మిగిలిన కల
కథ
.ఆకునూరి మురళీకృష్ణ
కోట లాంటి తన ఇంటి ఆవరణలో చెట్టు కింద కుర్చీ వేసుకుని కూర్చున్నాడు రుద్రరాజు. అతడి చుట్టూ చేతులు కట్టుకుని నిలబడ్డ మనుషులు. వెనుక బలమైన వస్తాదులు. వాళ్లవైపు నడుస్తున్నాను. నేను యూనిఫాంలో ఉన్నాను. నా చేతిలో తుపాకీ ఉంది. రుద్రరాజు చేతిలో కూడా తుపాకీ ఉంది.
నాలాంటివాడు యమపురి ద్వారం లాంటి ఆ కోట గేటు దాటుకుని లోపలికి రావడమే వాళ్లందరికీ విచిత్రంగా అనిపిస్తున్నట్టుంది. కట్టలు తెంచుకున్న ఏదో ఆవేశం నన్ను అక్కడికి నడిపించింది.
‘‘చూడు మిస్టర్ రుద్రరాజూ...’’ చుట్టుపక్కలవాళ్లని పట్టించుకోకుండా అతడి వంకే చూస్తూ నేను చెప్పదలుచుకున్నది చెప్పాలని నోరు విప్పాను. అక్కడున్నవాళ్లు నన్నెక్కువగా మాట్లాడనివ్వరని నాకు తెలుసు. అవసరమైతే లోడ్ చేసిన రివాల్వర్ నాకు బదులుగా నిప్పులు కక్కడానికి సిద్ధంగా ఉంది.
నేను ఊహించినట్టుగానే వస్తాదు ఒకడు ముందుకు వచ్చాడు నన్ను అడ్డుకోవడానికి. మరుక్షణంలోనే పెద్ద చప్పుడు చేస్తూ తుపాకీ పేలింది. చెట్టు మీద ఉన్న కాకులు ఒక్కసారిగా భయంకరంగా అరుస్తూ చెల్లాచెదురుగా ఎగరసాగాయి.
నేను ఉలిక్కిపడి లేచాను. గుండె వేగంగా కొట్టుకుంటోంది. చొక్కా మొత్తం చెమటతో తడిసింది. గోడ గడియారం సెకన్ల ముల్లు తిరిగే చప్పుడు ఫ్యాన్ శబ్దంలో కలిసి వినిపిస్తుంటే ఈ లోకంలోకి వచ్చాను. పక్కనే శాంత, పిల్లలు గాఢనిద్రలో ఉన్నారు. అలవాటు ప్రకారం చప్పుడు చేయకుండా లేచి, మంచినీళ్లు తాగాను. కిటికీ దగ్గర నిలబడి బయటకి చూశాను. నాలుగో అంతస్థులో ఉన్న మా అపార్ట్‌మెంట్ కిటికీలోంచి వీధి దీపాల వెలుగులో రోడ్డు నిర్మానుష్యంగా కనిపిస్తోంది.
నాకు రుద్రరాజు గుర్తుకు వచ్చాడు. ‘జరిగినదంతా కలన్నమాట?’ అనుకోలేదు నేను. అది కలన్న సంగతి నాకు బాగా తెలుసు. ఆ కల నాకు కొత్త కాదు. అంతకుముందు కూడా చాలాసార్లు వచ్చింది. కానీ ఎప్పుడూ పూర్తిగా రాదు. అక్కడితో ఆగిపోతుంది. కలలో పేలినది నా చేతిలో ఉన్న సర్వీస్ రివాల్వరో లేక - రుద్రరాజు చేతిలో ఉన్న ఇంపోర్టెడ్ గన్నో తెలియదు కానీ, ఆ రోజు రాత్రి రుద్రరాజు నా కలలోకి ఎందుకు వచ్చాడో మాత్రం నాకు బాగా తెలుసు!
‘‘ఆ పాపని కిడ్నాప్ చేసింది రుద్రరాజు మనుషులన్న సంగతి స్పష్టంగా అర్థమౌతోంది సార్. ఇదే కాదు, ఇంతకుముందు జరిగిన కిడ్నాప్, మర్డర్ కేసులు అన్నీ ఆ రుద్రరాజు మనుషులు చేసినవే అని నిరూపించడానికి కూడా మన దగ్గర తగిన ఆధారాలున్నాయి. కానీ అతడిని అరెస్టు చేయడానికి వెళ్లిన ఏ ఒక్క ఎస్సై కూడా ప్రాణాలతో తిరిగి రాలేదు’’ నలభయ్యారేళ్ల వయసున్న హెడ్ కానిస్టేబుల్ గురుమూర్తి కిడ్నాప్ కేసు తాలూకు ఫైలు నాకు చూపిస్తూ చెప్పాడు.
అతడలా చెప్పడం నాకు కొత్త కాదు. స్టేషన్‌ని కుదిపేసే నేరం ఏది జరిగినా, అతడు ఫైలుని నా ముందు ఉంచి అదే మాటలని హరికథ చెప్పినట్టుగా ప్రతిసారీ చెబుతూ ఉంటాడు.
ఫైలు మూసేసి లేవబోతుంటే అన్నాడు గురుమూర్తి, ‘‘సార్, ఆ కిడ్నాపైన పాప తల్లిదండ్రులు వచ్చారు. మిమ్మల్ని కలవాలంటున్నారు.’’
నాకు ఇబ్బందిగా అనిపించింది. ‘‘ఏం మాట్లాడాలట?’’ అన్నాను.
‘‘వాళ్లు డబ్బు సిద్ధం చేసుకుంటున్నారట. ఈ విషయం ఇంక మనల్నేమీ కల్పించుకోవద్దని చెప్పడానికి వచ్చారు.’’
చాచిపెట్టి చెంప మీద కొట్టినట్టనిపించింది నాకు.
‘‘తొందర పడద్దను. ఒక్కరోజు ఆగమని చెప్పు.’’
‘‘ఏం జరుగుతుంది సార్, ఒక్కరోజులో?’’ మూసిన ఫైలు అందుకుంటూ అన్నాడు గురుమూర్తి నిర్లిప్తంగా.
‘‘ఏమవుతుంది? మహా అయితే ఆ కల నీకు ఇంకోసారి వస్తుంది’’ నవ్వుతూ అన్నాడు డాక్టర్ దామోదర్.
‘‘కలలు భవిష్యత్‌ని సూచిస్తాయంటారు. నిజమేనా? అలా అయితే నాకొచ్చిన కల కూడా భవిష్యత్‌ని సూచిస్తోందా? నేను నిజంగానే రుద్రరాజుతో తలపడతానా? ఒకవేళ తలపడితే తరువాత ఏం జరుగుతుంది? కలలో పేలినది నా చేతిలో ఉన్న రివాల్వరా లేక రుద్రరాజు చేతిలో ఉన్నదా? కలలో ఆ విషయం నాకెందుకు తెలియడం లేదు?’’ దామోదర్ వెటకారాన్ని పట్టించుకోకుండా ప్రశ్నలు కురిపించాను.
దామోదర్ మరింత బిగ్గరగా నవ్వాడు. ‘‘కలలు భవిష్యత్‌ని సూచిస్తాయని నీకెవరు చెప్పారు? మనలో అంతర్లీనంగా ఉండే భయాలకీ, కోరికలకీ ప్రతిరూపాలే కలలు. రుద్రరాజంటే నీకు భయం ఉంది. అతడిని ఎదిరించాలన్న కోరికా ఉంది. రెండూ కలిసే నీకా కల రూపంలో వస్తున్నాయి.’’
‘‘నువ్వన్నదే నిజమనుకుందాం. అయితే ఆ కల నాకు సగం దాకా వచ్చి ఎందుకు ఆగిపోతోంది? పూర్తిగా ఎందుకు రాదు ఎప్పుడూ?’’
‘‘కల మధ్యలో ఆగిపోవడం కాదు. మధ్యలో నీకు మెలకువ వచ్చేస్తోంది. నిజం చెప్పాలంటే మధ్యలో మెలకువ వచ్చిన కలలే మనకి బాగా గుర్తుంటాయి. నిద్రలో పూర్తయిన కలలు చాలామటుకు గుర్తుండవు.’’
‘‘రుద్రరాజు మీద కేసు ఏది వచ్చినా ఆ రోజు రాత్రి నాకు ఆ కల వస్తుంది. విచిత్రమేమిటంటే, కలలో నేను భయపడినా, ఆ కల వచ్చిన రోజు నాకెందుకో ఆనందంగా ఉంటుంది. ఎందుకంటావు?’’
‘‘కలలకి అర్థాలుండవు.’’
‘‘కానీ నాకెందుకో ఆ కల పూర్తిగా వస్తే బాగుండుననిపిస్తోంది.’’
ఒక్కక్షణం విస్మయంగా చూశాడు నా వంక హిప్నాటిస్ట్, డాక్టర్ అయిన దామోదర్.
‘‘నిద్రలో అన్ని స్టేజీలలోనూ కలలు రావు. రేపిడ్ ఐ మూవ్‌మెంట్ అంటే స్వప్నావస్థలోనే మన మెదడు కలలని సృష్టిస్తుంది. నీకు ఒక మాత్ర ఇస్తాను. దాన్ని నిద్రపోయే ముందు వేసుకో. ఆ మాత్ర పనిచేస్తుందని కచ్చితంగా చెప్పలేను. పడుకునే ముందు ఆ కల గురించీ, రుద్రరాజు గురించీ ఆలోచిస్తూ పడుకో. నీకు ఈసారి ఆ కల పూర్తిగా వచ్చే అవకాశం ఉంటుంది’’ నవ్వుతూ తన మెడికల్ కిట్‌లోంచి మాత్ర తీసి ఇచ్చాడు దామోదర్. ‘‘అయినా ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ఆ కల గురించి కాదు. చేయాల్సిన డ్యూటీ గురించి’’ తన సహజ ధోరణిలో నన్ను మందలిస్తూ అన్నాడు.
ఆ రోజు నేను స్టేషన్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఆలస్యమైపోయింది. బాగా అలసిపోయాను కూడా.
‘‘నాన్నా, ఐశ్వర్య నాలుగు రోజుల నుంచీ స్కూలికి రావడం లేదు’’ దిగులుగా అంది మా ఎనిమిదేళ్ల అమ్మాయి వందన నాతో. ఏమ్మాట్లాడాలో తెలియనట్టుగా చూశాను.
‘‘ఐశ్వర్యనెవరో ఎత్తుకుపోయారుట కద నాన్నా? డబ్బులివ్వకపోతే చంపేస్తారంట కదా? ఐశ్వర్యని వాళ్లు చంపేస్తారా? మీ నాన్న పోలీసు కదా? ఐశ్వర్యని కాపాడటం లేదేం అని మా ఫ్రెండ్సందరూ అడుగుతున్నారు.’’
‘‘లేదమ్మా. ఐశ్వర్యకేమీ కాదు. తను మళ్లీ స్కూలికి వస్తుంది. ఒక్కరోజు ఆగు’’ అని దగ్గరికి తీసుకుని పడుకున్నాను. అప్పటికే దామోదర్ ఇచ్చిన మాత్రని వేసుకున్నాను!
మళ్లీ అదే కోట లాంటి ఇల్లు. ఇంటి ముందర కుర్చీలో సింహంలా రుద్రరాజు. వెనకే అనుచరులు. నా చేతిలో తుపాకీ, రుద్రరాజు చేతిలో తుపాకీ. నేను రుద్రరాజు వైపు నడుస్తున్నాను. తుపాకీ నేరుగా అతడి మీదకి గురిపెడుతూ ‘‘మిస్టర్ రుద్రరాజూ! ఆ పాప ఇక్కడే ఉందని నాకు తెలుసు. మర్యాదగా పాపని వదిలిపెట్టు’’ అన్నాను.
నేనేం చేస్తున్నానో వాళ్లకర్థమయ్యేలోగా, వేగంగా కదులుతూ తుపాకీని అలాగే గురిచేసి ఉంచి, రుద్రరాజుకి మరింత దగ్గరగా వచ్చేశాను. ట్రిగ్గర్ నొక్కానంటే గురితప్పదని రుద్రరాజుకి తెలుస్తోంది. నా ముఖంలో ఉన్న తెగింపు చూస్తుంటే డీల్ ఏమాత్రం అటూ ఇటూ అయినా ట్రిగ్గర్ నొక్కడానికి వెనుకాడనన్న విషయం కూడా అతడికి అర్థమైంది. చేతిలో తుపాకీ ఉంచుకుని కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితి!
చేసేది లేక అతడు దూరంగా ఉన్న తనవాళ్లకి సైగ చేశాడు. వాళ్లు లోపలి గది తలుపు తెరిచారు. ‘‘అంకుల్’’ అంటూ నావైపు పరిగెత్తుకు రాసాగింది ఐశ్వర్య.
‘‘ఐశ్వర్యా! నువ్వు నా దగ్గరికి రాకు - పరిగెత్తుకుని వెళ్లిపో. వేగంగా’’ ఒక్క క్షణం తడబడ్డా. పరిస్థితిని అర్థం చేసుకుంది. బయటికి పరిగెత్తసాగింది.
తుపాకీని రుద్రరాజు వైపు గురిచూసి ఉంచి, నేను కొనకంట పాప పరిగెడుతున్న వైపే చూస్తూ... ఒకటి... రెండు... మూడు... ఐశ్వర్య గేటు దాటితే చాలు... బయట మా సిబ్బంది జీపుతో సిద్ధంగా ఉంటారు. ఇంక భయం లేదు.
నేను ఉద్విగ్నంగా క్షణాలు లెక్కపెడుతుండగా నా చేతిమీద బలమైన వేటు పడింది. ఒక కొడవలి సినిమాల్లో చూపించినట్టుగా గిరగిరా తిరుగుతూ నా ముంజేతిని తాకింది.
నరాలు తెగిపోతున్న బాధ. తలతిప్పి రుద్రరాజు వంక చూశాను - అతడి కళ్లల్లో కసితో కూడిన ఆనందం.
ఒక్కసారి తలతిప్పి గేటు వంక చూసి నేను కూడా నవ్వాను - సరిగ్గా అప్పుడే ఐశ్వర్య గేటు దాటేసింది!
నా చేతిలో తుపాకీ కిందపడగానే, రుద్రరాజు అనుచరులు ఒక్కసారిగా నా మీద విరుచుకుపడిపోయారు. వాళ్ల చేతుల్లో రకరకాల ఆయుధాలు - కత్తులు, కొడవళ్లు, కర్రలు, బరిసెలు ... చెట్టు మీద కాకులు చెల్లాచెదురుగా ఎగురుతున్నాయి గోలగోలగా అరుస్తూ.
వాళ్లు నన్నేం చేస్తారోనన్న బాధ నాకిప్పుడు లేదు - నా కళ్లముందు ఆనందబాష్పాలతో కూతుర్ని గుండెలకద్దుకుంటున్న ఐశ్వర్య తల్లిదండ్రులూ, ‘మా నాన్న దొంగలకి భయపడలేదు’ అని మెరిసే కళ్లతో చూస్తున్న నా కూతురూ కనిపిస్తున్నారు. కిందపడ్డ నా మీదకి ఆటవికుల్లా ఆయుధాలతో దాడి చేయబోతున్నారు... సగం తెగి వేళ్లాడుతున్న చేతితో నేను... అప్రయత్నంగా కళ్లు మూసుకున్నాను.
నేను కళ్లు తెరిచేసరికి నా ఒళ్లంతా చెమటతో తడిసిపోయింది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. పక్కనే ప్రశాంతంగా నిద్రిస్తున్న నా భార్య, పిల్లలు. వందన నుదుటి మీద చెయ్యేసి జుట్టుని వెనక్కి తోస్తూ ప్రేమగా నిమిరాను.
చప్పుడు చేయకుండా లేచి మంచినీళ్లు తాగి, అలవాటు ప్రకారం కిటికీ దగ్గరికి వెళ్లాను. కింద రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. తెల్లవారడానికి ఇంకా అరగంట సమయం మాత్రమే ఉంది. నాకింక పడుకోబుద్ధి కాలేదు. ఎంత తొందరగా తయారై స్టేషన్‌కి వెడతానా అని ఉద్విగ్నంగా అనిపించింది. ‘థాంక్స్ టు దామోదర్’.
సూర్యుడు ఇంకా బంగారు రంగులో మెరుస్తుండగానే పోలీస్ స్టేషన్‌కి చేరుకున్నాను. అంత తొందరగా స్టేషన్‌కి వెళ్లి చాలా రోజులైంది. హెడ్ కానిస్టేబుల్ గురుమూర్తి, మిగతా సిబ్బంది స్టేషన్లో ఉన్నారు. అమ్మవారి గుడికి వెళ్లి వచ్చాడేమో, గురుమూర్తి నుదుట కుంకుమ బొట్టు ఎర్రగా మెరుస్తోంది. అతడిలో ఎప్పుడూ కనిపించే ఉదాసీనత స్థానే ఏదో కొత్త ఉత్సాహం.
అంతకుముందు రోజు మేము పరిశీలించిన ఫైళ్లన్నీ టేబుల్ మీద గుట్టలుగా పడి ఉన్నాయి. వాటిని పక్కకి తోస్తూ చార్జి షీటు ఉన్న ఫైలుని చేతిలోకి తీసుకుని మరొకసారి చదివాను. పదకొండు రకాల నేరాలు... అరవై నాలుగు కేసులు... అవి కాకుండా ప్రస్తుతం కిడ్నాప్ కేసు.
‘‘గురుమూర్తిగారూ! కోర్టు అరెస్టు వారెంట్ ఇష్యూ చెయ్యకుండా ఒక మనిషిని మనం అరెస్టు చేయచ్చా? సెర్చి వారెంటు లేకుండా ఒక వ్యక్తి ఇంటిని మనం తనిఖీ చేయచ్చా?’’
‘‘చేయచ్చు. ఏదైనా నేరంలో ఒక వ్యక్తి ప్రమేయం ఉందని పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో బయటపడినప్పుడు, ఆ అనుమానితుడే నేరస్థుడని నమ్మిన పక్షంలో, అతడిని మేజిస్ట్రేటు వారెంటు కోసం ఎదురుచూడకుండా అరెస్టు చేయవచ్చు. అతడి ఇంటిని సెర్చ్ కూడా చేయచ్చు. కాకపోతే తాము అరెస్టు చేసిన కారణం, సెర్చి చేసిన కారణం సరైనదని పోలీసులు కోర్టులో నిరూపించుకోవలసి వస్తుంది’’ ముందు రోజు బట్టీపట్టినది అప్పచెబుతున్నట్టు చెబుతున్న గురుమూరి వంక నవ్వుతూ చూశాను.
‘‘అంతా సిద్ధంగా ఉందా?’’ గురుమూర్తి తల ఊపాడు.
‘‘మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలి. గుర్తుంది కదా?’’
‘‘గుర్తుంది సార్.’’
‘‘మిస్టర్ రుద్రరాజూ! కిడ్నాపైన ఐశ్వర్య మీ ఇంట్లోనే ఉందన్న సంగతి నాకు బాగా తెలుసు. మర్యాదగా ఆ పాపని వదిలిపెట్టు’’ పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో సర్వీస్ రివాల్వర్‌ని గురిపెట్టి హఠాత్తుగా నేనన్న ఆ మాటలకి ఖంగు తిన్నట్టుగా చూశాడు రుద్రరాజు.
ఎస్సై కలవడానికి వచ్చాడని చెబితే, మంతనాల కోసమో, మామూలు కోసమో అనుకున్నట్టుగా నిర్లక్ష్యంగా ‘రమ్మని’ చెప్పిన రుద్రరాజు, ఊహించని ఈ పరిణామానికి దెబ్బతిన్నట్టుగా చూశాడు.
‘‘నాకు లొంగిపో. లేదా నా చేతిలో చచ్చిపో’’ తుపాకీని అతడి కణతలకి నొక్కుతూ నేను అన్నాను. ‘‘నీ దృష్టిలో రెండూ ఒకటే అని నాకు తెలుసు. ముందుగా పాపని వదిలిపెట్టు. అప్పుడు నీకు కనీసం నాతో మాట్లాడే అవకాశం దొరుకుతుంది.’’
రుద్రరాజు సైగ చేశాడు. అతడు సైగ చేసినది పాపని వదిలిపెట్టమని కాదని నాకు బాగా తెలుసు. రుద్రరాజు అమాయకుడు కాదు - క్రిమినల్.
అతడి సైగని అందుకుని ముందు నుంచీ, వెనుక నుంచీ ఆయుధాలతో నా మీదకి దాడిచేయబోయారు అతడి అనుచరులు. చేతిలో తుపాకీని అలాగే పట్టుకుని నేను రెండో చేతిని పెకైత్తాను వాళ్లని వారిస్తున్నట్టుగా.
‘‘తొందరపడకు రుద్రరాజూ, ఒక్కసారి అలా బయటికి చూడు’’ అన్నాను.
నేను ఎడమ చెయ్యి ఎత్తగానే అప్పటిదాకా నిర్మానుష్యంగా కనిపిస్తున్న కోట గోడల దగ్గర, గేటు దగ్గర, పక్కనే ఉన్న ఎత్తయిన కొండ గుట్టల మీదా ఒక్కసారిగా పుట్టుకొచ్చారు అశేష జనవాహిని...
రుద్రరాజు దాష్టీకాలకు బలైపోయిన కేసుల్లోని పీడితులు, వాళ్ల బంధువులు, స్నేహితులు, మద్దతుదారులు, అన్యాయానికి ఎదురు తిరగాలన్న కసి ఉన్న ప్రతి ఒక్కరూ ముందురోజు రహస్యంగా మేము అందించిన పిలుపు విని అప్పటికే అక్కడికి చేరుకుని ఉన్నారు.
వాళ్లెవరి చేతుల్లోనూ ఒక్క ఆయుధం కూడా లేదు. నేను పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో రివాల్వర్‌ని ఉంచినా తొణకని రుద్రరాజుకి ఆ జనాన్ని చూడగానే నుదుటన చెమటలు పట్టాయి. అవును మరి... రుద్రరాజుకే కాదు, చీకట్లో అతడు చేసే ఎన్ని తప్పులనైనా సమర్థించే పొలిటికల్ లీడర్స్‌కి కూడా జనం ముందు రుద్రరాజు చేసే తప్పులని సమర్థించే ధైర్యం ఉండదు - జనం వాళ్ల బలహీనత! ఆ జనాన్నే రుద్రరాజు మీద ఆయుధంగా వాడదల్చుకున్నాను.
‘‘రుద్రరాజూ! నాకు ప్రాణాలంటే లెక్కలేదు. ప్రాణం కన్నా నా డ్యూటీ ముఖ్యం కాదు. నీకు నీ ప్రాణం, పరువు ఎంత విలువైనవో నాకు తెలుసు. జనం చూడకుండా దొడ్డిదారిన విడిచిపెట్టినా నాకు అభ్యంతరం లేదు. ముందర ఐశ్వర్యని విడుదల చెయ్యి. తరువాత నువ్వు నేను మాట్లాడుకుందాం.’’
రుద్రరాజు చేష్టలుడిగినట్టు నిలబడిపోయాడు. అతడు కనుసైగ చేస్తే చాలు, నన్ను ఖండఖండాలుగా నరకడానికి సిద్ధంగా ఉన్నట్టు నిలుచున్నారు అతడి అనుచరులు. ఎక్కువ సమయమిస్తే రుద్రరాజు మరో క్రిమినల్ ఐడియా ఆలోచించే ప్రమాదముంది.
‘‘క్విక్... ఆలస్యం చేస్తే ఏమైనా జరగచ్చు. ఐశ్వర్యని వదలమని మీవాళ్లకి చెప్పు’’
రుద్రరాజు తనవాళ్లకి సైగ చేశాడు. దాదాపు రెండు నిమిషాల తరువాత నా సెల్ బీప్‌మంది. ఐశ్వర్య క్షేమంగా బయటికి వచ్చిందనడానికి మావాళ్లు ఇచ్చిన సంక్షిప్త సందేశం అది!
నేను రుద్రరాజు తలమీద నుంచి తుపాకీ కిందకి దించాను. రుద్రరాజు అనుచరుల చేతులు పైకి లేచాయి నన్ను మట్టుపెట్టడానికి. రుద్రరాజు చెయ్యెత్తి వారించకపోయి ఉండుంటే, అరక్షణంలో నా ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవి. అయినా నాకిప్పుడు భయంగా అనిపించడం లేదు.
రుద్రరాజు అరెస్టు వార్త నగరంలో సంచలనాన్ని సృష్టించింది. తరువాత పరిణామాలని ఎలా ఎదుర్కోవాలన్న విషయంలో నా దగ్గర స్థిరమైన ప్రణాళిక ఏమీ లేదు. చావు అంచుల దాకా వెళ్లి వచ్చిన నాకు ఇప్పుడు ఏ విషయంలోనూ భయం లేదు. ఇన్నాళ్లూ ఇంత చిన్న విషయానికా నేను భయపడ్డాను అనిపిస్తోంది.
‘‘కంగ్రాచ్యులేషన్స్. నువ్వీ పని చేస్తావని నేను ముందే ఊహించాను’’ అన్నాడు దామోదర్.
‘‘ఎలా?’’
‘‘ఆ రోజు నువ్వు నాకీ కల పూర్తిగా వస్తే బాగుండునని అన్నావు కదా? అప్పుడే నేను ఊహించాను. ధైర్యం అంటే భయాన్ని దాని మూలాల దాకా రుచి చూడటం. నువ్వు ఈ కలని పూర్తిగా రావాలని కోరుకుంటున్నప్పుడే నువ్వు దానికి సిద్ధంగా ఉన్నావన్న సంగతి నాకు అర్థమైంది. ఆ రోజు నేను నీకు ఇచ్చిన మాత్రలో ఏమీ లేదు. మిగిలిన కల కూడా రావాలన్న బలమైన నీ కోరికే నీకా కల పూర్తిగా వచ్చేట్టు చేసింది’’ నావంక మెచ్చుకోలుగా చూస్తూ అన్నాడు దామోదర్.
దామోదర్ మాత్రమే కాదు. ఇంట్లోనూ, స్టేషన్లోనూ, మా అమ్మాయి స్కూల్లోనూ, మార్కెట్లోనూ, ఎక్కడికి వెళ్లినా అందరూ నన్ను మెరిసే కళ్లతో చూస్తున్నారు. నాతో మాట్లాడే విధానమే వేరుగా ఉంటోంది. జీవితంలో మనిషికి కావాల్సిందేమిటో అర్థమైనట్టుగా అనిపిస్తోంది నాకిప్పుడు.