విశ్లేషణం: రియాక్టివ్ లీడర్!
కోమలవల్లి... ఈ పేరు చెబితే చాలామందికి తెలియదు. కానీ రెండేళ్ల వయసులో తండ్రిని పోగొట్టుకుని, 15 ఏళ్ల వయసులో అయిష్టంగా సినీరంగ ప్రవేశంచేసి, అగ్రకథానిక స్థాయికి ఎదిగి, 140 సినిమాల్లో నటించి, అయిష్టంగానే రాజకీయ ప్రవేశం చేసి, నాలుగుసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన మగువ అంటే మాత్రం చెప్పేస్తారు... ఆమె తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత, పురచ్చి తలైవి అమ్మ... అని!
జయలలిత ఇంగ్లిష్, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషలను అనర్గళంగా మాట్లాడగలరు. మాటల్లో సూటిదనం, స్పష్టత ఉంటాయి. తెలివైనదని, విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తని ఆమె మాటల్లో మనకు తెలిసిపోతుంది. ఆమె మనసు తెలుసుకోవడం కొంచెం కష్టమైన పనే. ఎందుకంటే ఆమె మాట్లాడేటప్పుడు శరీరంలో ఎలాంటి కదలికలూ ఉండవు. మొహంలో భావోద్వేగాలూ ఉండవు. కానీ ఆమె మాటతీరు, మాట్లాడే మాటలు, జీవనశైలి, తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ఆమె వ్యక్తిత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సూటిగా, స్పష్టంగా...
జయలలిత నిదానంగా, సున్నితంగా మాట్లాడతారు. ఎదుటివారి కళ్లలోకి సూటిగా చూస్తూ, చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్తారు. చెప్పడం ఇష్టంలేకపోయినా, ఎదుటివారి మాటలు ఇబ్బంది కలిగిస్తున్నా మొహమాటం లేకుండా ఆ విషయాన్ని వారికే చెప్తారు. మీడియా అడిగే ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానం చెప్పడమే కాదు, మీడియాకే ప్రశ్నలు వేస్తారు. సందర్భాన్ని బట్టి ఆమె స్వరంలో కోపం ధ్వనించినా మొహంలో మాత్రం కనిపించదు. ఎలాంటి సందర్భంలోనైనా బ్యాలెన్స్ కోల్పోకుండా ఉంటారు. వీటన్నింటినీ బట్టి ఆమె చాలా అసెర్టివ్ లీడర్ అని చెప్పవచ్చు. కానీ దీన్నే నిరంకుశత్వమంటుంటారు ప్రత్యర్థులు.
రియాక్టివ్ ఫీలింగ్స్...
బాల్యంలోనే తండ్రిని కోల్పోవడం, కోరుకున్న స్థాయిలో తల్లి ప్రేమను పొందలేకపోవడం, అయిష్టంగానే సినిమారంగంలోకి ప్రవేశించడం.. ఇవన్నీ జయలలిత వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేశాయని చెప్పవచ్చు. పైకి కఠినంగా కనిపించినా ఆమె నిరంతరం ప్రేమకోసం అన్వేషిస్తూనే ఉన్నారు. తన జీవితంలో 1/3 శాతం తల్లి, 1/3 శాతం ఎమ్జీఆర్, 1/3శాతం శశికళ ఆక్రమించారని అంగీకరిస్తారామె. ఈ మాటలు చెప్పేటప్పుడు, తన బాల్యం గురించి మాట్లాడేటప్పుడు ఆమె చూపు ఎడమవైపు కిందకు ఉంటుంది. గొంతు మంద్రస్థాయిలో, సున్నితంగా ఉంటుంది. అంటే ఆమె వాటిని నిజంగా ఫీలవుతున్నారని, వాస్తవాలనే చెప్తున్నారని అర్థం. ఆమెది అనుభూతి ప్రధాన వ్యక్తిత్వం. దీనికి తోడు రియాక్టివ్ పర్సన్. అందుకేనేమో తమిళనాడు అసెంబ్లీలో తనకు జరిగిన పరాభవాన్ని మనసులోకి తీసుకున్నారు, ప్రతీకారం తీర్చుకున్నారు ( అది ప్రతీకారం కాదని ఆమె అనవచ్చుగాక).
సెల్ఫ్ సెంట్రిక్
బాల్యంలో కామ్‌గా, సిగ్గరిగా ఉండేదాన్నని చెప్తారు జయలలిత. అయితే జీవితం, జీవితంలో ఎదురైన వ్యక్తులు, అనుభవాలు, రాజకీయాలు తనను ధృఢంగా మార్చాయంటారు. నాయకుడు లేదా నాయకురాలు తన భావోద్వేగాలను పబ్లిక్‌గా ప్రదర్శించకూడదంటారు. అందుకేనేమో ఎంత సీరియస్ విషయం మాట్లాడుతున్నా ఆ భావాన్ని తన మొహంలో కనపడనీయరు. తాను, తన వ్యక్తిత్వం మారిన తీరు తనకే ఆశ్చర్యంగా ఉంటుందని చెప్తారావిడ. ఆమె సమస్యలకు దూరంగా పోరు. పరిష్కారాలకోసం చూస్తారు. ఎవరేం చెప్పారనేదానికన్నా తనకేది మంచని అనిపిస్తుందో అదే చేస్తారు. సెల్ఫ్ సెంట్రిక్‌గా ఉంటారు. అన్‌కండిషనల్ లవ్ అనేది పుస్తకాల్లోనే ఉంటుందని, జీవితాల్లో ఎక్కడా కానరాదని చెప్పడం ఆమె వాస్తవిక దృక్పథాన్ని వెల్లడిస్తుంది. సినిమాలు, రాజకీయాలూ రెండూ చెడ్డవేనని, అయినా తన జీవితం వాటిలోనే సాగిందని, సాగుతోందని చెప్తారు. తనకు ఇష్టం ఉన్నా లేకున్నా.. ఒకసారి ఒక పని చేపట్టాక దానికి పూర్తిగా అంకితం కావడమే జయలలిత బలం. అందుకే సినీరంగంలోనూ, రాజకీయ రంగంలోనూ కూడా ఆమె సక్సెస్ అయ్యారు!
- విశేష్, సైకాలజిస్ట్