రోజులు కాదు. నెలలు కాదు. ఏళ్లు గడిచిపోయాయి. అది కూడా ఒకటి రెండేళ్లు కాదు. ఏకంగా 11 ఏళ్లు. అయినా అతణ్ణి ఆమె, ఆమెను అతడు కలవడానికి ప్రయత్నం, పోరాటం ఆపలేదు. చివరికి రెండు దేశాల మధ్య హద్దులు చెరిగిపోయాయి. వాళ్లిద్దరూ కలిశారు. ఇంతకూ ఎవరా ఇద్దరు? ఏమా కథ? అది నలభై ఏళ్ల నాటి కథ. సోవియెట్ యూనియన్ అమ్మాయి ఇరినా మెకిలాన్. మాస్కోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ ఎకానమీ అండ్ ఇంటర్నేషనల్‌లో ఉద్యోగి. అక్కడే ఆమె అమెరికాకు చెందిన ప్రొఫెసర్ వుడ్‌ఫోర్డ్‌ను కలిసింది. కొన్నాళ్లకే వాళ్లిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. 1974 మేలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ మూడు నెలల తర్వాత వుడ్‌ఫోర్డ్ స్వదేశానికి బయల్దేరాల్సి వచ్చింది. అతని వీసా గడువు ముగిసిపోవడమే దీనికి కారణం. మళ్లీ వస్తానంటూ... వదల్లేక వదల్లేక మాస్కోను వదిలివెళ్లాడు వుడ్‌ఫోర్డ్. ఆ తర్వాత తన భార్యను కలవడానికి చాలాసార్లు ప్రయత్నించాడు వుడ్‌ఫోర్డ్.
కానీ మాస్కో రావటానికి అతనికి అనుమతి లభించలేదు. కనీసం తనైనా యూఎస్ వెళ్దామని చూసింది ఇరినా. కారణాలు చెప్పలేదు కానీ, ఆమె అమెరికా వెళ్లడానికి అనుమతించలేదు సోవియెట్ యూనియన్. యూఎస్‌కు, సోవియెట్ యూనియన్‌కు మధ్య వైరం... ఇరినా, వుడ్‌ఫోర్డ్‌లకు శాపంగా మారింది. ఉత్తర ప్రత్యుత్తరాలతో క్షేమ సమాచారాలు కనుక్కుంటూ, వివాహ వార్షికోత్సవాల సమయంలో గ్రీటింగ్ కార్డులు, ఫొటోలు పంపుకుంటూ అప్పుడప్పుడూ ఫోన్‌లో మాట్లాడుతూ, ఇలా ఏకంగా పదకొండేళ్లు గడిచిపోయాయి. అయినా ఒకరినొకరు కలవడానికి వుడ్‌ఫోర్డ్, ఇరినా ప్రయత్నాలు ఆపలేదు. ఎడబాటు ఎంత బాధ, ఎంత అసహనం కలిగించినా, ఏనాడో ఒకనాడు తప్పకుండా కలుస్తామన్న ఆశతోనే అన్నేళ్లు ఎదురుచూశారు వాళ్లిద్దరూ.
వుడ్‌ఫోర్డ్, ఇరినాల ప్రేమకథ పత్రికలకెక్కింది. దీంతో సోవియెట్ యూనియన్ దిగి వచ్చింది. ఇరినా యూఎస్‌కు వెళ్లడానికి అంగీకరించింది. 1986 జనవరిలో ఇరినా మాస్కో నుంచి కూతురితో కలిసి బయల్దేరింది. యూఎస్‌లోని బాల్టిమోర్ - వాషింగ్టన్ ఎయిర్‌పోర్టులో దిగగానే వర్షించే కళ్లతో తనకోసం ఎదురుచూస్తూ కనిపించాడు వుడ్‌ఫోర్డ్. ఇద్దరిలో ఉద్వేగం కట్టలు తెంచుకుంది. వాళ్లిద్దరూ తిరిగి కలిసిన క్షణాల్ని అమెరికా పత్రికలన్నీ ప్రముఖంగా ప్రచురించాయి. అనూహ్య మలుపులు తిరిగిన తమ కథను తర్వాత ‘ఆఫ్ లవ్ అండ్ రష్యా: ది ఎలెవన్ ఇయర్ ఫైట్ ఫర్ మై హజ్బెండ్ అండ్ ఫ్రీడమ్’ పేరుతో పుస్తకంలోకి ఎక్కించింది ఇరినా. ఇటు రష్యాలో, అటు అమెరికాలో ఈ పుస్తకం మంచి పాపులారిటీ సంపాదించుకుంది.
ఆమె... అతడు... మధ్యలో రెండు దేశాలు
Published Sun, May 25 2014 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 7:48 AM
Advertisement