ఆదిభిక్షువు వాడినేది కోరేది...
పాటతత్వం
సిరివెన్నెల చిత్రం కోసం కె.విశ్వనాథ్ కోరిక మేరకు ‘విధాత తలపున ప్రభవించినది’ పాట రాశారు సీతారామశాస్త్రి. షూటింగ్ జరిగేటప్పుడు మేమంతా లొకేషన్‌కి వెళ్లేవాళ్లం. నందిహిల్స్‌లో షూటింగ్ జరుగుతుండగా, ఒకసారి నేను, సీతారామశాస్త్రి కలిసి శివాలయానికి వెళ్లాం. అక్కడ దర్శనం పూర్తి చేసుకుని, వెనుకకు వస్తుండగా, ‘నాకు మంచి పాట వస్తోంది’ అంటూ ‘ఆదిభిక్షువు వాడినేది కోరేది... బూడిదిచ్చేవాడినేది అడిగేది...’ అంటూ పాట వినిపించాడు. పాట వినగానే నాకు చాలా ఆనందం కలిగింది. ఆ పాటను సినిమా కోసం రాయలేదు. తన ఆనందం కోసం రాసుకున్నారు. పాటను పూర్తిగా విన్నాక, విశ్వనాథ్‌గారికి వినిపించాను. పాట వినడం, ఓకే చేయడం వెంటనే జరిగిపోయాయి. ఈ పాటను రాజస్థాన్‌లోని బ్రహ్మ దేవాలయంలో చిత్రీకరించారు. ఆదిభిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చేవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది... అనే పల్లవితో ప్రారంభమైన ఈ పాట నిందాస్తుతిలో సాగింది. బూడిదిచ్చేవాడు అంటే సర్వసంపదలు ఇచ్చేవాడని మరో అర్థం ఉంది. అడగకుండానే అన్నీ ఇచ్చేవాడిని ఇంకేమీ కావాలని అడగక్కర్లేదని నిందిస్తూనే స్తుతించాడు పల్లవిలో.
చరణం – 1
తీపిరాగాల కోకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేది కోరేది
కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చినవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేదిఎంతో మధురంగా గానం చేసే కోయిలమ్మకు నల్లని రంగునిచ్చాడు ఆ మహాశివుడు. కరకుగా గర్జించే మేఘాలకు మాత్రం తెల్లని రంగును హంగుగా కూర్చాడు. అటువంటి వాడిని ఏమివ్వమని అడగాలి అంటూ నిందిస్తాడు. ప్రతివారిలోనూ చూడవలసింది అంతఃసౌందర్యమే కాని బాహ్య సౌందర్యం కాదు అని స్తుతిస్తూ చెబుతాడు. నల్లగా ఉన్న కోయిల ఎంతో తీయగా గానం చేస్తుంది. తెల్లగా ఉన్న మేఘం భీకరంగా గర్జిస్తుంది. కాని అందరూ కోయిలనే ఇష్టపడతారు. ఆ గానమాధుర్యాన్ని ఆస్వాదిస్తారు... అనే అంతరార్థాన్ని స్ఫురింపచేస్తాడు.
చరణం – 2
తేనెలొలికే పూలబాలలకు మూణ్నాళ్ల ఆయువిచ్చినవాడినేది కోరేది బండరాళ్లను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఈ చరణంలో... పువ్వులు ఎంతో సుకుమారంగా ఉంటాయి. తేనెను స్రవిస్తాయి. అటువంటి పూలకు మూడునాలుగు రోజుల ఆయుష్షు మాత్రమే ఇచ్చాడు. కాని బండరాళ్లను మాత్రం చిరకాలం జీవించమన్నాడు. అటువంటివాడిని ఏమడగాలి అని నిందించాడు. అందులోనే కాకిలా కలకాలం జీవించడం కంటె, హంసలా ఆరు నెలలు జీవించినా చాలు అనే విషయాన్ని పరోక్షంగా స్తుతించాడు.
చరణం – 3
గిరిబాలతో తనకు కల్యాణమొనరింప దరిజేరు మన్మ«థుని మసి చేసినాడు... వాడినేది కోరేదివర గర్వమున మూడు లోకాల పీడింప తలపోయు దనుజులను కరుణించినాడు... వాడినేది అడిగేది ముఖప్రీతి కోరేటి ఉబ్బుశంకరుడు... వాడినేది కోరేది ముక్కంటి ముక్కోపి... ముక్కంటి ముక్కోపి తిక్కశంకరుడు మూడవ చరణంలో... పార్వతిని తనకిచ్చి వివాహం చేయాలనే సత్సంకల్పంతో వచ్చిన మన్మథుడిని బూడిద చేశాడు. సాక్షాత్తు ఆ పరమశివుడు ఇచ్చిన వరగర్వంతో లోకాలను పీడిస్తున్న రాక్షసులను మాత్రం కరుణించాడు. ముఖస్తుతులు కోరే ఆ శంకరుడిని ఏమి కోరుకుంటాం. అసలే ఆయన ముక్కోపి, ముక్కంటి... అంటూ నిందించాడు. మన్మధుడిని మసి చేసి, మళ్లీ ప్రాణం పోశాడు. రాక్షసులకు వరం ఇచ్చాడు, ఆ తరువాత అంతం చేశాడు. ఎవరిని ఎప్పుడు ఎలా చూడాలో ఆయనకు తెలుసు అని అంతర్లీనంగా స్తుతించాడు. నిందాస్తుతిలో సాగిన ప్రత్యేకమైన పాట, సీతారామశాస్త్రిని ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’గా చేసిన పాట.
ఆకెళ్ల సినీ రచయిత
– డా. వైజయంతి