ఒకసారి శివపార్వతులు ఆకాశమార్గంలో కాశీ నగరానికి వెళ్తున్నారు. వారికి గంగానదిలో అనేకమంది యాత్రికులు స్నానాలు చేస్తుండటం కనిపించింది. అది చూసి పార్వతి ‘‘నాథా! ఇంతమంది గంగలో స్నానాలు చేస్తున్నారు కదా, నిజంగానే వారి పాపాలు తొలగిపోతాయా? అదే నిజమైతే అందరూ పాపాలు చేసి, వాటి ఫలితాన్ని అనుభవించకుండా గంగాస్నానం చేసి పోగొట్టుకుంటారు కదా’’ అని సందేహం వెలిబుచ్చింది. శివుడు చిర్నవ్వుతో ‘‘దేవీ! ఇప్పుడు నేను ఒకటి చెబుతాను. నీవు ఆ విధంగా చేయి. అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది’’ అంటూ ఆమె ఏమి చేయాలో చెప్పాడు. ఆ ప్రకారం పార్వతి, పండుముల్తైదు రూపం ధరించి, గంగలో మునిగిపోతున్న ఒక వృద్ధుణ్ణి చూపిస్తూ, ‘‘దయచేసి నా భర్తను కాపాడండి’’ అంటూ కేకలు వేయసాగింది. ఆ మాటలు విని చాలామంది గంగలో దూకి, ఆమె పతి ప్రాణాలను రక్షించేందుకు సిద్ధమయ్యారు. అది చూసిన వృద్ధురాలు ‘‘అయ్యా! నా భర్తకొక శాపం ఉంది. పాపాత్ములెవరయినా ఆయనను ముట్టుకుంటే వెంటనే ఆయన ప్రాణాలు పోతాయి. అదేవిధంగా ఆయనను తాకిన వారి తల బద్దలవుతుంది. కనుక మీలో పాపరహితులైన వారు మాత్రమే ఆయనను రక్షించేందుకు పూనుకోండి’’ అని హెచ్చరించింది.
ఆ మాటలు విని అందరూ వెనక్కి వెళ్లిపోయారు. ఒకే ఒక వ్యక్తి మాత్రం నదిలో దూకి, కొట్టుకుపోతున్న వృద్ధుడి రెక్క పుచ్చుకుని, తన వీపు మీద ఆయనను మోస్తూ, ఒడ్డుకు తీసుకు వచ్చాడు. వృద్ధురాలు అతనికి కృతజ్ఞతలు చెబుతూనే, నాయనా! నీవు ప్రాణాలకు తెగించి మరీ నా మాంగల్యం దక్కించావు. నీవు పాపరహితుడవా’’ అని అడిగింది. ఆ వ్యక్తి ‘‘అమ్మా! నేను ఇంతకుముందే గంగా స్నానం చేసి పునీతుడినయ్యాను. అందుకే నీ పతి ప్రాణాలు రక్షించేందుకు ప్రయత్నించాను’’ అని చెప్పాడు. పార్వతీ పరమేశ్వరులు ఆ వ్యక్తికి దర్శనమిచ్చి, అంతులేని సంపదలను ప్రసాదించి తిరిగి వినువీధులలో విహరించసాగారు. ‘‘చూశావా దేవీ! విశ్వాసం ఉంటే గంగ తప్పకుండా వారి పాపాలను ప్రక్షాళన చేస్తుంది’’ అన్నాడు పరమేశ్వరుడు. అర్థమైందన్నట్లుగా పార్వతి చిరునవ్వుతో తల పంకించింది. పని చేస్తుందా లేదా అని అనుమానంతో వేసుకుంటే ఔషధం కూడా పని చేయదు. దృఢవిశ్వాసంతో చేసే పని తప్పక ఫలితాలనిస్తుందన్నది నీతి.
– డి.వి.ఆర్. భాస్కర్
పాప ప్రక్షాళనం
Published Sun, Apr 15 2018 12:08 AM | Last Updated on Sun, Apr 15 2018 12:08 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment