పుష్ప ఐదేళ్ల జర్నీలో ప్రతి క్షణం నాకు ముఖ్యమే: హీరో అల్లు అర్జున్ | Pushpa 2 The Rule Thank Meet: Allu Arjun | Sakshi
Sakshi News home page

పుష్ప ఐదేళ్ల జర్నీలో ప్రతి క్షణం నాకు ముఖ్యమే: హీరో అల్లు అర్జున్

Published Sun, Feb 9 2025 3:51 AM | Last Updated on Sun, Feb 9 2025 3:51 AM

Pushpa 2 The Rule Thank Meet: Allu Arjun

∙నవీన్‌ ఎర్నేని, సుకుమార్, అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్, వై. రవిశంకర్, చెర్రీ

‘‘చాలాసార్లు ‘పుష్ప’ సినిమా అసలు అవుద్దా అనిపించింది. కోవిడ్‌ టైమ్‌లో ఎంతో కష్టపడ్డాం. జాతర ఎపిసోడ్‌ టైమ్‌లో... ఈ ఎపిసోడ్‌ ఎండ్‌ని చూడగలనా అనిపించింది. ‘పుష్ప 2’(Pushpa 2)ని 2024 ఆగస్టు 15న రిలీజ్‌ చేయాలనుకున్నాం. కానీ చేయలేకపోయాం. డిసెంబరు 5న రిలీజ్‌ చేశాం. అయితే చివరి నిమిషం వరకూ కష్టపడ్డాం. ‘పుష్ప’ సినిమాకు చెందిన ఐదేళ్ల ప్రయాణంలోని ప్రతి క్షణం నాకు ముఖ్యమే. ఈ సినిమాగానీ హిట్టైతే ఈ కష్టం అంతా నా ఫ్యాన్స్ కు అంకితం చేయాలనుకున్నాను... అంకితం చేస్తున్నాను. ‘పుష్ప 3’ గురించి నాకు, సుకుమార్‌గారికి తెలియదు. కానీ అదొక అద్భుతంలా అయితే ఉంది (నవ్వుతూ)’’ అన్నారు అల్లు అర్జున్(Allu Arjun) .

హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్‌’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సాధించిన నేపథ్యంలో ‘థ్యాంక్స్‌ మీట్‌’(Thank You Meet)ను శనివారం హైదరాబాద్‌లో నిర్వహించింది చిత్రయూనిట్‌. ఈ వేదికపై ఇంకా అల్లు అర్జున్  మాట్లాడుతూ– ‘‘పుష్ప 2’(Pushpa 2) సినిమా రిలీజ్‌ సమయానికి మరో హిందీ చిత్రం రిలీజ్‌ కావాల్సింది. కానీ వాళ్లు వాయిదా వేసుకున్నారు. ఇలా ప్రతి ఇండస్ట్రీ నుంచి సపోర్ట్‌ లభించింది.

ఇండియన్  సినిమాలోని అన్ని ఇండస్ట్రీలకు, ఆడియన్స్ కు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ‘పుష్ప’ ఫ్యాన్స్ కు థ్యాంక్స్‌. ఒక్కరికి మాత్రం థ్యాంక్స్‌ చెప్పాలనుకోవడం లేదు. ఎందుకంటే... థ్యాంక్స్‌ అనే పదం సరిపోదు. ఒక యాక్టర్‌ ఎంత బాగా అయినా  చేయవచ్చు. నిర్మాతలు ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు... కానీ అందరికీ హిట్‌ ఇచ్చేది డైరెక్టర్‌ మాత్రమే. ఒకరు ఎంత పెద్ద యాక్టర్‌ అయినా సరే... సరైన మార్గ దర్శకులు లేకపోతే ఏ యాక్టర్‌ అయినా బ్యాడ్‌ యాక్టరే.

నన్ను, మమ్మల్ని అందరినీ గైడ్‌ చేసినందుకు థ్యాంక్స్‌ (సుకుమార్‌ను ఉద్దేశించి).  తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ గర్వపడేలా చేసినందుకు థ్యాంక్స్‌. డార్లింగ్‌... నిన్ను అందరూ నమ్ముతారు. నువ్వు ఒక్కడివే నిన్ను నువ్వు నమ్మవు. మైత్రీ మూవీ మేకర్స్‌ నవీన్ , వై. రవిశంకర్‌గార్ల వల్లే ‘పుష్ప’ సాధ్యమైంది. అలాగే ప్రతి రోజూ కష్టపడే చెర్రీగారికి థ్యాంక్స్‌. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ, నా వ్యక్తిగత ఏఏ టీమ్‌ అందరికీ ధన్యవాదాలు. సాంగ్స్‌ మిలియన్స్  ఎలా అవుతాయి అనుకున్న నాకు బిలియన్స్ లో చూపించాడు దేవిశ్రీ ప్రసాద్‌. శ్రీవల్లి (రష్మిక), కెమేరామేన్  క్యూబా, డ్యాన్స్‌మాస్టర్స్‌ గణేశ్, విజయ్, ప్రేమ్‌ రక్షిత్, శేఖర్‌... ఇలా అందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు.

సుకుమార్‌ మాట్లాడుతూ– ‘‘నేషనల్‌ అవార్డు విన్నర్‌ పెర్ఫార్మ్‌ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందీ సినిమా అని ప్రతి సీన్‌ ముందు అల్లు అర్జున్‌కి చెప్పేవాడిని. ఈ మాటను మరోలా తీసుకోవద్దు... ట్రోల్స్‌ చేయవద్దు. మా కాలనీలో ఓ పెద్దాయన నాతో ‘ఎస్వీ రంగారావుగారిలా నటించాడు’ అన్నారు. ఆ పక్కనే ఉన్న మరో పెద్దాయన ‘ఎస్వీఆర్‌ డ్యాన్సులు, ఫైట్లు చేయడు కదా’ అన్నారు. అల్లు అర్జున్‌ పరిపూర్ణమైన హీరో. డ్యాన్స్‌ చేయగలడు... ఫైట్స్‌ చేయగలడు... ఏడవగలడు... నవ్వగలడు... ‘రంగస్థలం’ నుంచి నాకు సూపర్‌డూపర్‌ హిట్స్‌ వచ్చాయంటే కారణం మైత్రీ మూవీ మేకర్సే. మంచి సీన్స్‌ కోసం రీ షూట్స్‌ చేసేంత ఫ్రీడమ్‌ ఇచ్చారు.

‘పుష్ప’ సక్సెస్‌ మైత్రీ మూవీ మేకర్స్‌కే చెందుతుంది. దేవీశ్రీ ప్రసాద్‌ లేకుండా నేను సినిమా తీయలేనేమో!  మొదట్లో ‘పుష్ప’ రెండు పార్ట్స్‌ కాదు. తొలి భాగానికే మూడు గంటల ఫుటేజ్‌ వచ్చిందని ‘పుష్ప 1’గా రిలీజ్‌ చేశాం. ఇది ‘పుష్ప’కు జరిగిన అద్భుతం. ఇది చెర్రీగారి వల్ల జరిగింది. ‘పుష్ప 2’నూ ఇలానే రిలీజ్‌ చేశాం. ఇలా మా లైఫ్‌లో ఆయన ‘పుష్ప 1, పుష్ప 2, పుష్ప 3’ పెట్టారు. ఈ సిరీస్‌ ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు. ‘పుష్ప 2’తో అసోసియేట్‌ అయిన అందరికీ థ్యాంక్స్‌’’ అని తెలిపారు.

‘‘పుష్ప 1, పుష్ప 2’ అనే మ్యాజిక్‌ను క్రియేట్‌ చేసిన అందరికీ... ముఖ్యంగా అల్లు అర్జున్, సుకుమార్, మైత్రీ మూవీస్‌కు థ్యాంక్స్‌’’ అన్నారు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌. 

‘‘పుష్ప 3’ కోసం ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు ‘పుష్ప 2’ను హిందీలో పంపిణీ చేసిన హిందీ నిర్మాత అనిల్‌ తడానీ. 
‘‘సుకుమార్‌గారి విజన్‌ని అల్లు అర్జున్‌గారు సరిగ్గా తీసుకెళ్లగలిగారు.  ‘పుష్ప’ కోసం చాలా కాల్షీట్స్‌ ఇచ్చారు రష్మిక. మా సినిమాకు దేవీగారు బ్యాక్‌బోన్‌. ‘పుష్ప’ టీమ్‌ అందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు వై. రవిశంకర్‌.  

‘‘పుష్ప 2’ అంచనాలను మించి కలెక్ట్‌ చేస్తుందని ఊహించాం. కానీ ఇంత పెద్ద స్థాయిలో ఉంటుందని మాత్రం ఊహించలేదు’’ అన్నారు నవీన్‌ ఎర్నేని. 

‘‘స్పెయిన్‌లో షూటింగ్‌ చేస్తూ, అర్ధరాత్రి వేళ అక్కడ ఓ రెస్టారెంట్‌కి  వెళితే, ఆ రెస్టారెంట్‌ నడిపే పాకిస్తాన్‌ వ్యక్తి నన్ను ‘పుష్ప’ సినిమాలోని మంగళం శీనుగా గుర్తుపట్టి, మాట్లాడితే చాలా హ్యాపీ ఫీలయ్యాను. తమిళ, కన్నడ, మలయాళం... ఇలా ఇతర ఇండస్ట్రీ వాళ్ళు నాకు గౌరవంతో పాటు, అవకాశాలు ఇస్తున్నారు. ఇది ‘పుష్ప’తోనే సాధ్యమైంది’’ అన్నారు సునీల్‌. 

‘‘పుష్ప’ సినిమా అయ్యేలోపే రెండు ఇన్‌కమ్‌టాక్స్‌ రైడ్స్‌ జరిగాయి. ఈ రైడ్స్‌ను తట్టుకుని, అందరికీ కరెక్ట్‌గా పేమెంట్‌ చేసిన మా అకౌంట్స్‌ టీమ్‌కు థ్యాంక్స్‌’’ అన్నారు మైత్రీ సీఈవో చెర్రీ. 

‘నైజాంలో వన్నాఫ్‌ ది బిగ్గెస్ట్‌ హిట్స్‌లో ‘పుష్ప 2’ కూడా ఉంది’’ అన్నారు మైత్రీ డిస్ట్రిబ్యూటర్‌ శశి. సీడెడ్‌ డిస్ట్రిబ్యూటర్‌ నాగార్జున మాట్లాడారు. అజయ్, ఆదిత్యా మీనన్, జగదీశ్, గణేశ్‌ ఆచార్య మాస్టర్, డ్యాన్స్‌ మాస్టర్‌ విజయ్‌ పోలంకి, ఎడిటర్‌ నవీన్‌ నూలి, బన్నీ వాసు తదితరులు పాల్గొన్నారు. ఈ వేదికపై అల్లు అర్జున్, సుకుమార్, నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ కలిసి ‘పుష్ప’ టీమ్‌కు, డిస్ట్రిబ్యూటర్స్‌కు షీల్డ్స్‌ అందించారు. ఈ కార్యక్రమంలో సుకుమార్‌కి స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement