భగీరథప్రయత్నం | short stories | Sakshi
Sakshi News home page

భగీరథప్రయత్నం

Published Sun, Feb 19 2017 12:20 AM | Last Updated on Tue, Sep 5 2017 4:02 AM

భగీరథప్రయత్నం

భగీరథప్రయత్నం

వెండికొండమీద అర్ధనిమీలిత నేత్రాలతో ధ్యాననిమగ్నుడై ఉన్నాడు పార్వతీపతి. ఇంతలో తననెవరో ఆర్తితో పిలుస్తున్నట్లుగా అనిపించింది. ఎవరా ఆ పిలుస్తున్నది అని తరచి చూశాడు. భూలోకంలో భగీరథుడనే మహారాజు తనకోసం తీవ్రమైన తపస్సు చేస్తూ, కనిపించాడు. అతని తపస్సులోని నిస్వార్థాన్ని తెలుసుకున్న ముక్కంటి క్షణం కూడా ఆలసించకుండా వెంటనే వెళ్లి భగీరథుడి ముందు నిలిచాడు. ‘‘వత్సా! నీ తపస్సు నన్ను మెప్పించింది. ఏమి కావాలో కోరుకో’’ అన్నాడు మేఘగంభీరమైన స్వరంతో పరమేశ్వరుడు. ఉలిక్కిపడి కన్నులు తెరిచాడు భగీరథుడు. ఎదురుగా చిరునవ్వులు చిందిస్తూ, అభయ హస్తంతో సాక్షాత్కరించిన ముక్కంటిని చూడగానే సంభ్రమాశ్చర్యాలతో  నోటమాట రాలేదు భగీరథునికి. భక్తిపారవశ్యం నుంచి తేరుకున్న తర్వాత తానెందుకోసం తపస్సు చేసిందీ శివుడితో చెప్పసాగాడిలా...

‘‘సర్వజ్ఞులైన మీరు ఎరుగనిది కాదు నా గాథ.. అయినా, చెప్పడం నా ధర్మం.  సుమారు లక్షసంవత్సరాల క్రితం సగరుడనే చక్రవర్తి లోకకల్యాణం కోసం అశ్వమేధ యాగం యాగం చేశాడు. చివరలో యాగాశ్వాన్ని వదిలిపెట్టాడు. దానిని అనుసరించి, ఆ రాజుకు జన్మించిన 60 వేలమంది కుమారులూ వెళ్లేవారు. అది అన్ని రాజ్యాలకూ వెళ్లి, యథేచ్ఛగా సంచరించేది. ఆయా రాజులందరూ దాని రాకను గౌరవించి, సగరుడికి సామంతులుగా మారి పోయేవారు. చివరికోరోజున ఆ అశ్వం రాజపుత్రులందరి కళ్లూ కప్పి, ఎవరికీ కనిపించకుండా ఎటో వెళ్లింది. రాజుకీవిషయం తెలిసి, దాన్ని వెతుక్కు రమ్మని కుమారులను పంపాడు. అశ్వం లేకుండా రాజ్యంలోకి అడుగుపెట్టనివ్వనని చెప్పాడు.

రాజకుమారులు యాగాశ్వం కోసం భూమండలమంతా వెదికినా ప్రయోజనం లేకపోవడంతో పాతాళంలో వెదకాలని నిశ్చయించుకుని ఒక్కొక్కరు ఒక్కో యోజనం చొప్పున భూమిని తవ్వుతూ పాతాళంలోకి ప్రవేశించారు. ఆశ్చర్యం! వారికి పాతాళంలో వారి అశ్వం ఒక బయలులో పచ్చిక మేస్తూ కనిపించింది. దాని చెంతనే కపిల ముని తపస్సులో నిమగ్నమై ఉండటం చూసి, ఆయనే తమ అశ్వాన్ని బంధించాడేమోనని భావించి, ఆయన గడ్డం పట్టుకుని లాగారు. తపోభంగం కావడంతో కళ్లు తెరిచి వారివంక చుర్రున చూశాడు కపిలముని. ఆ కన్నుల నుండి అగ్నికీలలు వెలువడి వారందరూ బూడిద కుప్పలుగా మారిపోయారు. సగరపుత్రులు ఎంతకాలానికీ రాజ్యానికి చేరుకోకపోవడంతో వారికోసం అన్వేషిస్తూ వారి వారసుడైన అంశుమంతుడు పాతాళలోకానికిళ్లాడు. అక్కడ బూడిద కుప్పలుగా మారిన పితరుల భస్మరాశులను, పక్కనే తపోధాన్యంలో లీనమై ఉన్న కపిలమునిని చూసి, విషయం గ్రహించి, మునిని ప్రార్థించాడు.

 అప్పుడు ముని, శివుని శిరస్సుపై ఉన్న గంగ వచ్చి, వీరి భస్మరాసులపై ప్రవహిస్తే వీరికి మోక్షం కలుగుతుందని చెప్పాడు. నాటినుంచి మా వంశంలోని వారందరూ గంగను భువికి రప్పించేందుకు తీవ్రప్రయత్నాలు చేస్తూ వచ్చారు. చివరికి నేను ఎలాగైనా సాధించాలని మిమ్ములను ప్రార్థించాను స్వామీ, కాబట్టి దయచేసి మా పితరులకు సద్గతులు కలగడంతోపాటు, అందరి పాపాలనూ ప్రక్షాళన చేయగల పరమ పావనమైన గంగను దయచేసి నాతో పంపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను’’ అని కోరాడు.  అతని వినయానికి, పట్టుదలకు ముగ్ధుడైన శివుడు ‘‘భక్తా! గంగను నీ వెంట పంపడానికి నాకెటువంటి అభ్యంతరమూ లేదు కానీ, దివినుంచి జాలువారే గంగాప్రవాహ ఉద్ధృతిని తట్టుకోవడం ఎవరి తరమూ కాదు, గంగాప్రవాహంతో భూమిలో ఎన్నో విధ్వంసాలు జరుగుతాయి. అందువల్ల నేను ఇక్కడే కూర్చుని, గంగాప్రవాహ వేగాన్ని నా జటాజూటాలతో నిలువరిస్తాను’’ అని వరమిచ్చాడు.

మాట మేరకు శివుడు దివినుంచి మహోద్ధృతవేగంతో దుముకుతున్న గంగను తన జటాజూటాలతో బంధించి, ఏడు పాయలుగా చేసి, భూమిమీదకు వదిలాడు. అయినప్పటికీ గంగాప్రవాహ వేగానికి జహ్నుమహర్షి ఆశ్రమం మునిగిపోవడంతో ఆయన కోపించి, గంగను ఒక్క గుక్కలో ఔపోసన పట్టేశాడు. భగీరథుని ప్రార్థనకు తన చెవినుంచి వదిలిపెట్టాడు. జాహ్నవిగా మారిన గంగ అనేక దేశాలు, రాజ్యాలు, నగరాలు దాటుకుంటూ వచ్చి, చివరికి భగీరథుడి ముత్తాతల భస్మరాశుల మీద ప్రవహించి, వారికి ఉత్తమ గతులు కల్పించింది. అలా దివినుంచి గంగను భువికి రప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినందువల్ల భగీరథ ప్రయత్నమనే నానుడి ఏర్పడింది. అలాగే భగీరథుని అనుసరించి వచ్చింది కనుక గంగకు భాగీరథి అనే పేరు స్థిరపడింది. పరమశివుని భక్తవత్సలతను, ఒక మంచిప్రయత్నం చేయడానికి ఎన్నో ఆటంకాలను, అవరోధాలను అధిగమించాలని ఈ ఉదంతం నిరూపిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement