Khadgam
-
అబద్ధమే ఆభరణమట!
‘సత్యం పలికే హరిశ్చంద్రులం! అవసరానికో అబద్ధం!!’ ఈ లైన్ గుర్తుందా..? బ్లాక్ బాస్టర్ మూవీ... ‘ఖడ్గం’ సినిమాలో మంచి ఊపున్న సాంగ్లోనిదీ లైన్!! ఈరోజుల్లో అవసరానికో అబద్ధం చెప్పని వారే ఉండరు!! నిజానికి అక్షరాభ్యాసం నాడే అబద్ధమాడకూడదని బోధిస్తారు మన పెద్దలు. అక్షరాలు నేర్చుకున్న నాటి నుంచీ... సత్యమార్గాన నడిచిన మహాత్మా గాంధీనీ, అవమానాలను తట్టుకున్న సత్య హరిశ్చంద్రుడినీ ఉదహరిస్తూ కథలు చెబుతారు. సామ, దాన, దండోపాయాల్లో భాగంగా అబద్ధమాడితే తల వేయి ముక్కలవుతుందంటూ భయపెడతారు కూడా! చెప్పిన మాట నిజమో కాదో నిర్ధారించుకోవడానికి ప్రమాణాలు చేయించుకోవడం అలవాటు చేస్తుంటారు. కానీ, అవసరం కొన్ని సార్లు అబద్ధమాడిస్తుంది. అరుదైన అవకాశం కోసం, ఆత్మరక్షణ కోసం అసత్యమే శరణమనిపిస్తుంది. అందులో భాగంగానే ‘బాస్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్’ అనే నానుడి బలపడుంటుంది. చిన్న చిన్న అబద్ధాలు ఆడటం మనందరికీ చాలా కామన్!! అదే అన్నింటికీ మంచిదంటున్నారు ఇయాన్ లెస్లీ అనే రచయిత. ఆ కథేంటో చూద్దాం!! అన్నీ అబద్ధాలే!! వయసు దాచుకోవడానికి కొందరు ఆడవారు... మగువలను వలలో వేసుకోవడానికి కొందరు మగవారు.. అబద్ధాలు చెప్పడంలో దిట్టలే! పొరిగింటావిడ నిన్న కొన్న కొత్త డ్రెస్ రేటు ఎంత అని అడిగితే.. మరో రెండొందలు ఎక్కు వేసుకుని చెప్పుకునే కాలేజ్ అమ్మాయి, వచ్చిన కట్నానికి 2 ఎకరాలు కలుపుకుని బంధు మిత్రులకు చెప్పుకునే పెళ్లికొడుకు తల్లి, మెడలో ఉన్న నెక్లెస్ బాగుందని పొగిడితే.. అసలు బంగారానికి మరో తులం కలుపుకుని చెప్పుకునే షావుకారుగారి భార్య.. ఇలా అసత్యావాదులు రోజుకు చాలా మంది తారసపడుతుంటారు. అబద్ధమే మిన్న! నిజం కన్నా అబద్ధమే మిన్న అంటున్నాడు ఇయాన్ లెస్లీ అనే రచయిత. ’వై లయింగ్ కెన్ యాక్చువల్లీ బీ గుడ్ ఫర్ యూ’ అనే పుస్తకంలో అబద్ధమనేది మనిషి మనుగడకు ఎంతో అవసరమని రాసుకొచ్చాడు. అందుకు సర్వేలు, లెక్కలు ఆధారంగా చూపిస్తున్నాడు. అబద్ధమాడితే ఆరోగ్యం కుదుటపడుతుందని, అసత్యం చెబితే ఆయా రంగాల్లో వ్యక్తిగతంగా ఎదుగుతారని ఏవేవో ఉపయోగాలను చెప్పుకొచ్చాడు. ఓ ప్రాణాంతక వ్యాధికి అబద్ధపు ఆపరేషన్ చేస్తే.. ఆ వ్యక్తి రికవర్ అయిన ఓ సైంటిఫిక్ ఉదంతాన్ని కూడా అతడు ప్రస్తావించాడు.అబద్ధాల గురించి కొన్ని నిజాలు 147 మందిపై జరిపిన ఓ సర్వేలో... ఒక వారం రోజుల పాటు వాళ్లు ఎంతమందికి ఎన్ని అబద్ధాలు చెప్పారో డైరీలో నోట్ చేయమని చెప్పారు. ఈ సర్వే ప్రకారం.. ఒక వ్యక్తి రోజుకి సగటున రెండు సార్లు అబద్ధమాడుతున్నాడని తేలింది. ఆయన ఆనాడే చెప్పాడు! బలి చక్రవర్తి కథ తెలుసు కదా! బలి ప్రాణాలు కాపాడేందుకు శుక్రచార్యుడు నానా విధాలా ప్రయత్నించి.. తన కన్ను కూడా పోగొట్టుకుంటాడు. ఈ సమయంలోనే ఓ పద్యం చెబుతాడు.‘వారిజాక్షులందు వైవాహికములందుప్రాణవిత్త మాన భంగమందుజకిత గోకులాగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు నఘము పొందదధిప!’ దీని అర్థం ఏంటంటే.. ఆడవారి విషయంలో, పెళ్లిళ్లు జరిపించడంలో, ధన మాన ప్రాణాలను కాపాడుకోవడంలో.. ఆవుల సంరక్షణలో.. అబద్ధం ఆడవచ్చని, దానివల్ల ఎలాంటి పాపం అంటదని బలికి హితబోధ చేస్తాడు శుక్రచార్యుడు. సువార్తే!! ఎట్టిపరిస్థితుల్లోనూ అసత్యమాడరాదన్నారు మన మహాత్ముడు. ఆచరణలో తనను మించిన వారే లేరని నిరూపించారు çసత్య హరిశ్చంద్రుడు. ఇరువురూ చరిత్రలో నిలిచినవారే! కానీ ఈ సర్వే ’చరిత్రలో నిలిచేందుకు కాదు! స్వతహాగా గెలిచేందుకట!!’ మొత్తానికి అసత్య హరిశ్చంద్రులకు ఇది నిజంగా ఏక్దమ్ గుడ్ న్యూసే కదూ!! -
శత్రువుకే ఎదురు నిలిచిన దేశం మనది!
శ్రీకాంత్, రవితేజ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రధారులుగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన దేశభక్తి చిత్రం ‘ఖడ్గం’. శక్తి సాహిత్యం అందించగా, దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ‘మేమే ఇండియన్స్..’ పాటతత్వం గురించి కథ-మాటల రచయిత ‘డైమండ్’ రత్నబాబు మాటల్లో.... పల్లవి: సత్యం పలికే హరిశ్చంద్రులం.. అవసరానికో అబద్ధం (2) నిత్యం నమాజు పూజలు చేస్తాం.. రోజూ తన్నుకు చస్తాం (2) నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం.. నమ్మడమేరా కష్టం అరె ముక్కు సూటిగా ఉన్నది చెప్తాం.. నచ్చకుంటే మీ కర్మం అరె కష్టమొచ్చినా కన్నీళ్ళొచ్చిన.. చెరగని నవ్వుల ఇంద్రధనుస్సులం మేమే ఇండియన్స్.. మేమే ఇండియన్స్.. మేమే ఇండియన్స్.. అరె మేమే ఇండియన్స్ (2) మన భారతీయుల్లో ప్రతి ఒక్కరూ హరిశ్చంద్రుల్లా ఉండాలని ప్రయత్నిస్తారు. కానీ, అవసరాలు మనతో అబద్ధాలు ఆడిస్తాయి. సర్వమత సమ్మేళనం.. మన భారతీయత. కానీ, ఏవేవో చిన్న కారణాలతో నిత్యం గొడవ పడుతుంటాం. ‘నమ్మితె ప్రాణాలైనా ఇస్తాం..’ ఇది మన మనస్తత్వాలకు దగ్గరగా ఉంటుంది. వ్యాపారం పేరుతో వచ్చిన బ్రిటిషర్లను నమ్మడం వలనే బానిసలుగా చేసుకున్నారు. ఆ తర్వాత ప్రాణాలు అర్పించి స్వాతంత్య్రం సాధించుకున్నాం. కష్టం వస్తే పెగ్గులో కన్నీళ్లు మిక్స్ చేసుకుని మగాళ్లు, సీరియల్స్ చూస్తూ అందులో వాళ్లు ఇంకా ఎక్కువ కష్టాలు పడుతున్నారని మహిళలు లైట్ తీసుకుంటారు. ఆకాశంలో ఇంద్రధనుస్సులా చిరునవ్వుతో తిరిగేస్తుంటాం. సగం తెలియకుండానే మన జీవితం అయిపోతుంది. తెలుసుకోవడానికి ఇంకో సగం జీవితం పూర్తయిపోతుంది. మొత్తం మీద హ్యాపీగా బతికేస్తున్నాం. అందుకే, ప్రపంచ దేశాలు మన భారతీయుల్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయి. స్నేహం, నమ్మకం, ముక్కుసూటిగా మాట్లాడడం, కష్టం, సుఖం.. అన్నిటిలో మనలా బతకాలనుకుంటున్నారు. చరణం1: వంద నోటు జేబులో ఉంటె నవాబు నైజం పర్సు ఖాళీ అయ్యిందంటే ఫకీరు తత్వం కళ్ళు లేని ముసలవ్వలకు చెయ్యందిస్తాం పడుచు పోరి ఎదురుగ వస్తే పళ్లికిలిస్తాం ప్రేమా కావాలంటాం.. పైసా కావాలంటాం ఏవో కలలే కంటాం.. తిక్క తిక్కగా ఉంటాం ఏడేళ్లైనా టీవీ సీరియల్ ఏడుస్తూనే చూస్తాం తోచకపోతే సినిమాకెళ్ళి రికార్డు డ్యాన్సులు చేస్తాం కోర్టు తీర్పుతో మనకేం పనిరా నచ్చినోడికి ఓటేస్తాం అందరు దొంగలే అసలు దొంగకు సీటు అప్పచెప్పేస్తాం రూలు ఉంది.. రాంగు ఉంది.. (2) తప్పుకు తిరిగే లౌక్యం ఉంది ॥ఇండియన్స్..॥ ప్రతి మధ్యతరగతి భారతీయుడికి ఈ చరణంలో భావం కనెక్ట్ అవుతుంది. ప్రతినెలా జీతం వచ్చిన మొదటి ఐదు రోజులు షాపింగ్, నచ్చిన ఫుడ్, షికార్లు, సినిమాలు.. రాజభోగమే. చివరి ఐదు రోజుల్లో అప్పులు. ఏవేవో ఆశలు, కలలు.. ప్రేమ, పైసలు రెండూ కావాలి. పరిస్థితులను బట్టి ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటాం. కొన్ని సందర్భాల్లో కుల, రాజకీయ, ఆర్థిక ప్రభావంతో మంచి దొంగను ఎన్నుకుంటామనే విషయాన్ని ఇందులో చెప్పాలనుకున్నారు. ఈ చరణం తర్వాత ‘వందేమాతరం..’ అంటూ ఓ ఆలాపన ఉంటుంది. ఇప్పటికీ, ‘వందేమాతరం..’ పాడితే స్కూల్లో ఫస్ట్ బెల్, ‘జన గణ మణ..’ పాడితే లాస్ట్ బెల్ కొడతారని కొందరు విద్యార్థులు భ్రమలో ఉన్నారు. అలా కాకుండా వాటి గొప్పతనం గురించి విద్యార్థులకు వివరించమని ఉపాధ్యాయులను కోరుతున్నాను. చరణం2: కలలు కన్నీళ్ళెన్నో మన కళ్ళల్లో ఆశయాలు ఆశలు ఎన్నో మన గుండెల్లో శత్రువుకే ఎదురు నిలిచిన రక్తం మనది ద్వేషాన్నే ప్రేమగా మార్చిన దేశం మనది ఈశ్వర్ అల్లా ఏసు ఒకడే కదరా బాసూ దేవుడికెందుకు జెండా.. కావాలా పార్టీ అండా మాతృభూమిలో మంటలు రేపే మాయగాడి కనికట్టు అన్నదమ్ములకు చిచ్చుపెట్టిన లుచ్చాగాళ్ళ పనిపట్టు భారతీయులం ఒకటేనంటు పిడికిలెత్తి వేయ్ ఒట్టు కుట్రలు చేసే శత్రు మూకల తోలు తీసి ఆరబెట్టు దమ్మె ఉంది.. ధైర్యం ఉంది.. (2) తలవంచని తెగపొగరే ఉంది ॥మేమే ఇండియన్స్..॥ దేశ సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టే చరణమిది. ఇండియా-పాక్ సరిహద్దుల్లో ఇటీవల 18 మంది జవాన్లు అమరవీరులయ్యారు. దేశ ప్రజల కోసం సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేస్తున్నారు. మనమంతా ఎవరి పనులు వారు చేసుకోవడానికి కారణం మన ఆర్మీ. సరిహద్దుల్లో మనకోసం పోరాడుతున్న సైనికులు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. మనం అందరం గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోవడానికి కారణం వాళ్లు శత్రువుల గుండెల్లో నిద్రపోవడమే. చిన్నప్పుడు స్కూల్లో భవిష్యత్తులో మీరు ఏమవుతారని స్టూడెంట్స్‌ని టీచర్ అడిగితే... డాక్టర్, టీచర్, ఇంజినీర్.. కాకుండా నేను ఆర్మీకి వెళ్తాననేలా పిల్లల్లో దేశభక్తి పెంపొందించాలి. మతాల పేరుతో పార్టీల జెండాలను మోయకుండా మూడు రంగుల మువ్వన్నెల జెండా మోసేలా చేయాలి. నాకున్న ఎమోషన్‌కి ఆర్మీకి వెళ్లాలనుకున్నా. మా తల్లిదండ్రులు భయపడ్డారు. రచయిత కావాలనే నాన్నగారి కోరికను నేను నెరవేర్చాను. నాకు ఇద్దరు కుమారులు. వారిలో ఎవరో ఒకరు నా కోరిక నెరవేరుస్తారని ఆశిస్తున్నాను. అప్పుడు తండ్రిగా కంటే భారతీయుడిగా గర్విస్తాను. ఇంటర్వ్యూ: సత్య పులగం -
సిన్సియర్ పోలీస్
ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించిన శ్రీకాంత్ మరోసారి లాఠీ ఝుళిపించనున్నారు. శ్రీకాంత్, నిఖిత జంటగా సతీశ్ కాసెట్టి దర్శకత్వంలో షేక్ మస్తాన్ నిర్మించిన ‘టై’ చిత్రం ఈ నెలాఖరున విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘శ్రీకాంత్ కెరీర్లో చెప్పుకోదగ్గ చిత్రంగా నిలుస్తుంది. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథే ఈ చిత్రం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: హరి అయినీడి, సమర్పణ: షేక్ కరీమా. -
'బాయిలింగ్ స్టార్ ఇరగదీశాడు'
30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ.. అంటూ ఖడ్గం సినిమాలో ఒకే ఒక్క డైలాగ్‌తో ప్రేక్షకుల హృదయాలను చకిలగింతలు పెట్టిన నటుడు పృథ్వీరాజ్ . గోపిచంద్ హీరోగా తాజా విడుదలైన 'లౌక్యం' చిత్రంలో పృథ్వీరాజ్ టీవీ యాంకర్ పాత్రలో ఒదిగిపోయారు. 'బాయిలింగ్ స్టార్ బబ్లూ' పాత్రలో పృథ్వీ ఇరగదీశాడంటూ అటు ప్రేక్షకులు, ఇటు విమర్శకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆ పాత్రలో ఒదిగిపోయి తీరు... డైలాగులు పలికిన విధానంతోపాటు నటన అద్భుతంగా ఉన్నాయని పృథ్వీని సీని విమర్శకులు సైతం మెచ్చుకుంటున్నారు. పృథ్వీ పాత్ర లౌక్యం చిత్రానికే హైలైట్ అని ప్రేక్షక్షులు తెలుపుతున్నారు. గోపిచంద్, రుకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటించి లౌక్యం గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనుప్ రుబెన్స్ సంగీతం అందించారు. సినిమా మధ్యమధ్యలో ఎక్కడైనా కాస్త ఇబ్బందిగా అనిపించినా వెంటనే మళ్లీ పృథ్వీ రంగప్రవేశం చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారని సినిమా రివ్యూలు కూడా చెబుతున్నాయి.