గోరంత రంగు... కొండత కథ
ఫ్లాష్ బ్యాక్
సౌందర్య వర్ణన చేసేటప్పుడు నఖశిఖ పర్యంతం వర్ణించేవారు మన పూర్వకవులు. అంటే, కొనగోటి నుంచి కొప్పు వరకు నానాలంకార ప్రయోగాలతో వర్ణిస్తూ పద్యాలల్లేవారు. కొప్పుల సంగతి సరే, ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మరి కొనగోటి వర్ణనలకు ఎందుకంత ప్రాధాన్యం అంటారా..? నఖసౌందర్యానికి కూడా అప్పట్లో చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు. వాటిని అందంగా తీర్చిదిద్దుకునేవారు. రంగు కోసం గోరింట పెట్టుకొనేవారు. గోరుపై గోరంత రంగు పడితేనే, దాని అందం కొండంత అవుతుందని భావించేవారు.
నఖసౌందర్యం కోసం రకరకాల నెయిల్ పాలిష్‌లను ఇప్పటికీ అతివలు విరివిగా వాడుతూనే ఉన్నారు. అయితే, గోరింట పెట్టుకోవడం అమ్మమ్మల నాటి ఫ్యాషన్ అని, నెయిల్ పాలిష్‌లు పూసుకోవడం అల్ట్రా మాడర్న్ ఫ్యాషన్ అని చాలామంది అపోహపడుతుంటారు. కానీ, అది నిజం కాదు. నెయిల్ పాలిషే చాలా చాలా పురాతనమైన ఫ్యాషన్.
చైనీస్ మహిళలు క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల నాడే గోళ్లకు రంగులు పూసుకునేవారు. ర వంశస్థుల పాలనలో క్రీస్తుపూర్వం 600 సంవత్సరం నాటికి నెయిల్ పాలిష్ చైనాలోని సంపన్న వర్గాల మహిళలకు తప్పనిసరి ఫ్యాషన్‌గా ఉండేది. వాళ్లు తేనెపట్టులోంచి సేకరించిన కొవ్వు, కోడిగుడ్డు సొన, శాకాహార రంగులు ఉపయోగించి, గోళ్లకు పూసుకునే రంగులు తయారు చేసేవారు. పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత కృత్రిమ పద్ధతుల్లో రకరకాల రసాయనాలు ఉపయోగించి తయారు చేసే నెయిల్ పాలిష్‌లు విరివిగా వాడుకలోకి వచ్చాయి. దరిమిలా మారుమూల పల్లెలకూ వీటి వాడుక వ్యాపించింది.