
సూది ఎప్పుడో దిగింది!
మన దేశంలో శతాబ్దం కిందట సూదిమందు అత్యాధునిక వైద్యానికి ప్రతీకగా ఉండేది. సూదిమందు వేసే డాక్టర్లే గొప్ప డాక్టర్లుగా చలామణీ అయ్యేవాళ్లు. సూదిమందు వేయించుకోవడానికి భయపడేవాళ్లు ఎందరు ఉండేవారో, సూదిమందు తీసుకోవడానికి ఉబలాట పడేవాళ్లూ ఉండేవాళ్లు. సూదిమందు వేస్తే ఎలాంటి జబ్బయినా మటుమాయం కాక తప్పదని బలంగా నమ్మేవాళ్లు. అయితే, సూదిమందు మరీ అంత ఆధునికమైన వైద్య సాధనమేమీ కాదు. రోమన్ సామ్రాజ్యంలో క్రీస్తుశకం ఒకటో శతాబ్ది నాటికే ఇంజెక్షన్ సిరంజీలు వాడుకలో ఉండేవి.
నాటి కాలానికి చెందిన ‘డి మెడిసినా’ గ్రంథంలో ఆలస్ కార్నేలియస్ నెల్సస్... సిరంజీల ద్వారా శరీరంలోకి ఔషధాలను పంపి చికిత్స చేసే విధానం గురించి రాశాడు. అప్పటి సిరంజి రూపు రేఖలు, పనితీరు ఎలా ఉండేవో పెద్దగా ఆధారాలు లేవు. అయితే, ఫ్రెంచి వైద్యుడు చార్లెస్ ప్రవాజ్, స్కాటిష్ వైద్యుడు అలెగ్జాండర్ వుడ్ 1853లో తొలిసారిగా గాజు గొట్టానికి సూది, పిస్టన్ జతచేసిన ఆధునిక సిరంజి నమూనాకు రూపకల్పన చేశారు.
దీనికి కొద్ది మార్పులతో న్యూయార్క్‌కు చెందిన వైద్యుడు లెటీషియా మర్న్‌ఫోర్డ్ గీర్ అరచేతిలో ఇమిడిపోయే పరిమాణంలో సిరంజిని తయారు చేసి, దానికి పేటెంట్ పొందాడు. అర్ధశతాబ్ద కాలం పాటు గాజుతో తయారు చేసిన సిరంజీలే వాడుకలో ఉండేవి. న్యూజిలాండ్‌కు చెందిన ఫార్మసిస్టు కోలిన్ మర్దోక్ 1956లో డిస్పోజబుల్ సిరంజీని రూపొందించాడు. కొద్ది దశాబ్దాల్లోనే గాజు సిరంజీలు దాదాపుగా అంత రించి, వాటి స్థానాన్ని ఈ డిస్పోజ బుల్ సిరంజీలు ఆక్రమించాయి.