ఈ రోజు కొత్తింట్లోకి షిఫ్ట్ అవుతున్నారు చెర్రీ అండ్ ఫ్యామిలీ! కొత్తిల్లు అంటే పూర్తిగా కొత్త అని కాదు. ఫ్యామిలీ అంటే చెర్రీ, ఉపాసన మాత్రమే కాదు. మొత్తం మెగా ఫ్యామిలీ.. పెద్ద సెలబ్రేషన్‌తో.. రీమోడలింగ్ చేసిన ఇంట్లోకి వచ్చేస్తోంది. మతాబుల్లాంటి పిల్లలు.. స్టార్స్‌లా వెలుగుతున్న పెద్దలు కలిసి సాయంత్రం దీపావళిని జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా.. ‘సాక్షి’... రామ్‌చరణ్‌ని కలిసింది. కొత్తింట్లోకి వెళ్లడానికి ముందే చెర్రీనిమీ ఇంటికి తీసుకొచ్చింది! హ్యాపీ దీపావళి.
‘సైరా’ నిర్మాతగా మీ అనుభవాలను షేర్ చేసుకోండి.
నిర్మాత అనే ట్యాగ్‌ను నేనింకా యాక్సెప్ట్ చేయలేదు. ‘సైరా’ సినిమాను నేను నిర్మాతగా చేయలేదు. నాన్నగారి ఆలోచనకు చిన్న ఎక్స్‌టెన్షనే నిర్మాత అనే పాత్ర. ఆయన కలకి ఎక్స్‌టెన్షన్.
కానీ ‘సైరా’ టీమ్‌లో పని చేసిన వాళ్లందరూ ‘చరణ్ బెస్ట్ ప్రొడ్యూసర్’ అని చెబుతున్నారు..
ఈ సినిమా ప్రీ–ప్రొడక్షన్, రెండు ఎపిసోడ్లకే(సుమారు 20 నిమిషాల నిడివి) 75 కోట్లు అయిపోయింది. వేరేవాళ్లైతే సినిమాను ఆపేస్తారు. నేను కూడా ఆపాలనే చూశాను. ఆపడం వల్ల వచ్చే నష్టమేంటి? కొనసాగించడంలో ప్లస్ ఏంటి? అని చూసుకున్నాం. ‘చిరంజీవిగారి సినిమా బడ్జెట్ సమస్యల వల్ల ఆగిపోయింది’ అనే మాట నేను పడకూడదు. ఆయన 30 ఏళ్ల కెరీర్‌లో ఇదో బ్లాక్‌మార్క్‌లా ఉండిపోతుంది. ఈ సినిమాకు లాభాలు రాకపోయినా నేను నిర్మాతగా ఫెయిల్ అవ్వను కానీ ఈ సినిమా ఆగిపోతే కొడుకుగా, మనిషిగా, నిర్మాతగా నేను ఫెయిల్ అయినట్టే. అందుకే దిగిపోయాం కాబట్టి చేసేద్దాం అని, పూర్తి చేశాం. నేనీ సినిమా లాభాల కోసం చేయలేదు అని చాలా సందర్భాల్లో చెప్పాను. నాన్న కోసమే ఈ సినిమా చేశాను. ఇక ముందు కూడా చేస్తాను. నిర్మాతంటే అనుకున్నదాంట్లో చేయాలి. మేం అనుకున్నదానికంటే లిమిట్ దాటేశాం. అందుకే నన్ను నేను పూర్తి స్థాయి నిర్మాతగా చూసుకోను.
నాన్నగారి డ్రీమ్ సినిమా (సైరా) తీయాలని మీరెప్పుడనుకున్నారు?
‘ఖైదీ నంబర్ 150’ తర్వాతే. నెక్ట్స్ ఏం సినిమా చేయాలి? అని ఆలోచిస్తూ ఉంటే ‘ఒక కథ ఉందిరా అని ఆయన చెప్పారు, ఆ కథంతా విన్న తర్వాత చేయాలనుకున్నాను. ఏ నిర్మాతయినా నాన్నగారితో 7–8 నెలల్లో సినిమా తీసి ఏ పండగకో రిలీజ్ చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటారు. అటూ ఇటు అయినా ఫర్వాలేదు అనుకోవాలి. అంత ప్యాషనేట్‌గా ఫ్యామిలీ వాళ్లే తీయగలరు. అప్పట్లో అల్లు అరవింద్‌గారు నాతో ‘మగధీర’ సినిమాను చాలా ప్యాషనేట్‌గా నిర్మించారు. అందుకే ‘సైరా’ని నేను ప్యాషనేట్‌గా తీయాలనుకున్నాను.
‘నా సినిమా కలెక్షన్లను ఇక మీదట సినిమా పోస్టర్స్ మీద వేయను’ అని ఆ మధ్య అన్నారు. ఎందుకా నిర్ణయం?
మంచిదే కదా. మేం చెప్పకపోయినా మార్కెట్, ట్రేడ్‌లో తెలుస్తూనే ఉంటుంది కదా. వెబ్‌సైట్లు ఉంటాయి. నేనొక్కడినే మాట్లాడకపోవడం వల్ల ఆగుతుందా? అఫీషియల్‌గా పోస్టర్స్ మీద ఉండవంతే. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడైనా సినిమా పోస్టర్స్‌లో ఆర్టిస్టులను, టైటిల్స్ మాత్రమే చూసాం. కేవలం మన ఇండియాలోనే పోస్టర్స్ మీద నంబర్స్ (సినిమా కలెక్షన్లు) వేస్తుంటాం. అది బిజినెస్‌కి సంబంధించినది. ఆర్ట్‌కి, ఆర్టిస్ట్‌కి సంబంధించినది కాదు. ‘రంగస్థలం’ సమయంలో మా అభిమానులకు, మహేశ్ అభిమానులకు సోషల్ మీడియాలో కలెక్షన్ల విషయంలో చిన్న గొడవలు ఏర్పడ్డాయి. నిజమైన నంబర్స్ ఏంటో మాకే తెలియదు. నిర్మాతలు ఇచ్చే నంబర్స్ కరెక్టా, ఫ్యాన్స్ వేసే నంబర్స్ కరెక్టా అనేది అర్థం కావడం లేదు. మంచి సినిమా తీశాం. హ్యాపీగా ఉన్నాం. మహేశ్ మంచి సినిమాలు తీస్తున్నాడు. అతను హ్యాపీగా ఉన్నాడు. ఇది కట్ చేయాలని అనుకున్నాను. పోస్టర్స్ మీద కలెక్షన్లను వేయడం ఆపేద్దాం అని నిర్ణయం తీసుకున్నాను.
ఇండస్ట్రీలో నంబర్ గేమ్ కూడా కీలకమే కదా.
అవును. కానీ పోస్టర్స్ మీద కలెక్షన్లు రావడం కాదు కదా? మేం కష్టపడిందంతా కొంతమంది అభిమానులు ఓవర్ షాడో చేసేసి, మా ఎఫర్ట్‌ని మించిపోయి గొడవలు ఎక్కువవుతున్నాయి. నేను అందరితో బావుంటాను. ఫ్యాన్ వార్స్ వల్ల మా మధ్య ఉన్న ఆ అనుబంధం మిస్ అవుతుందేమో అనిపిస్తుంది. అందుకే సినిమా చేశామా.. అక్కడితో చాప్టర్ క్లోజ్ అయిపోవాలి. ‘మా ఫ్యాన్స్ కోసం పోస్టర్ వేయండి’ అని నేను నా నిర్మాతను రెచ్చగొడితే ఎంతసేపు?
ఈ బోర్డ్‌లో ‘చెర్రీ మామ, అన్నయ్యా యూ ఆర్ బెస్ట్’ అని ఉంది.
పిల్లలు (చెల్లెళ్లు సుస్మిత, శ్రీజల కూతుళ్లు, బాబాయి నాగబాబు కూతురు నిహారిక, పవన్ కల్యాణ్ కుమార్తె ఆద్య) అందరూ వస్తారు. బోర్డ్ మీద వాళ్లకు తోచింది రాస్తుంటారు. చిన్న పిల్లలు కదా.. వాళ్లకు వచ్చిందే బెస్ట్, గుడ్ అనే పదాలు. నీహా (నిహారిక) ఏవేవో రాస్తుంటుంది (నవ్వుతూ). ‘నిన్ను డైరెక్ట్ చేయాలనుంది’ అని రాసింది ఆద్యా. పవన్ కల్యాణ్ గారి అమ్మాయి. తనకి డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్. నన్ను హీరోగా పెట్టి సినిమా చేస్తానంటుంది. నేను ఆఫీస్‌లో లేనప్పుడు వస్తే. ఆ రోజుకి వాళ్లకి ఏది అనిపిస్తే అది రాస్తారు. నేను వచ్చినప్పుడు చూస్తాను.
ఎన్టీఆర్‌గారితో ‘ఆర్‌ఆర్‌ఆర్’ చేస్తున్నారు. మీరిద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి ఆ ఈక్వేషన్ కుదిరిందా?
ఏమో. కథ వల్ల మాత్రం మేం దగ్గరవ్వలేదు. మేం ఫస్ట్ నుంచి దగ్గరగానే ఉన్నాం. రాజమౌళిగారు అలా ఆలోచించరు. కథకు మేం సూట్ అయ్యాం కాబట్టి మమ్మల్ని తీసుకున్నారు. వీళ్లిద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి వీళ్లను పెడదాం అని అనుకోలేదు.
కెరీర్ మొదట్లో (మగధీర) చేశారు. మళ్లీ ఇప్పుడు చారిత్రాత్మక సినిమా చేస్తున్నారు. ఎలా అనిపిస్తోంది?
కెరీర్ స్టార్టింగ్‌లోనే పది సినిమాల అనుభవాన్ని నాకిచ్చారు రాజమౌళిగారు. హెవీ డ్రామా ఉన్న సినిమా అది. నాకు చాలా హెల్ప్ అయింది ఆ సినిమా. ఒకవేళ నాకు ‘మగధీర’ ఇప్పుడు ఇచ్చి ఉంటే ఇంకా బాగా చేసేవాణ్ణేమో. ‘ఆర్‌ఆర్‌ఆర్’లోనూ హెవీ డ్రామా ఉంటుంది. అద్భుతమైన అవకాశం. ఈ సినిమాలోని అల్లూరి సీతారామారాజు పాత్ర కోసం కొంచెం సన్నబడ్డాను.
ప్రస్తుతం అయ్యప్ప దీక్షలో ఉన్నారు. మాల వేసుకోవడం ఎలా అలవాటైంది?
నాన్నగారు ఒకసారి నన్ను శబరిమల తీసుకెళ్లారు. 14 ఏళ్లప్పుడు అనుకుంటాను. ఆ తర్వాత నాన్న మాల వేసుకున్నప్పుడు ఒంట్లో బాగోలేకపోతే, ఆయన ఇరుముడిని కుటుంబ సభ్యులు శబరిమల తీసుకెళితే చాలన్నారు. దాని వల్ల రెండోసారి వేసుకున్నాను. నా టీనేజ్‌లో గ్యాప్ ఇచ్చి ‘చిరుత’ సినిమా తర్వాత నుంచి వేసుకుంటున్నాను. ఇది పదమూడోసారి. మాకున్న అప్స్ అండ్ డౌన్స్ లైఫ్ స్టయిల్‌లో అయ్యప్ప మాల వేసుకుంటే బాగున్నట్లు ఉంటుంది
అయ్యప్ప దీక్ష వల్ల ఆలోచనా విధానం మారుతుందా?
కచ్చితంగా. మాలలో ఉన్న 40–45 రోజులు మాత్రం క్లారిటీ ఎక్కువ ఉంటుంది. ఫ్రెష్‌గా ఉంటాం. ‘మనం ఏం తింటున్నామో అదే మనం’ అనే సామెత ఉంటుంది. ప్రతి 3 నెలలకు మన బాడీ మారిపోతుంటుంది. తినేటప్పుడు ఎంత స్వచ్ఛంగా ఉంటామో ఈ 45 రోజుల్లో అంతే స్వచ్ఛంగా ఉంటాం. అది సరిగ్గా వర్ణించలేను. డీటాక్స్‌లాగా అనుకోండి. ఆయుర్వేదిక్ సెంటర్‌కి వెళ్ళినట్టు. మొత్తం కొత్త మనిషిలా మారిపోతాం. 24 గంటల్లో 18 గంటలు పని చేసినా మనకు అలుపు రాదు.
ఏదైనా సంవత్సరం మాల వేసుకోవడానికి కుదరకపోతే?
వెలితి అనిపిస్తుంది. సంక్రాంతి తర్వాత, నా పుట్టిన రోజుకి (మార్చి 27) లేకపోతే ఏడాది చివర్లో వేసుకుంటాను.
ఈరోజు దీపావళి పండగ. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు?
చిన్నప్పటి నుంచి బాంబులు ఎక్కువ కాల్చేవాణ్ణి కాదు. భయంతో కాదు. పెద్దగా ఆసక్తి లేదు. కూర్చుని చూస్తుంటాను. అల్లు అర్జున్ బాగా కాల్చేవాడు. శిరీష్ వీళ్లంతా కాల్చుతుంటే చూస్తుంటా. నేను వాళ్లకు క్రాకర్స్ అందిస్తుంటాను. ఫ్యామిలీ అందరూ కలిసి ఒకేచోట ఉండటం చాలా ఇష్టం. దానికోసం ఎక్కువ ఎదురుచూస్తూ ఉంటాను.
మీ అక్కాచెల్లెళ్లు, తమ్ముళ్లు.. ఇలా ఇల్లంతా చాలా సందడిగా ఉంటుందేమో?
చాలా ఎక్కవమంది అయిపోయారు. (నవ్వుతూ). ఈసారి దీపావళి కొత్త ఇంట్లో చేసుకుంటున్నాం. మా ఇంటిని రీమోడలింగ్ చేయించాం. త్వరగా అయిపోతుందనుకున్నాం కానీ చాలా టైమ్ పట్టేసింది. దీపావళికి కొత్త ఇంట్లోకి వెళ్లిపోతున్నాం. సంక్రాంతి లోపల పూర్తిగా కొత్త ఇంట్లోకి మారిపోతాం.
మీకు పిలల్లెప్పుడు?
మరీ ముసలోడిలా కనిపిస్తున్నానా? నేను ఫాదర్‌లా అనిపించినప్పుడు ఆలోచిస్తా.
ఈ మధ్య ఓ సందర్భంలో నిర్మాత డబ్బులిచ్చేంత వరకూ డబ్బులు అడగను. చరణ్ కూడా అలానే చేస్తున్నాడు అని మీ నాన్నగారు చెప్పారు.
మీకు ఫలానా సినిమా చేస్తానని అడ్వాన్సులు తీసుకోను. సినిమా చేసేటప్పుడు నెల ఖర్చులకు మాత్రమే డబ్బు తీసుకుంటాను. అది నాకు ఎప్పటి నుంచో అలవాటు. నేనెప్పుడూ నమ్మిన ప్రొడ్యూసర్స్‌తోనే చేస్తాను. నమ్మిన వాళ్లతో చేస్తున్నప్పుడు వాళ్లు ఎక్కడికి వెళ్లిపోతారు? వాళ్ల ఆఫీస్‌లు, బిజినెస్‌లు అన్నీ ఇక్కడే. ఎక్కడికి పారిపోతారు. ఆ నమ్మకం నాకుంది. నేనెక్కువగా దానయ్యగారు, తిరుపతి ప్రసాద్, గీతా ఆర్ట్స్, మైత్రీ మూవీస్, నాగబాబుగారు, దత్‌గారు వీళ్ళతోనే చేశాను. నెలనెలా ఇంత జీతం అని తీసుకోవడం వల్ల వాళ్ల వడ్డీలు ఎక్కువ అవ్వవు. సేఫ్‌గా ఉంటారు. రిలీజ్‌కి మూడు రోజుల ముందు బిజినెస్ ముగుస్తుంది. అప్పుడే తీసుకుంటాను.
ఈ పద్ధతిని ఎప్పుడు అలవాటూ చేసుకున్నారు?
నాన్నగారి దగ్గర కూడా అడ్వాన్స్ కాన్సెప్ట్ ఎక్కువ ఉండేది కాదు. వాళ్లు బలవంతంగా ఇస్తే తప్ప. ఆయన కూడా ఆయనకు ఇష్టమైన నిర్మాతలకే చేశారు. నేను కూడా ఈ సిస్టమ్‌కు అలవాటి పడిపోయాను.
– డి.జి. భవాని
Comments
Please login to add a commentAdd a comment