
వాయనం: నో డౌట్... మహిళలకివి కరెక్ట్!
గడప దాటి బయటకు రాని రోజుల నుంచి... అంతరిక్షానికి ఎగిరేదాకా చేరుకున్నారు మహిళలు. ప్రతి రంగంలోనూ పురుషులతో పోటీ పడుతున్నారు.
గడప దాటి బయటకు రాని రోజుల నుంచి... అంతరిక్షానికి ఎగిరేదాకా చేరుకున్నారు మహిళలు. ప్రతి రంగంలోనూ పురుషులతో పోటీ పడుతున్నారు. డాక్టరో, టీచరో కావడం మామూలే. కానీ మహిళలకే ఉండే కొన్ని ప్రత్యేకమైన లక్షణాల వల్ల ఇప్పుడు కొన్ని రంగాల్లో వారికి ప్రాధాన్యత పెరుగుతోంది. మహిళలే బెస్ట్ అనిపించుకుంటోన్న రంగాలివే...
ఎయిర్ హోస్టెస్ - ఈ పోస్ట్‌లో పురుషుడిని ఊహించడానికే మనసొప్పదు. ఎయిర్‌లైన్స్ సంస్థలు నానాటికీ పెరుగుతూ ఉండటంతో వీటిలో ఎయిర్ హోస్టెస్‌లకు డిమాండ్ పెరుగుతోంది. అందం, చలాకీతనం, చక్కని మాటతీరు ఉండి ఇంప్రెస్ చేయగలిగితే... ప్రారంభ జీతమే పాతిక నుంచి నలభై వేల వరకూ ఉంటుంది. అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌లో అయితే 50 నుంచి 80 వేల వరకూ వస్తుంది.
హెచ్.ఆర్. - ఉద్యోగుల నియామకం దగ్గర్నుంచి ప్రతిదానిలోనూ హెచ్.ఆర్. మేనేజర్ పాత్ర కీలకం. ఈ పాత్ర పోషించడానికి చాలా ఓర్పు ఉండాలి. చాకచక్యత ప్రదర్శించాలి. ఈ రెండు గుణాలూ మహిళల్లో అధికం కనుక పెద్ద పెద్ద కంపెనీలన్నీ మహిళలనే హెచ్.ఆర్. మేనేజర్లుగా నియమించుకోవడానికి ఇష్టపడుతున్నాయి.
మార్కెటింగ్ - అన్నీ సర్వే చేయడం, అందరినీ కలవాల్సి రావడం, డిమాండ్ పెంచుకోవడానికి ఎప్పటికప్పుడు ఎత్తుకు పై ఎత్తులు వేయడం వంటివి చేయాల్సినందుకు పురుషులకే ఈ రంగం తగుతుంది అనేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడది మారింది. కలుపుగోలుతనం, ఆప్యాయంగా పలుకరించి ఆకర్షించడం వంటి లక్షణాలు మెండుగా ఉండటం వల్ల మహిళలకు ప్రాధాన్యత పెరుగుతోంది.
అడ్వర్టయిజింగ్ - క్రియేటివ్ హెడ్స్‌గా, స్క్రిప్ట్ రైటర్స్‌గా, మోడల్స్‌గా... రకరకాల పాత్రలు పోషిస్తున్నారు ఈ రంగంలో. మహిళలు ఇంట్లోవాళ్లందరి మనస్తత్వాలనూ బాగా అర్థం చేసుకుని, దాని ప్రకారం నడచుకుంటారు. కాబట్టి ఎవరు ఎలా ఆలోచిస్తారు, ఏం కోరుకుంటారు అన్నదాని మీద వారికి అవగాహన ఉంటుంది. అది ఈ రంగానికి బాగా ఉపయోగపడుతుంది అంటారు అడ్వర్టయిజింగ్ కంపెనీల యజనమానులు. ఫ్యాషన్ డిజైనింగ్ - ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాషన్ డిజైనర్ల సంఖ్యలో మహిళల వాటానే ఎక్కువ. సహజంగానే అందచందాల మీద ఆసక్తి ఉండటం వల్లనో ఏమో గానీ... వారు ఈ రంగంలో దూసుకుపోతున్నారు.
టెలివిజన్ - టెలివిజన్ రంగం మహిళల చుట్టూనే తిరుగుతోంది. సీరియళ్లు, రియాలిటీ షోలు... అన్నీ మహిళల కోసమే. వాటిలో పని చేసేది కూడా ఎక్కువ శాతం మహిళలే. తెరమీద మహిళా యాంకర్ కనిపిస్తే చూసినంతగా మగ యాంకర్‌ని చూడరు అని ప్రముఖ యాంకర్, నటుడు జెమినీ సురేష్ అన్నారంటే... ఆ రంగంలో మహిళలకు ఉన్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా న్యూస్ రీడర్లుగా కూడా ఆడవాళ్లే ఎక్కువ మెప్పిస్తున్నారు.
ప్రయాణంలోనూ పస్తులుండక్కర్లేదు!
కొంతమందికి ఇంట్లో వండినవి తప్ప, బయట ఎక్కడ ఏం తిన్నా ఆరోగ్యం దెబ్బ తింటుంది. అలాంటివాళ్లకి పక్క ఊళ్లు వెళ్లాలంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. పూర్తి విభిన్నమైన ఆహారం దొరికే చోటికి వెళ్లాలంటే మరీను. అలాంటివారి కోసం తయారు చేసిందే ఈ ‘మల్టీపర్పస్ ట్రావెల్ కుక్కర్’.
దీనిలో రెండు విభాగాలుంటాయి. కింద కనిపిస్తోన్న నల్లది స్టాండు. దానికే ఆన్, ఆఫ్ చేయడానికి, మంటను పెంచుకుని, తగ్గించుకోవడానికి ఉపయోగించే బటన్ ఉంది. ఇక ఎర్రగా ఉన్నది వండుకునే గిన్నె. దీనిలో అన్నం, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, కూరలు... అన్నీ వండేసుకోవచ్చు. గుడ్లు ఉడికించుకోవచ్చు. ఆమ్లెట్ వేసుకోవడానికి ఓ చిన్న గిన్నె, ఇడ్లీ స్టాండు కూడా అదనంగా లభిస్తాయి. రైళ్లలోను, బస్సులలోను కూడా విద్యుత్ సౌకర్యం ఉంటోంది కాబట్టి ప్రయాణాల్లో కూడా వండేసుకోవచ్చు. వెల కూడా పెద్ద ఎక్కువేం కాదు. రూ.1200 లోపే. ఆన్‌లైన్ స్టోర్స్‌లో 999 రూపాయలకు కూడా దొరుకుతున్నాయి!