దేవదాసు పాతాళభైరవి లాంటి ప్రేమకథ | YVS Chowdary Devadasu Movie sotry | Sakshi
Sakshi News home page

దేవదాసు పాతాళభైరవి లాంటి ప్రేమకథ

Published Sun, Jan 31 2016 12:22 AM | Last Updated on Mon, May 28 2018 2:13 PM

దేవదాసు పాతాళభైరవి లాంటి ప్రేమకథ - Sakshi

దేవదాసు పాతాళభైరవి లాంటి ప్రేమకథ

కారులో వాళ్లిద్దరే ఉన్నారు. హైదరాబాద్ నుంచి గుడివాడ వెళ్తున్నారు. వైవీయస్ చౌదరి డ్రైవ్ చేస్తున్నాడు. సడన్‌గా ఓ చోట వేరే రూట్‌కి తిప్పాడు. ‘‘ఇటెందుకు? ఇదంతా గతుకుల రోడ్డు. కొంచెం లాంగ్ కూడా’’ అన్నాడు కొమ్మినేని వెంకటేశ్వరరావు. ‘‘ఏం పర్లేదు. ఈ రూట్‌లో జర్నీ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ట్రాఫిక్ కూడా తక్కువ’’ చెప్పాడు చౌదరి.
 
 మాట్లాడలేదు కొమ్మినేని. అతనికి తెలుసు... చౌదరి ఒకసారి ఫిక్స్ అయితే తన మాట తనే వినడని! హరికృష్ణను హీరోగా పెట్టి ఆమధ్యే ‘సీతయ్య’ తీశాడు. దానికి క్యాప్షన్ ‘ఎవరి మాటా వినడు’! ఆ మాట చౌదరికి హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్. ‘సీతయ్య’కు బాగా పేరొచ్చింది. చౌదరి తర్వాత ఏం చేస్తాడు? కొమ్మినేని క్యూరియాసిటీతో అడిగాడు. ‘‘ఈసారేంటి?’’
 
 చౌదరి డ్రైవ్‌ను ఆస్వాదిస్తూ సమా ధానం చెప్పలేదు. దారిలో ఓచోట ‘పాతాళభైరవి’ పోస్టర్ కనిపించింది. దానివైపు చూపిస్తూ ‘‘అలాంటి ప్రేమకథ చేద్దాం. అందరూ కొత్తవాళ్లతో’’ అన్నాడు చౌదరి. ఆ టైమ్‌లో చౌదరితో సినిమా చేయడానికి పెద్ద హీరోలు కూడా రెడీగా ఉన్నారు. కానీ ఇతగాడేమో కొత్తవాళ్లతో సినిమా అంటాడేంటి? ఈ జర్నీ ఎటు వెళ్తుందో!!
   
 అబ్బాయి పక్కా మాస్. అమ్మాయి ఫుల్ క్లాస్. ఇద్దరి మధ్యనా ప్యూర్ లవ్. పెద్దవాళ్లు ఒప్పుకోరు. అది కామన్. ఆ అమ్మాయి ప్రేమ కోసం అమెరికా వెళ్తాడు అబ్బాయి. ఇట్స్ ఎ న్యూ థాట్! రాకుమారిని మాంత్రికుడు ఎత్తుకెళ్లిపోతే తోటరాముడు వెళ్లలేదూ... ఇదీ అంతే. టైటిల్ ‘బాలరాజు’. ఫుల్ స్క్రిప్ట్ రెడీ.
 
 హైదరాబాద్‌లో ‘బొమ్మరిల్లు’ ఆఫీసులో కూర్చున్నారు చౌదరి, కొమ్మినేని. అది చౌదరి సొంత బ్యానర్. బాధ్యతంతా కొమ్మినేనిది. చౌదరికి అతనే బ్యాక్‌బోన్! ఈ ‘బాలరాజు’కి హీరోగా ఎవరిని తీసుకుందాం? ఏదైనా కాంటెస్ట్ రన్ చేద్దామా?... ఇలా ఏవేవో డిస్కషన్స్.‘‘అల్లు అర్జున్ ఈ స్టోరీకి కరెక్ట్ అనిపిస్తోంది’’ అన్నాడు కొమ్మినేని. ‘‘గుడ్ ఐడియా. ‘గంగోత్రి’ తర్వాత ఏ సినిమా కమిట్ అయినట్టు లేడు. అల్లు అరవింద్ గారిని కలిసొస్తా’’... చౌదరిలో హుషారు. కట్ చేస్తే - గీతా ఆర్ట్స్ ఆఫీసులో ఉన్నాడు చౌదరి. అరవింద్ కథ విని, ‘‘మావాడికి బావుంటుంది. కానీ ‘ఆర్య’ సినిమా చేస్తున్నాడు. అదయ్యాక డెసిషన్ తీసుకుందాం’’ అని చెప్పారు. బన్నీకి కూడా ఇంట్రస్ట్ ఉంది. కానీ చౌదరికి కన్‌ఫ్యూజన్. ‘ఆర్య’ పూర్తయ్యాక ఒకవేళ కాదంటే? అందుకే ఎవరైనా కొత్త హీరోతో వెళ్లిపోతే బెటర్.
   
 సీనియర్ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ రమ్మంటే వెళ్లాడు చౌదరి. ‘‘తిరుమలై అనే తమిళ సినిమా హక్కులు కొన్నా. నీ డెరైక్షన్‌లో రీమేక్ చేద్దామనుకుంటున్నా. ఏమంటావ్?’’ అడిగారు రవికిశోర్. ‘‘ఆల్రెడీ నేనో ప్రాజెక్టు ప్లానింగ్‌లో ఉన్నా. కొత్త హీరో హీరోయిన్లు కావాలి. ఎవరైనా ఉంటే చెప్పండి’’ అడిగాడు చౌదరి. రవికిశోర్ తన మొబైల్ ఫోన్‌లో ఓ వీడియో చూపించారు. ‘‘ఈ కుర్రాడు చాలా బావున్నాడు. డీటైల్స్ చెప్పండి. నేనే హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తా’’ అన్నాడు చౌదరి. ‘‘మా తమ్ముడు మురళి చిన్నకొడుకు.. రామ్. నేను, సురేశ్‌బాబు కలిసి ‘ఫర్ ది పీపుల్’ అనే మలయాళ సినిమాను ‘యువసేన’గా రీమేక్ చేయాలనుకుంటున్నాం. నలుగురు కుర్రాళ్లలో ఒకరిగా రామ్‌ను ఇంట్రడ్యూస్ చేద్దామనుకుంటున్నాం’’ చెప్పారాయన. ‘‘కుర్రాణ్ణి నాకొదిలేయండి. భారీ లెవెల్‌లో ఈ సినిమా చేస్తా’’ అన్నాడు చౌదరి.
 
 రవికిశోర్‌కి కూడా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. కానీ ఇంకో ట్విస్ట్ ఉంది. ప్రసిద్ధ దర్శకుడు శంకర్ నిర్మాత అవతారమెత్తి, బాలాజీ శక్తివేల్ డెరైక్షన్‌లో ‘కాదల్’ అనే ఫిల్మ్ ప్లాన్ చేశాడు. హీరోగా రామ్ ఆల్‌మోస్ట్ ఓకే. ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు. ఇప్పుడు చౌదరి సినిమా చేయాలంటే, రామ్ రెండు సినిమాలు మానేయాలి. కానీ రామ్‌కు ఏది బెస్ట్ ఫ్యూచర్‌నిస్తుందో రవికి శోర్ బాగా జడ్జ్ చేయగలరు. చౌదరికే ఆయన ఓటు. హమ్మయ్య, చౌదరికి హీరో దొరికాడు. ఇక హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టాలి.
 
 చౌదరి ఆ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్న టైమ్‌లో అరవింద్ నుంచి పిలుపు. బన్నీ డేట్స్ ఇవ్వడానికి రెడీ. అప్పటికే ‘ఆర్య’ సూపర్ హిట్. బన్నీతో సినిమాలు చేయడానికి చాలామంది క్యూలో ఉన్నారు. కానీ చౌదరికే ఫస్ట్ చాన్స్. అయితే రామ్‌కి మాటిచ్చేశాడు చౌదరి. అరవింద్‌తో ఆ విషయం చెప్పి వచ్చేశాడు.
   
 ముంబైలో ఫేమస్ మోడల్ కో-ఆర్డినేటర్ సుష్మా కౌల్ ఆఫీస్. హీరోయిన్లు కావాలనుకునే అమ్మాయిలందరికీ ఆమె ఆఫీసే పెద్ద అడ్డా. అక్కడ ఇలియానా ఫొటో చూడగానే చౌదరి ఫ్లాట్. లవ్లీగా ఉంది. కానీ ఆల్రెడీ తేజ సెలెక్ట్ చేసేశాడు... ‘ధైర్యం’ మూవీ కోసం. పాపం చౌదరి! మళ్లీ వెతుకులాట మొదలు!
   
 ఇలియానా హైదరాబాద్‌లో, ‘ధైర్యం’ షూటింగ్‌లో ఉంది. నిజానికి ఆ క్యారెక్టర్‌కి ఫాస్ట్ లుక్ ఉన్న అమ్మాయి కావాలి. ఇలియానా ఏమో సాఫ్ట్ లుక్. అప్పటికే కొంత షూట్ చేశారు. తనను తీసేయలేరు. అలాగని ఉంచనూ లేరు. అదే టైమ్‌లో చౌదరికి ఇలియానా నచ్చిందన్న విషయం జర్నలిస్ట్ అన్నే రవి ద్వారా తేజకు తెలిసింది. ‘‘వాళ్లకంతగా నచ్చితే ఇచ్చేద్దాం. అయితే ఇలియానా హర్ట్ కాకూడదు’’ చెప్పాడు తేజ. అంతా స్మూత్‌గా జరిగిపోయింది. తేజ క్యాంప్‌లో నుంచి చౌదరి క్యాంప్‌లోకి వచ్చిపడింది ఇలియానా.
 
 హీరోయిన్ ఫాదర్‌గా ప్రకాశ్‌రాజ్ లాంటి స్టేచర్ ఉన్నవాడు కావాలి. కానీ ప్రకాశ్‌రాజ్ అన్ని డేట్స్ ఇవ్వలేడు. దాంతో శాయాజీ షిండేను తీసుకున్నారు. మ్యూజిక్ కీరవాణి చేయాలి. లాస్ట్ మినిట్‌లో చక్రి చేరాడు.హీరో హీరోయిన్లు కొత్తవాళ్లు కాబట్టి ప్రమోషన్ హై లెవెల్‌లో ఉండాలి. టైటిల్ నుంచే డిస్కషన్ స్టార్ట్ కావాలి. ‘బాలరాజు’ కన్నా ‘దేవదాసు’ బాగుంటుంది. ఓపెనింగ్ ఇన్విటేషనే అదిరిపోయింది. 36 పేజీలు. ఆల్బమ్‌లా ఉంది. అందరి లుక్కూ ‘దేవదాసు’పైనే.
   
 2004 సెప్టెంబర్ 24. ‘దేవదాసు’ గ్రాండ్ ఓపెనింగ్. ఇండియాతో పాటు బ్యాంకాక్‌లో 17 రోజులు, యూఎస్‌లో 45 రోజులు తీశారు. యూఎస్‌లోని గ్రాండ్ కాన్యన్, హాలీవుడ్, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, అమెరికన్ కాంగ్రెస్ బిల్డింగ్ లాంటి చోట్ల షూట్ చేశారు. పాతిక మంది యూనిట్‌తో ఇన్ని లొకేషన్స్‌లో తీయడం మాటలు కాదు. ఫిల్మ్ అక్కడే కొని, అక్కడే డెవెలప్ చేశారు. టిక్కెటింగ్‌తో కలిపి యూఎస్, బ్యాంకాక్ ఎపిసోడ్ల షూటింగంతా 90 లక్షల్లోపే పూర్తి చేసేశారు. అంత తక్కువలో ఎలా చేయగలిగారని చాలామంది ఆశ్చర్యపోయారు. చౌదరి కూడా అమరశిల్పి జక్కన్నే. సినిమా కంప్లీట్ కావడానికి 192 రోజులు పట్టింది.
   
 6 కోట్లతో ‘దేవదాసు’ రెడీ. సంక్రాంతికి రిలీజ్. పోటీలో వెంకటేశ్ ‘లక్ష్మీ’, లారెన్స్ ‘స్టైల్’, సిద్ధార్థ్ ‘చుక్కల్లో చంద్రుడు’ ఉన్నాయి. అందరూ స్టార్సే. ఇదొక్కటే నాన్‌స్టార్ మూవీ. 2006 జనవరి 11న ‘దేవదాసు’ రిలీజైంది. ఫస్ట్ ఫోర్ వీక్స్ డివెడైడ్ టాక్. ఆరోవారం నుంచీ ‘దేవదాసు’కి అందరూ దాసోహం. హైదరాబాద్‌లోని ఓడియన్‌లో ఏకంగా 200 రోజులు ప్రదర్శితమైంది. రామ్‌కి ఫస్ట్ మూవీతోనే స్టార్ స్టేటస్. ఇలియానాకు కూడా ఒకప్పుడు దివ్యభారతికొచ్చినంత క్రేజ్.
   
 ‘పాతాళభైరవి’ చూస్తున్నాడు చౌదరి. పక్కనే కొమ్మినేని. ‘సాహసం సాయరా డింభకా’ అనే డైలాగ్ దగ్గర పాజ్ చేశాడు. ఈ డైలాగ్ నా కోసమే చెప్పారా ఏంటి? అనుకున్నాడు. ‘దేవదాసు’ 200 రోజుల షీల్డ్ అతని వైపే విజయగర్వంతో చూస్తోంది.
 
 వెరీ ఇంట్రస్టింగ్
 ఒక సామాన్యుడు, ఓ కోటీశ్వరుడి కూతుర్ని ప్రేమించి, ఆ ప్రేమ కోసం ఫారిన్ వెళ్లడమనే కాన్సెప్ట్‌తో తారకరత్న ‘భద్రాద్రిరాముడు’, శివాజీ ‘ఎర్రబాబు’ చేశారు. ఈ రెండూ కూడా ‘దేవదాసు’ కన్నా ముందే రిలీజయ్యాయి. ‘దేవదాసు’ టైమ్‌లోనే నితిన్ హీరోగా ‘ఎడిటర్’ శంకర్ డెరైక్షన్‌లో ఇదే కాన్సెప్ట్‌తో సినిమా మొదలుపెట్టి ఆపేశారు.
 
 దర్శకుడు సూర్యకిరణ్ మలయాళంలో అదే పేరుతో డబ్ చేశారు. హిందీలో ‘సబ్‌సే బడా దిల్‌వాలా’ పేరుతో అనువాదమైంది. బెంగాలీలో ‘పగ్లూ’ పేరుతో రీమేక్ అయ్యింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement