దోమల వేట ఎప్పుడు మొదలైంది?
ఆవిష్కరణం
సృష్టి మొదలయినప్పటి నుంచి మనిషికి ఉన్న అతి భయంకరమైన శత్రువు దోమ. భూమిపై 170 మిలియన్ సంవత్సరాలుగా దోమలు కాపురం చేస్తున్నాయట! ఇవి తనకు ప్రమాకరం అని భావించినప్పటి నుంచి మనిషి వీటిని దూరంగా పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఆదిలో ఏవైనా పచ్చి ఆకుల నుంచి వచ్చే పొగద్వారా దోమల బారి నుంచి బయటపడవచ్చని మానవుడు అర్థం చేసుకొన్నాడు.
కొన్ని శతాబ్దాల పాటు పొగ ఒక్కటే మానవుడిని దోమల బారి నుంచి రక్షించిందని పరిశీలకులు అభ్రిపాయపడ్డారు. నాగరికత వృద్ధి అయ్యాక దోమతెరల వినియోగం మొదలైంది. శాస్త్రీయంగా దోమలను చంపే పద్ధతులు ఆవిష్కృతం అయినది మాత్రం 19, 20 శతాబ్దాల్లోనే. ఈ సమయాల్లో కొన్ని రసాయనిక పదార్థాల ద్వారా దోమలను చంపవచ్చని పరిశోధకులు గుర్తించారు. ‘పైరేథ్రం’అనే మొక్కలోని ఇన్‌సెక్టిసైడ్ గుణాలున్నాయని యూరోపియన్‌లు గుర్తించారు. దీనిని ఆధారంగా చేసుకొని 1890లో జపనీస్ బిజినెస్‌మ్యాన్ ఇచిరో ఉయేమా మస్కిటోకాయల్‌ను రూపొందించినట్టు తెలుస్తోంది. అయితే కాయిల్ కేవలం 40 నిమిషాల్లో మాత్రమే పూర్తిగా కాలిపోయేదట. తర్వాత ఇచిరో భార్య దాని రూపు రేఖలు మార్చి ఎక్కువసేపు పొగను ఇచ్చే విధంగా తీర్చిదిద్దింట.
1957 నుంచి కాయిల్స్ ఉత్పత్తి పెరిగింది. చైనా, థాయిలాండ్‌లలో భారీ ఎత్తున ఉత్పత్తి ప్రారంభం అయ్యింది. కాయిల్ సంగతి ఇలా ఉంటే 1911 నుంచి దోమలను ఆకర్షించి హతమార్చే ‘బగ్ జాపర్’ల వినియోగం మొదలైంది. ఆ సంవత్సరంలో ‘పాపులర్ మెకానిక్స్’ అనే మ్యాగ్జిన్‌లో దీని గురించి ప్రచురించారు. లైట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ గ్రిడ్‌తో కూడిన మిషన్‌ను దోమల నివారణకు వాడటం మొదలుపెట్టారు. అమెరికాలో వీటి ఉత్పత్తి, వినియోగం మొదలై, విస్తృతంగా వినియోగంలోకి వచ్చింది.