నేను సాదాసీదా అందగత్తెను! | Bollywood Actress sonakshi sinha Exclusive Intervie | Sakshi
Sakshi News home page

నేను సాదాసీదా అందగత్తెను!

Published Mon, Feb 2 2015 10:47 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

నేను సాదాసీదా అందగత్తెను! - Sakshi

నేను సాదాసీదా అందగత్తెను!

శతృఘ్నసిన్హా కూతురంటేనే రాజభోగం. పొగిడేవాళ్లు, హారతులు పట్టేవాళ్లు, వంగి వంగి సలాములు చేసేవాళ్లు ఉంటారు. సోనాక్షి సిన్హాకు ఇవన్నీ తెలుసు. కానీ ఆమె తండ్రి ఇమేజ్‌తో కాకుండా సొంతంగా బాలీవుడ్‌లో ఎదగాలనుకున్నారు. అలాగే కష్టపడ్డారు. వరుసగా విజయాలందుకున్నారు. బాలీవుడ్‌లో క్రేజీయెస్ట్ హీరోయిన్‌గా కితాబులందుకుంటున్న సోనాక్షీ ఇటీవల హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాల్లోకి వెళ్తే...
 
 
 నాలుగేళ్లలో పన్నెండు సినిమాలు... చాలా కష్టపడుతున్నట్లున్నారు?
 అవునండి... చాలా. కానీ, ఎంజాయ్ చేస్తున్నాను. నా సంపాదనతోనే ఇల్లు గడవాలనే పరిస్థితి ఉంటే, అప్పుడు ఒత్తిడి ఉండేది. ఏ సినిమా పడితే అది చేసేసేదాన్ని. ఆర్థికంగా బాగుండటంతో, నా ఇష్టప్రకారం మంచి సినిమాలు ఎంపిక చేసుకుంటున్నా. లక్కీగా అవి హిట్ అవుతున్నాయి. విజయాల్లో ఉన్న తారలకు వద్దన్నా అవకాశాలు వచ్చేస్తాయ్ కదా. అలా నాకు వరుసగా అవకాశాలొస్తున్నాయి.
 
 సో.. మీ జీవితం వడ్డించిన విస్తరి అన్నమాట...
 అవునండి. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాల్ని.  కారు కొనాలనీ, సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలనీ తాపత్రయపడాల్సిన అవసరంలేదు. మా అమ్మా, నాన్న నాకు అన్నీ సమకూర్చారు. అయినప్పటికీ క్షణం తీరిక లేకుండా నాలుగేళ్లల్లో పన్నెండు సినిమాలు చేశానంటే వృత్తిపట్ల నాకున్న ప్రేమ, గౌరవాలే కారణం. ఉదయం నిద్ర లేచి, టంచనుగా షూటింగ్ లొకేషన్‌కి వెళ్లడం, హాయిగా పని చేసుకుని అలసిపోయి ఇంటికి రావడం నాకిష్టం.
 
 గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన మీకు ఆర్క్ లైట్ల హీట్, అన్‌టైమ్ షూటింగ్స్ ఇబ్బందిగా అనిపించడంలేదా?
 గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన మాట నిజమే. కానీ, ఆ విషయాన్ని నెత్తికెక్కించుకోలేదు. స్కూల్, కాలేజీలకు రిక్షా, ట్రైన్‌లో వెళ్లేదాన్ని. అన్ని సౌకర్యాలు సమకూరుస్తూనే, సాదాసీదాగా బతకడం కూడా మా అమ్మానాన్న నేర్పించారు. అందుకే, ఇవాళ ఎండనకా వాననకా షూటింగ్స్ చేయగలుగుతున్నాను. ఎండలో ఉన్నప్పుడు నేనొకటే అనుకుంటా... ‘మనం ఒక్కళ్లే కాదు.. మనతో పాటు లొకేషన్లో రెండు వందల మంది ఉన్నారు. వాళ్లకి కష్టంగా అనిపించనిది మనకెందుకు అనిపించాలి’ అని. పైగా, హీరోయిన్‌ని కాబట్టి గ్లామర్ పాడవ్వకుండా గొడుగు పట్టేవాళ్లు ఉంటారు. షూటింగ్ విరామంలో సేద తీరడానికి కార్‌వాన్ ఉంటుంది. మిగతావాళ్లకి అవి కూడా ఉండవు కదా.
 
 ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసిన మీరు విడిగా సింపుల్‌గా ఉంటారేమో?
 జీన్స్, టీ-షర్ట్స్ నాకు సౌకర్యవంతంగా అనిపిస్తాయి. అందుకే, ఎక్కువగా వాటినే ధరిస్తాను. కానీ, హీరోయిన్లంటే హంగామాగా ఉండాలి. మామూలుగా కనిపిస్తే ‘ఓస్ ఇంతేనా’ అనేస్తారు. అలా అనిపించుకోవడం ఇష్టం లేక ఫంక్షన్స్‌కి, పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు కొంచెం స్టయిలిష్‌గా డ్రెస్ చేసుకుంటాను.
 
 మీరు గొప్ప అందగత్తె కాదని ఎవరైనా అంటే.. మీ స్పందన?
 ఒప్పేసుకుంటా. నేను సాదాసీదా అందగత్తెని. పైగా, ఇప్పుడున్న చాలామంది కథానాయికల్లా ఉండను. పైగా, కొంచెం బొద్దుగా ఉంటాను. అయినా, ఫర్వాలేదు. మనం చాలా బాగున్నామనే ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్లిపోతుంటా. ఆ మాత్రం ఫీలింగ్ లేకపోతే నలుగురిలో నెగ్గుకు రావడం కష్టం.
 
 ఈ ఆత్మవిశ్వాసం మీకు అమ్మా, నాన్నల్లోఎవరి దగ్గర్నుంచి వచ్చింది?
 మా నాన్నగారు. ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్ని సైతం ఆయన ఎంతో ఆత్మవిశ్వాసంతో అధిగమించడం స్వయంగా చూశాను. ఆ తండ్రికి కూతురిగా నేనలా లేకపోతే ఎలా? పైగా నేను బాగా చదువుకున్నాను. చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పగలను. దేని గురించైనా నిర్భయంగా మాట్లాడగలను. జీవితం సాఫీగా సాగిపోవడానికి ఈ లక్షణాలుంటే చాలు... అందం ప్రాధాన్యం కాదు.
 
 మరి.. ‘ఈ బ్లీచ్ వాడితే మీ అందం రెట్టింపు అవుతుంది’ అంటూ ఓ వాణిజ్య ప్రకటనలో నటించడానికి కారణం.. మీరు మేని ఛాయకు ప్రాధాన్యమిస్తారా?
 అస్సలు ఇవ్వను. ఆ బ్లీచ్ ఏ రంగువాళ్లయినా వాడొచ్చు. ఆ ఉత్పత్తిదారులు ఆ విషయం చెప్పిన తర్వాతే ఒప్పుకున్నాను. ఎందుకంటే, మేని ఛాయ ఏదైతే ఏంటి? అనుకునే వ్యక్తిని నేను. తెలుపు రంగు గొప్ప అనీ, నలుపు తక్కువ అనీ చరిత్రలో చెప్పారా? నేను తెల్లగా ఉన్నానంటే అందులో నా గొప్పతనం ఏముంటుంది? అది దేవుడిచ్చిన రంగు. అందుకే అంటున్నా. ఒంటి రంగుదేముంది? మనసుకి రంగు అంటూ ఉంటే అది తెల్లగా, స్వచ్ఛంగా ఉండాలని.
 
 నేటి తరం నాయికల్లా మీరు సన్నగా ఉండరు.. ఇకపై కూడా ఇలానే ఉండాలనుకుంటున్నారా?
 ఇలానే ఉంటాను. సన్నగా ఉండటం నాకు ప్రాధాన్యం కాదు.. ఆరోగ్యంగా ఉండటం నాకు ముఖ్యం. సినిమాల్లోకి రాకముందు చాలా లావుగా ఉండేదాన్ని. అప్పుడు 30 కేజీలు తగ్గాను. ఇక తగ్గను. అయినా ఇప్పటివరకు నేను చేసిన పాత్రలకు బరువు తగ్గాలనే నిర్భంద పరిస్థితి ఏర్పడలేదు.
 
 ఒకవేళ జీరో సైజ్ రోల్‌కి అవకాశం వస్తే..?
 అందరి శరీరం జీరో సైజ్‌కి నప్పదు. ముఖ్యంగా నా శరీరాకృతికి జీర్ సైజ్ అస్సలు బాగుండదు. నా ఎత్తు ఐదు అడుగుల ఎనిమిది అంగుళాలు. ఎముక పుష్టి ఎక్కువ. భుజాలు బ్రాడ్‌గా ఉంటాయి. నాకు తెలిసి ఇలాంటి ఫిజిక్ ఉన్న ఎవరికీ జీరో సైజ్ నప్పదనుకుంటున్నాను. అందుకే ఒకవేళ పాత్ర డిమాండ్ చేస్తే, కొంచెం సన్నబడతాను కానీ, సున్నా సైజ్‌కి దూరంగానే ఉంటాను.
 
 మీరు సంప్రదాయబద్ధమైన భారతీయ వనిత పాత్రల్లో అద్భుతంగా ఉంటారు. మోడ్రన్ గాళ్ కారెక్టర్స్ కన్నా ఈ తరహా పాత్రలకే నప్పడం ప్లస్ అనుకుంటున్నారా...?
 కచ్చితంగా. ఎందుకంటే మన దేశంలో ఏ రాష్ట్రానికి సంబంధించిన అమ్మాయిగా అయినా ఒదిగిపోగలుగుతాను. ఇటు సౌత్ అటు నార్త్.. దేన్నయినా కవర్ చేసేస్తాను (నవ్వుతూ). అందరూ ఇలా ఇమిడిపోలేరు. భారతీయ వనితలా అగుపించడం నా బలం అని నేననుకుంటున్నాను.
 
 రజనీకాంత్, సల్మాన్ ఖాన్, అక్షయ్‌కుమార్, అజయ్ దేవగన్... ఇలా సీనియర్ హీరోల సరసనే ఎక్కువగా జతకడుతున్నట్లనిపిస్తోంది?
 ఈ మాట నాతో చాలామంది అన్నారు. అయితే, నేను రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్, ఇమ్రాన్ ఖాన్ లాంటి యువ హీరోల సరసన కూడా నటించాను. అది పెద్దగా ఎలివేట్ కాలేదు. సీనియర్ హీరోలంటే సోనాక్షీ ఉందిగా అన్నట్లుగా అయిపోయింది. కానీ, యువహీరోల సరసన కూడా నటిస్తున్నాను. ఇకనుంచైనా అందరూ అది గ్రహిస్తే బాగుంటుంది.
 
 ముందు ప్రభుదేవా.. ఆ తర్వాత షాహిద్ కపూర్, అర్జున్ కపూర్‌తో ఎఫైర్ అంటూ మీ గురించి వచ్చిన వార్తలకు ఏమంటారు?
 నవ్వుకుంటాను. నేనెవరితో సినిమా చేస్తే వాళ్లతో ఎఫైర్ సాగిస్తున్నట్లా? నిన్న మొన్నటి వరకు షాహిద్‌తో లింక్ పెట్టారు. ఆ తర్వాత అర్జున్ కపూర్‌తో కలిసి ఓ సినిమా థియేటర్లో కనిపించాను. దాంతో షాహిద్‌ని పక్కన పెట్టేసి, అర్జున్‌తో లింక్ పెట్టారు. ఫ్రెండ్‌తో సినిమాకెళితే తప్పా?
 
 మన దేశంలో ఆడ, మగ స్నేహితులు కలిసి సినిమాలకెళ్లడం అనేది పెద్ద విషయమే కదా?
 అది విచారించదగ్గ విషయం. మన ఆలోచనా పరిధి ఎందుకు పెరగడంలేదో అర్థం కాలేదు. ఆడ, మగ అనే తేడా మన శరీరీ భాగాల వరకే. మిగతా విషయాల్లో అందరూ ఒకటే. మనందరం ‘మనుషులం’. అంతే. మనసులో ఏమీ లేనంతవరకు ఒకే గదిలో కలిసి ఉన్నా తప్పు లేదు.
 
  మురుగదాస్ దర్శకత్వంలో ఓ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ చేయబోతున్నా. ఇది యాక్షన్  మూవీ. ఫైట్స్ కూడా చేస్తాను. దీనికోసం శిక్షణ కూడా తీసుకున్నాను. నటిగా నాలో మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రం ఇది.
 
  ‘లింగా’ చిత్రంతో తెలుగు తెరపై కనిపించాను. మంచి కథ దొరికితే తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయడానికి నేను రెడీ.
 
 - డి.జి. భవాని
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement