జంట హత్యలు... కటకటాల్లో నిరపరాధి... | Wrong judgment decision | Sakshi
Sakshi News home page

జంట హత్యలు... కటకటాల్లో నిరపరాధి...

Published Sat, Jun 13 2015 11:46 PM | Last Updated on Sun, Sep 3 2017 3:41 AM

జంట హత్యలు... కటకటాల్లో నిరపరాధి...

జంట హత్యలు... కటకటాల్లో నిరపరాధి...

రాంగ్ జడ్జిమెంట్
 ‘థ్యాంక్ గాడ్..’ జైలు గోడలు దాటి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెడుతూనే దేవుడిని తలచుకున్నాడు జోసెఫ్ స్లెడ్జ్. ముడతలు పడ్డ ఆ మొహంలో గొప్ప సంతోషం... అంతకుమించి ఎట్టకేలకు నిరపరాధిగా విముక్తి పొందినందుకు గొప్ప రిలీఫ్. అతడి కోసం సోదరి బార్బరా కిన్లా, సోదరుడు ఆస్కార్ స్లెడ్జ్, అతడి కొడుకు మారిస్ స్లెడ్జ్ జైలు బయట నిరీక్షిస్తూ కనిపించారు.
 
 వారితో పాటు పదేళ్లుగా స్లెడ్జ్ తరఫున న్యాయపోరాటం సాగించిన న్యాయవాది క్రిస్ మమ్మా కూడా. అందరి కళ్లలోనూ ఆనందం. గొప్ప వెలుగు. అప్పటికే అక్కడకు మీడియా ప్రతినిధులు చేరుకున్నారు. ఫొటోలు తీస్తూ, స్లెడ్జ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘దేనికైనా ఓపిక పట్టమని మా అమ్మ చెప్పేది. ఓపిక పట్టాను. ఎట్టకేలకు న్యాయం దక్కింది’ అని అతడు చిరునవ్వుతో ప్రశాంతంగా బదులిచ్చాడు.
 
 ఒకటి కాదు, రెండు కాదు... చేయని నేరానికి ఏకంగా ముప్పయ్యేడేళ్లు కారా గారంలో మగ్గిన తర్వాత న్యాయవ్యవస్థ అతడికి డెబ్బైయేళ్లు వచ్చాక నిరపరాధిగా తేల్చింది. జైలుపాలు చేసినందుకు అమెరికా ప్రభుత్వం అతడికి చెల్లించబోయే పరిహారం 7.50 లక్షల డాలర్లు. అక్కడితో చేతులు దులిపేసుకుంటుంది. ఇంతకీ జోసెఫ్ స్లెడ్జ్ ఎలా జైలు పాలయ్యాడంటే...
 
 ఇదీ జరిగిన కథ..
 నార్త్ కరోలినాలోని ఎలిజబెత్ టౌన్‌లో 1976 సెప్టెంబర్ 6న ఇద్దరు మహిళల మృతదేహాలు దొరికాయి. వారిని ఎవరో దారుణంగా హత్య చేశారు. మృతదేహాలపై కత్తిగాట్లు ఉన్నాయి. పెనుగులాట జరిగినట్లు సంఘటనా స్థలంలో ప్రస్ఫుటమైన ఆనవాళ్లు ఉన్నాయి. స్థానికంగా కలకలం రేపిన ఈ జంటహత్యల కేసులో పోలీసులు చిల్లర నేరగాడు జోసెఫ్ స్లెడ్జ్‌ను అనుమానించారు. అప్పటికే ఒక చోరీ కేసులో అతడికి నాలుగేళ్ల శిక్ష పడింది. వైట్‌లేక్ జైలులో శిక్ష అనుభవిస్తున్న స్లెడ్జ్, ఈ జంట హత్యలకు ముందురోజే జైలు నుంచి పరారయ్యాడు. అతడే హత్యలు చేసి ఉంటాడనే అనుమానంతో పోలీసులు వేట ప్రారంభించారు. ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే చోరీ చేసిన కారులో ప్రయాణిస్తున్న స్లెడ్జ్‌ను పట్టుకున్నారు.
 
 జంట హత్యల కేసు మోపి, జైలుకు తరలించారు. రెండేళ్లు దర్యాప్తు చేసినా, ఆ హత్యలు స్లెడ్జ్ చేశాడనేందుకు ఎలాంటి ఆధారాలనూ సంపాదించలేకపోయారు. స్లెడ్జ్‌తో పాటు అదే జైలులో ఉన్న హెర్మన్ బేకర్, డానీ సట్టన్ అనే ఖైదీలను తమ దారికి తెచ్చుకున్నారు. ఇద్దరు మహిళలనూ తానే హత్య చేసినట్లు స్లెడ్జ్ తమ వద్ద అంగీకరించాడంటూ వారిద్దరూ వాంగ్మూలం ఇచ్చారు. ఖైదీల వాంగ్మూలమే ఆధారంగా పోలీసులు స్లెడ్జ్‌పై చార్జిషీట్ దాఖలు చేసి, 1978 ఆగస్టులో కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతడికి రెండు యావజ్జీవ శిక్షలను విధించింది. ఈ తీర్పుతో హతాశుడైన స్లెడ్జ్, నార్త్ కరోలినా సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకున్నా ఫలితం దక్కలేదు. తాను నిరపరాధినని మొత్తుకున్నా ఏ కోర్టూ అతడి వాదనను వినిపించుకోలేదు. అయినా, పట్టు వదలకుండా జైలులో ఉంటూనే కోర్టులకు పిటిషన్ల మీద పిటిషన్లు దాఖలు చేసుకున్నాడు.
 
 ఇదీ మలుపు...
 పాతిక పిటిషన్లు దాఖలు చేసుకున్న తర్వాత కేసులో అనుకోని మలుపు.. అతడికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చిన మాజీ ఖైదీ హెర్మన్ బేకర్ మనసు మార్చుకొని ముందుకొచ్చాడు. అప్పట్లో జైలులో ఉన్న తాను పోలీసుల బెదిరింపులకు, ప్రలోభాలకు లొంగి వాంగ్మూలం ఇచ్చానని కోర్టు ఎదుట చెప్పాడు. సంఘటనా స్థలం వద్ద సేకరించిన ఆధారాలకు డీఎన్‌ఏ పరీక్షలు చేయించాలంటూ 2003లో మళ్లీ కోర్టును ఆశ్రయించాడు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా 2012 వరకు ఎలాంటి పరీక్షలూ జరగలేదు. అప్పటికే ఆధారాల్లో కొన్ని నాశనమయ్యాయి. మిగిలిన వాటిని ల్యాబ్‌లో పరీక్షిస్తే వాటిలో ఏ ఒక్కటీ స్లెడ్జ్ డీఎన్‌ఏతో సరిపోలలేదు. ఆ నివేదికతో కేసు 2013లో మళ్లీ కోర్టుకొచ్చింది. మాజీ ఖైదీ బేకర్ సాక్ష్యాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. పలు విడతల విచారణ తర్వాత 2015 జనవరి 25న నార్త్ కరోలినా సుప్రీంకోర్టు ఈ కేసులో స్లెడ్జ్ పూర్తిగా నిరపరాధి అని, అతడిని తక్షణమే విడుదల చేయాలని తీర్పునిచ్చింది.              
 
 ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఖైదీలు గల దేశం అమెరికా. ఆ జైళ్లలో నిరపరాధుల సంఖ్య కూడా తక్కువేమీ
 కాదు. స్లెడ్జ్ వంటి
 కొందరు మాత్రం
 కాలం కలసి
 వచ్చినప్పుడు
 ఇలా విముక్తి
 పొందుతుంటారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement