ప్యార్ కా పవర్ | Pyaar Ka Power | Sakshi
Sakshi News home page

ప్యార్ కా పవర్

Published Sat, Jan 23 2016 11:21 PM | Last Updated on Sun, Sep 3 2017 4:10 PM

ప్యార్ కా పవర్

ప్యార్ కా పవర్

 దేడ్ కహానీ - జోధా అక్బర్

 మనిషికి రేపేం జరుగుతుందో తెలీదు. కాబట్టి ఫ్యూచర్ గురించి ఎక్కువ మాట్లాడుకోవడం ఇష్టం ఉండదు. ఇవ్వాళేం జరుగుతుందో తెలుసు కాబట్టి దాని గురించి మాట్లాడలేడు. నిన్న ఏం జరిగిందో తెలుసుకోవాలనే తపన. తన వెనక జరిగిన సంగతుల మీదున్న సాధా రణమైన ఇష్టమే సినిమాల్లో చరిత్రాత్మక మైన సినిమాలకి మంచి గిరాకీని తెచ్చిపెట్టిందని నాకనిపిస్తుంది.‘లగాన్’ అనే సినిమాతో భారీ హిట్టు కొట్టిన దర్శకుడు అశుతోష్ గొవారికర్ తర్వాతి సినిమా ‘స్వదేశ్’ వర్తమానానికి సంబంధించిన కథ. అది బాక్సీఫీసు దగ్గర దారుణంగా బోల్తాపడేసరికి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి చరిత్ర రూటు పట్టుకుని ‘జోధా అక్బర్’తో బాలీవుడ్‌కి పెద్ద కమర్షియల్ హిట్ ఇచ్చారు.
 
 చరిత్ర చెప్పినవాళ్లు కాని, రాసినవాళ్లు కాని అది జరుగు తున్న కాలంలో ఉండరు. విన్నవి, వాళ్లకి తెలిసినవి, వాళ్లకి దొరికిన ఆనవాళ్లని క్రోడీకరిస్తారు. కాబట్టి వీటికి కట్టుబడి ఉండాల్సిన గీతలు కొంచెం తక్కువే. పబ్లిక్‌లో బాగా పాపులర్ అయిన విషయాలకి వ్యతిరేకంగా వెళ్లకుండా ఉంటే చాలు. అదే చేశారు ‘జోధా అక్బర్’లో. 1960లో పృథ్వీరాజ్ కపూర్ అక్బర్‌గా, దిలీప్‌కుమార్ సలీమ్‌గా, మధుబాల అనార్కలిగా వచ్చిన ‘మొఘల్-ఎ- అజమ్’ చిత్రంలో అక్బర్ భార్య... జోధా బాయి అనే రాజపుత్ వంశీయురాలు, హిందువు. దాని ఆధారంగా 2008 ఫిబ్రవరి 15న ‘జోధా-అక్బర్’ అనే మంచి గంభీరమైన ప్రేమకథని అందించారు అశుతోష్.
 
 అక్బరు అఫ్గానిస్తాన్ నుంచి బంగాళాఖాతం తీరం మీదుగా నర్మదా నదీ తీరాన్ని జయించుకుంటూ మంచి ఊపు మీద ఉంటాడు. కానీ అక్కడ రాజపుత్ వంశీయులని వశపరుచుకోవడం చాలా కష్టమౌతుంది అతనికి. వాళ్లని ప్రతి ఘటించడం కన్నా బంధుత్వం కలుపు కోవడం తేలికని అనుకుంటాడు. రాజా భర్మల్ ఏకైక కూతురు జోధా, వివాహానికి రెడీగా ఉందని తెలుసుకుంటాడు. ఈలోగా భర్మల్ సాటి రాజపుత్ వంశస్థుడైన మరో రాజకుమారుడికి తన కూతురితో నిశ్చి తార్థం చేస్తాడు.
 
 తన తదనంతరం అతన్ని రాజుగా పట్టాభిషిక్తుణ్ని చేయాలన్న కండిషన్‌కీ తలొగ్గుతాడు. జోధా అన్నకు తన వారసత్వం చెల్లెలి మొగుడికి వెళ్లడం ఇష్టం లేక, అలిగి ఇల్లొదిలి వెళ్లిపోతాడు. ఈలోగా అక్బరు దండయాత్ర చేయబోతు న్నాడని తెలిసి, అతణ్ని అల్లుణ్ని చేసుకొనే ప్రతిపాదన తెస్తాడు. అదే కావాలనుకున్న అక్బరు ఒప్పుకుంటాడు. రాజకీయ చదరంగంలో పావులా మారిన జోధా పరిస్థితులకు తలొంచు తుంది. సాక్షాత్తూ ఆమె తల్లే జోధా చేతిలో విషం సీసా ఉంచి, ఏ రోజైనా అవసర మైతే దాన్ని వాడమంటుంది. ఆత్మాభి మానం గల జోధా పెళ్లయ్యాక అక్బరుని దగ్గరకి రానివ్వదు.
 
 రాజపుత్ యువ రాణిగా తన విలువని కాపాడుకుంటున్న ఆమె తీరు అక్బర్‌ని ఆకర్షిస్తుంది. అధికారంతో కాకుండా ప్రేమతో ఒకటవ్వాలని ఆమె అభిప్రాయాలని గౌరవించి దూరంగా ఉంటాడు. మత ఛాందసం భయంకరంగా ఉన్న అక్బరు అంతఃపురంలో కృష్ణుడి గుడి కట్టించుకుని పూజలు చేస్తుంది జోధా. క్రమంగా అక్బరు, జోధా మనసులు కలిసి ఒకటౌతారు. కానీ, అక్బరు జోధా అభి ప్రాయాలను గౌరవించడాన్ని ముస్లిములు అంగీకరించలేకపోతారు. వారిద్దరినీ కలవ కుండా చేయాలని రకరకాల పన్నాగాలు పన్నుతారు. అన్నిటినీ జయించి అజరా మరమైన ప్రేమికులుగా జోధా, అక్బరు ఎలా కలిశారన్నది కథ.
 
 ఈ చిత్రం రిలీజయ్యాక ఎంతోమంది చరిత్రకారులు అక్బరు భార్య జోధాబాయి కాదని, అసలు అక్బరు రాజపుత్ వంశస్థు రాలినే పెళ్లాడలేదని అన్నారు. అన్నిటినీ అశుతోష్ కొట్టిపారేశాడు. చిన్నప్పట్నుంచి చదువుకున్న విషయాన్ని, మళ్లీ సినిమా కోసం ఎంతో మంది హిస్టరీ లెక్చెరర్స్‌ని సంప్రదించిన విషయాన్ని తను సినిమాగా తీశానని నొక్కి వక్కాణించాడు.
 
 పరుచూరి బ్రదర్స్‌లో పెద్దవారైన  పరుచూరి వెంకటేశ్వరరావు ఎప్పుడూ స్టోరీ సిట్టింగ్స్‌లో ఒక విషయం చెప్తుండే వాళ్లు. ఏ ప్రేమకథైనా సూపర్‌హిట్ అవ్వా లంటే ప్రేమికులిద్దరూ కలిస్తే బావుణ్ను అని ప్రేక్షకుడికి అనిపించాలి అని. అంటే, పాత్రల మధ్య కలవలేని అవాంతరాలని స్క్రీన్‌ప్లేలో అందంగా అల్లుకుంటూ రావాలి క్లైమాక్స్ వరకూ. చూస్తున్న ప్రేక్ష కుడికి వాళ్లు కలిస్తే బావుణ్ను అన్న ఫీలింగ్ కలుగజేసి, పెంచి పెద్ద చేసి చివరికి వాళ్లని కలిపితే, అప్పుడు హమ్మయ్య అని తృప్తిగా బైటికెళతాడు, అప్పుడు కూడా బలమైన కారణం ఇంకోటి పెట్టి ఆ ప్రేమికుల్ని విడగొట్టి ట్రాజెడీ ఎండింగ్ ఇస్తే ఆ బాధని ప్రేక్షకుడు అనుభవించి సినిమాని సూపర్‌హిట్ చేస్తాడు అని.
 
 మరోచరిత్ర నుంచి మనసంతా నువ్వే దాకా ఏ సూపర్‌హిట్ ప్రేమకథ చూసినా అలాగే అని పిస్తుంది. ‘జోధా అక్బర్’ ప్రేమకథలో ఈ ఫీలింగ్ విషయంలో పెద్ద రిస్క్ ఒకటుంది. హీరో, హీరోయిన్లకి ముందు పెళ్లయిపోయి, ఒకే కోటలో కలిసుంటారు. కలిస్తే బావుణ్ను అనుకోడానికి బయటి నుంచి కారణాలు తక్కువ. సో, ఇన్నర్ కాన్‌ఫ్లిక్ట్స్ మీద ఆధారపడి వాళ్ల మనసులు కలిస్తే బావుణ్ను అని ప్రేక్షకుడితో అనిపించాలి. అది చాలా చాలా కష్టమైన పని. కానీ సాధించారు దర్శక, రచయితలు. అందరికీ ఆమోదయోగ్యంగా చిత్రీకరించారు కాబట్టే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి మిలీనియమ్‌లో మంచి ప్రేమకథగా నిలిచింది.
 
 హృతిక్ రోషన్, ఐశ్వర్యారాయ్ అద్భుతంగా సరిపోయారు జోధాగా, అక్బర్‌గా. టైటిల్‌కి తగినట్టు సినిమా అంతా వారిద్దరిదే. అయినా ఆ బరువుని తేలికగా మోశారిద్దరూ. రెహ్మాన్ సంగీతం ఈ సినిమాకి సగం బలం. పాటలు ఎంత హిట్టో, నేపథ్య సంగీతం అంత యాప్టు. సెట్స్, సినిమాటోగ్రఫీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని చేశారు. యుద్ధ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో చిత్రీకరించడం దీనితోనే మొదలైందీ తరంలో.
 
 ఈ చిత్రంలో సంఘ టనల కన్నా సంభాషణలు ఎక్కువ ఉండడం వల్ల హిందీ, ఉర్దూ భాషలు ఆస్వాదించలేని ప్రేక్షకులకి కాస్త బోరు కొట్టొచ్చు కానీ, జాగ్రత్తగా ఫాలో అయితే, సాధారణ సినిమా ప్రేమికులందరూ ఇష్టపడతారు. మేకింగ్‌కి పెద్ద పీట వేసే ఇలాంటి చిత్రా లకి బడ్జెట్ కూడా ఎక్కువే ఉంటుంది. కాబట్టి ఇవి తేడా రాకుండా తీయడం ముఖ్యం. అందుకే దర్శకుడు కూడా సగం నిర్మాతయ్యాడు ఈ చిత్రానికి.  2000 తర్వాత మగధీర, బాహుబలి, రుద్రమదేవి చిత్రాలతో, జోధా అక్బర్‌ల స్థాయిలో మన చిత్రాలు తీయడం ప్రారంభమైంది. మిలీనియమ్‌లో బాలీవుడ్ ప్రభావం కథల్లోనే కాకుండా భారీతనంలో కూడా మన మీద ఉందనడానికి ఇదే సాక్ష్యం.   

వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement