శత్రువుకే ఎదురు నిలిచిన దేశం మనది!
శ్రీకాంత్, రవితేజ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రధారులుగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన దేశభక్తి చిత్రం ‘ఖడ్గం’. శక్తి సాహిత్యం అందించగా, దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ‘మేమే ఇండియన్స్..’ పాటతత్వం గురించి కథ-మాటల రచయిత ‘డైమండ్’ రత్నబాబు మాటల్లో....
పల్లవి: సత్యం పలికే హరిశ్చంద్రులం.. అవసరానికో అబద్ధం (2)
నిత్యం నమాజు పూజలు చేస్తాం.. రోజూ తన్నుకు చస్తాం (2)
నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం.. నమ్మడమేరా కష్టం
అరె ముక్కు సూటిగా ఉన్నది చెప్తాం.. నచ్చకుంటే మీ కర్మం
అరె కష్టమొచ్చినా కన్నీళ్ళొచ్చిన.. చెరగని నవ్వుల ఇంద్రధనుస్సులం
మేమే ఇండియన్స్.. మేమే ఇండియన్స్.. మేమే ఇండియన్స్.. అరె మేమే ఇండియన్స్ (2)
మన భారతీయుల్లో ప్రతి ఒక్కరూ హరిశ్చంద్రుల్లా ఉండాలని ప్రయత్నిస్తారు. కానీ, అవసరాలు మనతో అబద్ధాలు ఆడిస్తాయి. సర్వమత సమ్మేళనం.. మన భారతీయత. కానీ, ఏవేవో చిన్న కారణాలతో నిత్యం గొడవ పడుతుంటాం. ‘నమ్మితె ప్రాణాలైనా ఇస్తాం..’ ఇది మన మనస్తత్వాలకు దగ్గరగా ఉంటుంది. వ్యాపారం పేరుతో వచ్చిన బ్రిటిషర్లను నమ్మడం వలనే బానిసలుగా చేసుకున్నారు. ఆ తర్వాత ప్రాణాలు అర్పించి స్వాతంత్య్రం సాధించుకున్నాం.
కష్టం వస్తే పెగ్గులో కన్నీళ్లు మిక్స్ చేసుకుని మగాళ్లు, సీరియల్స్ చూస్తూ అందులో వాళ్లు ఇంకా ఎక్కువ కష్టాలు పడుతున్నారని మహిళలు లైట్ తీసుకుంటారు. ఆకాశంలో ఇంద్రధనుస్సులా చిరునవ్వుతో తిరిగేస్తుంటాం. సగం తెలియకుండానే మన జీవితం అయిపోతుంది. తెలుసుకోవడానికి ఇంకో సగం జీవితం పూర్తయిపోతుంది. మొత్తం మీద హ్యాపీగా బతికేస్తున్నాం. అందుకే, ప్రపంచ దేశాలు మన భారతీయుల్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయి. స్నేహం, నమ్మకం, ముక్కుసూటిగా మాట్లాడడం, కష్టం, సుఖం.. అన్నిటిలో మనలా బతకాలనుకుంటున్నారు.
చరణం1: వంద నోటు జేబులో ఉంటె నవాబు నైజం
పర్సు ఖాళీ అయ్యిందంటే ఫకీరు తత్వం
కళ్ళు లేని ముసలవ్వలకు చెయ్యందిస్తాం
పడుచు పోరి ఎదురుగ వస్తే పళ్లికిలిస్తాం
ప్రేమా కావాలంటాం.. పైసా కావాలంటాం
ఏవో కలలే కంటాం.. తిక్క తిక్కగా ఉంటాం
ఏడేళ్లైనా టీవీ సీరియల్ ఏడుస్తూనే చూస్తాం
తోచకపోతే సినిమాకెళ్ళి రికార్డు డ్యాన్సులు చేస్తాం
కోర్టు తీర్పుతో మనకేం పనిరా నచ్చినోడికి ఓటేస్తాం
అందరు దొంగలే అసలు దొంగకు సీటు అప్పచెప్పేస్తాం
రూలు ఉంది.. రాంగు ఉంది.. (2)
తప్పుకు తిరిగే లౌక్యం ఉంది
॥ఇండియన్స్..॥
ప్రతి మధ్యతరగతి భారతీయుడికి ఈ చరణంలో భావం కనెక్ట్ అవుతుంది. ప్రతినెలా జీతం వచ్చిన మొదటి ఐదు రోజులు షాపింగ్, నచ్చిన ఫుడ్, షికార్లు, సినిమాలు.. రాజభోగమే. చివరి ఐదు రోజుల్లో అప్పులు. ఏవేవో ఆశలు, కలలు.. ప్రేమ, పైసలు రెండూ కావాలి. పరిస్థితులను బట్టి ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటాం. కొన్ని సందర్భాల్లో కుల, రాజకీయ, ఆర్థిక ప్రభావంతో మంచి దొంగను ఎన్నుకుంటామనే విషయాన్ని ఇందులో చెప్పాలనుకున్నారు. ఈ చరణం తర్వాత ‘వందేమాతరం..’ అంటూ ఓ ఆలాపన ఉంటుంది. ఇప్పటికీ, ‘వందేమాతరం..’ పాడితే స్కూల్‌లో ఫస్ట్ బెల్, ‘జన గణ మణ..’ పాడితే లాస్ట్ బెల్ కొడతారని కొందరు విద్యార్థులు భ్రమలో ఉన్నారు. అలా కాకుండా వాటి గొప్పతనం గురించి విద్యార్థులకు వివరించమని ఉపాధ్యాయులను కోరుతున్నాను.
చరణం2: కలలు కన్నీళ్ళెన్నో మన కళ్ళల్లో
ఆశయాలు ఆశలు ఎన్నో మన గుండెల్లో
శత్రువుకే ఎదురు నిలిచిన రక్తం మనది
ద్వేషాన్నే ప్రేమగా మార్చిన దేశం మనది
ఈశ్వర్ అల్లా ఏసు ఒకడే కదరా బాసూ
దేవుడికెందుకు జెండా.. కావాలా పార్టీ అండా
మాతృభూమిలో మంటలు రేపే మాయగాడి కనికట్టు
అన్నదమ్ములకు చిచ్చుపెట్టిన లుచ్చాగాళ్ళ పనిపట్టు
భారతీయులం ఒకటేనంటు పిడికిలెత్తి వేయ్ ఒట్టు
కుట్రలు చేసే శత్రు మూకల తోలు తీసి ఆరబెట్టు
దమ్మె ఉంది.. ధైర్యం ఉంది.. (2)
తలవంచని తెగపొగరే ఉంది
॥మేమే ఇండియన్స్..॥
దేశ సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టే చరణమిది. ఇండియా-పాక్ సరిహద్దుల్లో ఇటీవల 18 మంది జవాన్లు అమరవీరులయ్యారు. దేశ ప్రజల కోసం సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేస్తున్నారు. మనమంతా ఎవరి పనులు వారు చేసుకోవడానికి కారణం మన ఆర్మీ. సరిహద్దుల్లో మనకోసం పోరాడుతున్న సైనికులు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. మనం అందరం గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోవడానికి కారణం వాళ్లు శత్రువుల గుండెల్లో నిద్రపోవడమే. చిన్నప్పుడు స్కూల్‌లో భవిష్యత్తులో మీరు ఏమవుతారని స్టూడెంట్స్‌ని టీచర్ అడిగితే... డాక్టర్, టీచర్, ఇంజినీర్.. కాకుండా నేను ఆర్మీకి వెళ్తాననేలా పిల్లల్లో దేశభక్తి పెంపొందించాలి. మతాల పేరుతో పార్టీల జెండాలను మోయకుండా మూడు రంగుల మువ్వన్నెల జెండా మోసేలా చేయాలి.
నాకున్న ఎమోషన్‌కి ఆర్మీకి వెళ్లాలనుకున్నా. మా తల్లిదండ్రులు భయపడ్డారు. రచయిత కావాలనే నాన్నగారి కోరికను నేను నెరవేర్చాను. నాకు ఇద్దరు కుమారులు. వారిలో ఎవరో ఒకరు నా కోరిక నెరవేరుస్తారని ఆశిస్తున్నాను. అప్పుడు తండ్రిగా కంటే భారతీయుడిగా గర్విస్తాను.
ఇంటర్వ్యూ: సత్య పులగం