పంచమాంగ దళాలు
నానుడి
ఆధునిక సైన్యాలలో త్రివిధ దళాలు ఉన్నట్లుగానే, ప్రాచీన సైన్యాలలో చతురంగ బలగాలు ఉండేవి. రథ, గజ, తురగ, పదాతి దళాలనే అప్పట్లో చతురంగ బలగాలు అనేవారు. యుద్ధాలు జరిగేటప్పుడు సైన్యంలో స్థాయీ భేదాలను అనుసరించి వీరాధి వీరుల్లో కొందరు రథాలను అధిరోహించేవారు. మరికొందరు ఏనుగులెక్కి యుద్ధాలు సాగించేవారు. ఇంకొందరు గుర్రాలెక్కి పోరు సల్పేవారు. సామాన్య సైనికులు ఎలాంటి వాహనం లేకుండానే యుద్ధరంగంలో నిలబడి శత్రువులను ఎదుర్కొనేవారు.
చతురంగ బలసంపదతో ఎంతటి సేనావాహిని ఉన్నా, యుద్ధాలలో గెలుపు సాధించడం ఒక్కోసారి కష్టమయ్యేది. అలాంటప్పుడే రాజుల్లో కొందరు శత్రువర్గంలోని అసంతుష్టులను చేరదీసి, తమకు అనుకూలంగా తయారు చేసుకునేవారు. వాళ్ల ద్వారా గుట్టుమట్లు సేకరించి, అవలీలగా శత్రువులను మట్టికరిపించేవారు. ఒక్కోసారి అసంతుష్టుల్లో కొందరు తమంతట తామే శత్రు రాజులతో కుమ్మక్కయి, తమ రాజుల ఓటమికి కారకులయ్యేవారు. ఇలాంటి వాళ్లనే పంచమాంగ దళాలుగా అభివర్ణిస్తారు. రామాయణంలోని విభీషణుడు, మహాభారతంలోని శల్యుడు అలాంటి వాళ్లే.