మెహందీ అంటింది | mehandi, a short story | Sakshi
Sakshi News home page

మెహందీ అంటింది

Published Sun, Aug 3 2014 12:48 AM | Last Updated on Sat, Sep 2 2017 11:17 AM

మెహందీ అంటింది

మెహందీ అంటింది

కథ

‘‘ఎన్నాళ్లకు మళ్లీ మీ దర్శనం సాబ్!
లోపలికి దయ చేయండి’’ అంది. ఆమె వెనకాలే నడిచాడు. లేకపోతే చేయి పట్టుకుని లాక్కుపోతుందేమోననిపించింది.
‘‘మాల్ చాహియే సాబ్’’ అడిగాడు ఆటోవాలా.
పరధ్యానంలో ఉన్న శంకరానికి ఆ మాటలు చెవికెక్కలేదు. మళ్లీ అదే మాట ఆటోవాలా నోటి నుండి వెలువడింది. ఏ కళనున్నాడో అతడు జవాబివ్వలేదు. ఆయన బుర్ర నిండా ఆలోచనల సుడులు. ఏదో తెలియని ‘సాంత్వన’ కోసం ఆయన మనస్సు వెదుకులాడుతోంది. ఆటోలో కూర్చున్నాడు. మౌనం అంగీకారంగా తీసుకున్న ఆటోవాలా, స్టార్ట్ చేసి చార్మినార్ వైపు పోనిచ్చాడు.

పుత్లీబౌలి, గౌలీగూడ, నయాపూల్, మూసీ సువాసనలు, హైకోర్టు భవనం దాటి చార్మినార్ ఏరియాలో ప్రవేశించింది ఆటో. ఏవేవో సందులు, ఇరుకు గల్లీలు, ఇరానీ హోటళ్లు, అరిగిపోయిన రికార్డులోంచి పాత హిందుస్తానీ పాటలు, గుడ్డి వెలుతురు. ఇరుకు సందుకు రెండు వైపులా ఇళ్లు. రోడ్డుపైకి తెరుచుకున్న పాతకాలపు భవంతుల కిటికీలు, కిటికీల కింద సింహద్వారాన్ని కప్పుతూ వేలాడుతున్న నిజాము కాలం నాటి గోనెపట్టా పరదాలు. పై కప్పులు కూలిన ఇళ్లు, ఒక్కో చోట గోడల మీద నిలువుగా జారిన వర్షపు నీటి చారికలు. రోడ్డంతా పాన్ మరకలు. ఖాళీ గుట్కా పొట్లాలు. నవ్య నగరానికి భిన్నంగా నాలుగు వందల నాటి సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాలు.
 ఓ ఇరుకు గల్లీలో ఆటో ఆగింది. ఢోలక్ మోత, చప్పట్లు. ‘మేరి బన్‌కీ బాత్ న పూఛో మేరీ బన్ హరియాలా హై’, (నా వనం గురించి అడుగకు. నా వనం సస్యశ్యామలం) అంటూ ఆడ, మగ కాని గొంతులు, గజ్జెల చప్పుడు.
 ‘‘దిగండి సాబ్’’ అన్న మాటతో మళ్లీ ఈ లోకానికి వచ్చాడు. ఆ ఏరియాలోకి మొదటిసారి వస్తున్న శంకరానికి ఏమీ అర్థం కాలేదు.
 ‘‘ఇదేమిటోయ్?’’ ప్రశ్న.
 ‘‘భలే వారే సార్... గానా బజానా. వెయిట్ చేయమంటారా?’’
 ‘‘అక్కరలేదు’’ అన్నట్లుగా చేసైగ చేసి ఆటో దిగాడు.
 సంకేతం కాబోలు, రెండుసార్లు లాంగ్ హారన్ ఇచ్చి ‘యు’ టర్న్ చేసుకుని వెళ్లిపోయాడా ఆటోవాలా.
 సందు అంతా చీకటి. ఎక్కడో చదివాడతను- వీధి లైట్ల బల్బుల్ని స్థానికులు కావాలనే పగలగొడతారట. కొత్తవి వేసినా రెండు రోజుల్లో అవీ పగిలిపోతాయట.
 కిటికీలు అనబడే తెరలు కట్టిన కన్నాల్లోంచి బలవంతంగా బయటకు వస్తోన్న గుడ్డి వెలుతురు. సందుకు ఎదురుగా ఓ ఇల్లు. ఇంటికి రెండు వైపులా ఇంటి గోడల మీద గీచిన పసుపు రంగు పెద్దపులి బొమ్మలు, వాటి పంజాల్లో ‘తల్‌వారు’లు. బూడిద రంగుకు మారిన పరదా. చేరేడు, తలుపుల రెక్కలు, అన్నీ ఒకే రంగుకు మారాయి. పట్టా పరదాను కాస్త తొలిగించాడు శంకరం.
 ‘‘అయియే, ఆయియే బాద్‌షా!’’ ఓ నడి వయస్సు దాటిన ఆడగొంతు. షర్టు లాంటి పల్చని వదులు లుంగీ, చీర. ముక్కుకూ, చెవులకూ బంగారం గుళ్ల వరుసలు. సుర్మా కళ్లు, నెత్తిన ఏవో వెండి ఆభరణాలు. ‘ఒగల్‌దాన్’లోకి పాన్‌ను తుపుక్కున ఉమ్మేసింది. ‘‘పీర్ల బీబీ మీకు సలాం చేస్తోంది’’ అంటూ ఆహ్వానించిందామె. లోపల మళ్లీ ఓ తెర కట్టిన దర్వాజా. ‘‘అరే ఖాజా! నవాబ్ సాబ్ ఆగయా’’ అంది లోనికి చూస్తూ. శంకరం వైపు తిరిగి, ‘‘ఎన్నాళ్లకు మళ్లీ మీ దర్శనం సాబ్! లోపలికి దయ చేయండి’’ అంది. ఆమె వెనకాలే నడిచాడు. లేకపోతే చేయి పట్టుకుని లాక్కుపోతుందేమోననిపించింది. ‘ఠప్’మని నుదురుకు కొట్టుకుంది ద్వార బంధం. తడుముకున్నాడు. అతడి ఎత్తు ద్వారానికి సరిపోలేదు. ‘‘అరరే! మార్ లగ్ గయా క్యా? ఖాజా! బద్మాష్! ఇక్కడ బత్తీ (లైటు) వేయలేదురా’’ అన్న అరుపు. ఆవిడకు తెలుసు అక్కడ లైటు లేదని.
 ‘‘ఇలా నా చేయి పుచ్చుకుని రండి సాబ్’’ అంది. ఆమె చేయి సాయం అక్కర లేకుండానే లోనికి నడిచాడు.
 విశాలమైన హాలు. నేలమీద ఓ మాసిపోయిన తివాచీ. తివాచీకి రెండు వైపులా బయటకు తెరుచుకునే అగ్గిపెట్టెల్లాంటి అరలు. గోడల మీద అసఫ్‌జాహీ వంశీయుల ఫొటోలు. ఎవరో ఓ నవాబు తుపాకీని నేలకి ఆనించి మీసాల్ని మెలిపెడుతూ నించున్నాడు. ఆయన కాళ్ల దగ్గర పులి కళేబరం. నెత్తిన ఇంగ్లిషు వాడి టోపి, వెడల్పాటి బెల్టు, టైట్ ప్యాంటు.
 తివాచీకి అటువైపు ఐదారుగురు యువతులు కూర్చున్నారు. వారి వయస్సులు ఇరవై ఐదు నుంచి నలభై మధ్య ఉంటుండొచ్చు. ఒకరు ఢోలక్ కొడుతుంటే మరొకరు గొంతు కలిపారు. మిగతా వారు చప్పట్లు చరుస్తున్నారు. పెట్రోమాక్సు వెలుతురు అంతగా లేదు. వాళ్ల పాటకు నాదస్వరంలా ‘సుయ్’మంటోంది.
 ‘‘అరే! ఖాజా! బద్మాష్! పాందాన్ తీసుకురా’’ అన్న పీర్ల బీబీ కేక. వయస్సులో ఉన్నప్పుడు ఆమెను ‘బేబీ’ అని పిలిచేవారు కావొచ్చు. వయస్సుడిగాక ‘బీబీ’ అయింది.
 శంకరం, ఆవిడ, బాలీసులకు ఆనుకుని కూర్చున్నారు. హాలుని మరింత పరిశీలనగా చూశాడు శంకరం. వాడిపోయిన మందారం రంగు బాలీసులు. ఇంచుమించు అదే రంగు తివాచీ. అక్కడక్కడా స్టూల్స్ మీద నిలబెట్టబడిన ఆయుధాలు ధరించిన సైనికుల ఇత్తడి విగ్రహాలు. గోడలకు ప్లాస్టిక్ పూలసరాలు.
 మొఖాన మేకప్, సన్నని మీసం, గమ్మత్తుగా కత్తిరించుకున్న గడ్డం, నెత్తిన బోర్లించిన బౌల్ లాంటి ఎంబ్రాయిడరీ టోపీతో ఓ ముప్ఫై ఏళ్ల యువకుడు చేతిలోని పాందాన్ అక్కడుంచి, మోకాళ్లు ముందుకు వంచి, చూపుడు వేలు చుబుకానికి ఆనిస్తూ ‘సలాం’ చేశాడు.
 పాందాన్ తెరిచి, తమలపాకు ఈనెలు చీల్చి నాజూగ్గా సున్నం రాస్తోంది పీర్ల బీబీ. వయస్సుడిగినా వృత్తితో అబ్బిన నాజూకుదనం ఆమెలో కనబడుతోంది.
 శంకరం కంటే ముందే వచ్చి కూర్చున్న ఓ యువకుడు, యువతుల గుంపులోంచి లేచిన ఓ యువతీ అగ్గిపెట్టెల అరల్లో ఓ అరలోకి వెళ్లిపోయారు.
 ఉక్క లాంటి వేడి, చవక రకం సెంటు వాసన, శంకరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. గాలి ఆడటం లేదు. ఒక రకమైన విసుగు ముఖం పెట్టి ‘ఊఫ్’ అంటూ ఊదుకున్నాడు.
 విసుగు కనిపెట్టిన పీర్ల బీబీ చెప్పసాగింది, ‘‘ఆ పాడుతున్న పిల్ల ఉంది చూశారు! ‘చమేలీ’. పద్నాలుగేళ్లే సాబ్!  ఎంత మంది దానిమీద కన్నేశారనుకున్నారు? మీరు చాలా కిస్మత్‌వాలా సాబ్! ఒక్కరోజు ఆలస్యం అయినా మీకు దొరికేది కాదు.’’
 శంకరం నిశ్శబ్దాన్ని గమనించి మళ్లీ తనే అందుకుంది. ‘‘నిజం నవాబ్ సాబ్’’ వేయికి తక్కువ అసలు ముట్టనే ముట్టను. మీరు వెళ్లేటప్పుడు మరో అయిదు వందలు బక్షీష్‌గా ఖుషీగా మీరే ఇస్తారు. ఇంత ఫ్రెష్ సరుకు ఈ గల్లీ మొత్తానికి లేదు సాబ్! అబద్ధం అయితే నా పేరు మార్చుకుంటా’’ అంది రొమ్ము చరుచుకుంటూ. ఆమె చేతి పది వేళ్లకున్న పెద్ద పెద్ద రాళ్లు తళుక్కుమన్నాయి.
 శంకరం జేబులోంచి ఫెళఫెళలాడే ఓ నోటు పీర్ల బీబీ వదులు అంగీ జేబులోకి పోయింది. చమేలీకి కనుసైగ అందింది. ఓరగా శంకరాన్ని చూస్తూ, ఓ అగ్గిపెట్టెల అరలోనికి వెళ్లింది. మరో పాట మొదలైంది. ‘‘మేరీ మహబూబ్ తూ...’’
 చమేలీని అనుసరించటానికి శంకరం కూడా లేవబోయాడు. ‘‘సాబ్! నా ఇనాం’’ ఒళ్లంతా మెలికలు తిరుగుతూ ఖాజా.
 ఓ పచ్చనోటు జేబులు మారింది. నుదురు నేలకు తాకేంతగా వంగి సలాం చేశాడు ఖాజా. ‘‘జరా నాజూక్ సాబ్! ఇదే మొదటిసారి. బెదరగలదు. అయినా మీ లాంటి ‘ఆశిఖ్’లకు చెప్పాలా సాబ్!’’ పీర్ల బీబీ గొంతు సన్నాయి నొక్కులు నొక్కుతోంది.
 చాలా ఇరుకైన గది. చిన్న మంచం. పల్చని పరుపు. నల్లరంగు ఛాదర్. తెరలు దించిన కిటికీ వైపు ముఖం చేసి నిలుచున్న చమేలీ. ఆకుపచ్చ పైజామా, తెల్ల కుర్తా, మెడకు ఓ వైపు జీరాడుతున్న నైలాన్ దుపట్టా.
 చమేలీ భుజం మీద శంకరం చేయి సతారంగా పడింది. చమేలీ అతడి వైపు తిరిగింది. పీర్ల బీబీ మాటలు పూర్తిగా అబద్ధం కావు. చామనఛాయ, కోల ముఖం. చేపల్లాంటి కళ్లు. సన్నజాజి లాంటి నాసిక. ‘పాన్’ వల్ల మెరుస్తున్న ఎర్రని పెదాలు. పాపెట్లో ‘సునేరు’. జుట్టునూ ముఖాన్నీ కప్పుతున్న ప్లాస్టిక్ ముత్యాల సరాలు. మోచేతి వరకు మెరుస్తున్న గాజులు.
 మంచంలో కూర్చున్నాడు శంకరం. ‘‘సాబ్!’’ మృదువుగా పెదాలు విచ్చుకున్నాయి. పండు దానిమ్మ గింజల్లాంటి పలువరుస.
 ‘‘పాన్ ఇవ్వనా?’’
 పీర్ల బీబీ ఇచ్చిందే ఇంకా నోట్లోనే ఉంది. అయినా చమేలీ చేత్తో అందుకోవటంలోని అనుభవం వేరు. ‘ఊ’. కావాలో వద్దో ఎటూ తేల్చని సమాధానం. చిన్నగా గాజులు లయబద్ధంగా శబ్దం చేస్తూంటే తమలపాకుపైకి నాజూగ్గా సున్నం, కాచు, ఛాలియా చేర్చింది. మధ్య మధ్య శంకరం వైపు చిరునవ్వులు విసిరేస్తూ ‘బీడా’లు చుట్టింది.
 చనువుగా మంచంలో శంకరం పక్క కూర్చుంది. మంచం కిర్రుమంది. సిగ్గు నటిస్తూ నోటికి అందించింది. శంకరానికింకా కైపు ఎక్కటం లేదు. ఎక్కడో చదివాడు. ఈ ప్రొఫెషనల్స్‌లో ఎన్నో జబ్బులుంటాయని వెనక్కు తగ్గలేక  ముందుకు పోలేకా మల్లగుల్లాలు పడుతున్నాడు.
 చమేలీ పక్కన చేరగానే ఆయన మనస్సు ముడుచుకుపోయింది. వృత్తిపరంగా ఆరితేరిన చమేలీకి అది అర్థం కావటానికి ఎంతోసేపు పట్టలేదు.
 ‘‘మీకిది కొత్తా’’ అంది.
 ‘‘జరా నాజూక్ సాబ్! ఇదే మొదటిసారి’’ మాటలు గుర్తుకు వచ్చాయి. శంకరానికి నవ్వు వచ్చింది. ‘‘ఆ నవ్వెందుకో నాకు చెప్పగూడదూ’’ అంటూ మంచం పట్టీ మీదకు ఒరుగుతూ ఆయన్నూ లాక్కుంది. పులుముకున్న సెంటూ చెమటా రెండూ కలిసి అదో కొత్త వాసన.
 గుచ్చుకుంటున్న చమ్కీ దుస్తులు దూరమయ్యాయి. ఆమె పొడవాటి వేళ్ల గోళ్లు శంకరం వీపును గుచ్చుతున్నాయి. మెరుస్తున్న ఆమె గాజులు ఆయన వీపుకు ఒరుసుకుపోతున్నాయి. ఆయన వీపు ఎర్రనై చిన్న మంట. ‘మెహబూబ్‌కా మెహందీ’ అంటుకుంది. పున్నమి చంద్రుటి రాకతో పొంగిన సముద్రపు కెరటాలు రగిలి రగిలి అమావాస్య రాత్రిలాగా చల్లబడ్డాయి. అనుభవాంతర తన్మయత్వంతో కళ్లు మూతలు పడుతున్నాయి. ప్యాంటు జోబీలో చమేలీ చేయి తారాడుతుంటే ఈ లోకంలోకి వచ్చాడు శంకరం.
 ‘ఏం’ అన్నట్లుగా కళ్లతోనే ప్రశ్న.
 ‘‘అంతా ఆ ముసలి ముండకే ఇచ్చారా?’’ ఖాళీ జేబులు తడుముతున్న చమేలీ శంకరం నుండి దూరం జరిగి, ‘‘నా బక్షీష్’’ అంది దీనంగా. ‘నా శ్రమంతా వృథాయేనా’ అన్నట్లున్నాయ్ ఆ చూపులు.
 ‘‘అదేంటి, నా మీద ప్రేమ లేదూ! నీదంతా నటనేనా?’’ శంకరం నిలవరింపు.
 ‘‘ప్రేమా, మట్టిగడ్డా!’’ అంటూ కాసేపాగి, ‘‘నా బక్షీష్’’ అంది కొంచెం అధికార స్వరంతో.
 దగ్గరకు లాక్కోబోయాడు. విదిలించుకుంది చమేలీ. ‘బోణీ నై హూవా’ సణుగుతోంది. ఆయన హిప్ పాకెట్‌లోంచి రెండు పచ్చనోట్లు బయటకు వచ్చాయి. చమేలీ ముఖంలో మళ్లీ వెలుగు వచ్చింది. గభాలున మంచంలో వాలి శంకరాన్ని పొదుముకుంది. ‘‘అజీ! నువ్వే నా ప్రాణం. ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోండి. క్వార్టర్, బిర్యానీ తెప్పించనా? ఎగస్ట్రా అవుతుంది. మరి’’ ముద్దుల వర్షం కురిపిస్తోంది. శంకరానికి తన్మయత్వం కలుగటం లేదు. నెమ్మదిగా వదిలించుకుని బయటకు వచ్చాడు. హాల్లో పీర్ల బేబీ కునుకుతోంది. తలుపు చప్పుడు విని కళ్లు తెరిచింది. శంకరాన్ని గమనించింది. మరోవైపు తిరిగి కళ్లు మూసుకుంది. ఖాజా బద్మాష్ పత్తాలేడు.
 చెప్పుల్లో కాళ్లు దూర్చి బయటపడ్డాడు. పక్కింట్లోంచి ఖవాలీ, మద్దెల చప్పుడు, ‘‘ఓ జానె వాలే కభీ న కభీ లౌట్ కె ఆనా’’.
 చమేలీ ఇచ్చిన బీడాలో సున్నం ఎక్కువైనట్లుంది. నోరు మండుతుంటే దవడ తడుముకున్నాడు. ఇంటి బయటి గోడలకు గీచిన పులులు గర్జించినట్లనిపించింది.
 ‘పులి రాజు’ శంకరం మళ్లీ మెహందీకై అటేపు వస్తాడో - లేక అఫ్జల్‌గంజ్ ఆస్పత్రి చుట్టూ తిరుగుతాడో కాలమే నిర్ణయించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement