సాయం | this story of Marshall shuvon story | Sakshi
Sakshi News home page

సాయం

Published Sat, Mar 12 2016 10:34 PM | Last Updated on Mon, Oct 1 2018 5:16 PM

సాయం - Sakshi

సాయం

ఆమె పేరు ఐలీన్. చూడగానే అందగత్తె అనిపించకపోయినా, చూస్తూంటే చూడాలనిపించే అందం. ఏడుస్తూ చెప్పింది.

ఆమె పేరు ఐలీన్. చూడగానే అందగత్తె అనిపించకపోయినా, చూస్తూంటే చూడాలనిపించే అందం. ఏడుస్తూ చెప్పింది. ‘‘ఏం చేయాలో తెలీక మీ దగ్గరికి వచ్చాను. షాపుకి ఇద్దరు వచ్చారు... పోలీస్‌వాళ్లు. జేక్‌ని నకిలీ డాలర్ల నోట్లు మారుస్తున్నందుకు అరెస్ట్ చేసారు. మిస్టర్ హంటర్! అవి నకిలీవని మాకు తెలీదు. నా సోదరుడు జైలుకి వెళ్ళకుండా మీరు కాపాడాలి.’’ ‘‘వాళ్లు స్థానిక పోలీసులా? లేక ఎఫ్‌బీఐ ఏజెంట్లా?’’ అడిగాను. ‘‘స్థానిక పోలీసులు. వాళ్లు మా షాపుని, అపార్ట్‌మెంట్‌ని మొత్తం క్షుణ్ణంగా వెదికారు.’’ ‘‘దొంగ నోట్లకోసమా?’’ ‘‘వాటి కోసం, ఇంకా వాటిని ముద్రించిన ప్లేట్ల కోసం. జేక్ జైల్లో ఉండగా ప్రింటింగ్‌ని నేర్చుకున్నాడని తెలిసి...’’
 
‘‘ఏమైనా దొరికాయా?’’ ప్రశ్నించాను. ఆమె కన్నీళ్లు తుడుచుకుని చెప్పింది. ‘‘నకిలీ నోట్ల కట్ట దొరికింది. అది మాది కాదని చెప్పినా నమ్మలేదు.’’  ‘‘అది ఎవరిది?’’  ‘‘పోలీసులు వెళ్లాక అతను ఫోన్ చేసాడు. డబ్బు వెనక్కి ఇవ్వమని నన్ను కోరాడు. అతను దుర్మార్గుడు. మీ సహాయం కావాలి... మీ ఫీజ్ ఎంతో తెలీదు...’’
 ‘‘వివరంగా చెప్పండి... ఆ దుర్మార్గుడు ఎవరు?’’ ‘‘జాకబ్. జైల్లో జేక్‌కి పరిచయం. రెండు నెలల క్రితం విడుదల అయాట్ట. జేక్‌కి ఆ వంద డాలర్ల కట్టని ఇచ్చి దాచమని కోరాడు.

ఫిలడెల్ఫియాలో బేంక్ దొంగతనంతో పట్టుబడి ఐదేళ్లు శిక్షని అనుభవించాడు. అది దొంగిలించిన డబ్బు అని చెప్పాడు. వారం పది రోజుల్లో పోలీసులు తనని అరెస్ట్ చేయకపోతే మళ్లీ వచ్చి తీకుంటానని అన్నాడు.’’
 ‘‘ఆ కట్టలో ఎంతుంది?’’
 ‘‘నాకు తెలీదు. బహుశా నాలుగు లక్షల దాకా ఉండచ్చు.’’
 నేను చిన్నగా ఈల వేసి సిగరెట్ అంటించాను. ‘‘మీ అడ్రస్ జాకబ్‌కి ఎలా తెలుసు?’’

‘మా అన్నయ్యకి వీక్లీ పత్రిక పెట్టాలనే కోరిక. ‘జైల్లో ఉండగా ప్రింటింగ్ నేర్చుకున్నాడు. జాకబ్ ప్రింటింగ్ ప్రెస్ నడిపే వారి చిరునామాలు సేకరించి మా అన్నయ్యని కలిసానని చెప్పాడు.’’
 ‘‘మీ అన్నయ్యకి నిజంగా అవి దొంగ నోట్లని తెలీదా?’’
 ‘‘తెలిస్తే వాటిని ఖర్చు చేసే ధైర్యం ఎలా చేస్తాడు?’’
 ‘‘సరే. నా ప్రయత్నం నేను చేస్తా’’ చెప్పాను.
   
బ్రైటన్ పోలీసు శాఖలో నెడ్‌పాటర్ లెఫ్టినెంట్‌గా పనిచేస్తున్నాడు. అతను నాకు బాగా పరిచయం. అతన్ని వివరాలు కను క్కున్నాను. ‘‘ఒకడు పచారీ సరుకు కొని నకిలీ వంద డాలర్ల నోట్ ఇచ్చాడని పెన్ స్టేట్‌లోని ఓ షాపు నించి ఫిర్యాదు అందింది. వెంటనే వెళ్లి జేక్‌ని పట్టు కున్నాం. అతని పర్స్‌ని వెదికితే ఇంకో రెండు నకిలీ వంద డాలర్ల నోట్లు కనిపించాయి. అతని జేబులోని రసీదుని చూసి అతను మరో దుకాణంలో కూడా కొన్నాడని తెలిసి అక్కడికి వెళ్లాం.

అతను ఇచ్చిన నోటు నకిలీదని కేష్ బాక్స్‌లోని నోట్లని పరిశీలించాక తెలిసింది. అతను కొన్నది ఓ చిన్న పెర్‌ఫ్యూమ్ బాటిల్, కొన్ని పత్రికలు. వంద డాలర్లు నోట్‌ని మార్చడానికి కొనే చిన్న వస్తువులవి. జేక్ ప్రింటింగ్ వ్యాపా రంలో ఉన్నాడు కాబట్టి అతనే వాటిని అచ్చు వేసాడని మా అనుమానం.’’
 ‘‘మీరు వెదికినప్పుడు వాటిని ప్రింట్ చేసిన ప్లేట్స్ కనిపించాయా?’’ అడిగాను.
 ‘‘లేదు’’ చెప్పాడు. ‘‘మరి?’’
 ‘‘అవి ప్రొఫెషనల్స్ కాక, కొత్తవాళ్లు తయారుచేసిన నకిలీ నోట్లు. సామాన్యులు నకిలీ అని తెలుసుకోలేరు.’’
 ‘‘థాంక్స్.’’
   
నేను మా ఆఫీస్‌కి వెళ్లేసరికి ఐలీన్ నాకోసం ఆదుర్దాగా ఎదురు చూస్తోంది. ‘‘జాకబ్ మళ్లీ ఫోన్ చేసాడు. సాయంత్రం ఎనిమిదికి తనుండే మోటెల్‌కి జేక్ ఆ డబ్బుతో రాకపోతే, మా ఇద్దర్నీ చంపేస్తానని బెదిరించాడు.’’
 ‘‘అది ఉత్త బెదిరింపే అవచ్చు.’’
 ‘‘జాకబ్ అంటే మా అన్నయ్యే భయ పడుతున్నాడంటే, అది అబద్ధం కాదు. జాకబ్ నన్ను బెదిరించడం పోలీసులకి తెలిస్తే, నేను చెప్పేది నిజమని వాళ్లకి అర్థమవుతుంది. అప్పుడు జేక్ నిర్దోషి అని వాళ్లకి తెలుస్తుంది.’’
 ‘‘ఇది చక్కటి పరిష్కారం’’ చెప్పాను.
 
‘‘కానీ ఎలా?’’ నిస్పృహగా చూస్తూ అడిగింది. ‘‘దానికి ఒకటి రెండు మార్గాలు ఉన్నాయి. అతని మోటెల్ గదిలో రహస్య మైక్రో ఫోన్‌ని అమర్చితే, అతని సంభాషణని రికార్డ్ చేయచ్చు.’’
 ఆమె కళ్లు మెరిసాయి. నేను జాకబ్ బస చేసిన మోటెల్‌కి ఫోన్ చేసి గదులు ఖాళీగా ఉన్నాయా అని కనుక్కున్నాను. పక్క గదే ఖాళీగా ఉంది. ఎనిమిదికి ఐదు నిమిషాల ముందు పక్కగది గోడలోంచి శబ్దాన్ని గ్రహించే మైక్రో ఫోన్‌ని అమ ర్చాను. ఐలీన్ పర్స్‌లో మరో వాయిస్ ఏక్టివేటెడ్ టేప్ రికార్డర్‌ని కూడా అమ ర్చాను. ఒకటి పని చేయకపోయినా మరో టేప్ రికార్డర్‌లో రికార్డ్ అవుతుంది. ఐలీన్ జాకబ్ గదిలోకి వెళ్లడం కిటికీలోంచి చూసాను.

 ‘‘నేను ఎనిమిదికి రమ్మని చెప్పాను. పది నిమిషాలు ఎందుకు లేటయ్యావు? డబ్బెక్కడ?’’ ఓ మగ కంఠం చక్కగా వినిపించింది. ‘‘నా దగ్గర లేదు. మిస్టర్ జాకబ్! మా అన్నయ్యకి దాచమని ఇచ్చినప్పుడు అవి దొంగ నోట్లని ఎందుకు చెప్పలేదు?’’
 ‘‘ఏంటి నువ్వు మాట్లాడేది? ఆ సంగతి నీకెలా తెలుసు?’’
 ‘‘మా అన్నయ్య జైల్లో ఉన్నాడు. ఆ నకిలీ నోట్లు పోలీసుల ఆధీనంలో ఉన్నాయి. నేనది చెప్పాలని వచ్చాను. వెళ్తున్నాను.’’
 ‘‘వాటిని నువ్వు పోలీసులకి ఇచ్చావా?’’ అతని కంఠం ఆశ్చర్యంగా అడిగింది.

 ‘‘లేదు. జేక్ మీరు ఇచ్చిన డబ్బులోంచి నాలుగు వందలు అప్పుగా తీసుకున్నాడు...’’
 ‘‘నాకు ఎంత డబ్బు నష్టం వచ్చిందో తెలుసా నీకు? నువ్వీ గది దాటి బయటికి వెళ్లడం లేదు.’’
 కొట్టిన చప్పుడు. వెంటనే ఐలీన్ కేక. నేను తక్షణం నా రివాల్వర్‌తో పక్క గదిలోకి పరిగెత్తాను. ఆరడుగుల ఐదంగుళాల పొడవు, గడ్డం గల జాకబ్ ఇలాంటిదేదో జరగచ్చని తయారుగా ఉన్నట్లున్నాడు. లోపలకి వెళ్లీ వెళ్లగానే అతను నన్ను కొట్టిన దెబ్బకి కళ్లు తిరిగి పడిపోయాను. నాకు స్పృహ వచ్చేసరికి ఐలీన్ తడిబట్టతో నా ముఖాన్ని తుడుస్తూ కనిపించింది. ‘‘అతనేడి?’’ అడిగాను.
 
‘‘పారిపోయాడు. రికార్గ్డింగ్ బాగా వచ్చిందా’’ ఆశగా అడిగింది. నవ్వుతూ తల ఊపాను. ఆ సాక్ష్యంతో ఇద్దరం కార్లో పోలీస్ స్టేషన్‌కి వెళ్లాం. నెడ్ పాటర్ దాన్ని తీసుకుని జేక్‌ని విడుదల చేసి జాకబ్ కోసం రెడ్ అలర్ట్ చేసాడు. మర్నాడు ఉదయం నేను ఐలీన్ ఇంటికి నా ఫీజ్ కోసం వెళ్లాను. గత రాత్రి అపార్ట్‌మెంట్ ఖాళీ చేసి ముగ్గురూ వెళ్లిపోయారని ఇంటావిడ చెప్పింది. ‘‘ముగ్గురా? జేక్, ఐలీనే కదా ఇక్కడ ఉండేది?’’ అడిగాను.
 
‘‘లేదు. వారి ఇంకో సోదరుడు విల్సన్ కూడా ఇక్కడే ఉన్నాడు.’’
 ‘‘ఆరడుగుల ఐదంగుళాల పొడవు, గడ్డం. అవునా?’’ అడిగాను. ‘‘అవును. మీ పేరు హంటర్ అయితే ఐలీన్ మీకీ కవర్ ఇవ్వమంది.’’
 టై్వన్ దారంతో కట్టిన దాన్ని తెరచి చూస్తే ‘ఇది మీ కష్టానికి ప్రతిఫలం. లవ్. ఐలీన్ అనే కాగితం, రెండు ఎన్‌గ్రేవ్డ్ జింక్ ప్లేట్స్ కనిపిం చాయి. నకిలీ వంద డాలర్ల నోట్లు ప్రింట్ చేసేందుకు ఉపయోగించే ప్లేట్స్ అవి.
(మార్షల్ షూవోన్ కథకి స్వేచ్ఛానువాదం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement