వివరం: మన తెలుగు మన వెలుగు | Telugu Velugu: Story of Telugu language | Sakshi
Sakshi News home page

వివరం: మన తెలుగు మన వెలుగు

Published Sun, Aug 25 2013 3:00 AM | Last Updated on Fri, Sep 1 2017 10:05 PM

వివరం:  మన తెలుగు మన వెలుగు

వివరం: మన తెలుగు మన వెలుగు

తెలుగు గురించిన ఈ రెండు  గొప్పదనాలు, ఉత్తి స్వాతిశయపు విశేషణాలేం కాదు. తెలుగు,  రాయడానికి అందమైన భాష;  వినడానికి సొంపైన భాష. దీన్ని ప్రకటించుకుంది కూడా మనం కాదు; ఆ గుర్తింపునిచ్చింది  అన్యభాషీయులే! ‘ఇటాలియన్  ఆఫ్ ది ఈస్ట్’ అని మురిశాడు  ఇటలీ యాత్రికుడు నికొలొకాంటి.  ‘సుందర తెలుగు’ అని చాటాడు తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి. అన్నీ ఉన్నా ‘తెలుగువాడి నోట్లో’ శని అన్నట్టు, మొదట్నుంచీ మన మీద సంస్కృత అత్తగారి  పెత్తనాన్ని కొనసాగనిచ్చాం;  ఇప్పుడేమో ఇంగ్లీషు మామగారి ఆధిపత్యానికి నాలుకలు  మడతపెడుతున్నాం. ఆగస్టు 29న ‘తెలుగు భాషా దినోత్సవం’  సందర్భంగా మన తెలుగేమిటో, మన వెలుగేమిటో ఒకసారి మాట్లాడుకుందాం...  
 
 మనమేమో ‘వానల్లు కురియాలి వానదేవుడా!’ అనే చిన్నప్పటి పాట నెమరువేస్తుంటాం. పిల్లలేమో బడిలో ‘రెయిన్ రెయిన్ గో ఎవే’ అంటూ చక్కని రైమింగ్‌లో వానని వెళ్లగొడుతుంటారు. పేదరాసి పెద్దమ్మ కతల తరం మనదైతే, హ్యారీపోటర్ తరం మన పిల్లలది. కాలం మారిపోయింది. దానితో పాటు తెలుగు భాషకీ కాని కాలం వచ్చింది. కాని కాలం రాకపోతే టీవీ ప్రదర్శనల్లో యాంకరమ్మ ‘హాయ్ వ్యూయర్స్!’ అని తెలుగువాళ్లని ఇంగ్లిష్‌లో పలకరించే సాహసం చేస్తుందా? ‘యస్టర్ డే మార్నింగ్ మార్కెట్‌కి వెళితే టూ హండ్రెడ్ రూపీస్‌కి టూ కిలోస్ వెజిటబుల్స్ రాలేదండీ’ అని పక్కింటి పడుచు, ఎదురింటి యిల్లాలితో మాట్లాడుతుంటే, పోనీలే క్రియాపదాలైనా తెలుగులో ఉన్నాయని, తెలుగు భాషాభిమానులం సంతృప్తి పడుతున్నామా లేదా?
 
 అక్షరాలు ముత్యాల కోవలు
 ‘అరయంగ కర్ణుడీల్గె నార్వుర చేతన్’ అన్నట్టు తలా ఒక చెయ్యి నెత్తిమీద వెయ్యగా తెలుగుతల్లి మునిగిపోతుందన్నది వాస్తవం. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని శ్రీనాథుడో, శ్రీకృష్ణ దేవరాయలో చెప్పిన పద్యపాదాన్ని పైపైన ప్రస్తావించటం గాక లోతుగా చూస్తే తెలుగు భాష విలువ ఏమిటో బాగా అర్థమవుతుంది. ‘నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అన్నాడు ‘అమృతం కురిసిన రాత్రి’లో దేవరకొండ బాలగంగాధర తిలక్. ‘నా అక్షరాలు ముత్యాల కోవలు’ అని కూడా అంటే మరింత బాగుండేదనిపిస్తుంది. ఆ అందం, చందం ఒక్క తెలుగు వర్ణమాలకే ఉంది. ఆంగ్లం, రష్యన్, చైనీస్, దేవనాగరి, హిందీ, అరవం మొదలైన లిపులన్నీ రేఖాత్మకాలు. ప్రధానంగా కొన్ని (సరళ) రేఖలు కలుపుకుంటూ ఆ అక్షరాలు రాస్తారు. కానీ తెలుగు లిపిది వర్తులాకృతి. ‘అ’ మొదలు ‘క్ష’ దాకా ఏ అక్షరమైనా వృత్తంలో ఇముడుతుంది. త్రికోణాలు, చతుష్కోణాల కన్న వర్తులాకృతులు కనువిందుగా ఉంటాయని వేరే చెప్పాలా?
 తెలుగు అజంత (అచ్+అంత) భాష అని భాషావేత్తలు సాధారణంగా చెప్పే మాట. అంటే తెలుగు మాటల చివర అచ్చులుంటాయి. ఇందువల్ల భాష వినసొంపుగా ఉంటుంది. ‘తేనె వలె తీయనిది’ అని పాడుకునేది అందుకే.  
 
 ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని శ్రీనాథుడో, శ్రీకృష్ణ దేవరాయలో చెప్పిన పద్యపాదాన్ని పైపైన
 ప్రస్తావించటం గాక లోతుగా చూస్తే తెలుగు భాష విలువ ఏమిటో బాగా అర్థమవుతుంది.
 గిడుగు రామ్మూర్తి పంతులు గిడుగు జయంతి (ఆగస్టు 29)నే తెలుగు భాషా దినోత్సవంగా
 జరుపుకొంటున్నాం. ప్రాచీన మహాకవుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క దారి. వేములవాడ భీమకవిలో ఉద్దండ లీల, నన్నయలో ఉభయ వాక్ప్రౌఢి, తిక్కనలో రసాభ్యుచిత బంధం, ఎర్రాప్రెగ్గడలో ఉక్తి వైచిత్రి ఉన్నాయన్నాడు శ్రీనాథుడు. ప్రాచీన కవుల్లో భాషాశక్తి, పదబంధం, నిర్మాణవ్యూహం తప్పనిసరిగా పరిశీలించదగినవి.భాషా నైపుణ్యంతో పాటు జీవిత నిష్ఠ నేర్పే పద్యాలు, వేమన, సుమతీ శతకాలు పిల్లలకి నేర్పితే వేరే ‘వ్యక్తిత్వ వికాసాలు’ అవసరమంటారా?
 
 ఈ సొంపు హలంత భాషలకు ఉండదు. ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని నికొలొకాంటి అనే ఇటలీ యాత్రికుడు తెలుగును మెచ్చుకోవటానికి కారణం ఇదే. ఇటాలియన్ భాష కూడా తెలుగు మాదిరే అజంత భాష. ఈ వినసొంపైన లక్షణమే, కర్ణాటక సంగీత సంప్రదాయంలో తెలుగు కీర్తనల్ని అగ్రస్థానంలో నిల్పింది. ‘సుందర తెలుగు’ అని సుబ్రహ్మణ్య భారతి వంటి తమిళ మహాకవుల మెప్పు పొందింది. పరాయి భాషలంటే మొహం చిట్లించే తమిళులు త్యాగరాజు కీర్తనల్ని ఆస్వాదించటానికి ముఖ్య కారణం మన భాషలోని నాద మాధుర్యమే.
 
  ‘రెండు వేల’ ఏళ్ల తెలుగు
 ‘జనని సంస్కృతంబు సకల భాషలకును ’ (క్రీడాభిరామము) అనే నమ్మకమే చిరకాలం నుంచి రాజ్యమేలింది. అయితే తెలుగు సంస్కృత జన్యం కాదని, ద్రావిడ భాషా కుటుంబానికి చెందిందని రాబర్ట్ బిషప్ కాల్డ్‌వెల్ (19వ శతాబ్ది) నిరూపించటంతో సంస్కృతానికి, తెలుగుకు తల్లీబిడ్డల బంధం తెగిపోయింది. అయితే నన్నయ మొదలు కవులంతా తెలుగు కావ్యాల్లో సంస్కృత పదాలు గుప్పించి, సామాన్య ప్రజలకి సాహిత్యం దూరం చెయ్యటంలో కృతకృత్యులయ్యారు. సంస్కృతం లేదా ప్రాకృతమే రాజభాషగా శాసనాల్లో చెలామణి అయ్యింది.
 
 క్రీస్తు శకారంభం నుంచి తెలుగు మూల ద్రావిడ భాష నుంచి విడివడ సాగింది. అప్పటి ‘గాథాసప్తశతి’ ప్రాకృత గ్రంథంలో అత్త, అమ్మి, పొట్ట, పాడి మొదలైన తెలుగు మాటలు తొంగిచూశాయి. క్రీ.శ.ఒకటవ శతాబ్ది నాటి అమరావతి స్తూపం రాతిపలక మీద కనపడ్డ ‘నాగబు’ (నాగము, పాము) అనేది మనకు కనిపించిన మొట్టమొదటి తెలుగు మాట. ఆ తర్వాత రేనాటి చోళులు వేయించిన కలమళ్ల, ఎర్ర గుడిపాడు శాసనాల్లో (క్రీ.శ.575) తెలుగు భాష కనపడుతుంది. పండరంగడి అద్దంకి శిలాశాసనం (క్రీ.శ.848) మొట్టమొదటి (తరువోజ) పద్య శాసనం. యుద్ధమల్లుడి బెజవాడ శాసనం, విరియాల కామసాని గూడూరు శాసనం మొదలైన వాటిల్లో కనపడే తెలుగు పద్యాలు నన్నయభట్టుకు ముందే తెలుగు కవిత్వం ఉందని నిరూపిస్తున్నాయి. తెలుగు ప్రాచీన హోదాని బలపరుస్తున్నాయి.
 
 12, 13 శతాబ్దాల్లో నన్నెచోడుడు, పాల్కురికి సోమనాథుడు ‘జాను తెనుగు’ ఉద్యమం చేపట్టి, సంస్కృత మార్గ పద్ధతి కాక తేటతెలుగే కావ్య భాషగా ఉండాలని ప్రతిపాదించారు. తర్వాత కాలంలో తెలుగు మీద సంస్కృతం పెత్తనాన్ని నిరసిస్తూ అచ్చ తెలుగు కావ్యాలు వచ్చాయి. ఏది ఏమైనా తెలుగు మీద ఒకప్పుడు సంస్కృతం అత్తగారి పెత్తనం సాగితే, ఇవాళ ఇంగ్లిష్ మామగారి పెత్తనం సాగుతుందన్నది వాస్తవం.
 
 ప్రాచీన సౌందర్యం
 వర్తమాన సాహిత్య అధ్యయనం వల్ల సమకాలీన వస్తువులు, అధునాతన వ్యక్తీకరణ పద్ధతులు, వాదాలు, ఉద్యమాలు మొదలైనవాటి గురించి తెలుస్తుంది. మరి ప్రాచీన సాహిత్యాన్ని ఎందుకు అధ్యయనం చెయ్యాలి? ప్రాచీన మహాకవుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క దారి. వేములవాడ భీమకవిలో ఉద్దండ లీల, నన్నయలో ఉభయ వాక్ప్రౌఢి, తిక్కనలో రసాభ్యుచిత బంధం, ఎర్రాప్రెగ్గడలో ఉక్తి వైచిత్రి ఉన్నాయన్నాడు శ్రీనాథుడు. ఇక అతని కవిత్వంలో ధాటి చెప్పాల్సిన పనిలేదు. ప్రాచీన కవుల్లో భాషాశక్తి, పదబంధం, నిర్మాణ వ్యూహం తప్పనిసరిగా పరిశీలించదగినవి. ‘అభ్రంకషంబైన యాలపోతు నితండు త్రుంచినా డీతండు పెంచినాడు’ అనే నాచన సోమన పద్యాన్ని పరిశీలిస్తే, భిన్నాంశాల మధ్య వైరుధ్యాన్ని ఎట్లా వ్యక్తీకరించవచ్చో తెలుస్తుంది. అదే కవి ‘అరి జూచున్, హరి జూచు’ అంటూ భిన్న చర్యల మార్పును ఎంత చక్కగా కవిత్వీకరించవచ్చో చూపించాడు.
 
 అడిగెదనని కడు వడి జను
 నడిగిన దను మగుడ నుడుగడని నడ యుడుగున్
 వెడవెడ సిడి ముడి తడబడ
 నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్
 గజేంద్రుడిని రక్షించటానికై ఆదర బాదరగా పరిగెత్తుతున్న విష్ణువు పరిస్థితి అర్థం గాని లక్ష్మీదేవి మానసిక డోలాందోళన అది. పోతన రచించిన సర్వ లఘు కందం. చక్కని డకార అనుప్రాస. అర్థానికి శబ్ద సౌందర్యంతో పరిపుష్ఠి నెట్లా కల్పించవచ్చో తెల్పుతుంది. ‘మమ్మెరుగు, దెదిరి నెరుగుదు’మనే కంద పద్యంలో తిక్కన ఏడు వాక్యాలు ఇమిడించాడు. అల్పాక్షరాల్లో అనల్పార్థ రచన తిక్కనను చూసి నేర్చుకోవాల్సిందే. శ్రీనాథుడు తనకెంతో ఇష్టమైన సీస పద్య రచనలో 32 రకాల గతి భేదాలు ప్రదర్శించాడు.
 
 వ్యావహారిక భాషావాదం
 ఆంగ్లేయుల వలస పాలనలో 20వ శతాబ్ది మొదటి పాదంలో దేశంలో ఆధునిక దృక్పథం మొదలైంది. తరతరాల సాహిత్య, సాంస్కృతిక మూలాలను విమర్శిస్తూ కొత్త దారుల కోసం అన్వేషణ ప్రారంభమైంది. గురజాడ, గిడుగు సాహిత్య రంగంలో దీనికి ఆద్యులు. ‘మంచి గతమున కొంచెమే’ అన్నాడు గురజాడ. భాషలో యథాస్థితి వాదానికి, పరిణామ వాదానికి మధ్య యుద్ధం 1910లోనే మొదలైంది. వ్యావహారిక భాషోద్యమానికి గిడుగు, గురజాడ అంకురార్పణ చేశారు.
 
 దానికి వ్యతిరేకంగా జయంతి రామయ్య పంతులు నాయకత్వంలో గ్రాంథిక భాషా వాదం సాగింది. కాలక్రమంలో వ్యావహారిక భాషోద్యమానిది పైచేయి అయిందని మనకు తెలిసిన సంగతే. ఆ తర్వాత భాషా వ్యవహారంలో స్థిరీకరణ కోసం శిష్ట వ్యవహారం ముందుకొచ్చింది. కాని నిలబడలేకపోయింది. విభిన్న మాండలికాల మధ్య ప్రామాణిక భాష అనేది ఆదర్శంగానే మిగిలిపోయింది. అయితే మధ్య కోస్తాలో వెలసిన పత్రికల ద్వారా ఆ ప్రాంతపు భాష ముఖ్యంగా రాతలో, రచనల్లో ఆధిపత్యం వహించింది. రాను రాను రచయిత తమ ప్రాంతపు జీవద్భాషలో రచనలు చెయ్యటం వల్ల గొప్ప భాషా వైవిధ్యం చూడగలుగుతున్నాం.
 
 ప్రాచీన గ్రంథాల భాషకి, ప్రజల వ్యవహార భాషకి మధ్య గల అంతరాన్ని గుర్తించటమే వ్యావహారిక భాషావాదానికి ప్రాతిపదిక. గ్రాంథిక భాషలోని కృత్రిమత్వాన్ని, ‘పండితభిషక్కుల భాషా భేషజా’న్ని గిడుగువారు బయటపెట్టారు. వాడుక భాషే రచనా భాషగా ఉండటం సహజమైన విధానమని ఆయన చెప్పటంలో తప్పు లేదు. అయితే వ్యావహారిక భాషావాదులు గమనించని అంశమేమిటంటే, మాట్లాడే భాషకి, లిఖిత భాషకి పూర్తి ఏక రూపత సాధ్యం కాదనేది. ఉచ్ఛారణలో విసంధులు పాటించం. కాని రాతలో పాటించకపోతే అర్థ స్పష్టత ఉండకపోగా అపార్థాలు చోటుచేసుకుంటాయి. గురజాడే ‘కన్యాశుల్కం’లోని సంభాషణల్లో ఉచ్ఛారణ భేదాన్ని గుర్తించటానికి కొన్ని గుర్తులు వాడాల్సి వచ్చింది.
 
 వ్యావహారిక భాషోద్యమం గ్రాంథిక ‘భాష’ని తిరస్కరించే క్రమంలో ఆ భాషలోని అన్ని విలువల్ని తిరస్కరించే ఆలోచనావిధానం తలెత్తింది. తన కవిత ‘శ్మశానాల వంటి నిఘంటువుల దాటి, వ్యాకరణాల సంకెళ్లు విడిచి, ఛందస్సుల సర్ప పరిష్వంగం వదలి’ వెలువడిందన్నాడు శ్రీశ్రీ. కవిత్వ ఆవిర్భావంలోని నిసర్గ లక్షణాన్ని ఆయన దర్శించిన పద్ధతి అది.
 
 ఆ మాటలలోని ధ్వనిని వదిలిపెట్టి, వాచ్యార్థం గ్రహించిన సాహిత్యకారులు, నిఘంటువులు, వ్యాకరణాలు, ఛందస్సులు పూర్తిగా అనవసర విషయాలుగా భావించారు. ప్రాచీన సాహిత్యానికి అవి నిర్మాణ సాధనాలు. వాటిని తిరస్కరించే క్రమంలో ఆ సాహిత్యాన్నీ తిరస్కరించారు. అందులో రాచరిక, భూస్వామ్య విలువలు, వర్ణ భేదాలు, దైవ కేంద్రక భావజాలం- ఇవన్నీ ఉన్నమాట నిజం. అయితే ప్రాచీన సాహిత్యమంటే అవి మాత్రమే కాదు. భాషా విన్యాసం, పలుకుబడి, సాంస్కృతిక విశేషాలు, పౌరాణిక, చారిత్రక సమాచారం- మరెన్నో అందులో ఉన్నాయి. వాటిని నిరాకరించటమంటే ఆ వారసత్వ సంపదని  కోల్పోవటమే.
 
 పద్యాల్లో వ్యక్తిత్వ వికాసం
 పద్యం పాత చింతకాయ పచ్చడే కావచ్చు. కాని పిల్లలకు నైతిక జీవసూత్రాలు తెల్పటానికి, ధారణాశక్తి వృద్ధికి, భాషా సౌందర్యం తెలుసుకోవటానికి పద్య సాహిత్యం ఉపయోగపడుతుందనటంలో సందేహం లేదు. ఉదాహరణకి తిక్కన భారతంలో ఒక పద్యం చూడండి:
 ఒరు లేయవి యొనరించిన
 నరవర! య ప్రియము మనంబున కగు, దా
 నొరులకు నవి సేయకునికి
 పరాయణము పరమధర్మ పథములకెల్లన్
 ఇతరులు ఏ పనులు చేస్తే మనం బాధపడతామో, ఆ పనులను ఇతరుల పట్ల మనం చెయ్యకుండా ఉండటమే ఉత్తమమైన ధర్మం.
 ‘చదువు పద్యమరయ చాలదా యొక్కటి’ అన్నాడు వేమన. ఆ ఒక్కటి ఈ పద్యమే అనుకోగూడదా?
 తప్పులెన్నువారు తండోపతండముల్
 ఊరి జనులకెల్ల నుండు తప్పు
 తప్పులెన్ను వారు తమ తప్పు లెరుగరో
 విశ్వదాభిరామ! వినురవేమ!
 తేట తెలుగు మాటలతో సరళమైన అల్లిక పనితనం అది. భాషా నైపుణ్యంతో పాటు జీవిత నిష్ఠ నేర్పే యిటువంటి పద్యాలు, శతకాలు పిల్లలకి నేర్పితే వేరే ‘వ్యక్తిత్వ వికాసాలు’ అవసరమంటారా?
 
 తెలుగు లేని చదువు
 ఒక్క తెలుగు అక్షరం నేర్చుకోకుండా ఉన్నత విద్యాధికుడు కాగల అవకాశం తెలుగు దేశంలోనే ఉంది. కింది నుంచి పైస్థాయి దాకా తెలుగును ప్రథమ భాషగా, తప్పనిసరి అంశంగా చేస్తే విద్యార్థులు మాతృభాషకు దూరం కాకుండా ఉంటారు. తెలుగు మీడియం పట్ల చిన్నచూపును పోగొట్టడం కూడా అవసరమే. ప్రపంచంలో ఏ భాషవారైనా ఒక విషయాన్ని మాతృభాషలోనే చక్కగా అర్థం చేసుకోగలుగుతారని శాస్త్ర పరిశోధకులు చెప్పిన మాటే. విద్యార్థి మాతృభాషకి దూరం కావటం అంటే దానిలోని సమస్త సాంస్కృతిక సంపదకి దూరం కావటమే. పునాది లేని సమాచార నిధిగా మిగిలిపోవటమే.  
 
 భాషను ఆధునికం చెయ్యటం ఎలా?
 భాష కూడా ఇవాళ ప్రపంచీకరణకి గురి అవుతున్నది. కొత్త కొత్త శాస్త్ర విశేషాలు, కొత్త కొత్త అవసరాలు, వాటిని తీర్చే సాధనాలు పుట్టుకొస్తున్నప్పుడు వాటిని గ్రహించకుండా ఏ భాషైనా మడికట్టుకొని కూర్చోగూడదు. భాష విస్తృతం కావటానికి రెండు పద్ధతులున్నాయి. కొత్త పరిభాషని ఇతర భాషల నుంచి యధాతథంగా గ్రహించటం. రైలు, రోడ్డు, గుమస్తా, తారీకు, బత్తాయి మొదలైన ఇతర భాషా పదాల్ని (అన్య దేశాలు) అట్లాగే చేర్చుకొన్నాం. విషయ నిర్దేశానికి, వ్యక్తీకరణకి అవసరమైన పరిభాషను సొంతగా కల్పించుకోవటం. అశ్వ శక్తి, నల్ల ధనం, హరిత విప్లవం లాంటివి ఇట్లా కల్పించుకున్నవే.
 
 ఆ ప్రయత్నం పట్టుదలతో సాగటం లేదు. కంప్యూటర్ పరిభాషని మొత్తం తమిళంలో కల్పించుకోగలిగారు తమిళులు. ‘కంప్యూటర్’ అనే ఒక్క మాటని కూడా తెలుగు చెయ్యలేకపోయాం. పాలనా యంత్రాంగంలో అధికార భాషగా ఇంగ్లిష్ స్థానంలో తెలుగును ప్రవేశపెట్టడం అవసరం. నాయకులకు రాజకీయ నేపథ్యం తప్ప సాంస్కృతిక నేపథ్యం లేకపోవటం మన దురదృష్టం. తెలుగు భాషకి ప్రాచీన హోదా కన్నా ఆధునిక హోదా ఇవాళ అత్యవసరం.
 - పాపినేని శివశంకర్
 (ప్రముఖ కవి, రచయిత)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement