శివుడు.. భోళా శంకరుడు.శివుడు.. భక్త వశంకరుడు.పత్రం పుష్పం ఫలం తోయం...వీటిలో ఏది సమర్పించినా స్వీకరిస్తాడు.భక్తి శ్రద్ధలతో తనను కొలిచే భక్తులనుఆనందంగా అనుగ్రహిస్తాడు...జన్మానికో శివరాత్రి అంటారు గానీ,మహాశివరాత్రి పర్వదినంఏటేటా వస్తూనే ఉంటుంది.మనలో నిద్రాణమైన భక్తిని జాగృతం చేస్తూనే ఉంటుంది.
త్రిమూర్తులలోనే కాదు, సమస్త దేవతలలోనూ శివుడు భక్తసులభుడు. అందుకే అతడిని భోళాశంకరుడని అంటారు. శంకరుడు భక్తవశంకరుడు. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేశారు. అప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం పుట్టింది. హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలనూ దహించేసే ప్రమాదం ఉండటంతో దేవదానవులందరూ భీతావహులయ్యారు. హాలాహలం బారి నుంచి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుడిని శరణు వేడారు. లోక రక్షణ కోసం ఆ గరళాన్ని తానే మింగి, గొంతులో బంధించి గరళకంఠుడయ్యాడు. హాలాహల ప్రభావానికి అతడి కంఠం కమిలి, నీలంగా మారడంతో నీలకంఠుడిగా పేరుపొందాడు. గరళాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది. ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మథనంలో పుట్టిన చంద్రుడిని తలపై ఉంచుకున్నాడు. నిరంతర తాపోపశమనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు. అయినా, శివుడిని హాలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉంటుందట. అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్ఛిల్లాడట. ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకువ వచ్చేంత వరకు జాగారం చేశారట. అందుకే ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి, జాగారం ఉంటారు. జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ, జప ధ్యానాలతోనూ కాలక్షేపం చేస్తారు. ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం. నిజానికి శివారాధన పురాణాలకు ముందు నుంచే ఉనికిలో ఉంది.
శివారాధన చరిత్ర
క్షీరసాగర మథనానికి సంబంధించిన గాథ ప్రస్తావన చాలా పురాణాలలో ఉంది. మన పురాణ సాహిత్యం క్రీస్తుశకం మూడో శతాబ్ది నుంచి క్రీస్తుశకం పదో శతాబ్దికి చెందినదిగా ఆధారాలు ఉన్నాయి. మన దేశంలో శివారాధన మాత్రం పురాణాలకు శతాబ్దాల మునుపటి నుంచే వాడుకలో ఉంది. క్రీస్తుపూర్వం మూడువేల ఏళ్ల నాడే సింధులోయ నాగరికత విలసిల్లిన కాలంలో శివుడిని పశుపతిగా ఆరాధించేవారు. క్రీస్తుపూర్వం 1500–1200 నాటికి చెందిన రుగ్వేద శ్లోకాలలో రుద్రుడి పేరిట శివుని ప్రస్తావన కనిపిస్తుంది. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దికి చెందిన శ్వేతాశ్వతర ఉపనిషత్తులో శైవమత సిద్ధాంతాల ప్రస్తావన కనిపిస్తుంది. ఈ ఉపనిషత్తు భగవద్గీత కంటే మునుపటిది. అయితే, ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న శైవారాధన పద్ధతులు, సంప్రదాయాలు మాత్రం క్రీస్తుపూర్వం 200 నుంచి క్రీస్తుశకం 100 సంవత్సరాల మధ్య ప్రారంభమై ఉంటాయని గావిన్ ఫ్లడ్ వంటి చరిత్రకారుల అంచనా. పురాణాల రచన మొదలైన తర్వాత శివపురాణం, లింగపురాణం వంటి వాటి ద్వారా శైవానికి ప్రాచుర్యం పెరిగింది. అతి ప్రాచీన శివాలయాలు అప్పటికే కొన్ని ఉనికిలో ఉండేవి. క్రీస్తుశకం ఏడో శతాబ్దికి చెందిన హ్యుయాన్ సాంగ్ భారత ఉపఖండంలో పర్యటించాడు. హిందూకుష్ పర్వతశ్రేణుల వద్దనున్న నూరిస్తాన్ తదితర ప్రాంతాల్లో శైవాలయాలను తిలకించినట్లు తన రచనల్లో వివరించాడు. క్రీస్తుశకం 5–11 శతాబ్దాల కాలం నాటికి దేశంలోని తూర్పు, పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో సైతం ప్రధాన శైవక్షేత్రాల్లోని ఆలయాల నిర్మాణం జరిగింది. బాదామి, ఎలిఫెంటా, ఎల్లోరా గుహాలయాలు, ఖజురహో, భువనేశ్వర్, చిదంబరం, మధురై, కంచి వంటి ప్రాంతాల్లోని శివాలయాలు ఆ కాలానికి చెందినవే. అప్పటికే శైవమతం బాగా వ్యాప్తిలో ఉండేది. క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్దికి చెందిన శంకరాచార్యుల కాలానికి శైవమతంలో పాశుపత, లకులీశ, కాపాలిక, తాంత్రిక శైవ అనే నాలుగు ప్రధాన శాఖలు కూడా ఏర్పడ్డాయి. వైష్ణవ ఆళ్వార్లు, భక్తి ఉద్యమం వ్యాప్తికి ముందు దక్షిణ భారతదేశంలో బౌద్ధ, జైన మతాలతో పాటు శైవమతానికి చాలా ప్రాచుర్యం ఉండేది.
మహాభారతం వంటి ఇతిహాసాలలో శైవ, వైష్ణవాల రెండింటి ప్రస్తావనా ఉన్నప్పటికీ, దక్షిణాదిలో వైష్ణవం కంటే శైవమే పురాతనమైనదని చరిత్రకారుల అంచనా. వైష్ణవానికి చెందిన వైఖానస వంటి ఆగమ సంప్రదాయాలను శైవమతం ప్రభావితం చేసింది. ఆగమ సంప్రదాయాలపై శైవ ప్రభావానికి ‘ఈశ్వర సంహిత’, ‘పద్మ సంహిత’, ‘పరమేశ్వర సంహిత’ వంటి ప్రాచీన గ్రంథాలే నిదర్శనంగా నిలుస్తాయి. దక్షిణ భారతదేశంలో చాలా చోట్ల పురాతన స్వయంభూ శివలింగాలు, ఆలయాలు కనిపిస్తాయి. చోళుల కాలంలో ఈ ప్రాంతంలో శైవాలయాలు లెక్కకు మిక్కిలిగా నిర్మితమయ్యాయి. హిమాలయ ప్రాంతం నుంచి చైనా, టిబెట్ ప్రాంతాలకు శైవం కొంత వ్యాపించినా, దక్షిణ భారత ప్రాంతం నుంచి ఆగ్నేయాసియాకు మరింతగా విస్తరించింది. ఇండోనేసియా, మలేసియా, కంబోడియా, వియత్నాం, థాయ్‌లాండ్‌లలోని పురాతన ఆలయాల్లో శైవ ఆరాధనకు చెందిన చిహ్నాలు కనిపిస్తాయి. ఇవన్నీ క్రీస్తుశకం నాలుగో శతాబ్ది నుంచి ఏడో శతాబ్ది కాలానికి చెందినవి. ఇండోనేసియాలో శివుడిని ‘భట్టరగురు’ పేరిట ఆరాధించేవారు. క్రీస్తుశకం పదిహేనో శతాబ్దిలో ఇండోనేసియా, మలేసియాలలో ఇస్లాం వ్యాప్తి మొదలవడంతో శైవ, బౌద్ధ సంప్రదాయాలు మరుగున పడ్డాయి.
యోగ సంప్రదాయంలో శివుడు
యోగ సంప్రదాయంలో శివుడిని ఆదియోగిగా పరిగణిస్తారు. చాలా శివాలయాల్లో శివుడిని లింగరూపంలో ఆరాధిస్తారు. శివుడిని మూర్తిరూపంలో ఆరాధించే ఆలయాల్లో ఎక్కువగా శివుడు యోగముద్రలోనే కనిపిస్తాడు. నాథయోగ సంప్రదాయంలో శివుడిని మత్సే్యంద్రనాథునిగా, గోరఖ్‌నాథునిగా ఆరాధిస్తారు. శివుడిని నాట్యాభినయ కళలకు అధిదేవునిగా భావిస్తారు. నృత్య నాటక ప్రదర్శనలలో శివుని నటరాజ మూర్తిని ఆరాధించడం శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. బాదామి గుహలు, ఎల్లోరా గుహలు, ఖజురహో, చిదంబరం వంటి చోట్ల నటరాజ భంగిమలో శివుని పురాతన విగ్రహాలు కనిపిస్తాయి. యోగ సంప్రదాయంలో మాత్రమే కాదు, జైన బౌద్ధ మతాల్లోనూ శైవ ప్రభావం కనిపిస్తుంది. నాథయోగులు ఆరాధించే మత్సే్యంద్రనాథుని బౌద్ధులు కూడా ఆరాధిస్తారు. నేపాల్ రాజధాని కఠ్మాండూలోని ‘సెతో మచీంద్రనాథ్’ ఆలయంలో హిందువులతో పాటు బౌద్ధులు కూడా పూజలు, ప్రార్థనలు జరుపుతారు. బౌద్ధులకు చెందిన బోధిసత్వునిలో శివుని లక్షణాలు చాలా వరకు కనిపిస్తాయి. శైవంలోని తాంత్రిక ఆరాధన రీతిలోనే జైనులు తమదైన తాంత్రిక ఆరాధన పద్ధతిని ఏర్పరచుకున్నారు. పదకొండో శతాబ్దికి చెందిన జైన గ్రంథం ‘భైరవ పద్మావతికల్ప’లో ప్రస్తావించిన ‘పద్మావతి’కీ శైవ శాక్తేయాలలోని ‘త్రిపుర భైరవి’కీ మధ్య చాలా పోలికలు కనిపిస్తాయి.
ద్వాదశ జ్యోతిర్లింగాలు
శివుడిని లింగ రూపంలో ఆరాధించడమే ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. శివుడిని మూర్తి రూపంలో పూజించే ఆలయాలు చాలా తక్కువగా మాత్రమే కనిపిస్తాయి. లింగ రూపంలో శివుడిని ఆరాధించే ఆలయాల్లో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు అత్యంత ప్రధానమైనవి. నిరంతరం భక్తుల సందడి కనిపించే ఈ క్షేత్రాలలో ఏటా కార్తీక మాసంలోను, మహాశివరాత్రి పర్వదినంలోను మరింతగా భక్తజన సందోహం కనిపిస్తుంది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు ఇవే:
సోమనాథ్: గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన ప్రభాస్ పట్టణంలో వెలసిన క్షేత్రం ఇది. చంద్రుడు ఇక్కడ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించడంతో ఇది సోమనాథ క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. సోమనాథ క్షేత్రంలో తొలి ఆలయాన్ని ఎప్పుడు ఎవరు నిర్మించారనే దానిపై ఎలాంటి ఆధారాలూ లేవు. తొలినాటి ఆలయం జీర్ణ స్థితికి చేరుకోవడంతో క్రీస్తుశకం ఏడో శతాబ్దికి చెందిన యాదవ రాజులు పాత ఆలయం ఉన్న చోటే కొత్తగా ఆలయ నిర్మాణం చేశారు. సిం«ద్ ప్రాంతాన్ని పాలించిన అరబ్ రాజప్రతినిధి దండయాత్రలో యాదవ రాజులు నిర్మించిన సోమనాథ ఆలయం నాశనమైంది. ఇదేచోట గుర్జర–ప్రతీహార రాజు రెండో నాగభట్ట క్రీస్తుశకం 815లో కొత్త ఆలయాన్ని నిర్మించాడు. ఎర్రరాతితో నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికీ నిలిచి ఉంది.
శ్రీశైలం: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో దట్టమైన నల్లమల అడవులలో కొండగుట్టల నడుమ వెలసిన క్షేత్రం ఇది. ఇక్కడ శివుడు మల్లికార్జునుడిగా, పార్వతీదేవి భ్రమరాంబికగా వెలిశారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమే కాదు, అష్టాదశ శక్తిపీఠాల్లో కూడా ఒకటిగా శ్రీశైలం ప్రసిద్ధి పొందింది. శ్రీశైల క్షేత్రం ప్రస్తావన పురాణాలలో కనిపిస్తుంది. ఇది కచ్చితంగా ఏనాటిదో చెప్పేందుకు చారిత్రక ఆధారాలు లేవు. క్రీస్తుశకం ఆరో శతాబ్దికి చెందిన మైసూరు కదంబ రాజుల తాల్గుండి శాసనంలో శ్రీశైలం పేరు కనిపిస్తుంది. శ్రీశైల శిఖరాన్ని దర్శించుకుంటే చాలు మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. దేశంలోని అతి పురాతన నగరాల్లో ఒకటైన ఉజ్జయిని శక్తిపీఠం కూడా. అమ్మవారు ఇక్కడ మహాకాళిగా వెలసింది. ఇక్కడి కాలభైరవ ఆలయం కూడా అత్యంత ప్రసిద్ధమైనది. మహాకాలేశ్వర క్షేత్రంలో శివుడు దక్షిణామూర్తి రూపంలో దక్షిణాభిముఖంగా దర్శనమిస్తాడు. ఇక్కడి పురాతన ఆలయాలు ఏనాటివో తెలియదు. క్రీస్తుశకం ఆరో శతాబ్దికి చెందిన మహాకవి కాళిదాసు ఈ క్షేత్రంలోనే కాళికాదేవిని ప్రసన్నం చేసుకున్నట్లు ప్రతీతి. క్రీస్తుశకం పదమూడో శతాబ్దిలో ఇల్టట్‌మిష్ దాడిలో మహాకాళేశ్వర ఆలయం కొంత దెబ్బతిన్నది. పద్దెనిమిదో శతాబ్దికి చెందిన మరాఠా సేనాని రాణోజీ సింధియా ఆలయ పునర్నిర్మాణం చేశాడు.
ఓంకారేశ్వర్: ఇది కూడా మధ్యప్రదేశ్‌లోనే ఉంది. నర్మదా నదిలో ఏర్పడిన దీవిలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం వెలసింది. ఈ దీవిని అమలేశ్వరంగా, అమరేశ్వరంగా పిలుచుకుంటారు. ప్రస్తుతం ఖాండ్వా జిల్లా శివపురి పట్టణం పరిధిలో ఈ క్షేత్రం ఉంది. ఇక్ష్వాకు వంశానికి చెందిన మాంధాత తపస్సుకు మెచ్చి శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలసినట్లు పురాణాల్లో ఒక కథనం ఉంది. వింధ్య పర్వతం తపస్సుకు మెచ్చి శివుడు ఇక్కడ వెలసినట్లు మరో కథనం. ఆదిశంకరాచార్యులు ఈ క్షేత్రంలోనే ఒక గుహలో తపోధ్యానంలో ఉన్న తన గురువు గోవిందపాదులను కలుసుకున్నారు.
బైద్యనాథ్: జార్ఖండ్‌లోని దేవగఢ్ జిల్లాలో వెలసిన క్షేత్రం ఇది. రావణాసురుడు ఇక్కడ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణాల కథనం. రావణుడు ఒకసారి గాయపడినప్పుడు సాక్షాత్తు శివుడే అతడికి వైద్యం చేసి స్వస్థత చేకూర్చాడని, అందుకే వైద్యనాథుడిగా ప్రసిద్ధి పొందాడని ప్రతీతి. కార్తీకమాసంలోను, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మాత్రమే కాదు, ఏటా శ్రావణమాసంలో జరిగే ‘శివమేళా’కు లక్షలాదిగా భక్తులు ఇక్కడకు చేరుకుంటారు. వైద్యనాథ క్షేత్రాన్ని దర్శించుకుంటే ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుందని భక్తుల విశ్వాసం.
భీమశంకర్: మహారాష్ట్రలోని పుణే సమీపంలో సహ్యాద్రి పర్వత శ్రేణుల వద్ద భీమా నది ఒడ్డున వెలసిన జ్యోతిర్లింగ క్షేత్రం ఇది. త్రిపురాసుర సంహారం తర్వాత మహాశివుడు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నట్లు పురాణాల కథనం. పురాతనమైన ఈ ఆలయాన్ని గురించిన ప్రస్తావన క్రీస్తుశకం పదమూడో శతాబ్దికి చెందిన సాహిత్యంలో కనిపిస్తుంది. నాథ సంప్రదాయానికి చెందిన యోగి, కవి జ్ఞానేశ్వర్ పదమూడో శతాబ్దిలో ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నాడు. నాగర శైలిలో నిర్మితమైన ఈ ఆలయం ఏనాటిదో కచ్చితమైన ఆధారాల్లేవు. బాజీరావు పీష్వా సోదరుడు చిమాజీ పీష్వా పద్దెనిమిదో శతాబ్దిలో బహూకరించిన రోమన్ శైలి గంటలు ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. వీటిలోని భారీ గంటపై జీసస్, మేరీమాతల బొమ్మ ఉండటం విశేషం.
రామేశ్వరం: తమిళనాడులోని రామేశ్వర జ్యోతిర్లింగాన్ని సాక్షాత్తు శ్రీరాముడు అర్చించినట్లు పురాణాలు చెబుతున్నాయి. కాశీలోని గంగాజలాన్ని తెచ్చి రామేశ్వరలింగాన్ని అభిషేకించి, ఆ తర్వాత రామేశ్వర తీరంలోని ఇసుకను తీసుకుపోయి కాశీలో కలపడం అనాది సంప్రదాయం. రామేశ్వర తీరం నుంచి రాముడు వానరుల సాయంతో సేతువును నిర్మించి లంకా యుద్ధానికి బయలుదేరాడట. రావణ సంహారం తర్వాత బ్రహ్మహత్యా పాతకాన్ని నిర్మూలించుకోవడానికి రాముడు ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణాల కథనం. పదో శతాబ్దికి చెందిన శ్రీలంక చక్రవర్తి పరాక్రమబాహు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఆ తర్వాత పన్నెండో శతాబ్ది నుంచి పలువురు రాజులు ఈ ఆలయ నిర్మాణాన్ని మరింత విస్తరించారు.
నాగేశ్వర్: గుజరాత్‌లోని ద్వారక వద్ద దారుకావనంలో నాగేశ్వర జ్యోతిర్లింగం వెలసింది. పలు పురాణాలలో దారుకావన ప్రస్తావన కామ్యకవనంగా, ద్వైతవనంగా, దండకవనంగా కనిపిస్తుంది. దారుకావనాన్ని దారుకుడనే రాక్షసుడు పాలించేవాడు. అతడు ప్రజలను నానా హింసలు పెట్టేవాడు. అమాయకులను నిర్బంధించేవాడు. ఒకసారి సుప్రియుడనే శివభక్తుడిని ఖైదులో బంధించాడు. సుప్రియుడు ఖైదులోనే శివలింగాన్ని ప్రతిష్ఠించి, తోటి బందీలతో కలసి పంచాక్షరి గానాన్ని ప్రారంభించాడు. దారుకుడి భటులు అతడిని సంహరించేందుకు సిద్ధపడగా, శివుడే ప్రత్యక్షమై సుప్రియుడికి ఒక దివ్యాయుధాన్ని అనుగ్రహించాడు. ఆ ఆయుధంతో సుప్రియుడు రాక్షసులపై విజయం సాధించినట్లు పురాణాలు చెబుతున్నాయి. సుప్రియుడు ప్రతిష్ఠించిన శివలింగమే నాగేశ్వర జ్యోతిర్లింగంగా పూజలందుకుంటోంది.
వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని కాశీగా ప్రసిద్ధి పొందిన వారణాసిలో గంగా తీరాన శివుడు విశ్వనాథుడిగా వెలిశాడు. ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరాలలో ఒకటైన కాశీ నగర ప్రస్తావన చాలా పురాణాలలో కనిపిస్తుంది. విశ్వనాథ ఆలయంతో పాటు విశాలాక్షి, అన్నపూర్ణ ఆలయాలు అత్యంత ప్రాచీనమైనవి. కాశీ మోక్షక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ మరణిస్తే మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. కాశీ నగరాన్ని సాక్షాత్తు పరమశివుడే స్థాపించాడని పురాణాల కథనం. క్రీస్తుశకం ఏడో శతాబ్దికి చెందిన హ్యుయాన్‌సాంగ్ కాశీ నగరాన్ని సందర్శించాడు. కాశీ నగరం కళలకు, సంప్రదాయాలకు కేంద్రంగా ఉందని అతడు తన యాత్రానుభవాల్లో రాసుకున్నాడు.
నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ వద్ద వెలసిన జ్యోతిర్లింగ క్షేత్రం త్రయంబకేశ్వర క్షేత్రం. అగ్ని, సూర్య చంద్రుల తేజస్సు కలిగిన త్రినేత్రాలుగా శివుడు ఇక్కడ వెలసినందున త్రయంబకేశ్వరంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి పొందింది. పవిత్ర గోదావరి నది పుట్టిన చోటు ఇదే. బ్రహ్మగిరి, నీలగిరి, కాలగిరి అనే మూడు కొండల నడుమ వెలసిన ఈ క్షేత్రంలో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని పద్దెనిమిదో శతాబ్దికి చెందిన మరాఠా రాజు బాలాజీ బాజీరావు పీష్వా నిర్మించాడు.
కేదార్‌నాథ్: ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వతాల దిగువన మందాకినీ తీరంలో కేదారేశ్వర జ్యోతిర్లింగం వెలసింది. చలి తీవ్రత ఇక్కడ ఎక్కువగా ఉండటం వల్ల కేదారేశ్వర ఆలయాన్ని ఏటా వైశాఖమాసంలో వచ్చే అక్షయ తృతీయ పర్వదినం నుంచి కార్తీక పూర్ణిమ వరకు మాత్రమే తెరిచి ఉంచుతారు. సముద్ర మట్టానికి దాదాపు పదకొండువేల అడుగులకు పైగా ఎత్తున కేదారేశ్వర క్షేత్రాన్ని దర్శించుకోవడమంటే సాహస యాత్రకు తలపెట్టడమే. అత్యంత పురాతనమైన ఈ ఆలయం ఏనాటిదో ఎవరికీ తెలియదు. చాలా పురాణాలలో కేదారేశ్వర ప్రస్తావన కనిపిస్తుంది. ఈ ఆలయానికి సొంత పూజారి కూడా ఎవరూ లేరు.
బదరీనాథ్ క్షేత్రానికి చెందిన పూజారులే ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు.
ఘృష్ణేశ్వర్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఘృషేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. ఇక్కడ వెలసిన ఘృష్ణేశ్వరుడినే ధుష్మేశ్వరుడని, కుసుమేశ్వరుడని కూడా అంటారు. ఎల్లోరా గుహలకు అతి చేరువలో ఉన్న ఘృష్ణేశ్వర ఆలయం క్రీస్తుశకం పదమూడు–పద్నాలుగు శతాబ్దాల కాలంలో జరిగిన ముస్లింల దండయాత్రల్లో బాగా దెబ్బతిన్నది. శివాజీ తాత మాలోజీ భోస్లే పదహారో శతాబ్దిలో ఆలయాన్ని పునర్నిర్మించినా, మళ్లీ జరిగిన దాడుల్లో నాశనమైంది. ఆ తర్వాత పద్దెనిమిదో శతాబ్దికి చెందిన ఇండోర్ రాణి అహల్యాబాయి ఆధ్వర్యంలో ఘృష్ణేశ్వర ఆలయ పునర్నిర్మాణం జరిగింది. ఇప్పటికీ ఇదే నిలిచి ఉంది.
సౌర వైష్ణవ శాక్తేయాల్లోనూ శివారాధన
సనాతన మార్గంలోని సౌర వైష్ణవ శాక్తేయ మతాలకు చెందిన వారు కూడా తమ తమ ప్రధాన దేవతలతో పాటుగా శివారాధన చేసేవారు. విగ్రహారాధనే ప్రధానంగా వివిధ స్మృతుల ఆధారంగా ఏర్పడిన స్మార్త సంప్రదాయంలో నిర్వహించే పంచాయతన పూజల్లో శివుడిని ఇతర దేవతలతో కలిపి ఆరాధించే పద్ధతి ఇప్పటికీ ఉంది. శివ కేశవులకు భేదం లేదని స్కంద పురాణం చెబుతోంది.
‘శివాయ విష్ణు రూపాయ
శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణుః
విష్ణోశ్చ హృదయం శివః’ అని శ్రుతి. శివకేశవులు ఇద్దరూ కలసి ఉన్న పురాతన ఆలయాలు భారత్‌లోనే కాకుండా, ఇతర దేశాల్లోనూ ఉన్నాయి.
సౌర మతం వాయవ్య, తూర్పు భారత ప్రాంతాల్లో వ్యాప్తిలో ఉండేది. శైవానికీ, సౌరానికీ కూడా సాన్నిహిత్యం ఉండేది. శైవ గ్రంథమైన ‘శ్రీకంఠీయ సంహిత’లో సౌర మతానికి చెందిన ఎనభై ఐదు గ్రంథాల ప్రస్తావన ఉంది. అయితే, ఆ గ్రంథాలేవీ ఇప్పుడు అందుబాటులో లేవు. ముస్లింల దండయాత్రలో అవన్నీ నాశనమై ఉంటాయని చరిత్రకారులు భావిస్తున్నారు. అలాగే సౌరానికి చెందిన ‘సౌర సంహిత’లో శైవ గ్రంథమైన ‘వాథూల కాలోత్తర’ ప్రస్తావన ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో అరుదైన శివలింగాలు
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత అరుదైన రెండు శివలింగాలు ఉన్నాయి. వాటిలో ఒకటి అత్యంత ప్రాచీనమైన శివలింగమైతే, మరొకటి పరిమాణంలో అత్యంత పెద్ద స్వయంభూ శివలింగం. అత్యంత ప్రాచీన స్వయంభూ శివలింగం చిత్తూరు జిల్లా గుడిమళ్లం గ్రామంలో కనిపిస్తుంది. ఇది క్రీస్తుపూర్వం మూడో శతాబ్ది నుంచి క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్ది మధ్య కాలానికి చెందినది కావచ్చని పురాతత్వ శాస్త్రవేత్తల అంచనా. ఇక అత్యంత పెద్దదైన స్వయంభూ శివలింగం శ్రీకాకుళం జిల్లా రావివలస గ్రామంలో ఉంది. దీని ఎత్తు ఏకంగా యాభై ఐదు అడుగులు. వానర వైద్యుడు సుషేణుడు ఇక్కడ తపస్సు చేసి శివసాయుజ్యం పొందాడని, హనుమంతుడు అతడి కళేబరాన్ని ఖననం చేసిన చోట స్వయంభూ శివలింగం వెలసిందని పురాణాల కథనం.
Comments
Please login to add a commentAdd a comment