దైవ దాతలు | May 4 - Give day | Sakshi
Sakshi News home page

దైవ దాతలు

Published Sun, Apr 30 2017 1:47 AM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM

దైవ దాతలు - Sakshi

దైవ దాతలు

ఒక మనిషి... నోరులేని జీవాల కన్నీటి రోదనవుతాడు. తెగిపడిన చెట్టు మౌన వేదనవుతాడు. సాటి మనిషి ఆకలి అరుపులకు ఆహారమవుతాడు. ఆ మనిషి పేరు మంచి. మారుపేరు జాలి. ముద్దు పేరు దయ అలియాస్‌ కరుణ.

ఒక మనిషి... నోరులేని జీవాల కన్నీటి రోదనవుతాడు. తెగిపడిన చెట్టు మౌన వేదనవుతాడు. సాటి మనిషి ఆకలి అరుపులకు ఆహారమవుతాడు. ఆ మనిషి పేరు మంచి. మారుపేరు జాలి. ముద్దు పేరు దయ అలియాస్‌ కరుణ. ప్రపంచమంతా మోసం, దగా, కుట్ర, పగ, ద్వేషం, స్వార్థం, హింస, అహంకారం, నయవంచన, క్రూరత్వం లాంటి భయానక జబ్బులతో బాధపడుతుంటే.. ఆ మనిషి మాత్రం పాపం అనే మందు రాసి ఓదారుస్తుంటాడు.

చిన్నప్పుడు చెల్లి ఏడ్చిందని చాక్లెట్‌ని, స్కూల్‌కెళ్లేప్పుడు తోటి నేస్తం బాధపడ్డాడని పలకా బలపాన్నీ, కాలేజీలో జూనియర్‌ భయపడుతున్నాడని కొండంత «ధైర్యాన్నీ, వ్యాపారంలో తన భాగస్వామి దెబ్బతిన్నాడని ఆర్థిక సాయాన్నీ చేస్తూ... అంచెలంచెలుగా ఎదిగిన ఆ మనిషి అసలు పేరు సహాయం. అతడికి ఇవ్వడం మాత్రమే తెలుసు. ‘చిన్నదైనా, పెద్దదైనా.. కష్టమైనా, నష్టమైనా.. తనకు తోచింది, తను ఇవ్వగలిగింది ఏదీ దాచుకోడు. ఇచ్చేస్తాడు.’

హృదయపు గదుల్లో..
 ఎక్కడ అభాగ్యులు బావురుమంటారో, ఎక్కడ అమాయకులు హాహాకారాలు చేస్తుంటారో... ఎక్కడ బాధితులు గుండెలు బాదుకుని ఏడుస్తుంటారో అక్కడ.... నీడలా, నీలువెత్తు అండలా నిలబడే ‘మిస్టర్‌ సహాయం’.. ప్రతి మనిషికి ఆత్మబంధువే. అయితే హృదయపు గదిలో నేను, నా అనే స్వార్థపు లక్షణాలతో.. పోటీ పడుతూ మొదటి స్థాన్నాన్ని కోరుకుంటాడు. తనకు తగిన స్థానం ఇవ్వకపోతే.. అదే హృదయంలో చీకటి గదికి పరిమితమైపోతాడు.

గివ్‌ డే
ఆర్థికంగా వెనుకబడిన వారికి, దుర్భర పరిస్థితులతో సతమతమవుతున్న వారికి సాయం చేసేందుకు ప్రత్యేకంగా ఓ రోజు ఉంది. ఆ రోజే ‘మే–4’ వరల్డ్‌ గివ్‌ డే.  సాయం కోసం ఎదురు చూసే అభాగ్యుల కోసం మే ఫోర్త్‌ డెడ్‌ లైన్‌తో.. ‘బిగ్‌ డే ఆఫ్‌ గివింగ్‌’ అనే ఓ బ్లాగ్‌ కూడా ఉంది. ఇందులో ప్రతీ ఒక్కరు ఆర్థిక సాయం చెయ్యొచ్చు. ఎలాంటి బాధితులకు మన సాయం చెందాలో కూడా.. ఆఫ్షన్స్‌ ద్వారా ఎంచుకోవచ్చు. ఈ బిగ్‌ డే సంస్థ 2013 నుంచి ఈ కలెక్షన్స్‌ స్టార్ట్‌ చేసి.. పలు దేశాల నుంచి డొనేషన్స్‌ సేకరించి అలాంటివారికి అండగా నిలుస్తుంది.

ఐకమత్యమే మహా బలం..
‘స్టాలిన్‌’ సినిమాలో వికలాంగుల పరుగు పందెం సీన్‌ గుర్తుందా..? చిన్నారులంతా పరుగు తీస్తున్న సమయంలో ఓ బాలుడు కాలు జారి కింద పడిపోతాడు. అప్పుడు విజయానికి దగ్గరలో ఉన్న చిన్నారితో సహా అంతా వెనక్కి వచ్చి.. పడిపోయిన తమ స్నేహితుడిని పైకి లేపి.. అంతా భుజాలపై చేతులు వేసుకుని, అడుగులో అడుగులు వేసుకుంటూ  వెళ్లి లక్ష్యాన్ని తాకి అది తమందరి విజయం అని చాటి చెబుతున్న సీన్‌ చూస్తుంటే రోమాలు నిక్కబొడుస్తాయి. గుండెల్లో దాగి ఉన్న ఏదో ప్రవాహం కెరటంగా ఎగిసిపడుతుంది. ‘నేనున్నాను’ అనే భరోసా ఎంత గొప్పదో అర్థమవుతుంది. ‘ఓ మనిషి నిదురలే..! నీలో దాగిన మానవత్వాన్ని మేల్కొల్పు’ అన్నట్లు ఉంటుంది ఆ సన్నివేశం.

ద్రవించదా.. చలించదా..?
గుక్కెడు నీళ్లు దొరక్క రోడ్డు పక్కన గుంతల్లో ఉన్న నీరు తాగే అనాథలు ఒక వైపు... నిలువునీడను నాశనం చేసే ఉగ్రపీడిత దేశాల నుంచి పరుగులు తీస్తున్న బాధితులు మరో వైపు.. సహాయం కోసం నిస్సహాయంగా చూస్తుంటే.. హృదయం ఉన్నవారికి ద్రవించక ఏం చేస్తుంది.? చలించక ఏంచేస్తుంది..?

గాంధీ మాటల్లో..
‘పక్షికింత ధాన్యం.. పశువుకింత గ్రాసం.. మనిషికింత సాయం’ అనేది సమాజం ఏనాడో నమ్మిన నైతిక ధర్మం. ‘ఒక వస్తువు నీదే అయినా... నీకు దాని వల్ల ఉపయోగం లేనప్పుడు, అది అవసరం అయిన వారికి ఇవ్వకుండా దాచుకోవడం కూడా హింసే’ అంటారు గాంధీజీ. ‘నాది అనే మమకారాన్ని త్యజించినప్పుడే మానవత్వం పరిమళిస్తుందని’ ఆయన ఉద్దేశం కాబోలు. నిజమే, దానికి పరిమితమైన పరిధులు ఏముంటాయి..? జాలి, దయ, కరుణ వంటి స్వచ్ఛమైన లక్షణాలు తప్ప.

‘మంచి’ నీడలో..
‘కళ్లతో నవ్వలేని వాడు, మనసుతో ఏడ్వలేని వాడు మనిషే కాదు’ పళ్లతో నవ్వడం, కళ్లతో ఏడ్వడమే మనకు తెలుసు. కానీ స్వచ్ఛమైన భావాలను పలికించేటప్పుడు కళ్లు నవ్వుతాయి. హృదయం బరువెక్కే సన్నివేశాలు కంటపడినప్పుడు మనసు గుక్కపెట్టి ఏడుస్తుంది. ఇవి అప్రయత్నంగా సాగే భావాలు. ఏదేమైనా కన్నీళ్లను గుర్తించే మానవత్వం, కష్టాలను గమనించే మంచి మనుషులు ఉన్నంతకాలం ఈ ప్రపంచం చల్లగానే ఉంటుంది. ఏమంటారు?
– సంహిత నిమ్మన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement