వెలుగు రేఖలు | Madhya Pradesh in Poetry School | Sakshi
Sakshi News home page

వెలుగు రేఖలు

Published Sun, Jan 22 2017 1:42 AM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM

వెలుగు రేఖలు - Sakshi

రెక్కాడితేగానీ డొక్కాడని బతుకు భాజ్నుది.
‘ఈరోజు ఎలా పూటగడపాలి. ఏ కష్టం చేయాలి’ అనే ఆలోచన తప్ప మరే ఆలోచన ఆయనకు పెద్దగా ఉండేది కాదు. ఆడపిల్లలకు  చదువు ప్రాముఖ్యత గురించి తెలియజేయడానికి ఒక స్వచ్ఛందసంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో యాదృచ్ఛికంగా పాల్గొన్నాడు భాజ్ను.

‘విద్య అనేది దీపంలాంటిది. అది పిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. సమాజానికి దారి చూపే చుక్కాని అవుతుంది విద్య’ అనే మాటలు తనలో చాలారోజుల పాటు ప్రతిధ్వనించాయి. మధ్యప్రదేశ్‌లోని ఒక మారుమూల కుగ్రామానికి చెందిన భాజ్ను నిరక్షరాస్యుడు. అవగాహన లేకో, పరిస్థితుల ప్రభావం వల్లో తాను చదువుకు దూరమై ఉండొచ్చు. నష్టపోయి ఉండొచ్చు. అయితే తనలాంటి పరిస్థితి ఎవరికీ రాకుండా చూడాలనుకున్నాడు భాజ్ను. విద్య ప్రాముఖ్యత గురించి కాలికి బలపం కట్టుకొని  ప్రచారం చేయడం ప్రారంభించాడు.

సోనం, కవితలను తల్లిదండ్రులు చదువు మాన్పించారు. అక్కడి గ్రామీణ సమాజంలో ఇదేమీ ఆశ్చర్యకరమైన విషయం కాదు... రకరకాల కారణాలతో ఆడపిల్లలను చదువు మాన్పించడం సాధారణంగా జరిగేదే.
సోనం, కవితలు చదువులు మానేయడానికి కారణం వారి సోదరుడు. అతడి అభిప్రాయం ప్రకారం... ‘‘పరీక్షల్లో తప్పితే... వీరి కోసం  చేసిన ఖర్చు మొత్తం వృథానే కదా’’
నిజానికి ఇది ఏ ఒక్కరి అభిప్రాయమో కాదు.... మధ్యప్రదేశ్‌లోని అనేక గ్రామాల్లో చాలామంది పేదతల్లిదండ్రుల అభిప్రాయం.

సోనం, కవితలు స్కూలు మానేసిన విషయం తెలుసుకొని వాళ్ల ఇంటికి వెళ్లాడు భాజ్ను. తల్లిదండ్రులతో మాట్లాడి సోనం, కవితలు తిరిగి బడిలో చేరేలా చేశాడు.
ఇప్పుడు సోనం, కవితలు చదువులో రాణించడమే కాదు... భవిష్యత్‌ లక్ష్యాలు కూడా నిర్ణయించుకున్నారు. పోలీస్‌ కావాలని సోనం, టీచర్‌ కావాలని కవిత కలలు కంటున్నారు. బడి మానేసిన పిల్లలను తిరిగి బడిలో చేర్పించే కార్యక్రమాన్ని ఒక యజ్ఞంగా భావిస్తున్నాడు భాజ్ను.

రాజస్థాన్‌లోని మేవార్‌ జిల్లా మీర్జాపూర్‌లో ఆడపిల్లలు అయిదవతరగతికి మించి చదవడం అనేది కలలో మాట. ఒక వయసు దాటాక ఆడపిల్లలను స్కూల్‌కు పంపించడం మతవిరుద్ధం అనే అభిప్రాయం కూడా కొద్దిమందిలో ఉండేది. అయితే ‘రూమ్‌ టూ రీడ్‌’ స్వచ్ఛంద సంస్థ చొరవతో పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ‘ఆడపిల్లల చదువు అయిదు వరకే’ అనే పరిమితి చెరిగిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే... దీనికి కారణం షబ్నం అనే అమ్మాయి. అయిదవ తరగతితోనే చదువు సరిపెట్టాలని తల్లిదండ్రులు నిర్ణయించినప్పుడు ఆమె వ్యతిరేకించింది. బడికి వెళతానని పట్టుబట్ట
‘‘బడి సంగతి సరే... ఇంటి పని, పొలం పని ఎవరు చేస్తారు?’’ అని అడిగారు తల్లిదండ్రులు.

‘‘నేనే చేస్తాను’’ అంటూ తనను తిరిగి బడికి పంపించడానికి తల్లిదండ్రులను ఒప్పించింది షబ్నం. వాళ్లు సరే అనక తప్పలేదు.

ఒకవైపు బండెడు ఇంటిచాకిరి చేస్తూనే, పొలం పనులు చేస్తూనే చదువు మీద శ్రద్ధ పెట్టింది షబ్నం. చదువు మీద షబ్నం ఆసక్తి  ఎందరో ఆడపిల్లలకు ఆదర్శంగా మారింది. తన చదువు వరకు మాత్రమే పరిమితం కాకుండా... చదువు ప్రాముఖ్యత గురించి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసేది.

షబ్నం బడికి వెళుతుండడంతో మిగతా పిల్లలు కూడా తమ ఇళ్లలో గొడవ చేశారు. దీంతో వారికి కూడా పిల్లలను స్కూల్‌కు పంపించక తప్పలేదు. ఇలా ఒకరిని చూసి ఒకరు... అయిదవ తరగతి తరువాత కూడా పిల్లలు చదువు కొనసాగించడం మొదలైంది.

గ్రామచరిత్రలో విశేషమైన సంఘటన ఏమిటంటే... పద్దెనిమిది మంది ఆడపిల్లలు పదవతరగతి పాస్‌ కావడం. ఇది తల్లిదండ్రులకు  ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. షబ్నం రాజ్‌కియా పాలిటెక్నిక్‌ మహావిద్యాలయ, అల్వార్‌లో ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో చేరింది. ‘‘రాజస్థాన్‌లోని చాలా ప్రాంతాల్లో ఆడపిల్లల చదువు గురించి పట్టించుకోరు. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు వచ్చింది. షబ్నంలాంటి అమ్మాయిలు ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తున్నారు’’ అంటున్నారు రాజ్‌కియా పాలిటెక్నిక్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ అశోక్‌ వర్మ. షబ్నం అంటే తెలివైన విద్యార్థి మాత్రమే కాదు... గెలుపు పాఠం కూడా!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement