‘చరిత్రలో ఫెయిలయ్యా.. కానీ చాలా ఇంట్రెస్ట్’
ముంబయి: తాను స్కూళ్లో చదివే రోజుల్లో చరిత్ర సబ్జెక్టులో ఫెయిల్ అయ్యానని.. కానీ, ఇప్పుడు మాత్రం బయటకు చెప్పని చరిత్రల గురించి దృశ్యరూపంలో చెప్పే అవకాశం వచ్చిందని బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అశుతోష్ గౌరీకర్ అన్నారు. ‘నాకు ఎప్పుడూ తేదీలు గుర్తుండేవి కాదు. చరిత్ర సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాను. జాగ్రఫీతో కూడా నాకు సంబంధం లేదు. అయితే, ఇప్పటి వరకు బయటకు ఎవరు చెప్పని కథల గురించి తెలుసుకునే ఆసక్తి మాత్రం తగ్గలేదు’ అని ఆయన అన్నారు.
తాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మొహంజదారో చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. సింధూ నాగరికత కాలంనాటి మొహంజదారో నగర విశిష్టతను దృశ్యరూపంగా ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. మొహంజదారో చరిత్ర గురించి చెప్పడం అంటే తనకు ఎప్పటికీ ఆసక్తే అని అన్నారు. ‘నేను ఈ చిత్రాన్ని తీసినందుకు సంతోషంగా ఉన్నాను. ఈ చిత్రానికి న్యాయం చేశానని అనుకుంటున్నాను. లగాన్, జోదా అక్బర్, నేడు మొహంజదారో వంటి చిత్రాలకు విడిది తీసుకోవడానికి గల కారణం తన పరిశోధనే అన్నారు. ఇవి ప్రత్యేకమైన చిత్రాలు అయినందున తాను అలా గ్యాప్ తీసుకుంటానని చెప్పారు.