నేటికీ వదలని ‘ పీడకల’ | Andhra Pradesh And Telangana Face Problem With Zones | Sakshi
Sakshi News home page

నేటికీ వదలని ‘ పీడకల’

Published Tue, Aug 28 2018 12:55 AM | Last Updated on Tue, Aug 28 2018 12:55 AM

Andhra Pradesh And Telangana Face Problem With Zones - Sakshi

22 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడి కేబినెట్‌లో మంత్రి హోదాలో ఉన్న కేసీఆర్‌ 371(డి) ప్రకారమే జోనల్‌ పద్ధతి ఒకే విధంగా కొనసాగాలని నాటి ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. ‘రాష్ట్రం మొత్తంలో ఏ ప్రాంతపు ఉద్యోగిని మరే ఇతర ప్రాంతానికి బదిలీ చేసినా సరే విధిగా అక్కడికి వెళ్లి పనిచేయాల్సిందే’ అని చెప్పారు. అందుకే, 371(డి) మూడు ప్రాంతాల మూడు ముళ్లబంధంగా కాకుండా ఆరు ఉప రాష్ట్రాల ఆరు ముళ్లబంధంగా ఉమ్మడి రాష్ట్ర విభజన దాకా కొనసాగుతూ వచ్చింది. విభజన జరిగిన పద్ధతితో ఉభయ రాష్ట్రాలలో సమస్యలు మరింత పెరిగిపోయాయి. ఇది ఆర్డర్లు, ఆర్డినెన్సుల జారీవల్ల తేలే సమస్య కాదు.

ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ఉద్యమ లక్ష్యాల్లో ఒకటి ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వే షన్లు కల్పించడం. ముఖ్యమంత్రి వాదన విని ఫైలుకు సమ్మతించేందుకు ప్రధాని ఒప్పుకున్నారు. దీంతో మూడు మాసాల ఎదురుచూపులు ఫలించాయి. 1975 నాటి 371(డి) ప్రత్యేక రాజ్యాంగ సవరణ ఉత్తర్వుకు రాష్ట్రపతి ఉత్తర్వుతో తెరపడుతుంది.
– బి.వినోద్‌కుమార్, టీఆర్‌ఎస్‌ ఎంపీ ప్రకటన
ఉద్యోగుల భర్తీ కోసమే ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేస్తున్నట్టు కేసీఆర్‌ చెబుతున్నారు. కానీ, కొత్త జిల్లాల ఆమోదానికే ఆయన ఈ డ్రామాలు ఆడుతున్నారు. గత నాలుగేళ్లలో ఏనాడూ గర్తుకురాని నిరుద్యోగుల సమస్యలు కేసీఆర్‌కు ఇప్పుడే గుర్తుకురావడం అసలు విశేషం. ఆయన పాలనలో నిరుద్యోగులకు నిరాశ మాత్రమే మిగిలింది.
– టి.జీవన్‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్‌ శాసనసభా పక్ష ఉపనేత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలందరి భవిష్యత్తుకు, ఉభయ ప్రాంతాల ఉద్యోగాల సృష్టికి, వాటి పరిరక్షణకు 1975లో అసాధారణ, ప్రత్యేక రాజ్యాంగ సవరణ ద్వారా అనుల్లంఘనీయ ఏర్పాటుగా 371 (డీ) నిబంధన రూపొందించారు. ఆనాడు ఈ ప్రత్యేక నిబంధనను కేవ లం తెలంగాణ సోదరుల కోసం మాత్రమే చేయలేదు. అది యావత్తు ఆంధ్రప్రదేశ్‌ లోని విద్య, ఉద్యోగ విషయాల్లో ప్రజలందరికీ వర్తించే ఒక ప్రత్యేక ఏర్పాటు అని మరవరాదు. ఈ అధికరణ ఫలితంగానే మొత్తం రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా విభజించారు. ఇతరత్రా చట్టాలన్నింటికీ పూర్తి అతీతంగా ఈ 371(డీ) పనిచేస్తుందని అందులో స్పష్టంచేశారు. ఇంతకూ ఈ ప్రత్యేక అధికరణ(నిబంధన) లక్ష్యం ఏమిటి? ‘‘ప్రభుత్వో ద్యోగాల్లో, విద్యావకాశాల కల్పనలో మొత్తం రాష్ట్రంలోని వివిధ ప్రాంతా లకు చెందిన ప్రజలకు సమాన అవకాశాలు, సౌకర్యాలు కల్పించడం. అందుకుగాను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అవసరాలకు తగిన ఏర్పాట్లు చేయడం. అలాంటి అనుల్లంఘనీయమైన ఐక్యతా నిబంధన పోగొట్టు కుని తెలుగువాళ్లు రెండుగా చీలిపోయారు. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాలూ ఒకటిగాదు పలు సమస్యల చిక్కుముడిలో ఇరుక్కు పోయి నాలుగేళ్లయినా తేరుకోలేకపోతున్నాయి.

నిజానికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు సాగిన నేపథ్యంలోనే రాజ్యాంగ సవరణ చేశారు. అంతే గాదు, 371(డీ) ప్రత్యేక అధికరణ ద్వారా తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర–మూడు ప్రాంతాలనూ సమాంతరంగా అభివృద్ధి చేయాలి, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో 54 శాతం ఓపెన్‌ కేటగిరీ ద్వారా భర్తీ చేయాలి. మిగతా 46 శాతం ఖాళీలను బీసీ, ఎస్సీ, ఎస్టీలతో నింపాలి. అలాగే, విశ్వవిద్యాలయాల్లో, ఇతర విద్యాసంస్థల్లో సీట్లను సైతం ఇదే దామాషాలో భర్తీ చేయాలి. ఇంకా, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలుగా చీలిపోయినప్పటికీ, రెండింటికీ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగానే హైదరాబాద్‌ కొనసాగుతుంది. ఈ విషయాన్ని రాష్ట్ర విభ జన సమయంలోనే, ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌– 95 ప్రత్యేకించి పేర్కొంది. ఆనాడు కాంగ్రెస్‌ కేంద్ర నాయకులతో ‘ఇద్దరు చంద్రులు’ (చంద్రబాబు, కేసీఆర్‌) చేసుకున్న లోపాయికారీ ఒప్పం దాలు లేదా ఏర్పాట్ల ఫలితంగా అడ్డగోలుగా విభజన జరిగిపోయింది. కాని, పదేళ్లు పూర్తయ్యేదాకా ఆ 371(డీ) అధికరణను చెక్కుచెదర్చడానికి వీల్లేదని విభజన చట్టంలోని సెక్షన్‌–95 స్పష్టంగానే పేర్కొంది. కాబట్టి, పదేళ్లు అంటే 2024 సంవత్సరందాకా ఆ సెక్షన్‌ను ముట్టుకోవడానికి వీల్లేదు. ఆ సెక్షన్‌ కాలపరిమితి ముగిసిన తర్వాతనే అప్పటిదాకా అమల్లో ఉండే ఉమ్మడి జోనల్‌ వ్యవస్థ రద్దయి, కొత్త జోన్లు ఏర్పాటు చేసుకోవడానికి మార్గం తేలికవుతుంది. నేడు ఉభయ రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు ఒకటా, రెండా?! అసమగ్ర విభజన వల్ల ఎక్కడి ప్రధాన సమస్యలు అక్కడే ఉండిపోయాయి.

ఓటుకు కోట్లు కేసుతో హడావుడిగా అమరావతికి!
పదేళ్లపాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, ఆ లోగా ఆంధ్రప్రదేశ్‌ తన సొంత రాజ ధాని ఏర్పాటుచేసుకోవాలన్న షరతుకు చంద్రబాబు మొదట తలూపివచ్చారు. తర్వాత ఏపీ రాజధాని ఏర్పా టుపై నియమించిన నిపుణుల కమిటీ చైర్మన్‌ కేసీ శివరామకృష్ణన్‌ నివేది కను కనీసం అసెంబ్లీలో కూడా చర్చకు రాకుండా చేశారు. అంతటితో ఆగకుండా ఓ ప్రైవేటు కన్సల్టెన్సీ సంస్థ ద్వారా తనకు అనుకూలమైన నివేదిక ఆధారంగా ఆంధ్ర రాజధానిగా అమరావతిని స్థిరపరిచి నేడు ‘నిర్మాణ దారి ద్య్రం’లో నిండా మునిగి ఉన్నారు. 10–15 అడుగుల్లోనే నీరు ఉబికి వచ్చి ‘మునగానాం, తేలానాం’గా ఉండే లోతట్టు ప్రాంతం ఈ అమరావతి. పట్టుమని నాలుగేళ్లు గడవకుండానే అర్థంతరంగా హైద రాబాద్‌లోని సెక్రటేరియట్‌ను వదిలి ఉడాయించారు. కేసీఆర్, చంద్ర బాబు మధ్య నడిచిన ‘ఓటుకు కోట్లు’ కేసు డ్రామాలో ‘దొరికిపోవడం’ వల్ల సెక్రటేరియట్‌ను ఆగమేఘాల మీద ఖాళీచేసి పారిపోయినట్ట యింది. అంటే, చట్టం నిర్దేశించిన పదేళ్లలో మిగిలిన ఆరేళ్లు వ్యవధి ముగి యక ముందే, స్థిమితంగా రాజధానిని నిర్మించుకునే సదవకాశాన్ని ‘ఓటుకు కోట్లు’ కేసుతో కోల్పోవలసివచ్చింది.

ఇక  ఇద్దరు చంద్రులు ఎదుర్కొంటున్న సమస్యలకు అంతే లేదు. నదీ జలాల సమస్య, ప్రాజెక్టుల పంపిణీ, ఉద్యోగుల నియామకాలు, పంపిణీలు, నీటి పంప కాల్లో బచా వత్, బ్రజేష్‌ కమిటీల సిఫారసుల వివేచనలో కొలిక్కి రాని తగాదాలు, జోనల్‌ సమస్యలు– ఇవన్నీ ఉభయ ప్రభుత్వాల సంగతేమో గానీ, ప్రజలకు మాత్రం అనంతమైన కష్టాలు తెచ్చిపెట్టాయి. ఉభ యులూ మర్చిపోయిన అంశం–371(డి) ఉమ్మడి రాష్ట్రాన్ని 6 జోన్లుగా మార్చిందంటే, ఏపీ అసలు రూపం ఒక రాష్ట్రం అని కాదు, అది ఆరు ఉప రాష్ట్రాల సమాఖ్య అనే! కనుకనే 1974 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానిక అభ్యర్థులకు ఇంజనీరింగ్, మెడిసిన్‌ సీట్లను 85 శాతం గానూ, స్థానికేతర కేటగిరీకి 15 శాతంగానూ కేటాయించాలని ఆ అధి కరణలో స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు కొత్తగా కేసీఆర్‌ తెలంగాణలో తీసుకున్న ప్రతిపాదన ప్రకారం స్థానికులకు ఈ సీట్ల కేటాయింపు 95 శాతంగానూ, స్థానికేతరులకు కేవలం 5 శాతంగానూ ఉంటుంది.

22 ఏళ్లనాటి కేసీఆర్‌ మాట ఏమైంది?
కానీ, 22 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడి కేబినెట్‌లో మంత్రి హోదాలో ఉన్న కేసీఆర్‌ 371(డి) ప్రకారమే జోనల్‌ పద్ధతి ఒకే విధంగా కొన సాగాలని నాటి ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. ‘రాష్ట్రం మొత్తంలో ఏ ప్రాంతపు ఉద్యోగిని మరే ఇతర ప్రాంతానికి బదిలీ చేసినా సరే విధిగా అక్కడికి వెళ్లి పనిచేయాల్సిందే’ అని చెప్పారు. అందుకే, 371(డీ) మూడు ప్రాంతాల మూడు ముళ్లబంధంగా కాకుండా ఆరు ఉప రాష్ట్రాల ఆరు ముళ్లబంధంగా ఉమ్మడి రాష్ట్ర విభజన దాకా కొనసాగుతూ వచ్చింది. విభజనతో సమస్యలు మరింత పెరిగిపోయాయి. నేడు ఉభయ రాష్ట్రాలనూ చుట్టిముట్టిన సమస్యలకు విభజన జరిగిన పద్ధతే ప్రధాన కారణం. గత నాలుగేళ్ల çపరిపాలన వల్ల లబ్ధి పొందినది పాలక కుటుంబాలేననేది ప్రజాభిప్రాయంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఒక ప్రశ్న ప్రజలకు ఎదురవుతోంది. వాజ్‌పేయి నాయకత్వంలోని నేషనల్‌ డెమొక్రాటిక్‌ అలయన్స్‌(ఎన్డీఏ) ప్రభుత్వం 2000 సంవత్సరంలో తన ఉనికి కోసం ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలోని చిన్న ప్రాంతాలను  ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలుగా ఏర్పాటు చేసింది.

ఈ చిన్న హిందీ రాష్ట్రాల ఏర్పాటుకు అప్పటి ఏన్డీఏ సర్కారు ఆశ్రయించింది రాజ్యాంగంలోని 2/3/4 అధికరణలనే. అయితే, ఈ మూడు అధికరణల అవతారం గుట్టు– 600 ప్రత్యేక సంస్థానాలుగా భారతదేశం అనైక్యంగా బతికిన కాలాన్ని దృష్టిలో పెట్టుకుని స్వతంత్ర భారత యూనియన్‌లో ఆ సంస్థానాలను విలీనం చేయడంలో ఉంది. ఈ సంస్థానాల విలీనం కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన ఆ ప్రత్యేక నిబంధనలను పరాయి పాలనలో రూపొందించారు. ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపత్తి విషయంలో రాజ్యాంగంలో కల్పిం చిన ప్రత్యేక నిబంధన 371(డి) వంటిది కొత్త రాష్ట్రాలకు లేదు. కనుకనే ఆ మూడు రాష్ట్రాల ఏర్పాటులో రాజ్యాంగ తగాదా తలెత్తలేదు. ఒకటైన రెండు తెలుగు ప్రాంతాలు చారిత్రక కారణాల వల్ల మళ్లీ విడిపోయాయి. అయినా 2014 విభజన నాటి నుంచీ పాత ఆత్మీయ బంధాల మూలంగా రెండు తెలుగు రాష్ట్రాలూ కలిసి పురోగమిస్తున్నాయి.

ఈ దశలో స్వార్థ రాజకీయాల నీడలో ‘కుటుంబ పాలన’ అనేక అనర్థాలకు దారి తీస్తోంది. బహుశా అందుకనే సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు సైతం 371(డి) అధికరణ విస్తృతాధికారాన్ని వివరిస్తూ, ఇది రాజ్యాంగంలోని 2 నుంచి 4 వరకు ఉన్న అధికరణలు సహా మిగతా రాజ్యాంగ అధికరణల న్నింటినీ తోసిపుచ్చుతోందని వ్యాఖ్యానించవలసి వచ్చింది. ఇప్పుడు ఈ ప్రత్యేక అధికరణ రద్దుకు అనుకూలంగా పార్లమెంటులో మూడింట రెండొంతులకు పైగా సభ్యులు ఓటేస్తే తప్ప కేసీఆర్‌ జోనల్‌ వ్యవస్థను అనుకున్న స్థాయిలో దక్కించుకోవడం కష్టం కావచ్చు. ఇది ఆర్డర్లు, ఆర్డి నెన్సుల జారీవల్ల తేలే సమస్య కాదు. ఆ ప్రత్యేక అధికరణ స్వరూప, స్వభావమే అంత అని గుర్తించడం మంచిది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ,  కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, రాజ్య సభలో అప్పటి బీజేపీ సీనియర్‌ సభ్యుడు ఎం. వెంకయ్య ఆపద్ధర్మంగా ప్రక టించిన హామీలన్నీ నీటిమూటలయ్యాయి. ఈసారికి గట్టెక్కితే చాలను కునే పాలకులు చేసే వాగ్దానాలకు ప్రజలు మోసపోరాదన్నదే 70 ఏళ్ల దేశ అవకాశవాద రాజకీయం నేర్పుతున్న గుణపాఠం. ఎటువెళ్లినా 371(డి) నేటికీ వదలని, వదిలించుకోలేని ఓ పీడ కల!!

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@ahoo.co.in

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement