తొలియత్నం: రవితేజ లేకపోతే నేను లేను!
రవితేజ... ఈ పేరుకో స్టైలుంది.
రామ్‌గోపాల్‌వర్మ... ఈ పేరుకో బ్రాండ్ ఉంది.
టబు, జ్యోతిక... వీళ్లకో రేంజ్ ఉంది.
బట్, హరీష్ శంకర్... ఈ పేరుకు అప్పటికి ఏ ఐడెంటిటీ లేదు.
పరిచయానికి ఎలాంటి ఐడీ కార్డూ లేదు. ఈ యువకుడు తన కెరీర్‌లో లైట్ కోసం స్విచ్ వెతుకుతుంటే, అనుకోకుండా ట్రాన్స్‌ఫార్మర్ తగిలింది. అది కొట్టిన ‘షాక్’ నుంచి తేరుకోవడానికి అతనికి నాలుగేళ్లు పట్టింది. ఆ షాక్ తాలూకు ప్రకంపనాలు, పర్యవసానాల గురించి హరీష్ శంకర్ మాటల్లోనే...
బైక్ స్పీడ్‌గా వెళుతున్నప్పుడు బ్రేక్ వేస్తే చాలా పెద్ద కుదుపు వస్తుంది. నా మొదటి సినిమా విషయంలోనూ అదే జరిగింది.
దుర్గా ఆర్ట్స్‌లో అసోసియేట్ డెరైక్టర్‌గా పనిచేసేవాణ్ని. డెరైక్టర్ ఎవరైనా నేను మాత్రం కంపెనీ తరఫున అసోసియేట్‌గా చేసేవాణ్ని. నేను, నారాయణగారు, గోపాల్‌రెడ్డిగారు కలిసి కొత్త కథలు వినేవాళ్లం. దుర్గా ఆర్ట్స్‌లో ఎన్టీఆర్‌తో సినిమా చేద్దామనుకుని ఎన్ని కథలు విన్నా నచ్చలేదు. అదే సమయంలో కోన వెంకట్ ద్వారా రవిరాజా పినిశెట్టి దగ్గర ‘వీడే’ సినిమాకు అసోసియేట్‌గా చేరాను. ఆయన దగ్గరే డెరైక్షన్‌లో ఓనమాలు నేర్చుకున్నాను. ఆ సమయంలో రవితేజతో మంచి పరిచయం ఏర్పడింది. తరువాత మళ్లీ గోపాల్‌రెడ్డిగారు చెప్పగానే ఆటోగ్రాఫ్ సినిమాకు కో-డెరైక్టర్‌గా వెళ్లాను. అప్పుడు నాకు, రవితేజకు మధ్య స్నేహం బాగా పెరిగింది. నేను తనతో ఎప్పుడూ ఒక కో-డెరైక్టర్‌గా ఉండలేదు. తను నన్నెప్పుడూ ఒక తమ్ముడిగా, ఫ్రెండ్‌గానే చూశాడు.
‘నా ఆటోగ్రాఫ్’ చిత్రం కోసం కేరళలో గోపిక ఎపిసోడ్ షూట్ చేసేటప్పుడు నేను, రవి రోజూ గంటన్నరపాటు పడవలో ప్రయాణించేవాళ్లం. ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్లం. మా ఇద్దరికీ కిషోర్‌కుమార్, అమితాబ్ బచ్చన్, చిరంజీవి కామన్ ఫ్యాక్టర్స్. నేనోసారి ఒక క్యారెక్టరైజేషన్ చెప్పాను. తనకు బాగా నచ్చింది. దాంతో ఆటోగ్రాఫ్ పోస్ట్ ప్రొడక్షన్ అయ్యాక నేను స్క్రిప్ట్ రెడీ చేసుకునే పనిలో పడ్డాను.
ఒకసారి జ్యోతిక బర్త్‌డే రోజు తనకో సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామనుకున్నాం. అప్పటికి సూర్య, జ్యోతిక ప్రేమలో ఉన్నారు. సూర్యతో కోన వెంకట్ ముందే మాట్లాడి షూటింగ్‌కు వచ్చేట్టు ప్లాన్ చేశారు. ఆ రోజు మేం మొదట బొకే ఇచ్చి తరువాత సూర్యని ఎంటర్ చేశాం. తను చాలా సర్‌ప్రైజ్ అయ్యింది.
అదే సమయంలో ప్రవాల్ రామన్ డెరైక్షన్‌లో వర్మగారు ఓ సినిమా చేద్దామనుకుంటున్నారని న్యూస్ వచ్చింది. తెలుగులో రవితేజ హీరో. తెలుగు వెర్షన్‌కు హిందీ తెలిసిన ఓ కో-డెరైక్టర్ సెట్‌లో ఉండాలనుకుని, రవితేజ నన్ను రికమెండ్ చేశారు. మన కథ కూడా ఆ సెట్స్‌మీద డిస్కస్ చేసుకోవచ్చని రవి చెప్పడంతో నేను ఓకే అన్నాను. కథ వింటానికి నేను, కోన వెంకట్ బాంబే వెళ్లాం. అక్కడ మొదటిసారి వర్మని కలిశాను. ఆయన గంటన్నర సేపు ‘షాక్’ కథ చెప్పారు. వింటుంటే ఒక హాలీవుడ్ స్క్రిప్ట్ చదువుతున్నట్టు, మారియోఫ్యుజో నవల చదువుతున్నట్టు కళ్లముందు సినిమా కనిపించింది. నేను మంత్రముగ్ధుడిలా ఉండిపోయాను. తేరుకోవడానికి చాలా టైమ్ పట్టింది. అంత పర్‌ఫెక్ట్ నేరేషన్ ఇచ్చారు. తరువాత ఎలా ఉందని అడిగారు.
స్క్రిప్ట్ ఎక్స్‌ట్రార్డినరీ, కానీ రవితేజకు సూటవదని చెప్పాను. ఆయన వెంటనే ‘నువ్వు బాంబే వచ్చి నా కథ విని, సినిమా వర్కవుటవదు అంటే నేను డెసిషన్ తీసుకోను. ఏం చేస్తే వర్కవుట్ అవుద్దో ఆలోచించు. ఈ సినిమాకు నువ్వే దర్శకుడివి’ అన్నారు. చాలా షాకయ్యా. ‘నీ లైఫ్‌లో కీలకమైన నిర్ణయం తీసుకోవడానికి నీకు అరగంట టైమిస్తున్నా’ అని ఫోన్ మాట్లాడుతూ వెళ్లిపోయారు. నేను సందిగ్ధంలో ఉండిపోయాను. నాకు సినిమా చేయాలని ఉంది కానీ, ఇదేమో డార్క్ కంటెంట్. ఏం చేయాలి? కోన వెంకట్ నా ఆలోచనలకు తెరదించుతూ నాకు గీతోపదేశం చేశారు. ‘అందరూ అవకాశాల కోసం నానా పాట్లూ పడుతుంటే నువ్విలా వెనుకాడటం కరెక్ట్ కాదు. అందులో రామ్‌గోపాల్‌వర్మ లాంటి డెరైక్టర్ తనంతట తాను అడిగినప్పుడు ఆ అవకాశాన్ని వదులుకోవద్దు’ అని చెప్పారు.
నేను సినిమా ఒప్పుకోవడానికి మానసికంగా సంసిద్ధమైపోయాను. ఇరవై నిమిషాల్లో ఆయనకు నా నిర్ణయం చెప్పేశాను. ఆ రోజు నుంచి ఫస్ట్ కాపీ వచ్చే వరకు ఆయన జోక్యం చేసుకోలేదు. కానీ వర్మగారు అనుకున్నదానిలో మేం చిన్న చిన్న మార్పులు చేశాం. ఆయన స్టైల్‌గా, క్రిస్ప్‌గా ఒక గంటన్నర సినిమా తీయమన్నారు. పాటలు లేకుంటే బాగుంటుందన్నారు. కానీ పాటలు లేకుండా తీయడానికి చాలా మెచ్యూరిటీ కావాలి. ‘మేం రంగీలానే తీయలేదు. అప్పుడే కంపెనీ, సర్కార్‌లు తీయమంటే ఎలా’ అంటే ఆయన నవ్వారు. అజయ్ అతుల్ ‘మధురం మధురం’ అని భగవంతునికి సంబంధించిన మధురాష్టకం పాటను కంపోజ్ చేసిన తీరు చూసి ఆ పాట పెట్టడానికి కన్విన్స్ అయ్యారు.
షూటింగ్ మొదలైంది. మొదటిరోజు జ్యోతికతో షూట్. తను మరుసటిరోజు వేరే షూట్‌కు వెళ్లాలి. ఉదయం తొమ్మిదికి మొదలుపెట్టి రాత్రి పదకొండు దాకా చేశాం. దాంతో మొదటిరోజు అంతా హడావుడిగా జరిగిపోయింది. నిజానికి అనుకున్నదాని ప్రకారం జ్యోతికది చాలా చిన్న క్యారెక్టర్. మేం చేసిన మార్పుల్లో భాగంగా తన క్యారెక్టర్ నిడివి పెరిగింది. తను చాలా బిజీగా ఉన్నా... అటు గౌతమ్ మీనన్ సినిమా చేస్తూనే మాకు డేట్స్ అడ్జస్ట్ చేసింది.
ఇదంతా కలా నిజమా అని తేరుకోవడానికి నాకు ఫస్ట్ షెడ్యూల్ పట్టింది. షూటింగ్‌లో పెద్దగా ప్రాబ్లెమ్స్ రాలేదు కానీ ఒకరోజు నా కో-డెరైక్టర్ వచ్చి తర్వాతి రోజు టబు, జ్యోతికల సీన్ అని చెప్పాడు. అంత పెద్ద యాక్టర్స్‌ని నేను డెరైక్ట్ చేయాలా అని భయపడిపోయాను. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. జైల్ సీన్స్ తీస్తున్నప్పుడు కూడా కొంచెం ఇబ్బందిగా ఫీలయ్యాను. ఒక్కోసారి అసిస్టెంట్స్ మీద అరిచేసేవాణ్ని. హీరో ఒంటరిగా కూర్చుని ఏడ్చే సీన్ తీసేటప్పుడు రవితేజ ‘ఇలా కరెక్ట్ కాదేమో హరీష్, అయినా నీకోసం చేస్తున్నాను’ అన్నాడు. తను కేవలం నన్ను నమ్మి చేశాడు.
షాక్ షూటింగ్‌లో ఎన్నో మరపురాని అనుభవాలు. ఒకసారి జ్యోతిక బర్త్‌డే రోజు తనకో సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామనుకున్నాం. అప్పటికి సూర్య, జ్యోతిక ప్రేమలో ఉన్నారు. సూర్యతో కోన వెంకట్ ముందే మాట్లాడి షూటింగ్‌కు వచ్చేట్టు ప్లాన్ చేశారు. ఆ రోజు మేం మొదట బొకే ఇచ్చి తరువాత సూర్యని ఎంటర్ చేశాం. తను చాలా సర్‌ప్రైజ్ అయ్యింది. సినిమా తీస్తున్నప్పుడు ఎక్స్‌పీరియన్స్‌డ్ డెరైక్టర్‌లా చేస్తున్నానని నన్నందరూ ఎంకరేజ్ చేశారు. కెమెరామెన్ సర్వేష్ మురారి సహకారంతో ఒక్కోరోజు 3, 4 సీన్స్ తీశాం. మొత్తం 72 రోజుల్లో సినిమా పూర్తయింది.
షాక్ సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు దాదాపు రాముగారు మొత్తంగా మాతోనే ఉన్నారు. సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంత ఇంపార్టెంటో అప్పుడు నేర్చుకున్నాను. పోస్ట్ ప్రొడక్షన్‌లో ఒకే ఒక సీన్ తీసేశాం. హీరోయిన్ మీద జైలర్ జోకులేస్తుంటే హీరో తిట్టే సీన్ ఉంటుంది. అప్పటికే సినిమా అంతా ఏడుపుతో నిండి ఉంది. మళ్లీ ఇది ఎందుకులే అని తీసేశాం. ఇదొక్కటే ఆ సినిమాలో మేం తీసేసిన సీన్. ఫైనల్‌గా సినిమా చాలా రియలిస్టిక్‌గా వచ్చింది. జ్యోతిక, రవితేజ క్యారెక్టరైజేషన్ చాలా న్యాచురల్ ఉంది. వాళ్ల మధ్య తీసిన లవ్ ట్రాక్ రొమాంటిక్ సీన్స్ బాగా వచ్చాయి. సినిమా చూశాక రవితేజ ‘చాలా బాగుందబ్బాయ్, రిజల్ట్ గురించి నువ్వేం వర్రీ అవకు. మనం ఒక సినిమా డిఫరెంట్‌గా ట్రై చేద్దాం అనుకుని చేశాం. సో... కూల్’ అన్నాడు.
2006 ఫిబ్రవరి 8న రిలీజ్. ఏడో తారీఖు పి.వి.ఆర్.లో ప్రివ్యూ వేశాం. ఫస్ట్ హాఫ్ సెలైంట్‌గా చూశారు. సెకెండాఫ్ అవగానే అందరూ మాట్లాడకుండా వెళ్లిపోయారు. విషయం అర్థమైంది. రిజల్ట్ విషయంలో తప్ప అన్ని రకాలుగా నాకు సంతృప్తినిచ్చిన సినిమా షాక్. అది ఫెయిలవడానికి కారణం నేనే తప్ప మరెవరూ కాదు. షాక్ రామూగారి బ్రెయిన్ చైల్డ్. నేను ఎక్కువగా ఎంటర్‌టైన్‌మెంట్ ఇష్టపడటం వల్లనో, నా ఆలోచనా విధానం భిన్నంగా ఉండటం వల్లనో ఆయన అనుకున్న భావాన్ని నేను కరెక్ట్‌గా తెర మీదకు తీసుకురాలేదని ఈ రోజుకూ ఫీలవుతుంటాను.
నిజంగా ఆయన ఇన్‌వాల్వ్ అయి ఉంటే షాక్ సినిమా బెటర్‌గా వచ్చి ఉండేదేమో! చివరకు నాకు అర్థమైందేంటంటే, మనకి ఏది వచ్చో అదే చేయాలి. మనకు రాని దాన్ని మనం ముట్టుకోకూడదు. అలా చేస్తే దానికి న్యాయం చేయలేం అని ఈ సినిమా ద్వారా నేర్చుకున్నాను. షాక్ ఫ్లాపయినా రవితేజ నన్నెప్పుడూ ఫ్లాప్ డెరైక్టర్‌గా చూడలేదు. ‘మిరపకాయ్’ చేసే అవకాశం ఇచ్చి నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. అందుకే రవితేజ లేని నా ఫిలిం కెరీర్ లేదు.
- కె.క్రాంతికుమార్‌రెడ్డి