మళ్లీ రభస మొదలు ! | Rabhasa start again! | Sakshi
Sakshi News home page

మళ్లీ రభస మొదలు !

Published Sun, Oct 5 2014 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM

మళ్లీ రభస మొదలు !

మళ్లీ రభస మొదలు !

టీవీక్షణం: మన దేశంలోని టాప్ రియాలిటీ షోలలో ఒకటి బిగ్‌బాస్. కొంతమంది సెలెబ్రిటీలను ఓచోట పడేసి, బయటకు రానివ్వకుండా చేసి, రకరకాల పోటీలు పెట్టి, చిట్ట చివరకు ఒకరిని విజేతగా ఎంపిక చేస్తారు ఈ షోలో. కానీ ఆలోపు జరిగే తంతు ఉంది చూశారూ... మామూలుగా ఉండదు. తిండి దగ్గర నుంచి పడుకునే చోటు వరకూ ప్రతి విషయంలోనూ కొట్లాటలు! ఒకరిని చూసి ఒకరు మండి పడుతుంటారు. కొందరు వెనుక కామెంట్లు చేస్తుంటే, కొందరు ముఖమ్మీదే విమర్శించి తగవులు పడుతుంటారు. వారానికొకరు ఎలిమినేట్ అవుతుంటారు. మధ్యలో కొందరు కొత్తగా ఎంట్రీ ఇస్తుంటారు. దాంతో వారం వారం షో కొత్త మజాని అందిస్తుంది. అందుకే ఈ షోకి టీఆర్పీ ఎప్పుడూ అధికంగానే ఉంటుంది!
 
 ఇటీవలే బిగ్‌బాస్ ఎనిమిదో సిరీస్ ప్రారంభమయ్యింది (కలర్స్ చానెల్). పోయినసారి స్వర్గం-నరకం కాన్సెప్ట్‌తో నడిచిన షో... ఈసారి ఎయిర్‌లైన్స్ కాన్సెప్ట్‌తో ప్రారంభమయ్యింది. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు అది ఏదైనా ప్రమాదంలో పడి నిర్మానుష్య దీవిలో చిక్కుబడిపోతే ఏం జరుగుతుంది? ప్రయాణికులు ఎలా ఉంటారక్కడ? ఉన్నవాటితో ఎలా సర్దుకుంటారు? ఇదే కాన్సెప్ట్. విమానం సెట్టింగు వేసి, కొందరు సెలెబ్రిటీలను అందులో వదిలేశారు.
 
 వాళ్లు ఆటాడుతుంటే, బిగ్‌బాస్ వేటాడుతున్నాడు. ఈసారి... మినీషా లాంబా (నటి), నటాషా స్టాంకోవిక్ (సెర్బిన్ మోడల్), ప్రణీత్‌భట్ (నటుడు, దర్శకుడు), సుకీర్తి కంద్‌పాల్ (మోడల్, నటి), గౌతమ్ గులాటీ (టీవీ నటుడు), సుశాంత్ దివ్‌గీకర్ (మిస్టర్ గే ఇండియా టైటిల్ విజేత), డయాండ్రా సోరెస్ (మోడల్, ఫ్యాషన్ డిజైనర్), ఆర్యబబ్బర్ (నటుడు, రాజ్‌బబ్బర్ కొడుకు), సోనీసింగ్ (టీవీ నటి), ఉపేన్ పటేల్ (మోడల్, నటుడు), కరిష్మా తన్నా (మోడల్, నటి), సోనాలీ రౌత్ (మోడల్, నటి) పోటీ పడుతున్నారు. ఇక గత రెండు సీజన్ల మాదిరిగానే బాలీవుడ్ సూపర్ హీరో సల్మాన్‌ఖాన్ సోలోగా యాంకరింగ్ చేస్తున్నాడు. నవ్వేచోట నవ్వుతూ, కసిరే చోట కసురుతూ ప్రేక్షకులను అలరించడంలో సల్మాన్ సక్సెస్ అయ్యాడు. అందుకే ఈసారి కూడా షో అతడి చేతికే వెళ్లింది.
 
 
 అయితే షో ఎంత సక్సెస్ అయినా... లోపల నడిచే ప్రేమకథలు, రొమాన్స్ వంటి వాటి విషయంలో మాత్రం కొందరు సంప్రదాయవాదులు గుర్రుగా ఉన్నారు. గతంలో షోను బ్యాన్ చేయమని కోరుతూ కొందరు కోర్టుకెళ్లారు కూడా! మరి ఈసారి ఎలాంటి కథలు నడుస్తాయో, ఎంత రభస జరుగుతుందో ముందు ముందు చూడాల్సిందే!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement