విద్యలన్నింటిలోనూ వేదం గొప్పది. వేదాలన్నింటిలోనూ సంహితకాండలోని నమక చమక మంత్రాలతో కూడిన రుద్రం గొప్పది. అందులోనూ ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరీ మంత్రం గొప్పది. పంచాక్షరిని పలుకలేకున్నా, అందులో ‘శివ’ అనే రెండక్షరాలు చాలా గొప్పవి అని శాస్త్ర వచనం. శివుడినే శంకరుడని కూడా అంటారు. శంకరోతి ఇతి శంకరః అని వ్యుత్పత్తి. అంటే శమనం లేదా శాంతిని కలిగించేవాడు అని అర్థం.
‘శివ శివ శివ యనరాదా... భవభయ బాధలనణచుకోరాదా’ అని త్యాగరాజ స్వామి అన్నాడు గాని, అచంచల భక్తితో శివనామాన్ని స్మరిస్తే చాలు, భవభయ బాధలన్నీ తొలగిపోతాయని శాస్త్ర పురాణాలు చెబుతున్నాయి. మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి శివభక్తులకు అత్యంత పవిత్రమైనది. ఉపవాస దీక్షలతో, జాగరణలతో రోజంతా శివనామ స్మరణలో, అభిషేక, అర్చనాది శివారాధన కార్యక్రమాలలో నిమగ్నమై పునీతమవుతారు.
దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు తొలుత హాలాహలం ఉద్భవించింది. దాని ధాటికి ముల్లోకాలూ దగ్ధమై భస్మీపటలం కాగలవని భయపడిన దేవదానవులు తమను కాపాడాలంటూ శివుడికి మొర పెట్టుకోవడంతో, శివుడు హాలాహలాన్ని మింగి తన కంఠంలో బంధిస్తాడు. హాలాహలం వేడిమికి శివుడి కంఠమంతా కమిలిపోయి, నీలంగా మారుతుంది. ఈ కారణంగానే శివుడు నీలకంఠుడిగా, గరళకంఠుడిగా పేరుగాంచాడు. ఇది జరిగిన రోజు మాఘ బహుళ చతుర్దశి. లోకాలను కాపాడిన శివుడు తిరిగి మెలకువలోకి వచ్చేంత వరకు జనులందరూ జాగరణ చేస్తారు. అప్పటి నుంచి మహాశివరాత్రి రోజున శివభక్తులు జాగరణ చేయడం ఆచారంగా మారిందని ప్రతీతి.
మహాశివరాత్రిని ఎలా పాటించాలంటే...
మహాశివరాత్రి రోజున వేకువజామునే నిద్రలేచి, సూర్యోదయానికి ముందే స్నానాదికాలు ముగించుకోవాలి. ఇంట్లో నిత్యపూజ తర్వాత సమీపంలోని శివాలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి. ఉపవాస దీక్షలు పాటించేవారు పండ్లు, పాలు మాత్రమే స్వీకరించాలి. లౌకిక విషయాలను ఎక్కువగా చర్చించకుండా వీలైనంతగా భగవత్ ధ్యానంలో గడపాలి. పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. వీలుంటే మహాశివునికి అభిషేకం జరిపించడం మంచిది. మరునాటి సాయంత్రం ఆకాశంలో చుక్క కనిపించేంత వరకు జాగరణ ఉండాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు ఉపవాస, జాగరణ నియమాలను పాటించకపోయినా, సాత్విక ఆహారం తీసుకుని, వీలైనంతగా శివ ధ్యానంలో గడపాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment