హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : దేశంలో గృహ కొనుగోలుదారులకు భరోసా కల్పించేందుకు ఏర్పాటైన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) బిల్లు.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా అమల్లోకి రాలేదు. నిబంధనల ఖరారుతోనే సరిపెట్టేశాయి రెండు ప్రభుత్వాలు. ఆ తర్వాత ఏర్పా టు చేయాల్సిన రెరా అథారిటీ, వెబ్‌సైట్‌లను విస్మరించాయి.
కేంద్రం ఇచ్చిన అమలు గడువు (2016, మే1) ముగిసి రెండేళ్లు గడుస్తున్నా... నేటికీ కార్యరూపం దాల్చట్లేదు. నిబంధనల్లో స్వల్ప మార్పులకు కేంద్రమిచ్చిన అవకాశాన్ని ఆసరా చేసుకొని రెండు ప్రభుత్వాలూ నిబంధనలను నిర్వీర్యం చేశాయని, కొనుగోలుదారులకు భరోసా కల్పించలేకపోయానని రెరా బిల్లు ఆమోదంలో కీలకపాత్ర పోషించిన ఫోరమ్ ఫర్ పీపుల్స్ కలెక్టివ్ ఎఫోర్ట్స్(ఎఫ్‌పీసీఈ) ఆరోపిస్తోంది.
కేంద్రం ఇచ్చిన రెరా అమలు గడువు ముగిసినా నేటికీ తెలంగాణ ప్రభుత్వం రెరా అథారిటీ ఏర్పాటు చేయలేదు. కనీసం నిర్మాణ ప్రాజెక్ట్‌ల నమోదు కోసం వెబ్‌సైట్‌నూ అందుబాటులోకి తీసుకురాలేదు! ఇక, ఏపీలో విచిత్రమైన పరిస్థితి. ట్రిబ్యునల్ ఏర్పాటు మాట పక్కనపెడితే.. అందుబాటులోకి తీసుకొచ్చిన వెబ్‌సైట్‌కు డెవలపర్ల నుంచి ఆదరణే లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో అమల్లోకి వచ్చిన ఏపీ రెరాలో నేటికి నమోదైన ప్రాజెక్ట్‌లు కేవ లం 22. ఇందులో అమోదం పొందినవి రెండంటే రెండే. ఇక, నమోదు చేసుకున్న ఏజెంట్లయితే జస్ట్ ఒక్కరే!
నిబంధనలు నిర్వీర్యం..
ఏపీ ప్రభుత్వం రెరా నిబంధనలను రూపొందించి, ఖరారు చేసేందుకు ఏడాది సమయం తీసుకుంది. గతేడాది మే 1, 2017న ఏపీలో రెరా ముసాయిదా బిల్లు ఆమోదం పొందింది. ఇందులో... ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లను రెరాలో నమోదు నుంచి తొలగించారు. లేఅవుట్ వెంచర్లలో రోడ్లు, ఓపెన్ ఏరియాలు, వసతులు వంటివి పూర్తయిన వాటిని మినహాయించారు.
హౌజింగ్ ప్రాజెక్ట్‌లలో శ్లాబులు పూర్తయిన వాటిని, 50% అమ్మకాలు/ లీజులు పూర్తయిన అపార్ట్‌మెంట్లు, ప్లాట్లను మినహాయించారు. అలాగే అభివృద్ధి పనులు పూర్తయి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వాటిని కూడా రెరాలో నమోదు నుంచి తప్పించారు. కేంద్రం రెరా ప్రకారం.. నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానాతో పాటూ జైలు శిక్ష నిబంధన ఉంది.కానీ, ఏపీ రెరాలో దీన్ని తొలగించి కేవలం ప్రాజెక్ట్ వ్యయంలో 10 శాతం జరిమానాతో సరిపెట్టేశారు.
తెలంగాణలో నో ట్రిబ్యునల్, నో వెబ్‌సైట్..
తెలంగాణ ప్రభుత్వం మరీ దారుణం. గతేడాది ఆగస్టులో రెరా నిబంధనలను ఖరారు చేసింది. 2017 జనవరి 1 తర్వాత యూడీఏ, డీటీసీపీ, మున్సిపల్ అథారిటీ, పంచాయతీ, టీఎస్‌ఐఐసీ నుంచి అనుమతి పొందిన అన్ని ప్రాజెక్ట్‌లూ, ఓపెన్ ప్లాట్లూ రెరా పరిధిలోకి వస్తాయని తెలిపింది.
ఇక రెరా అథారిటీ ఏర్పా టు ఊసే ఎత్తట్లేదు. కనీసం ప్రాజెక్ట్‌లు, ఏజెంట్ల నమోదు కోసం వెబ్‌సైట్‌నూ అందుబాటులోకి తీసుకురాలేదు. పైగా ఇటీవలే మహారాష్ట్ర, కర్ణాటక రెరా అమలు తీరును పరిశీలించేందుకు స్థానికంగా అధికారుల కమిటీ పర్యటించింది. మరో 3 నెలల్లో రెరా అథారిటీ ఏర్పాటు చేసే అవకాశముందని సమాచారం.
ఆదరణ కరువైన ఏపీ రెరా వెబ్‌సైట్..
ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఏపీరెరా వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చింది. స్థానిక నిర్మాణ సంస్థలు, ఏజెంట్ల నుంచి పెద్దగా ఆదరణ లేదు. ఇప్పటివరకు ఏపీరెరా వెబ్‌సైట్లో 22 ప్రాజెక్ట్‌లు నమోదు కాగా... వాటిలో పనోరమా హిల్స్ బ్లాక్ 2, విన్యాస్ కాన్‌కోర్డ్ క్యాసిల్ మాత్రమే అనుమతి పొందాయి. ఏడుగురు ఏజెంట్లు నమోదు చేసుకుంటే ఇండియాబుల్స్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజరీ లిమిటెడ్‌కు మాత్రమే అనుమతి వచ్చింది.
ఇప్పటివరకు ఏపీరెరాకు 1 ఫిర్యాదు అందగా అది పరిష్కారం కాలేదు. ఆమోదం పొందిన ప్రాజెక్ట్‌ల వివరాలేవీ ఏపీ రెరా వెబ్‌సైట్‌లో పూర్తి స్థాయిలో లేవని ఎఫ్‌పీసీఈ వైస్ ప్రెసిడెంట్ బీటీ శ్రీనివాసన్ ఆరోపించారు. ప్రాజెక్ట్ ఎక్కడుంది, ఎప్పటిలోగా పూర్తవుతుంది, కీలకపత్రాలు, ఇతరత్రా వివరాలేవీ లేవన్నారు. రెరా నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ లేకుండా ప్రకటనలు చేయకూడదు. కానీ, ఏపీలో రిజిస్ట్రేషన్ లేకుండానే కంపెనీలు యథేచ్చగా ప్రకటనలు చేస్తున్నాయి. అయినా ప్రభుత్వం సుమోటాగా కేసు నమోదు చేయట్లేదని ఆయన పేర్కొన్నారు.
రెరా కోసం ఎఫ్‌పీసీఈ
దేశంలో గృహ కొనుగోలుదారులకు భరోసా కల్పించేందుకు ప్రత్యేకంగా చట్టం తీసుకురావాలని ప్రతిపాదించింది ఫైట్ ఫర్ రెరా. ఇందుకోసం జాతీయ స్థాయిలో ప్రభుత్వ, ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి పార్లమెంట్‌లో రెరా బిల్లును ఆమోదింపజేసింది. తర్వాతి క్రమంలో ఈ ఫైట్ ఫర్ రెరా సభ్యులే ఫోరమ్ ఫర్ పీపుల్స్ కలెక్టివ్ (ఎఫ్‌పీసీఈ) సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇదొక నాన్‌ప్రాఫిట్ ఆర్గనైజేషన్.
ప్రస్తుతం ఇందులో దేశంలోని 200కు పైగా గృహ కొనుగోలుదారుల సంఘాలు సభ్యులతో పాటూ వ్యక్తిగతంలో 2 వేలకు పైగా సభ్యులున్నారు. ఎఫ్‌పీసీఈ ప్రెసిడెంట్‌గా అభయ్ ఉపాధ్యాయ్ (కోల్‌కతా), జనరల్ సెక్రటరీ ఎంఎస్ శంకర్ (బెంగళూరు), వైస్ ప్రెసిడెంట్‌గా బీటీ శ్రీనివాసన్ (హైదరాబాద్), కన్వీనర్‌గా కన్నల్ టీపీ త్యాగి (ఘజియాబాద్) ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment