ఏజింగ్‌ను ఆపగలం!
వయసు పెరుగుతున్న కొద్దీ (ఏజింగ్) మనలో వచ్చే మార్పులన్నవి అందరికీ తెలిసిందే. ఏజింగ్ వల్ల కలిగే దుష్పరిణామాలు మానవజీవితంలో తప్పదని అందరూ అనుకునే మాట. కానీ వయసు పైబడటం వల్ల వచ్చే పరిణామాలు అన్నింటినీ ఆపవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. పైగా వయసు పైబడినందు వల్ల జీవకణంలోని ఇంకా లోపలి అంశాలలో కలిగే మార్పులను గుర్తించి, అత్యంత సూక్ష్మమైన ఆ భాగాలనూ రిపేర్ చేయవచ్చని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్‌టెక్) అనే సంస్థతో పాటు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెలెస్ (యూఎల్‌సీఏ)కి చెందిన శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. వాస్తవానికి ఇప్పటివరకూ కణంలోని బ్యాటరీ లేదా పవర్ హౌజ్ అని పేర్కొనే మైటోకాండ్రియాలో వచ్చిన మార్పులను ఎవరూ రిపేర్ చేయలేదు.
ఇక వయసు పైబడుతున్న కొద్దీ ఆ డీఎన్‌ఏ నిర్మాణాలు తెగిపోవడం వల్ల ఏజింగ్ వల్ల జరిగే మార్పులు సంభవిస్తుంటాయి. కణంలోని దెబ్బతిన్న భాగాన్ని కణం తనంతట తానే స్వాహా చేసుకుంటుంది. ఇలా తనను తానే తొలగించుకోవడాన్ని ఆటోఫేజీ అంటారు. నిజానికి చాలా ఆసక్తికరమైన పరిశోధనలు ఈ రంగంలో జరుగుతున్నాయి. అల్జైమర్స్, పార్కిన్‌సన్స్ డిసీజ్ లాంటి ఏజింగ్‌తో వచ్చే వ్యాధుల్లో దెబ్బతిన్న కణాలను సైతం సమర్థంగా తొలగించి ఆ స్థానంలో ఆరోగ్యకరమైన కణాలు పెరిగేలా చూడటం ఈ చికిత్సలో భాగంగా చేస్తారు. అయితే ప్రస్తుతం ఇవి ప్రయోగదశలో ఉన్నాయి. ఈ పరిశోధనలు ఫ్రూట్‌ఫ్లై అనే కీటకంపై చేస్తున్నారు.
మనుషుల్లో లాగే ఈ కీటకంలోని కండరాలు సైతం ఏజింగ్‌కు గురవుతాయి. జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రక్రియ ద్వారా ఈ కీటకంలోని ఏజింగ్‌లో మొదట... ఎమ్‌టీ డీఎన్‌ఏలో ఏజింగ్ ప్రక్రియను మరింత త్వరగా అయ్యేలా చేశారు. అలా జరిగాక ఏజింగ్‌తో మార్పులు జరిగి వార్ధక్యం వచ్చిన డీఎన్‌ఏ భాగం దానంతట అదే ఆటోఫేజీకి గురయ్యింది. అలా కణంలో కొత్త స్థలానికి ఆస్కారం ఏర్పడింది. అప్పుడు అక్కడ మరింత కొత్తదీ, ఆరోగ్యకరమైన జీవకణ భాగం వృద్ధి చెందింది. ఇలా వార్ధక్యానికి లోనయ్యే భాగాన్ని మరింత వేగవంతం చేసి, అవి త్వరితంగా నశించేలా చేసే, కొత్త స్థలాన్ని సృష్టించి, ఆ ప్రదేశంలో సరికొత్త డీఎన్‌ఏ పెరిగేలా చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ పరిశోధనల గురించి కాల్‌టెక్‌కు చెందిన బ్రూస్ హే అనే శాస్త్రవేత్త వివరించారు. ‘‘ఇలా తరచూ కణాన్ని ఖాళీ చేస్తుండటం వల్ల (సెల్ హౌస్ క్లీనింగ్) కొత్త కణపదార్థం పుట్టేలా చేయడం ద్వారా కణాన్ని యౌవనంగా ఉండేలా చేయవచ్చు’’ అని చెబుతున్నారు
బ్రూస్ హే.