అనామిక అడ్రస్ ఏదంటే...! | Nayanatara's Anamika Movie | Sakshi
Sakshi News home page

అనామిక అడ్రస్ ఏదంటే...!

Published Sun, Oct 4 2015 1:43 AM | Last Updated on Sun, Sep 3 2017 10:23 AM

అనామిక అడ్రస్ ఏదంటే...!

అనామిక అడ్రస్ ఏదంటే...!

 ఆ సీన్ - ఈ సీన్
 ‘అనామిక’... నయనతార ప్రధాన పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాలీవుడ్ సినిమా ‘కహానీ’కి రీమేక్. విద్యాబాలన్ ప్రధాన పాత్రలో, సుజయ్‌ఘోష్ దర్శకత్వంలో రూపొంది సంచలన విజయం సాధించి, జాతీయస్థాయిలో ప్రశంసలు పొందిన సినిమా ‘కహానీ’. జాతీయ అవార్డులను కూడా పొందిన ఈ సినిమాను మంచి సినిమాగా ఎంచి, తెలుగులో రీమేక్ చేశారు. అందుకు అధికారికంగా రైట్స్ తీసుకున్నారు. కానీ ఆ రైట్స్ ఇచ్చే హక్కు ‘కహానీ’ దర్శక నిర్మాతలకు ఉందా అన్నదే సందేహం! ఎందుకంటే, ఈ సినిమా కథ సుజయ్ సొంతగా సృజించింది కాదని.. కొన్ని హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో ‘కహానీ’ తెరకెక్కిందని క్రిటిక్స్ అంటారు.
 
  ఆ వివరాలను విపులంగా చెప్పాలంటే... రెండు సినిమాలను పరిచయం చేయాలి. ఒకటి 2007లో విడుదల అయిన హాలీవుడ్ సినిమా ‘ఎ మైటీ హార్ట్’. రెండోది అంతకన్నా ముందు, అంటే 2004లో వచ్చిన ‘టేకింగ్ లైవ్స్’.
 ఒక గర్భవతి... అమెరికా నుంచి ఇండియా వచ్చి, తన భర్త భారతదేశానికి వచ్చి మిస్ అయ్యాడంటూ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ చేస్తుంది. విధి నిర్వహణలో భాగంగా అక్కడికి వచ్చిన అతడి జాడ తెలియడం లేదంటూ ఆవేదన చెందుతుంది. అయితే దాన్నొక సాధారణ కంప్లైంట్‌గా భావించిన పోలీ సులు అంతగా పట్టించుకోరు. కానీ ఒక పోలీసాఫీసర్ మాత్రం చొరవ చూపిస్తాడు. ఆమె భర్తను వెదికిపెట్టడంలో ఆమెకు సాయంగా నిలుస్తాడు. తర్వాత ఎన్నో మలుపులు!
 
 ఈ కథ వింటుంటే.. అనామిక సినిమా, దాని మూలం అయిన కహానీ గుర్తుకు వస్తాయి. కానీ నిజానికి ఈ నేపథ్యం అంతా ‘ఎ మైటీ హార్ట్’ సినిమాది. ఏంజెలీనా జోలీ ప్రధాన పాత్రలో నటించింది. వృత్తిరీత్యా జర్నలిస్ట్ అయిన తన భర్త పాకిస్తాన్‌లో మిస్ కావడంతో అమెరికా నుంచి కరాచీ వెళ్తుందామె. అక్కడ తన పరిస్థితి గురించి వివరిస్తే పోలీసులు పెద్దగా పట్టించుకోరు. అయితే ఒక పోలీసాఫీసర్ మాత్రం ఆమెకు అండగా నిలుస్తాడు. తీవ్రవాదం పేరుకు పోయిన పాకిస్తాన్‌లోని ఆ నగరంలో తన భర్తను వెదికేటప్పుడు ఏంజెలీనాకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేదే మిగతా సినిమా.
 
 ఇండియన్ వెర్షన్‌లో కేవలం నేపథ్యమే మార్పు. హాలీవుడ్ సినిమా కరాచీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగితే, హిందీ వెర్షన్ కోల్‌కతాలో, తెలుగు వెర్షన్ హైదరాబాద్‌లో నడుస్తుంది. ఇది తప్ప పెద్ద తేడా ఏమీ ఉండదు ఆ హాలీవుడ్ సినిమాకి, మన సినిమాలకి.
 ఇంత స్పష్టంగా అదే నేపథ్యం కనిపిస్తూ ఉండటం వల్లే ‘కహానీ’ రచయిత, దర్శకుడు సుజయ్ ఘోష్‌పై కాపీ ఆరోపణలు వచ్చాయి. అయితే ఆయన వాటిని తేలికగా తీసుకున్నాడు. ‘ఎ మైటీ హార్ట్’ సినిమా పేరును విన్నాను కానీ దాన్ని చూడలేదని, కాబట్టి తాను కాపీ కొట్టాననే ఆరోపణల్లో వాస్తవమే లేదని ఆయన తేల్చేశాడు.
 
 సరే... మూలకథ అలా పెడదాం.  మరి సినిమాకు ప్రాణం అయిన క్లయిమాక్స్ ట్విస్టు సంగతేంటి! దాని విషయంలో కూడా ‘కహానీ’కి మరో సినిమాతో పెద్ద పోలిక ఉంది. ‘కహానీ’ సినిమా పూర్తవుతుండగా విద్యాబాలన్ పాత్ర ప్రెగ్నెంట్ కాదనే విషయాన్ని రివీల్ చేశాడు ఘోష్. ఆటవికమైన మగాళ్ల ఆకలి చూపుల నుంచి త ప్పించుకోవడానికి, తన మీద ఎవరికీ అనుమానం రాకుండా సానుభూతి కలిగేందుకే ఆమె గర్భిణిగా నటించిందన్న విషయాన్ని క్లైమాక్స్‌లో ట్విస్టులా చూపించి ప్రశంసలు దక్కించు కున్నాడు ఘోష్. కానీ ఈ ట్విస్ట్ ‘టేకింగ్ లైవ్స్’ అనే హాలీవుడ్ సినిమాలో ఉంది. ఆ థ్రిల్లర్ సబ్జెక్ట్‌లో కూడా ప్రధాన పాత్రధారిణి సినిమా చివరి వరకూ ప్రెగ్నెంట్‌గా కనిపిస్తుంది. చిట్ట చివర్లో అది అబద్ధమనే విషయాన్ని రివీల్ చేస్తుంది. కానీ ఆ చిత్రం కూడా తాను అస్సలు చూడలేదంటాడు ఘోష్. తన సినిమాలో ఐడెంటికల్ సీన్స్, ట్విస్ట్స్ ఉంటే... అవన్నీ యాదృచ్ఛికంగా జరిగినవే తప్ప మరోటి కాదని వాదిస్తాడు.
 
 ఎంత  బల్లగుద్ది చెప్పినప్పటికీ... ఘోష్ మాటలు నమ్మబుల్‌యేనా అంటే ఊ అని అనలేం. ఎందుకంటే నేపథ్య మంతా ఒకటే. ముఖ్యమైన సీన్లూ ఎక్క డెక్కడో ఉన్నవే. మరి ‘కహానీ’ని ఘోష్ సృజన అని ఎలా అనగలం! అనలేం. కాబట్టి, మన ‘అనామిక’ అడ్రస్ బాలీవుడ్ కాదు, హాలీవుడ్ అనే ఒప్పుకోవాలి.
 - బి.జీవన్‌రెడ్డి  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement