ఈ కథ ఎవరిది? | This is the story? | Sakshi
Sakshi News home page

ఈ కథ ఎవరిది?

Published Sun, Nov 5 2017 12:58 AM | Last Updated on Sun, Nov 5 2017 12:58 AM

This is the story? - Sakshi

కేంద్ర కారాగారము. రాజమండ్రి పెద్ద పెద్ద అక్షరాలతో బయటున్న ప్రపంచానికి ప్రశాంతంగా కనిపిస్తున్న ఈ జైల్లోపల ఈరోజొక ఉరిశిక్ష అమలుకాబోతుంది.శీతాకాలం. నవంబర్‌ 11. తెల్లవారు జాము 3:13.ఈమధ్యనే చలి బాగా పెరగడంతో మనుషులంతా దుప్పట్లు, రగ్గులు కప్పుకుని ఎవరుండే చోట వాళ్ళు సుఖంగా నిద్రపోతున్నారు. ఒకరకంగా ప్రాణులన్నీ చాలా బద్ధకంగా ఈడుస్తున్నాయి రోజుల్ని. ఈ జైలు ప్రహరీ గోడే బయట ప్రపంచాన్ని లోపలున్న ప్రపంచాన్ని వేరు చేసేది. అంతెత్తులో ఉన్న జైలు ప్రహరీ గోడ రాజుల కాలం నాటి కోటగోడలను గుర్తుకుతెచ్చి భయపెడ్తోంది. లోపల ఎంత పెద్ద సామ్రాజ్యం ఉందో!జైల్లోపల కూడా చాలా ప్రశాంతంగా ఉంది. అది ఈ సమయంలో వాతావరణం వల్ల కూడా అయ్యుండొచ్చు కానీ ఏదో తెలియని ఆందోళన కలుగుతోంది నా మనసులో ఇప్పుడు. ఎప్పుడో కట్టిన డచ్‌ వారి కోటని బ్రిటిష్‌ వారు జయించి దాన్ని 1870లో సెంట్రల్‌ ప్రిజన్‌ కింద మార్చారు. ఇక్కడ నుంచుని చూస్తున్న నాకు ఈ జైలు ఆవరణమంతా చాలా గంభీరంగా కనబడుతోంది. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, చిన్న చిన్న పూల మొక్కలు, ఎటు చూసినా బయట ప్రపంచాన్ని కనబడనివ్వని ఎత్తైన ప్రహరీ గోడ.అక్కడక్కడున్న లైట్ల వెలుగులో జైలు పరిసరాలు తెలుస్తున్నాయి. ఎవరో నడుచుకుంటూ అటువైపు వెళ్తున్నారు. బూట్ల చప్పుడు వినిపిస్తోంది. మనమూ వెళ్దాం అతని వెనుక, ఏదో గదిలోకి వెళ్ళాడు. చేతిలో లాఠీ ఉంది.

‘‘ఏయ్‌ స్వామీ లెగు.. ఏయ్‌ లెగవయ్యా టైం అవుతోంది’’ లాఠీని తలాంచిన గోడమీద కొడుతూ అరుస్తున్నాడు జైల్‌ సెంట్రీ సలీం. ‘‘ఏయ్‌ స్వామీ’’ఏదో పీడకల్లోంచి మధ్యలో లేచినట్లు లేచాడు స్వామి. తన ఎడమపక్క నుంచున్న సెంట్రీ సలీమ్‌ను చూశాడు.‘లెగవయ్యా.. వెళ్ళి రెడీ అవ్వు. ఇందాకట నుండి లేపుతున్నా. టైం అవుతోంది ఇక కాని ..లేచి’’ అని చెప్పి వెళ్ళిపోయాడు సలీం.స్వామి ఒక చెవిలో మాత్రం గుయ్‌ య్‌ య్‌ మని ప్రతిధ్వనిస్తుంది ఇందాక సలీం లాఠీతో గోడమీద కొట్టినందువల్ల. ఎడమచేత్తో చెవిని నలుపుకుంటూ స్వామి ఈ కథని చెప్తున్న నన్ను చూశాడు.‘‘ఏయ్‌ ఎవడ్రా నువ్వు? ఏం చెబ్తున్నావ్‌? ఏంటీ జరగబోతున్న కథ చెబ్తున్నావా? ఇది నా కథ. నా కథ నేనే చెప్పుకుంటా నువ్వు పో ఇక్కడినుండి!’’

ఈ కథ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్న వారందరికి నా నమస్కారం. నా పేరు.. ఇదివరకే మీరు వినున్నారు. ఆ!..అవును.. స్వామి నా పేరు. వయసు సుమారు 56 యేళ్ళు. నేను ఇక్కడ... మర్చిపోయా ఇందాకటి విషయమ్మీద మీకందరికొక చిన్న వివరణ. ఇందాకొకడొచ్చాడే.. అదే మీకు కథ చెప్తానని మొదలుపెట్టాడే.. వాడే! నాకలాంటోళ్ళంటే వొళ్ళు మంట. ఎన్నో ఏళ్లుగా చూస్తున్నా.. కథ చెబుతామని మొదలుపెట్టి ఏదేదో చెప్తూ ఎవరి కథ ఎవడికి ఎలా చెప్తున్నామో కూడా తెలియకుండా చెప్పే ఇలాంటి కథకుల్ని చూస్తేనే నాకు వొళ్ళు మండిపోద్ది. అందుకే వాడ్ని పొమ్మన్నా. అయినా నా కథ నాకన్నా బాగా ఎవరు చెప్పగలరు? ఇది నా కథ.. నేనే చెప్పుకుంటా.అలా స్నానాల గదికెళ్తూ మాట్లాడుకుందాం పదండి. ఉ ఉహుహుహు.. బయట చాలా చలిగా ఉంది. అసలే ఇక్కడ చెట్లెక్కువ. నాకు జైల్తో అనుబంధం చాలా చాలా సంవత్సరాల ముందే మొదలైంది. మొదటిసారి జైల్‌కి మా నాన్నతో వచ్చా. అప్పుడు చాలా భయమేసింది కానీ, నాన్నే ధైర్యం చెప్పాడు నాకు.ఓహ్‌... స్నానానికి వేడ్నీళ్ళిచ్చారే, నాకిక్కడ చివర్రోజని అతి«థి మర్యాదనుకుంటా! ఆహా!! మీకోవిషయం తెల్సా.. బాగా చలిగా వున్నప్పుడు వేడి వేడీ నీళ్ళతో తలస్నానం చేస్తే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా! నేనైతే ప్రపంచాన్నే మర్చిపోతా. కార్తీక మాసాలంటూ చన్నీళ్ళ స్నానం చేస్తే ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఎప్పటికి తెలుస్తాయి? ఇంకోసారి దొరుకుతుందో లేదో కూడా తెలీదు ఈ మనిషి జన్మ. దొరికినప్పుడే చివరి చుక్క వరకూ అనుభవించెయ్యాలి. స్నానం చేస్తూ ఈ ఫిలాసఫీ ఏంటా అనుకుంటున్నారా... హహహహ.. స్నానం అయ్యింది ఇక పదండి నా గదికి.

మ్మ్‌ మ్మ్‌ మ్మ్‌... బట్టలెవరుతికారోగాని మిలమిల్లాడిపోతున్నాయి.‘‘ఏవోయ్‌ స్వామి. ఎంతసేపయ్యా రెడీ అయ్యేది? నీకోసం టిఫిన్‌ రెడీ చేసుంచాం తొందర్కానీ’’నన్ను నిద్రలేపాడే వాడే  జైల్‌ సెంట్రీ సలీం. అటు పోతున్నాడు చూడండి, వీడికున్నంత కంగారు ఈ ప్రపంచంలో ఎవడికీ ఉండదు. రేప్పోవాల్సినోడ్ని ఈరోజు పొద్దున్నుండే కంగారుపెట్టి మధ్యాహ్నానికే పంపించే రకం వీడు. వీడి పెళ్ళాం బిడ్డలు ఎలా బతుకుతున్నారో ఇలాంటోడితో. మంచి వాసనొస్తున్నాయ్‌ బట్టలు, చిన్న అద్దమున్నా బావుండేది ఎలా ఉన్నానో చూస్కునేవాడ్ని. సరేలే, అయినా ఇప్పుడదెందుకులేకానీ..‘‘ఇదిగో టిఫిన్‌’’‘‘టైం ఎంతయ్యింది?’’‘‘4:30. తొందరగా తిను.. టైం అవుతోంది. డాక్టర్‌ గారు, మేజిస్ట్రేట్‌ గారు బయలుదేరారంట’’వీడసలు మనిషా యంత్రమా? ఏం టిఫిన్‌ పంపించారో.. మ్మ్‌ పూరి. బంగాళదుంప కూర కూడా ఉంది. నాకిదంటే చాలా ఇష్టం. పర్లేదు నన్ను బానే చూసుకుంటున్నారు. కూరలో కొంచెం ఉప్పు తక్కువైంది. అయినా బ్రహ్మాండంగా వుంది పూరి. చాలా బావుంది.ఒక్కనిముషం.. ఉండండి అక్కడికెళ్ళి కూర్చుంటా. చెట్లు, ఆకాశం అన్నీ కనిపిస్తాయి.

టైం 5 దాటినట్లుంది. వాతావరణంలో గాలి మార్పు, ఆకాశంలో వెలుతురొచ్చే ముందుండే రంగువల్ల తెలుస్తోంది. అదిగో పక్షుల గుంపు ఆకాశంలో! నాలో నేను చాలాసార్లు అనుకున్నా.. ఆ గుంపులో ఉన్న ప్రతి పక్షి సాయంత్రానికి క్షేమంగా గూడు చేరుకుంటుందా? చేరని పక్షి గూటిలో తన కోసం ఎదురుచూసే దాని జంట పక్షో లేక వాటి పిల్లలో ఎవరైనా ఉంటారా? ఆ ఎదురుచూపుని కొలిచే పరికరాన్నేదైనా కనిపెట్టారో లేదో ఈ ఆధునిక శాస్త్రజ్ఞులు. నాకు పూజలు మంత్రాలు రావు. నేను ఏ దేవుడ్నీ నమ్మను. ప్రశాంతత కోసం ధ్యానం చెయ్యడం లాంటివేవీ చెయ్యను. నా మనసుకి ప్రశాంతతని ఇచ్చేవి ఇవే, ఈ ప్రకృతే.‘‘ఏమోయ్‌ స్వామీ... ఓయ్‌... స్వామీ.. ఏందయ్యాఆలోచిస్తున్నావ్‌? సరే కానీ ఇక పద! జడ్జిగారు, డాక్టర్‌ గారు వచ్చేశారు. సూపరింటెండెంట్‌ గారు కూడా తయారయిపోయారు. లెగు..’’‘‘పద’’నా ముందే నడుస్తున్నాడు సలీం. వెలుతురు కొంచెం వచ్చింది. తెల్లవారుతున్నట్లుంది. మళ్ళీ టైం అడిగితే విసుక్కుంటాడేమో. సలీం వెనక్కి తిరక్కుండానే నడుస్తున్నాడు. నాకు ఈ జైల్లో నచ్చని ఒకే ఒక ప్రదేశం ఉరికంబం వున్న గది. ఇప్పుడు అక్కడికే మేం వెళ్తున్నది. అదిగో ఇక్కడినుండి కనబడుతోంది ఆ గది. ఈ మసక వెలుతుర్లో ఆ గది గుమ్మం పైనున్న 60 కాండిల్‌ బల్బ్‌ వెలగటం స్పష్టంగా కనిపిస్తోంది. మేము గది దగ్గరకొచ్చినట్లు లేదు.. గదే మా దగ్గరకొచ్చేసినట్లనిపిస్తోంది.ఎక్కడినుండో లీలగా నమాజ్‌ వినిపిస్తోంది. అంటే టైం 6 అయ్యిందన్నమాట.

సలీం గది తాళాలు తీసి నావంక చూశాడు.ఇప్పటిదాకా మీముందు అదనీ ఇదనీ ఫిలాసఫీ గురించి, పూరి గురించి, పక్షుల గురించి తెగ మాట్లాడాను కానీ, అదంతా మేకపోతు గాంభీర్యమే. నిజంగా నాకిప్పుడు ఏడుపొస్తోంది.  చాలా చాలా భయంగా ఉంది ఆ గది లోపలికెళ్ళాలంటే! ఇప్పటికిప్పుడు నన్నిక్కనుండి ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతే బావుణ్ణు. ఏ పక్షి గుంపైనా వచ్చి నన్నెత్తికెళ్ళిపోతే బావుణ్ణు.సలీం లోపలికెళ్ళి లైట్‌ స్విచెస్‌ ఆన్‌ చేసి నన్ను పిలిచాడు. నాకిక్కడినుండి పారిపోవాలనిపిస్తోంది. ఇదంతా ఏంటో నాకర్ధం కావటం లేదసలు. లోపలికెళ్ళి నుంచున్నా. ట్యూబ్‌ లైట్‌ వెలుగులో గదంతా చాలా  బాగా కనిపిస్తోంది బూజుల్లో సహా.జరగబోయే ప్రమాదాన్ని తనలో దాచినట్లు కనిపిస్తోంది గదంతా ముసిరిన ప్రశాంతతని చూస్తుంటే.ఇంతలో ఇంకో సెంట్రీ రమణ వచ్చి జడ్జి గారు వాళ్ళు వస్తున్నారని చెప్పాడు.చెప్పీ చెప్పడంతోనే సలీం కంగారుపడిపోయి నన్ను మెట్లెక్కి ఆ ఉరికంబం మీదకు రమ్మన్నాడు. మెట్లెక్కుతుంటే తెలుస్తోంది ఉరితాడు ఎంత నునుపుగా ఉందా అని. పైకి వెళ్ళి ఓ పక్కగా నుంచున్న నన్ను, సలీం జైల్‌ సూపరింటెండెంట్‌ గారిని చూసి తన వైపుకి లాగి కిందకు దిగిపోయాడు. ఇప్పుడు ఉరితాడు నాకెదురుగా ఉంది.తాడు ఊగుతున్నట్లనిపిస్తోంది కానీ ఈ గదిలో గాలే లేదసలు. కలెక్టరే జిల్లా మేజిస్ట్రేట్‌  అవ్వడంతో ఆయనే వచ్చారు. ఒక డాక్టర్, ఒక లాయరు, జైల్‌ సూపరింటెండెంట్‌ వచ్చారు. అందరూ మాట్లాడుకుంటూ పేపర్స్‌ మీద ఏవో రాసుకుంటున్నారు. అదంతా అయ్యాక ఒకసారి బైటకెళ్ళి వెంటనే వచ్చాడు. ఆయన వచ్చిన రెండు నిముషాలకే సెంట్రీ సలీం లోపలికొచ్చాడు. చివరన సెంట్రీ రమణ, వీళ్లిద్దరి మధ్యలో తెల్ల బట్టలేసుకున్న ఒక వ్యక్తి నిలబడున్నాడు. ముగ్గురు ఉరికంబం మెట్లెక్కి పైకి వచ్చారు. ఉరికి ఎదురుగా ఉన్న నేను పక్కకి తప్పుకున్నా, ఆ తెల్ల బట్టలేసుకున్న వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టారు సెంట్రీలు. మెట్లెక్కుతున్నప్పుడు ఆ వ్యక్తి జేబు మీదున్న నెంబర్ని చూశా. 2197. తలకి నల్ల గుడ్డ వేసుంది. అయినా మొహం చూడ్డం నాకిష్టం లేదు.

సూపరింటెండెంట్‌ సైగ చేయడంతో తాడుతో కట్టడానికి ఆ వ్యక్తి చేతుల్ని మొదటిసారి ముట్టుకున్నా. పల్స్‌ చాలా వేగంగా కొట్టుకుంటోంది. కాళ్ళు కూడా కట్టా. రెండు రోజుల్నుండి క్రీజ్, అరటి పండు గుజ్జు రాసి నున్నగా మార్చిన మనీలా తాడుని ఆ వ్యక్తి గొంతువరకు తగిల్చి ఉచ్చుని వదులు కాకుండా కొంచెం గట్టిగా బిగించా. ఇలా చెయ్యకపోతే ప్రాణం పోవడం ఒక నరకంగా ఉంటుంది. తాడు నునుపుగా లేకపోతే తాడు రాపిడికి మెడ వరుచుకుని గాయమవుతుంది. ఇన్ని చేసేది తక్కువ బాధతో ఒకప్రాణాన్ని తీయడంకోసమే. తాడు తగిలించి లివర్‌ ముందుకొచ్చి నుంచున్నా.అవును నేను తలారిని. సమయం కోసం చూస్తున్నారు. గది మొత్తం నిశ్శబ్దం. 7 గంటలకు శిక్ష అమలు చెయ్యాలి. నేను సూపరింటెండెంట్‌ వంకే చూస్తున్నా. ఆయన వాచ్‌ చూసుకుంటున్నారు.డాక్టర్, కలెక్టర్‌ ఏవో మాట్లాడుకుంటున్నారు.నేను లివర్‌ పట్టుకుని సూపరింటెండెంట్‌ వైపు చూస్తున్నా. ఆయన సిగ్నల్‌ ఇచ్చాడు. నేను నా బలమంతా ఉపయోగించి చాలా నెమ్మదిగా లాగా లివర్ని. వెంటనే ఉరి తగిలించిన మనిషి కాళ్ళ కిందున్న తలుపులు తెరుచుకుని తను కొంచెం కిందకి పడి ఆగి, అలాగే గాల్లో ఉండి కొట్టుకుంటూన్నాడు.లివర్‌ లాగిన నేను అలాగే ఉండి మనసులో అరుస్తున్నా అతనికి వినబడుతుందేమోనని. అలా గింజుకోవద్దని. ఎందుకంటే అతను ఎంత గింజుకుంటే ప్రాణం పోవడం అంత కష్టమైపోతుంది.అలా కొట్టుకుంటున్న ఆ మనిషి దగ్గరికెళ్ళి అతన్ని పట్టుకుని ధైర్యం చెప్పాలని వుంది ‘‘ఏం కాదు అయిపోతుంది’’ అనే మాట చెప్పాలనిపిస్తోంది.సరిగ్గా 14 నిముషాల తర్వాత మెడ దగ్గరనుండి సౌండ్‌ వచ్చింది. దీన్నే నెక్‌ స్నాపింగ్‌ అంటారంట.

డాక్టర్‌ వచ్చి పల్స్‌ చూసి మరణాన్ని ధృవీకరించాడు. పేపర్లమీద ఏవో రాసుకుని అధికారులందరూ వెళ్ళిపోయారు. సెంట్రీలు కూడా ఇప్పుడే వస్తామని వెళ్ళారు.ఉరితాడుకి వేళాడుతూ ఆ మనిషి, తన పక్కన నించున్న నేను మాత్రమే మిగిలాం ఆ గదిలో. కథలంటే ఎప్పుడూ ఉరిశిక్ష పడ్డవాడిదో, లేదా, అది వేసి అమలు చేసినవాళ్ళు రాసినవో ఉంటాయి కానీ... ఉరిశిక్ష అమలులో నాకు తెలియని ఒక మనిషి ప్రాణాన్ని తీయడంలో నాలాంటి తలారులు ఎంత క్షోభ పడుతున్నారో ఎవరైనా రాశారా? కనీసం అనుకున్నారా? కథ మావైపు నుండి చెప్పడానికి ప్రయత్నించారా? అందుకే ఈ కథ నేనే చెప్పాలనుకున్నా.. చెప్పా.వారసత్వంగా నా తండ్రి నుండి వచ్చిన ఈ కొలువుని నేనెన్నడూ ప్రేమించలేదు. కనీసం ఒక బాధ్యత కింద కూడా చూడలేకపోయా. తప్పులు అందరూ చేస్తారు. క్షమించరాని తప్పులు చేసిన వాళ్ళకి మరణశిక్ష విధిస్తున్నారు. ఆ పాపం చెయ్యడానికి ఇంకా ఈ రోబోట్‌ కాలంలో కూడా మనుషులు కావాలా? లివెర్‌ లాగే మాకు గుండె లేదనుకున్నారా లేక మమ్మల్నే రోబోట్లనుకున్నారా? ఈరోజే జైల్లో నాకాఖరి రోజు. ఈరోజే నా రిటైర్మెంట్‌. ఇన్నాళ్ళ నా సర్వీస్లో ఎన్నో ఉరిశిక్షలు అమలు చేశా. నా తండ్రి సమయంలో కొన్ని తప్పక చూశా. అందుకే ఏది ఏమైనా నా పిల్లలకిదొద్దనుకున్నా. వాళ్ళు కలెక్టర్లు, డాక్టర్లు, పోలీసులు కావాలని నేనెప్పుడూ కోరుకోలేదు కాని ఇది మాత్రం వాళ్లకి అంటకూడదు. అంటి జీవితాంతం వెంటాడకూడదనుకున్నా. అందుకే ఇదంతా నాతోనే పోవాలి.ఇదీ అసలు మొత్తం కథ. బాడీని తీసే టైం అయింది మరి. చివరగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా...ఇందాకటినుండి నేను చెప్పే ఈ కథంతా విన్నారు కదా.. ఇప్పుడు మీరే చెప్పండి..ఈ కథ ఎవరిది?

ఆ గుంపులో ఉన్న ప్రతి పక్షి సాయంత్రానికి క్షేమంగా గూడు చేరుకుంటుందా? చేరని పక్షి గూటిలో తన కోసం ఎదురుచూసే దాని జంట పక్షో లేక వాటి పిల్లలో ఎవరైనా ఉంటారా? ఆ ఎదురుచూపుని కొలిచే పరికరాన్నేదైనా కనిపెట్టారో లేదో ఈ ఆధునిక శాస్త్రజ్ఞులు. నాకు పూజలు మంత్రాలు రావు. నేను ఏ దేవుడ్నీ నమ్మను. ప్రశాంతత కోసం ధ్యానం చెయ్యడం లాంటివేవీ చెయ్యను. నా మనసుకి ప్రశాంతతని ఇచ్చేవి ఇవే, ఈ ప్రకృతే.ఏది ఏమైనా నా పిల్లలకిదొద్దనుకున్నా. వాళ్ళు కలెక్టర్లు, డాక్టర్లు, పోలీసులు కావాలని నేనెప్పుడూ కోరుకోలేదు కాని ఇది మాత్రం వాళ్లకి అంటకూడదు. అంటి జీవితాంతం వెంటాడకూడదనుకున్నా. అందుకే ఇదంతా నాతోనే పోవాలి.
ఇదీ అసలు మొత్తం కథ.
- కె.ఎన్‌. మనోజ్‌ కుమార్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement