చట్టాల ముసుగులో భ్రూణహత్యలు | Article On Abortions Situations In India | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 13 2018 3:01 AM | Last Updated on Sat, Oct 13 2018 3:01 AM

Article On Abortions Situations In India - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

‘కేవలం 500 ఈరోజు వెచ్చించండి, లక్షలు కట్నంగా ఇవ్వక్కరలేకుండా చూసుకోండి’ అని ఎక్కడ పడితే అక్కడ గోడలపై, బస్సుల మీద పోస్టర్లు వెలి శాయి. పంజాబ్‌లో అమృత్‌సర్‌  స్వర్ణాలయం సాక్షిగా ఓ డాక్టర్‌ దంపతులు క్లినిక్‌ ఆరంభించి గర్భవతుల కడుపులో ఉన్న పిండం మగా లేక ఆడా అనే నిర్ధారణ చేసే పరీక్షలు నిర్వహిం చడం మొదలెట్టారు. అనాదిగా సమాజంలో ఆడపిల్ల అంటే గుండెల మీద కుంపటి అనే ధోరణి ఉండేది. ఉత్తర భారత దేశంలో పల్లెలు, పట్టణాలు, అక్షరా స్యులు, నిరక్షరాస్యులు అన్న తారతమ్యాలు లేకుండా ఆడపిల్లంటే చిన్న చూపు, ఏవగింపు. అలాంటి తరు ణంలో లింగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయంటే ఎగిరి గంతేయరూ? పురుషులు భార్య లను ఈ తరహా క్లినిక్‌లలో లింగ నిర్ధారణ చేయించి మగ అయితే ఉంచడం ఆడ అయితే తుంచేయడం మొదలెట్టారు. అప్పట్లో ఐరోపా దేశాల్లో ప్రాచుర్యం పొందిన అమ్నియోసెంటెసిస్‌ అనే లింగ నిర్ధారణ పరీక్ష అమృత్‌సర్‌ నుంచి ఉత్తర భారతదేశంలో మిగి  లిన రాష్ట్రాలకి పాకి ఎన్నో క్లినిక్‌లు పుట్టగొడుగుల్లా లేచాయి.

ఇంజెక్షన్‌ సాయంతో పిండం నుంచి అమ్నియో టిక్‌ ద్రవం తీసి దాన్లో క్రోమోజోముల నమూనాను విశ్లేషించడమే ఈ అమ్నియోసెంటెసిస్‌ పరీక్ష. మాన వుల్లో 46 క్రోమోజోములుండగా చివరి రెండు క్రోమోజోములు ఎక్స్, వై లు. ఈ పరీక్ష ద్వారా చివరి రెండు క్రోమోజోములు ఎక్స్‌ ఎక్స్, లేదా ఎక్స్‌ వై ఉందా అని తెలుసుకొని ఎక్స్‌ వై అయితే వెలిగి పోతున్న మొహంతో ‘అభినందనలు అబ్బాయే పుడ తాడు’, ఒక వేళ ఎక్స్‌ ఎక్స్‌ ఉంటే  ‘లాభం లేదు, అబార్షన్‌ చేసి తీసేయాలి’ అని 3 అబార్షన్లు, 6 టెస్టులతో దినదినాభివృద్ధి చెందిందీ వ్యాపారం. అమ్నియోసెంటెసిస్‌ వ్యవహారంపై ఆందోళన చెందిన స్త్రీవాద సంస్థలు గళమెత్తి  ఈ పరీక్షలపై నిషేధం విధించాలని దేశ వ్యాప్తంగా పట్టుబట్టారు.
 
గర్భంలో ఉన్న పిండం ఆరోగ్యం తెలుసుకునే నిమిత్తం 1974లో న్యూఢిల్లీ ఆల్‌ ఇండియా ఇన్‌స్టి ట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)లో మొట్ట మొదట అమినోసెన్సేసిస్‌ పరీక్షలు చేసే విభాగాన్ని నెలకొల్పారు. స్త్రీవాద సంస్థల పోరాటం నడుమ ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ రీసర్చ్‌ అనే సంస్థ ఈ లింగ నిర్ధారణ పరీక్షలు నిలిపివేయవల్సిందిగా ఎయిమ్స్‌ని కోరడంతో 1975 నుంచి ఎయిమ్స్‌లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం మానేశారు. అప్పుడు మనుగడలో ఉన్న ద మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నన్సీ యాక్ట్‌లో లొసుగుల వల్ల భ్రూణ హత్యకు అడ్డూ అదుపు లేక పోయింది. అలా ఈ భ్రూణ హత్యలు, శిశుహత్యల కారణంగానే భారతదేశంలో లింగ నిష్పత్తి క్షీణిం చింది. 1951 లో పిల్లల లింగ నిష్పత్తి 983 ఉండగా, 1981 నాటికి 962 పడిపోయింది.

1994–2017 మధ్య ప్రీ–కన్సెప్షన్‌ అండ్‌ ప్రి– నాటల్‌ డయాగ్నస్టిక్‌ టెక్నిక్స్‌ యాక్ట్‌ కింద లింగ నిర్ధారణ జరిగిన నేరంపై కేవలం 2350 కేసులు దాఖలయ్యాయి అంటే మన చట్టాలు ఎంత పదునై నవో, కఠినమైనవో వ్యక్తమవుతోంది. ఈ కేసుల్లో కూడా సింహ వాటా మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో జరిగినవే. భ్రూణ హత్యలు భార తదేశాన్నే కాక ఎన్నో పేద, సంపన్న అన్న తేడా లేకుండా అగ్ర దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలనన్నిటినీ పట్టి పీడిస్తున్న రోగం. 

పాపులేషన్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రకారం, భారతదేశంలో సగటున రోజువారీ 2,330 లింగ నిర్ధారిత గర్భస్రావాలు జరుగుతున్నాయి. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా ఇరవై ఏళ్లలో దాదాపు 11.8 కోట్ల ఆడపిల్లలు గర్భంలో ఉండగా లేదా పుట్టేక మొదటి వారంలోనే భ్రూణ హత్యకు గురయ్యారు. 1991 మరియు 2011 మధ్య సగటున ప్రతి ఏటా 13 లక్షల మంది ఆడ శిశువులను నవజాత శిశు హత్య ద్వారా మట్టుబెట్టారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అక్టోబర్‌ 11న ‘అంతర్జాతీయ బాలికల దినోత్సవం’గా ఐక్యరాజ్య సమితి ప్రక టించి 2012 నుంచి జరుపుతోంది. దీని ముఖ్య ఉద్దేశ్యం ప్రపంచవ్యాప్తంగా బాలికలు ఎదుర్కొనే సవాళ్లను వెలుగులోకి తెచ్చి పరిష్కరించడం, మహి ళల మానవ హక్కుల అవసరాలు వాటి నెరవేర్పు లపై దృష్టి కేంద్రీకరించేలా చేయడం.
 
లింగ నిష్పత్తి అసమానంగా పెరుగుతున్న కొలది మహిళలపై నేరాలు, ఘోరాలు పెరుగుతూనే ఉంటాయి. భారత పౌరులు అనుమతి లేకుండా ఏ దేశంలోనూ గర్భస్రావం చేసుకోకుండా ఉండేటట్లు, గర్భం దాల్చిన వెంటనే గర్భవతుల రికార్డుల నమోదు, పర్యవేక్షణ వంటి కొత్త నిబంధనల చట్టం తీసుకురావడం అవసరం. పరిస్థితులు ఇలానే కొన సాగితే 2050 నాటికి బహుభార్యత్వం లాగ ఒకే భార్యని బహు భర్తలు పంచుకోవాల్సిన గడ్డు రోజులు దాపురిస్తాయనడం అతిశయోక్తి కాదేమో!

సునీల్‌ ధవళ 
వ్యాసకర్త సీఈఓ, ద థర్డ్‌ అంపైర్‌ మీడియా మొబైల్‌ : 97417 47700

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement