నమ్మకం: ఎడమ చేయి ఏం పాపం చేసింది ?
Left hand
ఎడమ చేతితో తినకూడదు, ఎడమ చేతితో ఎవరికీ ఏమీ ఇవ్వకూడదు, ఎడమ చేతితో పూజల వంటి పవిత్ర కార్యాలు చేయకూడదు... ఈ మాటలు మనం తరచుగా వింటూ ఉంటాం. కానీ ఎందుకు ఎడమ చేతితో అవన్నీ చేయకూడదు అని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు కుడి కంటే ఎడమ ఎందులో తీసిపోతుంది? కుడి చేతికి ఉన్న ప్రాధాన్యత ఎడమ చేతికి ఎందుకు లేకుండా పోయింది? అసలిది నమ్మకమా... మూఢనమ్మకమా? దీని వెనుక చారి్రత్రక, మత సంబంధిత ఆధారాలు ఏవైనా ఉన్నాయా?
ఎడమ చేతితో తినకూడదు అన్నదానికి పరిశుభ్రతే ప్రధాన కారణం. అయితే, ఎడమచేతితో ఎవరికీ ఏమీ ఇవ్వకూడదు అన్నదానికి పెద్ద కారణమే ఉంది. హిందూ మతం ప్రకారం... శరీరాన్ని రెండు భాగాలుగా విభజించారు. నాభి నుంచి శిరస్సు వరకూ ఉన్నదాన్ని పవిత్ర భాగమని, నాభి నుంచి పాదాల వరకూ అపవిత్ర భాగమనీ అంటారు. అలాగే నిలువుగా కూడా రెండు భాగాలుగా విభజించారు. ఎడమవైపు భాగాన్ని చంద్రభాగమని, కుడివైపు భాగాన్ని సూర్యభాగమనీ అంటారు.
చంద్రుడు స్వయంప్రకాశకుడు కాని కారణంగా, అతడు ఎప్పుడూ పరిపూర్ణంగా కనిపించడు. కానీ సూర్యుడు ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉంటాడు. ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు పూర్ణ మనసుతో ఇవ్వాలని అంటారు కాబట్టి, నిత్యం పరిపూర్ణుడుగా ఉండే సూర్యుడికి ప్రతిరూపమైన కుడిభాగాన్ని మాత్రమే ఉపయోగించాలని వేదాలు చెబుతున్నాయి. క్రైస్తవ మతంలో కూడా ‘ఎడమ’ను చెడుకు ఆపాదించడం కనిపిస్తుంది. దేవుడి రాజ్యం గురించి చెప్పేటప్పుడు పుణ్యాత్ములంతా దేవుడికి కుడివైపు, పాపం చేసినవాళ్లంతా ఎడమవైపు ఉన్నట్టుగా వర్ణించడం చూడొచ్చు. అందువల్లే ‘ఎడమ’కు ప్రాధాన్యత తక్కువైంది.
గ్రీకులు, రోమన్లు ఎడమను చెడుగా చూసేవారని చరిత్ర చెబుతోంది. దుష్టశక్తులు ఎడమ వైపుగానే ఉంటాయని వాళ్లు నమ్మేవారట. ఎడమ భుజమ్మీదుగా చీకట్లోకి చూస్తే దెయ్యాలు కనిపిస్తాయని వాళ్లు విశ్వసించేవారట. ఆ నమ్మకం మెల్లగా చాలా దేశాలకు పాకిందని చెబుతారు పరిశోధకులు. దుష్టశక్తుల్ని పారద్రోలేందుకు గ్రీకులు, రోమన్లు ఎడమచేతి వేళ్లకి రకరకాల ఉంగరాలు ధరించేవారట. నవ దంపతుల మీద వాటి ప్రభావం పడకుండా ఉండేందుకే పెళ్లి సమయంలో ఎడమచేతికి ఉంగరం పెట్టించడం మొదలుపెట్టారని, అదే తర్వాత సంప్రదాయమైందనే వాదన కూడా ఉంది.
ఇలాంటి వాటన్నిటిని బట్టే ‘ఎడమ’ను చిన్నచూపు చూడటం మొదలైంది. కానీ నిజానికి... ఎడమచేతి వాటం ఉన్నవాళ్లు అన్ని పనులూ ఆ చేత్తోనే చేస్తారు. అయినా వాళ్లేమీ నష్టపోవడం లేదు కదా! వాళ్లకు మంచే జరుగుతోంది కదా! మరి ‘ఎడమ’ అంత చెడ్డది ఎలా అయ్యింది?
మొదట్లో రోమన్లు ఎడమ మంచిదని నమ్మేవారట. గ్రీకుల్ని చూశాక వారి అభిప్రాయం మారిందట.
మంచం దిగేటప్పుడు ఎడమ కాలు ముందు పెడితే అరిష్ట మని కొందరు నమ్ముతారు.
కెన్యాలోని మేరు తెగవారు ఎడమ మంచిదంటారు. ఎందు కంటే తమ దేవుడు తన ఎడమ చేతిలో దుష్టశక్తుల్ని బంధించి ఉంచాడని వాళ్లు నమ్ముతారు.