సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’ ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే.పుష్పగాడి దెబ్బకు ఇండియన్ బాక్సాఫీస్ షేకయ్యింది.బన్నిని పాన్ ఇండియా స్టార్‌ని చేయడమే కాకుండా.. నేషనల్ అవార్డుని కూడా తెచ్చిపెట్టింది. అలాంటి సినిమాకు సీక్వెల్ వస్తుందంటే.. ఆడియన్స్ అంచనాలు ఆటోమేటిక్‌గా పెరిగిపోతాయి. అందుకే పుష-2(పుష్ప:ది రూల్) విషయంలో సుకుమార్ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా తీర్చిదిద్దుతున్నాడు. వచ్చే ఏడాది ఆగస్ట్ 15న ఈ చిత్రం విడుదల చేస్తామని ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తూ.. ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. అందులో అల్లు అర్జున్ వేలు గోరు హైలైట్ చేస్తూ చూపించారు. ఆ మధ్య రిలీజ్ చేసిన ‘వేర్ ఈజ్ పుష్ప’ అనే స్పెషల్ వీడియోలోనూ బన్నీ గోరును హైలైట్ చేశారు. అప్పట్లో అది పెద్దగా పట్టించుకోలేదు కానీ.. ఇప్పుడు గోరుపై నెట్టింట విపరీతమైన చర్చ జరుగుతోంది.
సుకుమార్ ప్రత్యేకత అదే
తన సినిమాలో అనవసరపు సీన్స్ ఉండకుండా జాగ్రత్త పడతాడు సుకుమార్. కథతో సంబంధం లేని సన్నివేశాలను అస్సలు పెట్టడు. ఆయన తీసే ప్రతి షాట్ విషయంలోనూ కొన్ని రిఫరెన్స్‌లు ఉంటాయి. ప్రతి సీన్ వెనుక ఓ అర్థం ఉంటుంది. క్యారెక్టర్ల పేర్లతో పాటు వారి గెటప్ వెనుకాల కూడా ఓ కథ ఉంటుంది. రంగస్థలం సినిమాలో జగపతి బాబు పాత్ర పేరు ఫణీంద్రభూపతి.పేరుకు తగ్గట్టే పాములా బుసలు కొడుతుంటాడు. అంతేకాదు పాముని ఎలాగైతే కొట్టి చంపుతారో.. చిట్టి బాబు(రామ్ చరణ్) కూడా ఫణీంద్రను అలా కొట్టి చంపుతాడు. అందుకే ఆ పాత్రకు ఆ పేరు పెట్టాడు. ఓ పాత్రను తీర్చిదిద్దడంలో సుకుమార్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహారణ మాత్రమే.
చిటికెన వేలు కథేంటి?
పుష్ప-2లో ఇప్పటివరకు విడుదలైన ప్రచార పోస్టర్లు, వీడియోలలో అల్లు అర్జున్ చిటికెన వేలు గోరును హైలైట్ చేస్తూ చూపించారు. దీని వెనుక ఓ కథ ఉందంట. కొన్ని సంస్కృతుల్లో సమాజంలో తమ స్థాయిని చూపించుకునేందుకు ఇలా చిటికెన వేలు గోరును పెంచుకుంటారట. తాము సంపన్నులమని చెప్పుకోవడానికి కూడా ఇలా గోరును పెంచుకుంటారట.
అలాగే రాజ్యాన్ని పరిపాలించడానికి తమకే అర్హత ఉందని చెప్పడానికి కూడా ఇలా చిటికెన వేలు గోరును పెంచుతారట. ఎర్రచందనం వ్యాపారాన్ని పుష్పరాజ్ తన చిటికెన వేలుపై నిలబెట్టి నడిపిస్తున్నాడని సూచనగా సుకుమార్ వేలు గోరును హైలైట్ చేస్తున్నాడని ఇండస్ట్రీ టాక్. ఇది ఎంతవరకు నిజమే తెలియదు. గోరు హైలైట్ చేయడం వెనుక అసలు కథ ఏంటనేది తెలియాలంటే సుకుమార్ చెప్పేంత వరకు ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment