
‘ఈఫిల్‌టవర్’ని అమ్మేశాడు...
కొనేవాళ్లుంటే...
ఫ్రాన్స్‌లోని చిరప్రసిద్ధ చారిత్రక కట్టడం ఈఫిల్ టవర్. పారిస్ నగరం అంటే గుర్తొచ్చే ఒక ప్రపంచ వింత కూడా. అయితే మాత్రం నాకేంటి అనుకున్నాడు విక్టర్ లుస్టింగ్ అనే జగదేక మాయగాడు. దానిని అమ్మి పారేశాడు. ఒకసారి అమ్మితే ఏమంత ఘనత అనుకున్నాడేమో, ఏకంగా రెండుసార్లు అమ్మేశాడు. ఇతగాడు పారిస్- న్యూయార్క్ నగరాల మధ్య తరచు పర్యటించేవాడు. అందంగా కబుర్లు చెబుతూ జనాలను ఘరానాగా బురిడీ కొట్టించేవాడు.
మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత పారిస్ అప్పుడప్పుడే తేరుకుంటున్న సమయంలో లుస్టింగ్ కన్ను ఈఫిల్ టవర్‌పై పడింది. ఇంకేం! సొమ్ము చేసుకోవాలనుకున్నాడు. తుక్కు సామాన్లు టోకుగా కొనే ఆరుగురు బడా వ్యాపారులను ఆహ్వానించి, ఒక బడా హోటల్‌లో ‘ఆంతరంగిక’ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. తనను తాను ప్రభుత్వాధికారిగా పరిచయం చేసుకున్నాడు.
ఈఫిల్ టవర్ నిర్వహణ ప్రభుత్వానికి భారంగా మారిందని, నిర్వహించలేని తుక్కు సామానుగా అమ్మేయాలను కుంటోందని నమ్మబలికాడు.
ప్రభుత్వ అధికారిననే అబద్ధాన్ని నిజం చేయడానికి టవర్‌కు ధర నిర్ణయంలో లాభం చేకూరుస్తానని ఒక వ్యాపారి నుంచి లంచం పుచ్చుకున్నాడు. ఆ ధరకే అమ్మేశాడు. ఇది జరిగిన నెల్లాళ్ల వ్యవధిలోనే మళ్లీ ప్యారిస్ వచ్చి, ఇదే పద్ధతిలో రెండోసారి కూడా ఈఫిల్ టవర్‌ను మరొకరికి అమ్మేశాడు.