
సాక్షి, దుబ్బాక : ప్రతీ మనిషి జీవితంలో బాల్యం ఓ మధుర జ్ఞాపకం. చిన్నతనంలో చేసే చిలిపి పనులు మనం పెద్దయ్యకా తరుచూ.. తలుచుకుంటూ ఉంటాం. కానీ కొందరు మహిళలు పిల్లల్ని చూపి భిక్షాటన చేయడానికి అలవాటుపడ్డారు. పిల్లలను చంకలో గుడ్డతో కట్టుకుని భిక్షాటన చేస్తున్నారు. గంటల తరబడి పిల్లలను చంకలో కట్టుకుని తిరగడం వలన తల్లికి బిడ్డకు ఆరోగ్యపరంగా ఇబ్బందికరమేనని వైద్యులు చెబుతున్నారు. చంకలో నిరంతరం కట్టేయడం మూలంగా పిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుందంటున్నారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట, దుబ్బాకలో తెల్లవారుజాముగానే తల్లులు పలు ప్రాంతాల్లో తిరుగుతుంటారు.
ఉదయం హోటళ్ల వద్ద టిఫిన్ కోసం వచ్చేవారి నుంచి, బస్టాండ్‌లోకి వెళ్లే ప్రయాణికులతో పాటు పలు దుకాణాల వద్ద కనిపించిన వారినల్లా చంటి బిడ్డలను చూపి డబ్బులు అడుక్కుంటూ ఉండగా కొందరు డబ్బులు ఇస్తుంటారు. మరి కొందరు తిడుతూ.. చిరాకుపడుతుంటారు. ఇలా చంటి బిడ్డలతో యాచించి వారు రకరకాల ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ట్రాఫిక్‌లో ఏదైన వాహనం ఆగిందా అక్కడికి వెళ్లి చేయి చాపుతారు. అలాగే హోటళ్ల నుంచి బయటకు వస్తుంటే చాలు అడ్డుగా వెళ్లి దానం చేయ్యండయ్యా..íపిల్లలకు పాలు పట్టించాలి, పిల్లవాడు ఇంకా ఏమి తినలేదు అంటూ..అడుగుతుండడం కనిపిస్తూ ఉంటుంది. పేదరికం కారణంగా భిక్షాటన చేస్తున్నారని మానవత్వ హృదయంతో ఆలోచించి కొందరు దానం చేస్తుంటారు. మరి కొందరు చీదరించుకుంటారు.
పిల్లల ఆరోగ్యంపై ప్రభావం..
ప్రతీ రోజు పిల్లలను చంకలో కట్టేసుకుని గంటల తరబడి తిరుగుతూ...భిక్షాటన చేస్తుండటంతో పిల్లలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బడిలో ఆటపాటలతో చదువుకుంటూ సేద తీరాల్సిన పిల్లలు చంకలో కట్టేయడం మూలంగా పిల్లలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అయితే బిడ్డలను చూపి డబ్బులు అడుక్కోవడం అలవాటుగా మారిన తల్లులు అవేమి పట్టించుకోవడం లేదు. అలాగే పిల్లలకు సరైన ఆహారం అందించకపోవడంతో పిల్లలు బక్కచిక్కిపోతున్నారు. ఫౌష్టికాహారం లోపంతో పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదగడం లేదు.
లాక్‌డౌన్‌లో తీవ్ర ఇబ్బందులు..
కరోన నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా భిక్షాటన చేసేవారి పరిస్థితి దుర్భేద్యంగా మారింది. హోటళ్లు, బస్సులు నడపకపోవడంతో ప్రజలు ఎవరూ రోడ్ల పైకి రాకపోవడంతో యాచకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తినడానికి తిండిలేక ఆకలితో అలమటించారు. కొందరు మానవతావాదులు వారిని చూడలేక ఆహారం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment