శాంతిదూత | Sister Nivedita life story | Sakshi
Sakshi News home page

శాంతిదూత

Published Sun, Mar 6 2016 2:42 AM | Last Updated on Tue, Nov 6 2018 4:10 PM

శాంతిదూత - Sakshi

శాంతిదూత

 మనిషి ఏం చేయాలన్నా తన మనసు మీదే ఆధారపడి ఉంటుంది. అందులోనే మంచీ ఉంటుంది, చెడూ ఉంటుంది. అందులోనే అంతు లేనంత శక్తి కూడా ఉంటుంది. దాన్ని ఎలా ఉపయోగించుకుంటామన్న దానిపైనే జీవితం ఆధారపడి ఉంటుంది             - సిస్టర్ నివేదిత
 
 సేవా దృక్పథమే ఆమెను లండన్ నుంచి కలకత్తాకు రప్పిం చింది. జీవితం అగమ్యంగా మారిన స్థితిలో తారసపడ్డ గురువు స్వామి వివేకా నంద బోధలకు ఆక ర్షితురాలైంది. ఆయన బోధలే శాంతి మార్గమని నమ్మింది. అంతే.. మరేమీ ఆలోచించకుండా, అన్నీ వదులుకుని ఆయనతో కలసి భారత్‌కు వచ్చే సిందామె. అచిర కాలంలోనే సోదరి నివేదితగా భారతీ యులకు చిరపరిచితు రాలైంది. ఐర్లాండ్‌లోని కౌంటీ టైరాన్‌లో 1867 అక్టోబర్ 28న పుట్టింది. తండ్రి శామ్యూల్ రిచ్‌మండ్ నోబుల్, తల్లి ఇసాబెల్. స్కాట్లాండ్‌కు చెందిన వాళ్లు ఐర్లాండ్‌లో స్థిరపడ్డారు. మతబోధకుడైన శామ్యూల్ కూతురికి తరచు మానవసేవ గురించి చెప్పేవాడు. అయితే, ఆమెకు పదేళ్ల వయసులోనే శామ్యూల్ మరణించాడు. తల్లి ఇసాబెల్ పుట్టింటికి చేరడంతో, మార్గరెట్ అక్కడే పెరిగింది.
 
 లండన్‌లోని చర్చి బోర్డింగ్ స్కూల్‌లో, హాలిఫాక్స్ కాలేజీలో ఆమె చదువు సాగింది. ఒకవైపు చదువు కొనసాగిస్తుండగానే, పదిహేడేళ్ల వయసులోనే చిన్నపిల్లలకు టీచర్‌గా పాఠాలు బోధించేది. తర్వాతి కాలంలో వింబుల్డన్‌లో స్వయంగా ఒక పాఠశాలను నెలకొల్పింది. కాలేజీ చదువు పూర్తయ్యాక చాలామంది అమ్మాయిల్లాగానే తాను కూడా పెళ్లికి సిద్ధపడింది. వేల్స్‌కు చెందిన ఒక యువకుడితో నిశ్చితార్థం కూడా జరి గింది. నిశ్చితార్థం జరిగిన కొద్ది రోజులకే అతడు ఆకస్మికంగా మరణించాడు. మార్గరెట్‌కు ఇదొక షాక్. త్వరగా తేరుకో లేకపోయింది.
 
  మనశ్శాంతి కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనేది. ఆమె అలాంటి పరిస్థితుల్లో ఉన్న కాలంలోనే స్వామీ వివేకానంద అమెరికా నుంచి 1895లో లండన్ చేరుకున్నారు. లండన్‌లోని ఒక సంపన్నుని ఇంట ఏర్పాటు చేసిన స్వామీ వివేకానంద వేదాంత ప్రసంగం కార్యక్రమానికి ఒక స్నేహితురాలి ద్వారా మార్గరెట్‌కు ఆహ్వానం అందింది. మార్గరెట్ ఆ కార్యక్రమానికి హాజరైంది. అక్కడక్కడ సంస్కృత శ్లోకాలను ఉటంకిస్తూ సాగిన వివేకానందుని వాక్ప్రవాహానికి ఆమె మంత్రముగ్ధురాలైంది. ఇక అప్పటి నుంచి లండన్‌లో వివేకానందుని కార్యక్రమా లన్నింటికీ క్రమం తప్పకుండా హాజ రయ్యేది.
 
  వివేకానందుడి పిలుపుతో ఆమె సముద్రమార్గంలో 1898 జనవరి 28న కలకత్తా చేరుకుంది. వివేకానందుడి గురువైన రామకృష్ణ పరమహంస సాధనలతో గడిపిన దక్షిణేశ్వర ఆలయాన్ని సందర్శించుకుంది. కలకత్తాలో 1898 మార్చి 11న ఏర్పాటైన బహిరంగ కార్యక్రమంలో స్వామి వివేకానంద తొలిసారిగా మార్గరెట్‌ను ప్రజానీకానికి పరిచయం చేశారు. కొద్దిరోజులకే ఆమె రామకృష్ణ పరమహంస సతీమణి శారదాదేవిని కలుసుకుని ఆశీస్సులు తీసుకుంది. జీవితాంతం బ్రహ్మచర్య దీక్షను అవలంబిస్తానని ప్రతినబూనడంతో స్వామి వివేకానంద ఆమె పేరును ‘సోదరి నివేదిత’గా మార్చారు.
 
 నివేదితగా మారిన తర్వాత వివేకానందునితో కలసి ఆమె విస్తృతంగా భారత దేశమంతటా పర్యటించింది. నిధుల సేకరణ కోసం, ఆధ్యాత్మిక ప్రచారం కోసం అమెరికా కూడా వెళ్లింది. అల్మోరాలో ఉన్న సమయంలో ధ్యానం చేయడంలో శిక్షణ పొందింది. మనసు తన గరిమనాభిని మార్చుకునే ప్రక్రియగా ధ్యాన ప్రక్రియను  ఆమె అభివర్ణించింది. భారతదేశం గొప్ప మహిమాన్విత దేశమని పొగుడుతూ పాశ్చాత్య దేశాల్లోని తన మిత్రులకు ఉత్తరాలు రాసేది. వివేకా నందుడు 1902 జూలై 4న మరణించిన తర్వాత ఆమె మరింతగా ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో తలమునకలైంది.
 
  వివేకానందుని బోధలను యువతరానికి చేరవేసేందుకు అహరహం కృషి చేసింది. కలకత్తాలో ప్లేగు మహమ్మారి వ్యాపించినప్పుడు రోగుల దగ్గరే ఉండి, వారికి సేవలందించింది. భారత జాతీయ, స్వాతంత్య్రోద్యమాలకు ఇతోధికంగా తోడ్పాటునందించింది. విద్యావ్యాప్తికి, సేవా కార్యక్రమాల అమలుకు విశేషంగా కృషి చేసింది. స్వాతంత్య్ర సమర యోధుడు, ఆధ్యాత్మికవేత్త అరబిందొ ఆధ్వర్యంలో వెలువడే ‘కర్మయోగి’ పత్రికకు సంపాదకురాలిగా సేవలందించింది. మేధాసంపత్తిలో భారతదేశం అద్వితీయమైనదని ప్రపంచానికి చాటింది.
 
  నివేదిత రచించిన ‘కాళీ: ది మదర్’ స్ఫూర్తితోనే బెంగాలీ చిత్రకారుడు అవనీంద్రనాథ్ టాగోర్ ‘భారతమాత’ పెయింటింగ్ వేశారు. డార్జిలింగ్‌లో ఉండగా, అనారోగ్యానికి గురైన నివేదిత 1911 అక్టోబర్ 13న తన 43వ ఏట తుదిశ్వాస విడిచింది. భారతదేశంతో, భారత ప్రజలతో మమేకమై జీవించిన ఆమె స్ఫూర్తి నేటికీ కొనసాగుతూనే ఉంది. పలుచోట్ల ఆమె స్మారకచిహ్నాలు, ఆమె పేరిట ఏర్పాటైన పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు నేటికీ ఆమె సేవానిరతికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.                           ఠి
 
 అల్మోరాలో ఉన్న సమయంలో ధ్యానం చేయడంలో శిక్షణ పొందింది. మనసు తన గరిమనాభిని మార్చుకునే ప్రక్రియగా ధ్యాన ప్రక్రియను ఆమె అభివర్ణించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement