ఎన్నికల పోరులో సోదరులు, అన్నా చెల్లెళ్లు, భార్యాభర్తలు దగ్గరి బంధువులు, వారసులు పోటీకి
బంధుత్వాలు అడ్డుకావని నిరూపించిన గత లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు
ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లోనూ కొన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి పునరావృతం కానున్న వైనం
సాక్షి, దాదర్: అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోంది. కొద్దీ రాష్ట్ర రాజకీయం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇవ్వనున్నారో, ఎవరికి మొండిచేయి చూపనున్నారో తెలియని అయోమయ పరిస్ధితి నెలకొంది. ప్రస్తుతం ప్రధాన కూటములైన మహా వికాస్ ఆఘాడి (ఎంవీఏ), మహాయుతి కూటముల మధ్య సీట్ల సర్దుబాటుపై దాదాపు రాజీ కుదిరింది. ముఖ్యంగా బీజేపీ 99 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. జాబితా ప్రకటనల్లాంటివేమీ లేకుండా 17 మంది అభ్యర్థులకు ఎన్సీపీ (ఏపీ) ఏకంగా ఏపీ ఫారాలను పంపిణీ చేసింది. ఇక మిగిలిన సీట్లలో ఎవరు ఎక్కడి నుంచి పోటీచేస్తారనేది ఇరు కూటములు =స్పష్టం చేయలేదు. దీంతో కొందరు ఆశావహులు పార్టీ టికెటుపై పోటీ చేయాలా..?లేక స్వతంత్ర అభ్యర్థులు బరిలోకి దిగాలా అనేది ఎటూ తేల్చుకోలేక పోతున్నారు.
2014, 2019 ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందిన వారు, సమీప బంధువులు, వారసులు ఇలా...దగ్గరివారి మధ్యే హోరాహోరీ పోటీ జరిగింది. పంతాలు, పట్టింపులతో ఏ ఒక్కరూ వెనకడుగు వేయలేదు. నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. ఒకానొక సమయంలో ఒకే కుటుంబానికి చెందిన వారు బద్ధశత్రువుల్లా పోటీపడ్డారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 20వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్ధితి పునరావృత మవుతుందా..? లేదా..? అనేది అభ్యర్ధుల పేర్ల ప్రకటన తరువాత గానీ పూర్తి స్పష్టత రాదు.
ఇదివరకు జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కుటుంబంలోని ఇద్దరు సోదరులు, తండ్రీకొడుకులు, అన్నా చెల్లెళ్లు, భార్యాభర్తలు, తాతామనవడు, మామాకోడలు అలాగే దగ్గరి బంధువులు, వారసులు తలపడ్డారు. వీరిలో ఇందులో ఒకరు గెలిచి మరొకరు ఓడి ఎమ్మెల్యే, ఎంపీ లేదా మంత్రి పదవుల్లో కొనసాగారు. కానీ అప్పటితో పోలిస్తే ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. సుమారు రెండున్నరేళ్ల క్రితం శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) లాంటి ప్రధాన పార్టీలు చీలిపోయాయి. రెండు పారీ్టలు నాలుగుగా మారిన నేపథ్యంలో ఎక్కువ మంది అభ్యర్ధులకు పోటీచేసే అవకాశం లభించనుంది. దీంతో అసంతృప్తి, తిరుగుబాటుకు అవకాశాలు చాలా తక్కువ అని రాజకీయవిశ్లేషకులు భావిస్తున్నారు. ఏదైమైనా అభ్యర్ధుల పేర్ల ప్రకటన తరువాత మాత్రమే స్పష్టత రానుంది. ముఖ్యంగా టికెట్ ఆశించి భంగపడినవారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎవరిపై తిరుగుబాటు చేస్తారు...? ఎవరి ఓట్లు ఎవరు చీలుస్తారు..? స్వతంత్ర అభ్యర్ధిగా ఎవరు బరిలోకి దిగుతారు అనేది త్వరలో తేటతెల్లం కానుంది. ముంబైలోని అణుశక్తి నగర్ అసెంబ్లీ నియోజక వర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, అజిత్ పవార్ వర్గానికి చెందిన నేత నవాబ్ మలిక్ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయ మని తేలిపోయింది. అయితే ఈసారి ఆయన మాన్‌ఖుర్ద్–శివాజీనగర్ నియోజక వర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఆయన కుమార్తై సనా మలిక్ అణుశక్తినగర్ నియోజక వర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. ఎన్సీపీలో చీలిక తరువాత నవాబ్ మలిక్ అజిత్ పవార్ వర్గంలో చేరారు. బీజేపీ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన ప్పటికీ అజిత్ పవార్ ఆయన్ను దూరం చేసుకోలేదు. అయితే సీట్ల సర్దుబాటులో భాగంగా అణుశక్తి నగర్, మాన్‌ఖుర్ద్–శివాజీనగర్ ఈ రెండు నియోజక వర్గాలు అజిత్ పవార్‌కు లభించడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం. దీంతో తనకు మంచి పట్టున్న అణుశక్తి నగర్ నుంచి మాన్‌ఖుర్డ్–శివాజీనగర్ నుంచి మలిక్ పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదిలాఉండగా 2009లో జరిగిన వార్డు పునరి్వభజన తరువాత అణుశక్తి నగర్ నూతన నియోజకవర్గంగా ఏర్పడింది. అప్పటి నుంచి ఈ నియోజక వర్గంలో ఎన్సీపీ–శివసేన మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. 2014లో జరిగిన ఎన్నికల్లో శివసేన అభ్యర్థి కాతే, నవాబ్ మలిక్‌ను ఓడించారు. కాగా మాన్‌ఖుర్ద్–శివాజీనగర్ నియోజక వర్గంలో సమాజ్‌వాది పార్టీకి చెందిన ఆబూ ఆజ్మీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక్కడ ముస్లింల ఓటుబ్యాంకు అధికంగా ఉండటంతో నవాబ్‌మాలిక్ ఆబూ ఆజీ్మకి ప్రత్యర్థిగా సనాను పోటీలో నిలపాలని నిర్ణయించారు.
గతంలో ఒకే కుటుంబం, దగ్గరి బంధువులు, వారసుల మధ్య జరిగిన పోటీ వివరాలు
2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పుసద్ నియోజక వర్గంనుంచి నాయిక్ కుటుంబానికి చెందిన ఇద్దరు వారసులు ఇంద్రనీల్ నాయిక్ ఎన్సీపీ నుంచి నీలయ్ నాయిక్ బీజేపీ నుంచి పోటీచేశారు. వీరిలో ఇంద్రనీల్ విజయం సాధించారు. ఇప్పుడాఇద్దరూ మహాయుతిలో కొనసాగుతున్నారు.
2019లో బీడ్ అసెంబ్లీ నియోజక వర్గంలో ఎన్సీపీ తరఫున సందీప్ క్షిర్‌సాగర్, ఆయన బాబాయ్, శివసేన అభ్యరి్ధ, మాజీ మంత్రి జయ్‌వంత్ క్షిర్‌సాగర్ పరస్పరం తలపడ్డారు. సందీప్ కేవలం 1984 ఓట్ల తేడాతో బాబాయ్ జయ్‌వంత్‌ను ఓడించారు.
2019లో అప్పటి గ్రామాభివృద్ధి, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజా ముండే పర్లీ నియోజక వర్గం నుంచి బీజేపీ టికెట్‌పై బరిలోకి దిగారు. ఆమె ప్రత్యరి్ధగా స్వయానా చిన్నాన్న కుమారుడు ధనంజయ్ ముండే బరిలో ఉన్నారు. అయిదే పంకజాను 30 వేల ఓట్ల తేడాతో ధనంజయ్ ఓడించారు. అంతకు ముందుగా 2014లో జరిగిన ఎన్నికల్లో పంకజా ధనంజయ్‌ను 25వేల ఓట్ల తేడాతో ఓడించారు. ప్రస్తుతం బీజేపీ, అజీత్ పవార్ (ఎన్సీపీ) వర్గం మహాయుతిలో మిత్రపక్షా లుగా ఉన్నాయి. దీంతో పంకజా, ధనంజ య్ ఒకే కూటమిలో కొనసాగుతున్నారు. ఈ ఏడాది మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పంకజాకు మద్దతుగా ధనంజయ్ జోరుగా ప్ర చారం చేశారు. ఇందుకు బదులుగా ప్రస్తు తం అసెంబ్లీ ఎన్నికల్లో పంకజా , ధనంజయ్‌కు మద్దతుగా ప్రచారం చేయనున్నారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో సాతారా జిల్లాలోని మాణ్ నియోజక వర్గంలో బీజేపీ తరఫున జయ్‌కుమార్ గోరే, ప్రత్యర్ధిగా స్వతంత్ర అభ్యర్ధి ప్రభాకర్ దేశ్‌ముఖ్ బరిలో దిగారు. ఇద్దరి తల్లులూ అక్కాచెల్లెళ్లు కావడంతో వారిద్దరూ ఒకరికొకరు అన్నదమ్ముల వరస అవుతారు. అయినాసరే పోటీకి సై అన్నారు. ఈ ఎన్నికల్లో గోరే సుమారు మూడువేల ఓట్లతో గెలుపొందారు. ఆ సమయంలో బీజేపీ, శివసేన కూటమిలో మిత్రపక్షాలుగా ఉన్నప్పటికీ కాని మాణ్, కణ్‌కావ్లీలో మాత్రం పొత్తులో లేవు. అలాగే జయ్‌కుమార్ సొంత సోదరుడు శేఖర్ గోరే శివసేన తరపున పోటీ చేశారు. జయ్‌కుమార్ విజయం సాధించగా, ప్రభాకర్ రెండో స్ధానంలో, శేఖర్ మూడో స్ధానంలో నిలిచారు.
సాతారాలో ప్రస్తుత ఎంపీ ఉదయన్‌రాజే భోంస్లే (బీజేపీ) 1999లో స్వయాన బాబాయ్ అభయ్‌సింహ్‌రాజే బోంస్లే (ఎన్సీపీ) చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం అభయ్‌సింహ్‌రాజే కుమారుడు శివేంద్రసింహ్ సాతారాలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే శివేంద్రసింహ్, ఉదయన్‌రాజే ఇరువురూ ఇప్పుడు బీజేపీలో కొనసాగుతున్నారు. 1990లో ఉదయన్‌రాజే తల్లి కల్పనరాజే (శివసేన)పై అభయ్‌సింహ్‌రాజే గెలిచారు.
లాతూర్ జిల్లాలోని నిలంగా అసెంబ్లీ నియోజక వర్గంలో బాబాయ్–సోదరుడి కొడుకు, తాతా–మనవడు మధ్య గత అనేక సంవత్సరాలుగా రాజకీయ పోరు జరుగుతోంది. 2014, 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన సంభాజీ పాటిల్ నిలంగేకర్ బాబాయ్ అశోక్‌రావ్ పాటిల్ నిలంగేకర్‌ను ఓడించారు. అదేవిధంగా 2004లో జరిగిన ఎన్నికల్లో సంభాజీ పాటిల్ నిలంగేకర్‌కు ఆయన తాత మాజీ ముఖ్యమంత్రి శివాజీరావ్ పాటిల్ నిలంగేకర్‌ల మధ్య ఎన్నికలపోరు జరిగింది. ఈ పోటీలో సంభాజీ కేవలం రెండు వేల ఓట్లతో శివాజీరావ్‌ను ఓడించారు. అయితే 2009లో శివాజీరావ్ తన మనవడు సంభాజీని ఓడించి ప్రతీకారం తీర్చుకున్నారు.
సాంగ్లీ అసెంబ్లీ నియోజక వర్గంలో 1995లో జరిగిన ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి వసంత్‌దాదా పాటిల్ కుమారుడు ప్రకాశ్‌బాపు పాటిల్ కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేశారు. ఆయనకు ప్రత్యరి్ధగా బాబాయ్ కుమారుడు మదన్ పాటిల్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇద్దరి మధ్య జరిగిన ఈ పోరులో ఓట్లు చీలిపోయి జనతాదళ్ అభ్యర్ధి సంభాజీ పవార్ గెలుపొందారు.
2014లో సింద్‌ఖేడ్ నియోజక వర్గంలో బావా–మరదలు రేఖాతాయి ఖేడేకర్ (ఎన్సీపీ), శశికాంత్ ఖేడేకర్ (శివసేన) మ«ధ్య ఎన్నికల పోటీ జరిగింది. ఈ పోరులో శశికాంత్ విజయ ఢంకా మోగించారు.
Comments
Please login to add a commentAdd a comment