
మశకం మశకేన ఔషధం!
‘ఉష్ణం ఉష్ణేన శీతలం’ అనే ఆర్యోక్తి తెలిసిందే. బ్రిటిష్ బయోటెక్ కంపెనీ ‘ఆక్సిటెక్’కు చెందిన వైద్య పరిశోధకులు మాత్రం ‘మశకం మశకేన ఔషధం’ అంటున్నారు.
మలేరియా, చికున్ గున్యా, డెంగ్యూ వంటి నానా వ్యాధులను వ్యాపింపజేస్తూ, జనాలను వణికిస్తున్న దోమలకు విరుగుడుగా దోమల దండునే ప్రయోగించేందుకు వారు సమాయత్తమవుతున్నారు. వ్యాధికారక దోమలను అంతం చేసే మేలిరకం దోమల దండును వారు ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. అధికారికమైన అనుమతులు లభించినట్లయితే, ఈ ఏడాది అమెరికాలోని ఫ్లోరిడా కీస్ మస్కిటో కంట్రోల్ డిస్ట్రిక్ట్‌లో ప్రయోగాత్మకంగా ఈ దోమల దండును విడిచి పెట్టాలని భావిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే, త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా దోమల నివారణకు ఇదే పద్ధతిని పాటించే అవకాశాలు లేకపోలేదు.
ఇదెలా సాధ్యం?
దోమలకు దోమలతో విరుగుడు ఎలా సాధ్యమని ఎవరికైనా సందేహం కలగడం అసహజమేమీ కాదు. అయితే, జన్యుమార్పిడి పద్ధతి ద్వారా శాస్త్రవేత్తలు దీనిని సుసాధ్యం చేశారు. లేబొరేటరీలో రూపొందించిన డీఎన్‌ఏను దోమ గుడ్లకు ఇంజెక్ట్ చేశారు. వాటి నుంచి బయటకు వచ్చిన ఆడ, మగ దోమలకు, వాటి ద్వారా పుట్టిన తర్వాతి తరం దోమలకు ఇదే డీఎన్‌ఏ పాకేలా చేశారు. వీటి ద్వారా వ్యాధుల నియంత్రణ ఎలా సాధ్యమవుతుందంటే, వీటిని బయటకు విడిచిపెడితే, ఇవి సాధారణమైన దోమలతో కలిసిపోతాయి.
జన్యుపరివర్తనం చెందిన మగదోమలు వ్యాధుల వ్యాప్తికి కారణమయ్యే ఆడదోమలతో జతకట్టే ప్రక్రియలో సాధారణ మగ దోమలను సునాయాసంగా జయిస్తాయి. జన్యుపరివర్తనం చెందిన మగదోమలతో జతకట్టిన వ్యాధికారక ఆడదోమలు పునరుత్పత్తి చేయలేవు. ఫలితంగా దోమల జనాభా క్రమంగా అంతరించి, వ్యాధుల వ్యాప్తి నిలిచిపోతుందని ‘ఆక్సిటెక్’ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జన్యుపరివర్తనం చేసిన ఈ దోమలను బయటకు విడిచిపెడితే ప్రాణాంతకమైన నాలుగు రకాల డెంగ్యూ వైరస్ సహా పలు రకాల వ్యాధుల వ్యాప్తి నిలిచిపోతుందని అంటున్నారు.
‘ఆక్సిటెక్’ కంపెనీ దోమలపై జన్యుపరివర్తన ప్రయోగాలు చాలాకాలంగానే చేస్తోంది. ఐదేళ్ల కిందట మలేసియా, బ్రెజిల్‌లలో కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో జన్యుపరివర్తనం చేసిన దోమలను విడిచిపెడితే, ఆ ప్రాంతాల్లో దోమల జనాభా ఏకంగా 80 శాతం మేరకు తగ్గింది. ‘ఆక్సిటెక్’ ప్రయోగం ప్రస్తుతం ఎఫ్‌డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) పరిశీలనలో ఉంది. ఎఫ్‌డీఏ అనుమతి లభిస్తే, మొదటగా ఎంపిక చేసిన ఫ్లోరిడా కీస్ డిస్ట్రిక్ట్‌లో ఈ దోమలను విడిచిపెడతారు. అక్కడి ఫలితాలు ఆశాజనకంగా ఉంటే, మిగిలిన ప్రాంతాలకూ విస్తరిస్తారు.