పెళ్లికి పిలవండి.. కొత్తగా! | New trend to be set with Marriage Website making for Marriage photos | Sakshi
Sakshi News home page

పెళ్లికి పిలవండి.. కొత్తగా!

Published Sun, Jun 29 2014 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 9:31 AM

పెళ్లికి పిలవండి.. కొత్తగా!

పెళ్లికి పిలవండి.. కొత్తగా!

ఆహ్వానం: పెళ్లి...మరువ లేని ఘట్టం. మళ్లీ మళ్లీ తలచుకుని మురిసిపోయే అమూల్య జ్ఞాపకం. కలతలతో నివసించే కపుల్స్ కూడా అలనాటి పెళ్లి ఫొటో చూసినపుడు వారి మొహంపై నవ్వు వెల్లివిరుస్తుంది. మరి అంత గొప్ప అరుదైన ఏకైక సందర్భానికి అందరినీ పిలవాలి కదా... పెళ్లి విశేషాలు చెప్పాలి కదా. మరెలా పిలుస్తున్నారు?
 
 గతంలో బంధుమిత్రులు మన ఊళ్లలో చుట్టుపక్కల ఊళ్లలో ... ఇంకా మహా అయితే రాష్ర్ట రాజధానిలో ఉండేవారు. కాబట్టి పిలవడానికి అంత పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. ఆ సమయంలో అన్ని ఊళ్లు తిరుగుతూ దాన్ని కూడా ఆనందించేవాళ్లం. ఇపుడు ఆ పరిస్థితి లేదు. పరిచయస్థులు ప్రపంచం మొత్తం ఉంటున్నారు. ఊళ్లూ ఇరుగు పొరుగు మొదలుకొని ఐటీ రంగం పుణ్యమా అని బంధుమిత్రులు దేశ విదేశాల్లో ఉంటున్నారు. మరి వారందరినీ ఎలా పిలవడం? ఎంత మందికని ఫోన్లో అన్ని వివరాలు చెప్పగలం? అందుకే ఏ టెక్నాలజీతో అయితే మన వాళ్లందరూ అంతంత దూరం వెళ్లారో అదే టెక్నాలజీతో వారికి పెళ్లి పిలుపు ఇవ్వాలి. దానికి అత్యుత్తమ మార్గం వెబ్‌సైట్.
 
 వెబ్‌సైట్ దాకా ఎందుకు ఈ-మెయిల్ ఇన్విటేషను కూడా సరిపోతుందని కొందరు అనుకుంటారు. అది వెడ్డింగ్ కార్డ్ పంపడానికి బానే ఉంటుంది కాని మీరు ఆహ్వాన పత్రిక ఇచ్చేటపుడు మాట్లాడే కబుర్లన్నీ అందులో చెప్పలేరు. అందుకే వెబ్‌సైట్ ఉత్తమ మార్గం. మరి దానిని ఎలా క్రియేట్ చేయాలి? ఖర్చవుతుందా? ఉపయోగాలేంటి?
 
 పెళ్లంటే ముందు చెప్పాల్సింది.. వధువు/వరుడి గురించి. అయితే, ఇదే వెబ్‌సైట్‌ను ఇద్దరూ అందరికీ పంపుతారు కాబట్టి అందులో ఇద్దరి వివరాలు, చదువు, చిన్న ఇంట్రడక్షన్ ఉంటే మంచిది. అందులోనే  రెండు కుటుంబాల గురించి ప్రాథమిక వివరాలు రాసుకోవచ్చు. తర్వాత పెళ్లి వేదిక వివరాలు, ఏర్పాట్ల గురించి వివరించొచ్చు. ఫుడ్ మెను అనేది పెళ్లిలో ఎలాగూ ముందే నిర్ణయించుకునేది కాబట్టి దాన్ని కూడా వెబ్‌సైట్లో పొందుపరుచుకోవచ్చు. అలాగే వివాహం, ముహూర్తం, విందు వివరాలన్నీ ఒకే చోట ఉంటే బాగుంటుంది. ఇక పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అంతా వస్తారు. అతనేమో అపుడు బిజీగా ఉంటాడు. మరి వచ్చిన ఆ మిత్రులు ఎవర్ని కలవాలి? ఈ వివరాలు కూడా వెబ్‌సైట్లో  పెట్టాలి. వీలైతే మీ నెంబరు కాకుండా మీ ఫ్రెండ్స్‌ను రిసీవ్ చేసుకోవడానికి ఎవరినైనా ఏర్పాటుచేసి వారి ఫొటోలు, ఫోన్ నెంబర్లు వెబ్‌సైట్లో పెడితే అతిథులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏ హోటల్‌లో ఏ రూములు బుక్ చేసింది... వాటి గూగుల్ మ్యాప్స్ అనుసంధానిస్తే అతిథులకు హాయిగా ఉంటుంది.
 తర్వాత ఎక్కడెక్కడి నుంచో అతిథులు వస్తుంటారు కదా... మీ ఇంటికి/పెళ్లి మండపానికి ఎలా చేరుకోవాలి, ఏ ఏ రవాణా సదుపాయాలున్నాయో, ఏ సమయంలో ఉన్నాయో చెబితే మంచిది. మీ ఊర్లో దిగాక బస్టాండు నుంచి ఇంటికి/వేదికకు వచ్చే మార్గాన్ని వివరించాలి.  ఇవన్నీ పెళ్లికి వచ్చేవారికి. మరి ఎవరికైనా కుదరకపోతే వారు మీకు శుభాకాంక్షలు చెప్పే అవకాశం ఇవ్వాలి కదా... ‘విషెష్ బాక్స్’ కూడా పెడితే ఆనందిస్తారు. వీటితో పాటు మీ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు, షాపింగ్ ఫొటోలు, ఆల్బమ్స్ వంటివి కూడా పెట్టొచ్చు. అనుభవాలు, పెళ్లి గురించి భావాలు కూడా రాసేసుకోవచ్చు.   
 
 ఎంత ఖర్చవుతుంది?
 ఇది ఖరీదైన వ్యవహారం కాదు. మీకు తెలిసిన వెబ్ డిజైనర్ ఉంటే 2-3 వేలల్లో అయిపోతుంది. లేదంటే ఫ్రీలాన్స్ డిజైనర్‌ను ఆన్‌లైన్లో వెతుక్కోవచ్చు.  ఉదాహరణకు ‘రాగిణివెడ్స్‌రాము.కామ్’ అని మీ పెళ్లి సైట్‌కు పేరు  పెట్టుకోవచ్చు. సింపుల్‌గా ఆ డొమైన్ నేమ్ వాట్స్‌యాప్‌లోనో, ఎస్‌ఎంఎస్ ద్వారానో చెప్పేయొచ్చు.  డబ్బుల్లేకుండా ఉచితంగా పెట్టుకోలేమా అనే వారికి కూడా కొన్ని వేదికలున్నాయి. ఇవే విషయాలను ‘ఒక బ్లాగు’ ఏర్పాటుచేసుకుని అందులో చెప్పొచ్చు. లేదంటే గూగుల్‌కు వెళ్లి ‘క్రియేట్ యువర్ వెడ్డింగ్ వెబ్‌సైట్’ అనే కీవర్డ్‌తో సెర్చ్ చేస్తే అద్భుతమైన వెడ్డింగ్ టెంప్లేట్స్‌తో ఫ్రీగా మీకు వెబ్‌సైట్ ఇచ్చే పోర్టల్స్ కూడా ఉన్నాయి. అయితే డొమైన్ నేమ్ కాస్త పెద్దగా ఉంటుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement