అప్పుడు నేను ఏడో తరగతి చదువుతున్నాను.
ఒకరోజు మా మేడమ్ మాకు సోషల్ ఎగ్జామ్ పెట్టింది. ముందు ప్రశ్నలు, తర్వాత బిట్స్ ఇచ్చింది.
ప్రశ్నలన్నీ రాశాక, బిట్స్‌లోకి వెళ్లాను. చివరి బిట్‌లో ‘మన ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరు?’ అన్న ప్రశ్న వచ్చింది. దాని జవాబు నాకు తెలియదు. అయితే, అప్పుడే కొత్తగా ‘ఎమ్మెల్యే ఏడుకొండలు’ సినిమా వచ్చింది. కానీ అది సినిమా అని నాకు తెలియదు. మా క్లాస్ పక్కన హెడ్‌మాస్టర్ గది ఉంటే, అందులో ఎప్పుడో టీచర్స్ కూర్చుని మాట్లాడుకుంటూండగా వాళ్ల నోటినుంచి ఈ ఎమ్మెల్యే ఏడుకొండలు అని విన్నాను. ఇంకేం! జవాబు దొరికిందని సంతోషంగా రాసేశాను.
మా మేడమ్ రెండు రోజుల తర్వాత పేపర్స్ దిద్దింది. పేర్ల ప్రకారం పిలిచి, వచ్చిన మార్కులు చెప్పి, తక్కువ వచ్చినవారికి చీవాట్లతో వడ్డిస్తోంది.
నా పేరు పిలిచింది. ఏమంటారేమోనని నేను భయంతో నిలబడ్డాను. నన్ను చూస్తూనే మేడమ్ ఫక్కున నవ్వింది. అందరు పిల్లలు విస్తుపోయి చూస్తున్నారు, మార్కులు ఎలా వచ్చాయోనని.
మేడమ్ నన్ను హెడ్‌మాస్టర్ రూమ్‌లోకి పిలుచుకెళ్లింది. మాస్టర్లందరూ కూర్చున్నారు. ‘‘ఎవరు చెప్పారు సుజాత, ఆ ప్రశ్నకు నీకు జవాబు?’’ అంది మేడమ్. ‘‘మొన్న మీరందరూ కూర్చుని మాట్లాడుకుంటుంటే విన్నాం మేడమ్’’ అన్నాను. అందరూ ఒక్కసారి నవ్వేశారు. ఆవిడకు నేనంటే చాలా ఇష్టం. అది సినిమా అని చెప్పి, మళ్లీ నేను ఫీలవుతానని నన్ను హత్తుకుని నవ్వమంది. ఇంటికెళ్లాక ఇంట్లో, చుట్టుపక్కలా అందరూ నవ్వడమే.
ఇప్పటికీ నవ్వులే అది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా!
- బత్తుల సుజాత
ఇది మీ కోసం పెట్టిన పేజీ. మీ అనుభవాలు, అనుభూతులు, ఆలోచింపజేసిన సంఘటనలు, మీ ఊరు విశేషాలు, మీ పిల్లల ముద్దుమాటలు, వారి అల్లరి చేష్టలు... అవీ ఇవీ అని లేదు, ఏవైనా మాకు రాసి పంపండి.
మా చిరునామా: తపాలా, ఫన్‌డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1,
రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com
ఎమ్మెల్యే ఎవరు?
Published Sun, May 4 2014 11:35 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 AM
Advertisement
Advertisement