‌కి వెళ్ళినట్టు. మొత్తం కొత్త మనిషిలా మారిపోతాం. 24 గంటల్లో 18 గంటలు పని చేసినా మనకు అలుపు రాదు. ఏదైనా సంవత్సరం మాల వేసుకోవడానికి కుదరకపోతే? వెలితి అనిపిస్తుంది. సంక్రాంతి తర్వాత, నా పుట్టిన రోజుకి (మార్చి 27) లేకపోతే ఏడాది చివర్లో వేసుకుంటాను. ఈరోజు దీపావళి పండగ. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? చిన్నప్పటి నుంచి బాంబులు ఎక్కువ కాల్చేవాణ్ణి కాదు. భయంతో కాదు. పెద్దగా ఆసక్తి లేదు. కూర్చుని చూస్తుంటాను. అల్లు అర్జున్ బాగా కాల్చేవాడు. శిరీష్ వీళ్లంతా కాల్చుతుంటే చూస్తుంటా. నేను వాళ్లకు క్రాకర్స్ అందిస్తుంటాను. ఫ్యామిలీ అందరూ కలిసి ఒకేచోట ఉండటం చాలా ఇష్టం. దానికోసం ఎక్కువ ఎదురుచూస్తూ ఉంటాను. మీ అక్కాచెల్లెళ్లు, తమ్ముళ్లు.. ఇలా ఇల్లంతా చాలా సందడిగా ఉంటుందేమో? చాలా ఎక్కవమంది అయిపోయారు. (నవ్వుతూ). ఈసారి దీపావళి కొత్త ఇంట్లో చేసుకుంటున్నాం. మా ఇంటిని రీమోడలింగ్ చేయించాం. త్వరగా అయిపోతుందనుకున్నాం కానీ చాలా టైమ్ పట్టేసింది. దీపావళికి కొత్త ఇంట్లోకి వెళ్లిపోతున్నాం. సంక్రాంతి లోపల పూర్తిగా కొత్త ఇంట్లోకి మారిపోతాం. మీకు పిలల్లెప్పుడు? మరీ ముసలోడిలా కనిపిస్తున్నానా? నేను ఫాదర్‌లా అనిపించినప్పుడు ఆలోచిస్తా. ఈ మధ్య ఓ సందర్భంలో నిర్మాత డబ్బులిచ్చేంత వరకూ డబ్బులు అడగను. చరణ్ కూడా అలానే చేస్తున్నాడు అని మీ నాన్నగారు చెప్పారు. మీకు ఫలానా సినిమా చేస్తానని అడ్వాన్సులు తీసుకోను. సినిమా చేసేటప్పుడు నెల ఖర్చులకు మాత్రమే డబ్బు తీసుకుంటాను. అది నాకు ఎప్పటి నుంచో అలవాటు. నేనెప్పుడూ నమ్మిన ప్రొడ్యూసర్స్తోనే చేస్తాను. నమ్మిన వాళ్లతో చేస్తున్నప్పుడు వాళ్లు ఎక్కడికి వెళ్లిపోతారు? వాళ్ల ఆఫీస్‌లు, బిజినెస్‌లు అన్నీ ఇక్కడే. ఎక్కడికి పారిపోతారు. ఆ నమ్మకం నాకుంది. నేనెక్కువగా దానయ్యగారు, తిరుపతి ప్రసాద్, గీతా ఆర్ట్స్, మైత్రీ మూవీస్, నాగబాబుగారు, దత్‌గారు వీళ్ళతోనే చేశాను. నెలనెలా ఇంత జీతం అని తీసుకోవడం వల్ల వాళ్ల వడ్డీలు ఎక్కువ అవ్వవు. సేఫ్‌గా ఉంటారు. రిలీజ్‌కి మూడు రోజుల ముందు బిజినెస్ ముగుస్తుంది. అప్పుడే తీసుకుంటాను. ఈ పద్ధతిని ఎప్పుడు అలవాటూ చేసుకున్నారు? నాన్నగారి దగ్గర కూడా అడ్వాన్స్ కాన్సెప్ట్ ఎక్కువ ఉండేది కాదు. వాళ్లు బలవంతంగా ఇస్తే తప్ప. ఆయన కూడా ఆయనకు ఇష్టమైన నిర్మాతలకే చేశారు. నేను కూడా ఈ సిస్టమ్‌కు అలవాటి పడిపోయాను. – డి.జి. భవాని -
నేను సాదాసీదా అందగత్తెను!
శతృఘ్నసిన్హా కూతురంటేనే రాజభోగం. పొగిడేవాళ్లు, హారతులు పట్టేవాళ్లు, వంగి వంగి సలాములు చేసేవాళ్లు ఉంటారు. సోనాక్షి సిన్హాకు ఇవన్నీ తెలుసు. కానీ ఆమె తండ్రి ఇమేజ్‌తో కాకుండా సొంతంగా బాలీవుడ్లో ఎదగాలనుకున్నారు. అలాగే కష్టపడ్డారు. వరుసగా విజయాలందుకున్నారు. బాలీవుడ్లో క్రేజీయెస్ట్ హీరోయిన్గా కితాబులందుకుంటున్న సోనాక్షీ ఇటీవల హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాల్లోకి వెళ్తే... నాలుగేళ్లలో పన్నెండు సినిమాలు... చాలా కష్టపడుతున్నట్లున్నారు? అవునండి... చాలా. కానీ, ఎంజాయ్ చేస్తున్నాను. నా సంపాదనతోనే ఇల్లు గడవాలనే పరిస్థితి ఉంటే, అప్పుడు ఒత్తిడి ఉండేది. ఏ సినిమా పడితే అది చేసేసేదాన్ని. ఆర్థికంగా బాగుండటంతో, నా ఇష్టప్రకారం మంచి సినిమాలు ఎంపిక చేసుకుంటున్నా. లక్కీగా అవి హిట్ అవుతున్నాయి. విజయాల్లో ఉన్న తారలకు వద్దన్నా అవకాశాలు వచ్చేస్తాయ్ కదా. అలా నాకు వరుసగా అవకాశాలొస్తున్నాయి. సో.. మీ జీవితం వడ్డించిన విస్తరి అన్నమాట... అవునండి. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాల్ని. కారు కొనాలనీ, సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలనీ తాపత్రయపడాల్సిన అవసరంలేదు. మా అమ్మా, నాన్న నాకు అన్నీ సమకూర్చారు. అయినప్పటికీ క్షణం తీరిక లేకుండా నాలుగేళ్లల్లో పన్నెండు సినిమాలు చేశానంటే వృత్తిపట్ల నాకున్న ప్రేమ, గౌరవాలే కారణం. ఉదయం నిద్ర లేచి, టంచనుగా షూటింగ్ లొకేషన్‌కి వెళ్లడం, హాయిగా పని చేసుకుని అలసిపోయి ఇంటికి రావడం నాకిష్టం. గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన మీకు ఆర్క్ లైట్ల హీట్, అన్టైమ్ షూటింగ్స్ ఇబ్బందిగా అనిపించడంలేదా? గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన మాట నిజమే. కానీ, ఆ విషయాన్ని నెత్తికెక్కించుకోలేదు. స్కూల్, కాలేజీలకు రిక్షా, ట్రైన్లో వెళ్లేదాన్ని. అన్ని సౌకర్యాలు సమకూరుస్తూనే, సాదాసీదాగా బతకడం కూడా మా అమ్మానాన్న నేర్పించారు. అందుకే, ఇవాళ ఎండనకా వాననకా షూటింగ్స్ చేయగలుగుతున్నాను. ఎండలో ఉన్నప్పుడు నేనొకటే అనుకుంటా... ‘మనం ఒక్కళ్లే కాదు.. మనతో పాటు లొకేషన్లో రెండు వందల మంది ఉన్నారు. వాళ్లకి కష్టంగా అనిపించనిది మనకెందుకు అనిపించాలి’ అని. పైగా, హీరోయిన్ని కాబట్టి గ్లామర్ పాడవ్వకుండా గొడుగు పట్టేవాళ్లు ఉంటారు. షూటింగ్ విరామంలో సేద తీరడానికి కార్వాన్ ఉంటుంది. మిగతావాళ్లకి అవి కూడా ఉండవు కదా. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసిన మీరు విడిగా సింపుల్‌గా ఉంటారేమో? జీన్స్, టీ-షర్ట్స్ నాకు సౌకర్యవంతంగా అనిపిస్తాయి. అందుకే, ఎక్కువగా వాటినే ధరిస్తాను. కానీ, హీరోయిన్లంటే హంగామాగా ఉండాలి. మామూలుగా కనిపిస్తే ‘ఓస్ ఇంతేనా’ అనేస్తారు. అలా అనిపించుకోవడం ఇష్టం లేక ఫంక్షన్స్‌కి, పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు కొంచెం స్టయిలిష్‌గా డ్రెస్ చేసుకుంటాను. మీరు గొప్ప అందగత్తె కాదని ఎవరైనా అంటే.. మీ స్పందన? ఒప్పేసుకుంటా. నేను సాదాసీదా అందగత్తెని. పైగా, ఇప్పుడున్న చాలామంది కథానాయికల్లా ఉండను. పైగా, కొంచెం బొద్దుగా ఉంటాను. అయినా, ఫర్వాలేదు. మనం చాలా బాగున్నామనే ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్లిపోతుంటా. ఆ మాత్రం ఫీలింగ్ లేకపోతే నలుగురిలో నెగ్గుకు రావడం కష్టం. ఈ ఆత్మవిశ్వాసం మీకు అమ్మా, నాన్నల్లోఎవరి దగ్గర్నుంచి వచ్చింది? మా నాన్నగారు. ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్ని సైతం ఆయన ఎంతో ఆత్మవిశ్వాసంతో అధిగమించడం స్వయంగా చూశాను. ఆ తండ్రికి కూతురిగా నేనలా లేకపోతే ఎలా? పైగా నేను బాగా చదువుకున్నాను. చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పగలను. దేని గురించైనా నిర్భయంగా మాట్లాడగలను. జీవితం సాఫీగా సాగిపోవడానికి ఈ లక్షణాలుంటే చాలు... అందం ప్రాధాన్యం కాదు. మరి.. ‘ఈ బ్లీచ్ వాడితే మీ అందం రెట్టింపు అవుతుంది’ అంటూ ఓ వాణిజ్య ప్రకటనలో నటించడానికి కారణం.. మీరు మేని ఛాయకు ప్రాధాన్యమిస్తారా? అస్సలు ఇవ్వను. ఆ బ్లీచ్ ఏ రంగువాళ్లయినా వాడొచ్చు. ఆ ఉత్పత్తిదారులు ఆ విషయం చెప్పిన తర్వాతే ఒప్పుకున్నాను. ఎందుకంటే, మేని ఛాయ ఏదైతే ఏంటి? అనుకునే వ్యక్తిని నేను. తెలుపు రంగు గొప్ప అనీ, నలుపు తక్కువ అనీ చరిత్రలో చెప్పారా? నేను తెల్లగా ఉన్నానంటే అందులో నా గొప్పతనం ఏముంటుంది? అది దేవుడిచ్చిన రంగు. అందుకే అంటున్నా. ఒంటి రంగుదేముంది? మనసుకి రంగు అంటూ ఉంటే అది తెల్లగా, స్వచ్ఛంగా ఉండాలని. నేటి తరం నాయికల్లా మీరు సన్నగా ఉండరు.. ఇకపై కూడా ఇలానే ఉండాలనుకుంటున్నారా? ఇలానే ఉంటాను. సన్నగా ఉండటం నాకు ప్రాధాన్యం కాదు.. ఆరోగ్యంగా ఉండటం నాకు ముఖ్యం. సినిమాల్లోకి రాకముందు చాలా లావుగా ఉండేదాన్ని. అప్పుడు 30 కేజీలు తగ్గాను. ఇక తగ్గను. అయినా ఇప్పటివరకు నేను చేసిన పాత్రలకు బరువు తగ్గాలనే నిర్భంద పరిస్థితి ఏర్పడలేదు. ఒకవేళ జీరో సైజ్ రోల్‌కి అవకాశం వస్తే..? అందరి శరీరం జీరో సైజ్‌కి నప్పదు. ముఖ్యంగా నా శరీరాకృతికి జీర్ సైజ్ అస్సలు బాగుండదు. నా ఎత్తు ఐదు అడుగుల ఎనిమిది అంగుళాలు. ఎముక పుష్టి ఎక్కువ. భుజాలు బ్రాడ్‌గా ఉంటాయి. నాకు తెలిసి ఇలాంటి ఫిజిక్ ఉన్న ఎవరికీ జీరో సైజ్ నప్పదనుకుంటున్నాను. అందుకే ఒకవేళ పాత్ర డిమాండ్ చేస్తే, కొంచెం సన్నబడతాను కానీ, సున్నా సైజ్‌కి దూరంగానే ఉంటాను. మీరు సంప్రదాయబద్ధమైన భారతీయ వనిత పాత్రల్లో అద్భుతంగా ఉంటారు. మోడ్రన్ గాళ్ కారెక్టర్స్ కన్నా ఈ తరహా పాత్రలకే నప్పడం ప్లస్ అనుకుంటున్నారా...? కచ్చితంగా. ఎందుకంటే మన దేశంలో ఏ రాష్ట్రానికి సంబంధించిన అమ్మాయిగా అయినా ఒదిగిపోగలుగుతాను. ఇటు సౌత్ అటు నార్త్.. దేన్నయినా కవర్ చేసేస్తాను (నవ్వుతూ). అందరూ ఇలా ఇమిడిపోలేరు. భారతీయ వనితలా అగుపించడం నా బలం అని నేననుకుంటున్నాను. రజనీకాంత్, సల్మాన్ ఖాన్, అక్షయ్‌కుమార్, అజయ్ దేవగన్... ఇలా సీనియర్ హీరోల సరసనే ఎక్కువగా జతకడుతున్నట్లనిపిస్తోంది? ఈ మాట నాతో చాలామంది అన్నారు. అయితే, నేను రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్, ఇమ్రాన్ ఖాన్ లాంటి యువ హీరోల సరసన కూడా నటించాను. అది పెద్దగా ఎలివేట్ కాలేదు. సీనియర్ హీరోలంటే సోనాక్షీ ఉందిగా అన్నట్లుగా అయిపోయింది. కానీ, యువహీరోల సరసన కూడా నటిస్తున్నాను. ఇకనుంచైనా అందరూ అది గ్రహిస్తే బాగుంటుంది. ముందు ప్రభుదేవా.. ఆ తర్వాత షాహిద్ కపూర్, అర్జున్ కపూర్‌తో ఎఫైర్ అంటూ మీ గురించి వచ్చిన వార్తలకు ఏమంటారు? నవ్వుకుంటాను. నేనెవరితో సినిమా చేస్తే వాళ్లతో ఎఫైర్ సాగిస్తున్నట్లా? నిన్న మొన్నటి వరకు షాహిద్‌తో లింక్ పెట్టారు. ఆ తర్వాత అర్జున్ కపూర్‌తో కలిసి ఓ సినిమా థియేటర్లో కనిపించాను. దాంతో షాహిద్‌ని పక్కన పెట్టేసి, అర్జున్‌తో లింక్ పెట్టారు. ఫ్రెండ్‌తో సినిమాకెళితే తప్పా? మన దేశంలో ఆడ, మగ స్నేహితులు కలిసి సినిమాలకెళ్లడం అనేది పెద్ద విషయమే కదా? అది విచారించదగ్గ విషయం. మన ఆలోచనా పరిధి ఎందుకు పెరగడంలేదో అర్థం కాలేదు. ఆడ, మగ అనే తేడా మన శరీరీ భాగాల వరకే. మిగతా విషయాల్లో అందరూ ఒకటే. మనందరం ‘మనుషులం’. అంతే. మనసులో ఏమీ లేనంతవరకు ఒకే గదిలో కలిసి ఉన్నా తప్పు లేదు. మురుగదాస్ దర్శకత్వంలో ఓ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ చేయబోతున్నా. ఇది యాక్షన్ మూవీ. ఫైట్స్ కూడా చేస్తాను. దీనికోసం శిక్షణ కూడా తీసుకున్నాను. నటిగా నాలో మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రం ఇది. ‘లింగా’ చిత్రంతో తెలుగు తెరపై కనిపించాను. మంచి కథ దొరికితే తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయడానికి నేను రెడీ. - డి.జి. భవాని