ఒకటి లేదా రెండు రోజులే! | venati shoba sex problems solves | Sakshi
Sakshi News home page

ఒకటి లేదా రెండు రోజులే!

Published Sat, Oct 29 2016 10:12 PM | Last Updated on Mon, Sep 4 2017 6:41 PM

ఒకటి లేదా రెండు రోజులే!

ఒకటి లేదా రెండు రోజులే!

నా వయసు 19. బరువు 40 కిలోలు. నా సమస్య ఏమిటంటే, రెగ్యులర్‌గా పీరియడ్స్ రావు. మా ఫ్రెండ్స్‌కేమో రెగ్యులర్‌గా వచ్చి, 4-5 రోజులు బ్లీడింగ్ అవుతుందట. కానీ నాకు మాత్రం రెండు నెలలకు ఓసారి పీరియడ్ వస్తుంది. వచ్చినా బ్లీడింగ్ మాత్రం ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే అవుతుంది. మొదటి రోజు కడుపు నొప్పి కొద్దిగా ఉంటుంది. అలా వస్తే మంచిది కాదని, భవిష్యత్‌లో పిల్లలు పుట్టరని నా ఫ్రెండ్స్ అంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది. ఇదే విషయం అమ్మకు చెప్పడానికి ఎందుకో భయంగా ఉంది. గత నెల బ్లీడింగ్ సరిగా కాలేదని ఫ్రెండ్‌కు చెబితే, మీ అమ్మకు చెప్పు ఆస్పత్రికి తీసుకెళ్తుంది అని అన్నది. నాకేమో ఆస్పత్రి అంటేనే భయంగా ఉంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి.|
- రాణి, ప్రకాశం

 పీరియడ్స్ సక్రమంగా రావడానికి... ఎత్తుకు తగ్గ బరువు, ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్, థైరాయిడ్, ప్రొలాక్టిన్ వంటి ఎన్నో హార్మోన్ల పనితీరు వంటివి అవసరం. అధిక బరువు, మరీ సన్నగా ఉండటం, థైరాయిడ్ సమస్య, అండాశయాలలో నీటితిత్తులు, మానసిక సమస్యలు, ఇంకా ఇతర హార్మోన్ల అసమతుల్యత, గర్భాశయంలో టీబీ వంటి ఎన్నో సమస్యల వల్ల పీరియడ్స్ రెండు మూడు నెలలకోసారి రావడం, బ్లీడింగ్ కొద్దిగానే అవ్వడం వంటివి ఉండవచ్చు. మీరు 40 కేజీల బరువే ఉన్నారు. పొడవు రాయలేదు. వాళ్లు వీళ్లు చెప్పారని, మీకు మీరే భయపడకుండా ఓసారి డాక్టర్‌ను సంప్రదించండి. సమస్య ఎక్కడుందో తెలుసుకోవడానికి సీబీపీ, థైరాయిడ్ పరీక్ష, స్కానింగ్ వంటి అవసరమైన పరీక్షలు చేయించుకోండి. అప్పుడు కారణాన్ని బట్టి చికిత్స తీసుకుంటే... సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

నా వయసు 44. బరువు 58 కిలోలు. గర్భసంచికి సమస్య రావడం వల్ల ఈ మధ్యనే ఆపరేషన్ చేయించుకుని గర్భసంచిని తీయించుకున్నాను. దాంతో చాలా రోజులుగా నడుము నొప్పితో బాధ పడుతున్నాను. ఇప్పుడు నా సమస్య ఏమిటంటే, ఇన్ని రోజులు నడుము నొప్పి ఒక్కటే ఉండేది. కానీ ఇప్పుడు కాళ్ల నొప్పులు మొదలయ్యాయి. వాపులు వస్తున్నాయి. ఎక్కువ దూరం నడవలేక పోతున్నాను. ఆపరేషన్ అప్పటికీ, ఇప్పటికీ బరువు బాగా పెరిగానేమో అనిపిస్తుంది. ఒకవేళ నా కాళ్ల నొప్పులకు బరువే కారణమా లేక ఆపరేషన్ వల్లనా? దయచేసి సలహా ఇవ్వండి.
- రాజమణి, కర్నూలు

 సాధారణంగా ఆడవారిలో 35 సంవత్సరాలు దాటిన తర్వాత మెల్లమెల్లగా రక్తంలో, ఎముకల్లో కాల్షియం శాతం తగ్గడం మొదలవుతుంది. అది 40-45 దాటే కొద్దీ ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి కాల్షియం ఎక్కువగా తగ్గిపోవడంతో ఎముకలు బలహీనపడటం వల్ల, ఎముకలు అరగడం మొదలై కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలు మెల్లమెల్లగా మొదలవుతాయి. ఆడవారిలో ఎముకల్లోకి కాల్షియం చేరడానికి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ దోహదం చేస్తుంది. గర్భాశయం, అండాశయాలు తీసి వేయడం వల్ల, ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోయి, ఎముకలు తొందరగా అరిగి, వాటి సాంద్రత తగ్గిపోయి, కీళ్లనొప్పులు, వాపులు, నడుము నొప్పులు వంటి ఎన్నో సమస్యలు ఏర్పడవచ్చు. దీనిపైన బరువు పెరిగే కొద్దీ.. నొప్పుల తీవ్రత ఇంకా పెరుగుతూ ఉంటుంది. దీనికి పరిష్కారం.. కాల్షియం, విటమిన్-డి కలిపిన మాత్రలు తీసుకోవడం, పాలు, ఆకు కూరలు, రాగిసంగటి, పండ్లు వంటి కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటూ ఉండాలి. అలా చేస్తే మీ సమస్య చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే చిన్నచిన్న వ్యాయామాలు చేసి, బరువును నియంత్రణలో ఉంచుకోవడం మంచిది. ఇంకా సమస్య తీవ్రత పెరుగుతూ ఉంటే, డాక్టర్ పర్యవేక్షణలో అవసరమైన పరీక్షలు చేయించుకొని, తగిన మందులు వాడటం మంచిది.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement